నన్ను బాధపెట్టిన వ్యక్తి పట్ల నేను ఎలా స్పందించాలి?

ప్రశ్న: నా స్నేహితురాలని నేను పిలిచే వ్యక్తి నా గురించి గుసగుసలాడింది. ఆమె చేష్టల వలన నేను చాలా బాధపడ్డాను. నేను ఆమెను నమ్మి ఒక విషయం చెప్పాను, కాని ఆమె ఆ విషయాన్ని నా మిగిలిన స్నేహితులకు చెప్పేసింది. నేను సంఘములో నా ముఖాన్ని కూడా చూపించలేను. నేను ఆమె పట్ల చాలా కోపంగా ఉన్నాను. నేను ఇక ఆమెతో మాట్లాడటంలేదు, అయితే అది తప్పని నాకు తెలుసు. నా బాధ మరియు కోపాన్ని నేను ఎలా నియంత్రించగలను?

సమాధానం: పనికిరాని ముచ్చట్లు మంచి స్నేహాన్ని చంపుతుంది. సామెత చెప్పినట్లుగా: “జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును” (సామెతలు 17: 9). మీ గాయపడిన భావాలతోపాటు మీ స్నేహం కోల్పోయినందుకు విచారం, మీ స్నేహితురాలు బట్టబయలుచేసిన రహస్యంవల్ల సిగ్గు, మరియు సున్నితంకాని మీ స్నేహితురాలిపై కోపం వంటి ఇతర భావాలు ఉండవచ్చు.

మీరు మాత్రమే గుర్తించగలిగే భావాలు మీ ఆత్మగుండా గర్జిస్తూ ఉండవచ్చు. మీ హృదయాన్ని శోధించమని ప్రభువును కోరుకోవడానికి కొంత ప్రార్థనా సమయాన్ని ప్రక్కన పెట్టండి. అలాగే మీ భావాలను ఆయనకు ఒక లేఖలో రాయండి. మీ గుండెలో ఉన్న మంటను జాబితా రూపంలో పెట్టండి మరియు మీ స్నేహితురాలికి సంబంధించి మీకు ఉన్న భావాలను వ్రాయటం ఆపకండి. మిమ్మల్ని బాధపెట్టిన ఇతరుల పట్ల మీకు ఉన్న భావాలను చేర్చండి. మీ సంబంధాల గుండా నడిచే సామాన్యమైన ఇతివృత్తాన్ని చూసి మీరు ఆశ్చర్యపోవచ్చు.

మీరు మీ జాబితాను పరిశీలిస్తున్నప్పుడు, ప్రభువు మీ భావాలను పట్టించుకుంటున్నారని గుర్తుంచుకోండి. యేసును కూడా ఆయన స్నేహితులు మోసం చేశారు, కాబట్టి ఆయన మీ దుఃఖాన్ని అర్థం చేసుకుంటాడు, అలాగే ఆయన మిమ్మల్ని ఓదార్చగలడు. భావోద్వేగాలు ఉన్నందుకు బైబిల్ మిమ్మల్ని ఖండించదు. అయితే మీ భావోద్వేగాలను చక్కగా నియంత్రించుకోవడానికి జాగ్రత్త పడండి. పౌలు చెప్పిన మాటలు మీరు గుర్తు చేసుకోవచ్చు: “‘కోపపడుడి గాని పాపము చేయకుడి’” (ఎఫెసీయులకు 4: 26). కోపం ఉత్పన్నం చేసే పాపపు క్రియల కంటే కోపం పెద్ద సమస్యేమీ కాదు. పరిష్కరించని కోపం పగ, వెనుక మాట్లాడటం, తప్పులు వెదకటం, యింకా మొత్తం పాపాల జాబితాకు కారణం అవుతుంది. కాబట్టి మీ జీవితాన్ని కోపం శాసించే ముందు దాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించడమే కోపానికి సమాధానం.

మీ భావాలను పరిష్కరించడంలో మొదటి అడుగు వేయడానికి ఈ మానసిక చిత్రం మీకు సహాయపడవచ్చు. మీరు ప్రభువుకు రాసిన లేఖలోని అన్ని భావాలను పెద్ద, భారీ బంతిగా ఊహించుకోండి. ఇప్పుడు మీదగ్గర ఈ ఆవేశపూరిత బంతి ఉంది, మీరు దానితో ఏమి చేయవచ్చు? సరే, మీరు దానిని మింగడానికి ప్రయత్నించవచ్చు (ఆవేశాన్ని అణచివేయడం), కానీ అది మిమ్మల్ని మానసికంగా లేదా శారీరకంగా అనారోగ్యానికి గురి చేస్తుంది. మీరు దాన్ని వేరొకరి వద్దకు విసిరేయవచ్చు (ఆవేశాన్ని వెళ్లగ్రక్కడం), కానీ అది మీ ఇతర స్నేహాలను దెబ్బతీస్తుంది. మీరు విశ్వసించే వారితో బంతిని ముందుకు వెనుకకు విసిరివేయడం ద్వారా మీరు దాన్ని పట్టుకోవచ్చు (ఆవేశాన్ని వ్యక్తీకరించడం). గాయపడ్డ భావాలను గురించి మాట్లాడకపోవటం కంటే వాటి గురించి మాట్లాడటం మంచిది. కానీ చివరికి, మీరు ఈ దౌర్భాగ్య బంతిని మోసుకొని ఇంటికి వెళతారు.

కాబట్టి గాయం యొక్క ఈ భారమైన బంతితో మీరు ఏమి చేయాలి? దానిని ప్రభువుకు ఇవ్వండి. ప్రార్థనలో మీ భావాలను ఆయనకు అప్పగించండి మరియు ఈ భావాలన్నింటినీ ఆయనకు అప్పగించినట్లు మిమ్మల్ని మీరు చిత్రీకరించుకోండి.

మన ప్రతికూల భావోద్వేగాలను ప్రభువు చేతుల్లో విడిచిపెట్టడమే వాటిని నియంత్రించడానికి ఆరోగ్యకరమైన మార్గం. పేతురు ఇలా అంటాడు, “ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి” (1 పేతురు 5: 7). మీ బాధను మరియు కోపాన్ని ప్రభువుకు అప్పగించడం అంటే మీ భావాలను పూర్తిగా గుర్తించడం, వాటిని నియంత్రించడంలో మీ అసమర్థతను అంగీకరించడం, ప్రతీకారం తీర్చుకునే మీ హక్కును ఉపసంహరించుకోవడం మరియు ఆయనను మీ రక్షకుడిగా విశ్వసించడం. నేను అప్పగించడం అనే పదాన్ని ఉపయోగిస్తున్నాను. ఎందుకంటే తిరిగి బాధించే హక్కు దేవునికి మాత్రమే చెందుతుంది. అందుకే పగ అనేది ఆయనకు అప్పగించాలి. ప్రభువు ఇలా అంటన్నాడు, “‘పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును’” (రోమా 12: 19). విషయాలను సరిదిద్దడానికి మరియు సమము చేయడానికి కూడా ఆయనను విశ్వసించాలని ఆయన కోరుకుంటున్నాడు. మనము మన కోపాన్ని అప్పగించినప్పుడు, మనకు ఇంకా బాధగా అనిపించవచ్చు, కాని ఆ బాధ ప్రతీకారంగా వ్యక్తపరచబడదు.

మీ స్నేహితురాలి పట్ల మీ కోపాన్ని మీరు అప్పగించారా? లేదా మిమ్మల్ని బాధపెట్టినందుకు ఆమెను బాధపెట్టాలనే మీ హక్కును పట్టుకుని వ్రేలాడుతున్నారా? మీరు ఆమెను బాధపెట్టకూడదనుకునే స్థితికి మీరు రావచ్చు, కానీ ఆమె మాటలతో మీరు గాయపడినట్లు భావిస్తున్నారు. ఆ ఆవేశం సబబే. మీరు ఇంకా బాధపడవచ్చు- కాని కోపంతో ప్రతీకారం తీర్చుకోవటానికి ఆ బాధను బయలుపరచనివ్వొద్దు. తదుపరి మెట్టు ఏమిటంటే కీడుకు ప్రతిగా మేలును తిరిగి ఇవ్వటం. మీ స్వంత ప్రతీకారం తీర్చుకోవలసిన అవసరాన్ని మీరు ఇకపై భావించకపోతే, క్రీస్తు ప్రేమను అవతలి వ్యక్తికి ప్రదర్శించడానికి మీకు స్వాతంత్ర్యము ఉంటుంది. యేసు మాటలను వినండి:

“వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా–మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించువారికి మేలుచేయుడి, మిమ్మును శపించువారిని దీవించుడి, మిమ్మును బాధించువారికొరకు ప్రార్థనచేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడ త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తికొని పోవువానిని, నీ అంగీని కూడ ఎత్తి కొనిపోకుండ అడ్డగింపకుము. నిన్నడుగు ప్రతివానికిని ఇమ్ము; నీ సొత్తు ఎత్తికొని పోవువానియొద్ద దాని మరల అడుగవద్దు. మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో ఆలాగు మీరును వారికి చేయుడి. మిమ్మును ప్రేమించువారినే మీరు ప్రేమించినయెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును తమ్మును ప్రేమించువారిని ప్రేమింతురు గదా. మీకు మేలుచేయువారికే మేలు చేసినయెడల మీకేమి మెప్పుకలుగును? పాపులును ఆలాగే చేతురు గదా. మీరెవరియొద్ద మరల పుచ్చుకొనవలెనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చినయెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును తామిచ్చినంత మరల పుచ్చుకొనవలెనని పాపులకు అప్పు ఇచ్చెదరు గదా. మీరైతే ఎట్టి వారిని గూర్చియైనను నిరాశ చేసికొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలుచేయుడి, అప్పు ఇయ్యుడి; అప్పుడు మీ ఫలము గొప్పదైయుండును, మీరు సర్వోన్నతుని కుమారులైయుందురు. ఆయన, కృతజ్ఞతలేనివారియెడ లను దుష్టులయెడలను ఉపకారియై యున్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరముగలవాడై యున్నట్టు మీరును కని కరముగలవారై యుండుడి.” (లూకా 6: 27-36)

దయగల మాట నిజంగా కఠినమైన హృదయాన్ని కరిగించగలదు. బహుమతి లేదా కార్డు ద్వారా మీ స్నేహితురాలికి ప్రేమను చూపించే మార్గాన్ని కనుగొనమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. ఆమె దానికి అంగీకరిస్తుందని మీరు అనుకుంటున్నారా?

చివరగా, మీ స్నేహితురాలితో మీ భావాల గురించి మాట్లాడండి మరియు ఆమె గురించి చెప్పుకునే ఆమె మాటలను వినండి. వినడం అంటే అంగీకరించటంతో సమానం కాదు. వినడం అనేది ఒక సమస్య గురించి ఇతరుల ఆలోచనలను అర్థం చేసుకోవడం మరియు వారి భావాలను ప్రతిధ్వనించడం. ఆమె మాట విన్న తర్వాత, “నా సమస్యను ఇతరులతో పంచుకోవడంవల్ల వారు నాకోసం ప్రార్థిస్తారు గనుక ఆ పని సరైందేనని నువ్వు అనుకున్నావా” లేదా “నీ పట్ల నా ప్రతిస్పందన వల్ల నువ్వు బాధపడ్డావా” అని మీరు అనవచ్చు. అంతమాత్రాన మీ స్నేహితురాలు సరైనదేనని దీని అర్థం కాదు. మీ అనుమతి తీసుకోకుండా మీ రహస్యాలు పంచుకోవడం తప్పు. అయితే గుర్తుంచుకోండి, మీ లక్ష్యం ఎవరు ఒప్పు ఎవరు తప్పు అని నిర్ణయించడం కాదు. వాదమును గెలవటానికి కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకప్రక్క స్నేహితురాలిని కోల్పోతూ మరోప్రక్క వాదనను గెలవడం వలన ప్రయోజనమేమీ లేదు. “మనము ఈ విషయంపై విభేదిస్తున్నాము, ఫర్వాలేదు. నేను ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాను, నీ భావాలను నేను అర్థం చేసుకున్నాను,” అని మీరు మీ స్నేహితురాలికి చెప్పవచ్చు. ఈ విధంగా, మీ తేడాలు మీ మధ్య చీలికను కలిగించనివ్వకుండా మీ తేడాలను మీరు గుర్తించవచ్చు.

ఈ చర్యలు తీసుకున్న తరువాత, క్షమాపణ సహజంగానే ప్రవహిస్తుంది. మీ స్నేహితురాలు తనను క్షమించమని మిమ్మల్ని అడుగుతుంది. అలా కాకపోతే, తప్పును వదిలేయటం ద్వారా మీరు ఆమెను క్షమించగలరు. మీరు మీ భావాల పట్ల విజయవంతంగా వ్యవహరించారు; మీరు ఆమెతో స్పష్టంగా వ్యక్తపరచారు; ఇప్పుడు . . . దాన్ని వదిలేయండి.

Copyright © 2014 by Insight for Living. All rights reserved worldwide.
Posted in Anger-Telugu, Encouragement & Healing-Telugu, Forgiveness-Telugu, Friendship-Telugu, Love-Telugu, Women-Telugu.

Biblical Counselling Ministry

View posts by Biblical Counselling Ministry

The Insight for Living Biblical Counselling department comprises seminary-trained pastors and women’s counsellors who help meet the spiritual needs of Insight for Living’s listeners around the world through biblical counselling and training others for ministry. Our confidential biblical counselling includes a ministry of prayer, comfort, spiritual direction, and instruction to promote growth in Christ. We accomplish that mission by developing educational and counselling content that is fashioned into letters, Web articles, and other printed products.

ఇన్సైట్ ఫర్ లివింగ్ బైబిల్ కౌన్సెలింగ్ విభాగంలో సెమినరీ-శిక్షణ పొందిన పాస్టర్లు మరియు మహిళా సలహాదారులు ఉన్నారు. బైబిల్ కౌన్సెలింగ్ ద్వారా మరియు పరిచర్య కోసం ఇతరులకు శిక్షణ ఇచ్చుట ద్వారా వీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్సైట్ ఫర్ లివింగ్ శ్రోతల యొక్క ఆత్మీయ అవసరాలను తీర్చడంలో సహాయపడుతున్నారు. మా విశ్వసనీయమైన బైబిల్ కౌన్సెలింగ్‌లో ప్రార్థన, ఆదరణ, ఆత్మీయ మార్గము మరియు క్రీస్తులో వృద్ధిని ప్రోత్సహించడానికి సూచనలు ఉన్నాయి. ఉత్తరాలు, వెబ్ వ్యాసాలు మరియు ఇతర ముద్రిత ఉత్పత్తులుగా రూపొందించబడిన విద్యా మరియు కౌన్సిలింగ్ కంటెంట్‌ను అభివృద్ధి చేయడం ద్వారా మేము ఆ లక్ష్యాన్ని సాధిస్తాము.