ప్రశ్న: ఈ మధ్య నేను కోపంతో పోరాడుతున్నాను.నేను ఏ క్షణంలోనైనా పేలడానికి సిద్ధంగా ఉన్న ఉడుకుతున్న అగ్నిపర్వతంలా ఉన్నానని భావిస్తున్నాను. నేను విస్ఫోటనం చెందినప్పుడు, నేను క్రూరమైన విషయాలు మాట్లాడతాను, ఆ తరువాత నేను చాలా అపరాధభావంతో బాధపడుతూ ఉంటాను. నన్ను ఇంతగా బాధపెట్టడానికి కారణం ఏమిటో నాకు తెలియదు, కాని ఈ కోపం నేను శ్రద్ధ వహించే వ్యక్తులను బాధపెడుతుంది. నా కాఠిన్యమును మంచిగా నియంత్రించుకోవడానికి నేను ఏమి చేయగలను?
జవాబు: కోపంతో బాధపడే చాలా మంది దీనిని తమలో ఒక భాగంగా అంగీకరిస్తారు గాని మారడానికి ఏమాత్రం ప్రయత్నించరు. ఈ కోపము మీ సంబంధాలను విడదీసే ముందు ఈ సమస్యను పరిష్కరించాలని మీరు కోరుకుంటున్నారు గనుక మీరు ఆదర్శప్రాయమైవారు.
మొదటిగా, మీ కోపానికి గల కారణాలను గూర్చి విచారించడం మంచిది. మీరు కోపంగా ఉన్న కొన్ని సందర్భాలను గూర్చి ఆలోచించండి. మీరు ఒక తీరును గుర్తించగలరా? మీరు ప్రతిసారీ ఒకే వ్యక్తిపై కోపంగా ఉన్నారా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఏమిటి? మీ జీవితంలో మీరు కోరుకున్న విధంగా ఏమి వెళ్ళడం లేదు? ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టారా లేదా నిరాశపరిచారా? మీ కోపం మీ తల్లిదండ్రులపై లేదా జీవిత భాగస్వామిపై ఉందా? మీ సంబంధాలలో కొన్ని తీరుతెన్నులు మీకు కోపం తెప్పిస్తాయా?
ఇది ప్రశ్నోత్తరాల ఆటలా అనిపించవచ్చు, కానీ మీ భావోద్వేగ ప్రతిస్పందనను ప్రేరేపించే వాటిని గుర్తించడంలో మీకు సహాయపడటానికి మేము ఇవన్నీ చేర్చుతున్నాము. మీరు ఒక తీరును కనుగొన్న తర్వాత లేదా మీ కోపం యొక్క మూలం మీకు తెలుసని భావిస్తే, ఆ తీరును పగులగొట్టడానికి లేదా సమస్యను పరిష్కరించడానికి మీరు ఏమి చేయగలరో చూడండి. మీ కోపం ఒక వ్యక్తిపై కేంద్రీకృతమైతే, మీ బాధను లేదా ఆందోళనలను సానుకూల రీతిలో వ్యక్తీకరించడానికి మీరు అతనితో లేదా ఆమెతో మరింత స్పష్టంగా తెలియపరచగలరేమో చూడండి, అది మీ సంబంధాన్ని నిర్మిస్తుంది. మీ జీవితంలో పనిలో ఇబ్బందులు లేదా మీ కుటుంబంలో ఉద్రిక్తత వంటి సమస్య లేదా ఒత్తిడిని మీరు కనుగొంటే, ఆ సమస్యను పరిష్కరించడానికి ఆప్షన్లను పరిశోధించండి.
రెండవది, మీ ఆలోచనలను మరియు భావాలను మరింత నిర్మాణాత్మకంగా వ్యక్తీకరించడం నేర్చుకోండి. కోపం రావడానికి ముఖ్యంగా రెండు విషయాలు ఉన్నాయి: సంఘటన మరియు అంతర్లీన సమస్య. ఏమి జరిగిందో అది సంఘటన. ఉదాహరణకు, మీ జీవిత భాగస్వామి బ్యాంకులో తగినంత డబ్బు లేదని గ్రహించకుండా చెక్ వ్రాశారని అనుకుందాం. ఈ సంఘటన గురించి ఆలోచిస్తేనే మీకు కోపం వచ్చేస్తుందని అనిపించవచ్చు! మీ కోపాన్ని రేకెత్తిస్తున్న ఆలోచనలను గూర్చి నిదానించి చూడండి, అలాగే వాటిని పరిగణలోనికి తీసుకోండి. “నా జీవిత భాగస్వామి నన్ను మెచ్చుకోదు. కుటుంబానికి సమకూర్చడానికి నేను చాలా కష్టపడుతున్నాను, డబ్బు వృథా అవుతుంది!” అని మీలో మీరే అసంతృప్తి వ్యక్తంచేస్తుండవచ్చు. లేదా “ఇది జరుగుతూ ఉంటే, మనము దివాలా వైపు వెళ్తాము!” అని మీలో మీరే విచారపడుతుండవచ్చు. మీ జీవిత భాగస్వామితో ఈ ఆలోచనలు మరియు భావాల గురించి మాట్లాడటం ద్వారా మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవచ్చు. “నువ్వు ఖర్చు చేస్తున్నదాన్ని సరిగ్గా చూడనప్పుడు, నాకు విలువిస్తున్నావని నేను అనుకోను,” అని మీ జీవిత భాగస్వామికి చెప్పండి. లేదా “మనము ఆర్థిక ఇబ్బందుల్లో పడుచున్నామేమోనని నేను భయపడుతున్నాను,” అని చెప్పండి. నింద మరియు విమర్శ యొక్క కోపముగల ప్రకటనల ద్వారా కాకుండా మీ భావాలను వ్యక్తీకరించడానికి ఇది చాలా ఆరోగ్యకరమైన మార్గం.
మూడవది, మీ లక్ష్యాలను మరియు మీ హృదయంలోని ఉద్దేశాలను పరిశీలించండి. మీ ఉద్దేశాలు సరైనవైతే మరియు మీ లక్ష్యాలు మంచివైతే, కోపం సమర్థించబడవచ్చు. యేసు జీవిత లక్ష్యం తండ్రికి మహిమ తీసుకురావడం, మరియు ఆలయంలోని రూకలు మార్చువారు తన తండ్రి ఇంటిని లెక్కచేయకపోవడం చూసినప్పుడు, ఆయన ఒక మంచి కారణం చేతనే కోపగించుకున్నాడు. మీ కుటుంబ సభ్యుల పట్ల ప్రేమతో వారిని రక్షించడమే మీ లక్ష్యం అయితే, మీ పిల్లలను భయపెట్టే దానిపై మీ కోపం సముచితమే. ఇప్పుడు మీరు మీ ప్రేమను వ్యక్తపరచే క్రియలలో ఆ భావోద్వేగాన్ని తెలియచేయడం నేర్చుకోవాలి.
కానీ మీ లక్ష్యం మీ స్వంత ఆనందం అని అనుకుందాం. ఇష్టమైన కార్యక్రమం ప్రారంభమునుండి చూడాలని మీరు ఒక నిర్దిష్ట సమయంలో ఇంటికి చేరుకోవాలనుకోవచ్చు. మీ ముందు ఉన్న డ్రైవర్ నెమ్మదిగా బండి తోలుతూ అస్సలు వేగం పెంచకపోవచ్చు. మీరు లోలోపల ఉడికిపోతూ ఉండవచ్చు, డ్రైవర్‌ను శపించడం మరియు స్టీరింగ్ వీల్‌ను కొట్టడం వంటివి చేయవచ్చు. ఎందుకంటే అతను మిమ్మల్ని మీ లక్ష్యం నుండి దూరం చేస్తున్నాడు. ఆ కోపం పాపాత్మకమైన, స్వార్థపూరిత ఉద్దేశ్యాల నుండి వస్తుంది.
లేదా మీ జీవిత భాగస్వామి నుండి ఆప్యాయత పొందడం మీ లక్ష్యం కావచ్చు, కానీ మీ జీవిత భాగస్వామి మీకు కావలసినది చేయదు. కాబట్టి మీరు కోపంగా ఉండి బహుశా మాట్లాడకుండా అలగవచ్చు, లేదా తీవ్రంగా విమర్శించడం వంటి దూకుడు స్వభావం చూపించవచ్చు.
బహుశా మీ లక్ష్యం సాయంత్రం విశ్రాంతి తీసుకోవడమే కావచ్చు. కానీ మీ పిల్లలు అల్లరి చేస్తూ, మీరు తమ పట్ల శ్రద్ధ చూపాలని కోరుతూ ఉంటారు. కోపంలో, మీరు వారిని అరుస్తారు. మీరు అరవకపోవచ్చుగాని మీ కోపం వ్యంగ్య భాష మరియు పేర్లు పెట్టడం కావచ్చు. కానీ మీరు మీ పిల్లలను మీ మాటలతో పొడిచి వ్యంగ్య హాస్యంతో చంపేస్తారు.
మీపై నియంత్రణ సాధించడానికి మీ కాఠిన్యాన్ని అనుమతించే ముందు, ఒక్క క్షణం ఆగి, “నా లక్ష్యం ఏమిటి? నేను కలిగి ఉండకూడనిది నేను ఏమి కోరుకుంటున్నాను?” మీ లక్ష్యం వెనుక ఉన్న ఉద్దేశాలను వెల్లడించమని ప్రభువును అడగండి. మిమ్మల్ని మీరు సంతోషపెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? అలా అయితే, మీరు నిజంగా మీ దృక్పథాన్ని మార్చుకోవాలి. దీన్ని ఎలా చేయాలో తదుపరి పాయింట్ మీకు కొన్ని అభిప్రాయాలను ఇస్తుంది.
నాల్గవది, మీ దృక్పథాన్ని “పొందడం” నుండి “ఇవ్వడం” నకు మార్చుకోండి. మీ హక్కులు, మీ అభిప్రాయాలు, మీ అవసరాలు లేదా మీ సంతృప్తిపై మీ దృష్టి ఉంటే, మీరు మీకు అడ్డుగానున్న వ్యక్తులపై కోపగించుకునే అవకాశం ఉంది. మీరు ఇతరులకు, అనగా మీ శత్రువులకు కూడా పరిచర్య చేయడంపై దృష్టి పెడితే, మీ హృదయం వారి పట్ల దయ కలిగి ఉంటుంది, అలాగే మీ ఆత్మ మరింత శాంతముగా ఉంటుంది.
మీరు మీ దృక్పథాన్ని మార్చుకోవడానికి పని చేస్తున్నప్పుడు, లేఖనము నిజంగా సహాయపడుతుందని మీరు తెలుసుకుంటారు. దిగువ వాక్యాలను కంఠస్థం చేయడానికి ప్రయత్నించండి. వాటిని సూచిక కార్డులలో వ్రాసి వాటిని మీ వద్ద ఉంచుకోండి లేదా వాటిని అద్దానికి అతికించండి, తద్వారా మీరు వాటిని ప్రతిరోజూ చూసుకోవచ్చు.
ప్రతిమనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదా నించువాడునై యుండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. (యాకోబు 1: 19-20)
మీరు మాట్లాడే ముందు, మరియు మీరు కోపం తెచ్చుకునే ముందు వినాలని యిక్కడ దేవుడు మీకు గుర్తు చేస్తున్నాడు. ఇది చాలా కష్టంగా ఉంటుంది, కానీ మీరు కాస్త తగ్గి, చెప్పేది వింటే, తరచుగా కోపగించుకునే సందర్భాలను మీరు నివారించవచ్చు. మీకు త్వరగా కోపం వస్తే, దేవుడు మీ నుండి కోరుకునే విధంగా మీరు కోపంతో వ్యవహరించడం లేదని మీకు తెలుసు!
మృదువైన మాట క్రోధమును చల్లార్చును,
నొప్పించు మాట కోపమును రేపును. (సామెతలు 15: 1)
మీరు కోపంగా ఉన్న పరిస్థితులను నివారించాలనుకుంటే, మీరు చెప్పిన విషయాలకు ప్రశాంతంగా స్పందించాలి. మీరు సాత్వికముతో స్పందిస్తే, మీరు కోపాన్ని నివారిస్తారు.
ఆత్రపడి కోపపడవద్దు; బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసము చేయును. (ప్రసంగి 7: 9)
త్వరగా కోపంగా ఉండటానికి మిమ్మల్ని మీరు అనుమతించుకోవద్దు. మూర్ఖులు వారి ముంగోపముతో వర్ణించబడతారని దేవుడు చెప్పాడు.
ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును;
తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును. (సామెతలు 19:11)
ఈ వచనం చిన్న అపరాధములను విస్మరించమని మీకు గుర్తు చేస్తుంది. కొన్నిసార్లు కొన్ని విషయాల గురించి కోపం తెచ్చుకోవడం కూడా యోగ్యమైనది కాదు.
కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు . . . శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి-పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది. కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు. (రోమా 12: 17-20)
ఈ వచనాలలో కొన్ని గొప్ప క్రైస్తవ విలువలు ఉన్నాయి, దుష్ట మనుషులచేత దాడి చేయబడినప్పుడు మన ప్రభువు స్వయంగా మాదిరిగా నిలిచాడు. మీ ప్రతీకారమును మీరే తీర్చుకునే బదులు, తప్పులను సరిదిద్దే పనిని ప్రభువు నిర్వహించనివ్వండి. ఆయన మీ కంటే మెరుగ్గా సమస్యాత్మక ప్రజలను జాగ్రత్తగా చూసుకోగలడు. మిమ్మల్ని మరింత దౌర్భాగ్యులుగా మార్చడం తప్ప, మీ కోపం ఏదీ సాధించదు. బాధ కలిగించే వ్యక్తులను తిరిగి బాధించకుండా ప్రేమించడంలో మీకు సహాయం చేయమని ప్రభువును వేడుకోండి.
మీకు కోపం రావడం మొదలవుతుందని అనిపించినప్పుడు, ఈ వాక్యాలతోనున్న కార్డులను బయటకు తీయండి, వాటిని చదవండి మరియు మీ కోపం విషయమై ప్రార్థించండి. మీ కోపానికి ఎలా స్పందించాలో గుర్తించడంలో మీకు సహాయపడటానికి కొన్ని ప్రశ్నలను మిమ్మల్ని మీరే అడుగుకొనండి:
- నేను ఎందుకు కోపంగా ఉన్నాను? నా భావాలను లేదా నా అహాన్ని ఎవరైనా గాయపరచారా? ఎవరైనా నాకు ఏదో ఒక విధంగా హాని చేశారా? అసలు సమస్య ఏమిటి?
- ఉద్రేకపడేంత యోగ్యమైనదా యిది? ఇది విస్మరించగల చిన్న అపరాధమా? ఇది సంబోధించదగ్గ పెద్ద సమస్యా?
- నేను కోపంగా ఉన్న కారణం గురించి నేను ఏమి చేయగలను? నేను నా కోపాన్ని సానుకూల దిశలో కేంద్రీకరించగలనా? ఎవరైనా నా హక్కులను కాలరాసారని కోపంగా కాకుండా, నేను వారిని గాయపరచడానికి బదులు పరిస్థితిని మలిచి వారికి పరిచర్య చేయగలనా? నేను దీని గురించి ఆలోచించడం మానివేయటానికి నిర్ణయించుకోవచ్చా?
ఈ వాక్యాలను నేర్చుకుని, మీరు కోపంగా ఉన్న ప్రతిసారీ ఈ ప్రశ్నల గుండా మెల్లగా వెళ్ళినట్లైతే, మీ కోపము తగ్గుతున్నట్లు మీరు గుర్తించాలి.