అరుదుగా దేవుని వీరులలో ఒకరు వైఫల్యాలు లేని జీవితాన్ని గడిపినట్లు లేఖనాల్లో కనిపిస్తారు. ఉదాహరణకు పేతురును తీసుకోండి. మీరు పేరు చదివిన వెంటనే, అతని కథ మీకు గుర్తుకు వస్తుంది. క్రీస్తుతో ఆశీర్వాదకరమైన సహవాసం గడిపిన రోజుల నుండి ప్రభువును తిరస్కరించినప్పుడు కలిగిన విధేయత యొక్క గుండె కోత వరకు కూడా జీవితం యొక్క ఒడిదుడుకులను పేతురు ఎదుర్కొన్నాడు. ఒక్కసారి కాదు. రెండుసార్లు కాదు. మూడు సార్లు. అతను తన వైఫల్యాన్ని గ్రహించిన తర్వాత, “అతను వెలుపలికిపోయి సంతాపపడి యేడ్చెను” అని పరిశుద్ధ గ్రంథము చెబుతున్నది (లూకా 22:62).
మీరు మరచిపోవటానికి వీలులేని అనుభవాలతో చాలా నాటకీయంగా మరియు కన్నీటితో కూడిన వైఫల్యాన్ని మీరు గుర్తుకు తెచ్చుకోగలరా? బెట్సీ టెన్ బూమ్ మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి, “ఆయన లోతులో లేనటువంటి లోతైన గొయ్యి లేనేలేదు.” మీ వైఫల్యం ఎంత చీకటిగా మరియు ఎంత లోతుగా మరియు ఎంత విషాదకరంగా ఉంటుందో, ఆయన మీతో అంత లోతుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు.
పేతురు విషయంలో కూడా ఇది నిజం. లూకా 22 చూడండి. సాతాను దాడి గురించి ఆశ్చర్యకరమైన హెచ్చరిక తరువాత, యేసు పేతురుకు ఒక వాస్తవాన్ని వివరించాడు: “నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని.” అప్పుడు దాచబడిన, నమ్మిక కలిగించు ఒక మాట ఉంది: “నీ మనసు తిరిగిన తరువాత. . . ” అప్పుడు తుది ఆజ్ఞ: “నీ సహోదరులను స్థిరపరచుము” (22:32).
అది ఏమి సూచిస్తుంది? పేతురు పడిపోతున్నాడని యిది సూచిస్తుంది. “నీ మనసు తిరిగిన తరువాత.” “మీ అడుగులను గుర్తు తెచ్చుకొన్నారు” అని యింకో విధంగా మరొకరు చెప్పారు. “నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచడానికి దాన్ని ఉపయోగించుము” అని యేసు చెప్పాడు. యేసుకు పేతురు యొక్క అంతరంగము తెలుసు. పేతురు పడిపోతాడని ఆయనకు తెలుసు, కాని అతను పడిపోయిన స్థితిలోనే ఉండడని ఆయన అతనికొరకు ప్రార్థించాడు. తన (పేతురు) బలహీనమైన సమయంలో కూడా యేసు పేతురును ప్రేమించాడు.
ఆ ప్రేమను ఆయన ఎలా నిరూపించాడు? మార్కు 16:6-7 ఆ ప్రశ్నకు సమాధానమిస్తుంది. పునరుత్థానం తరువాత, స్త్రీలు సమాధి వద్ద నిలబడి ఉండగా, ఒక దేవదూత వారితో ఇలా అన్నాడు:
“కలవర పడకుడి సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు; ఆయన లేచియున్నాడు, ఇక్కడ లేడు; వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్లి ఆయన శిష్యులతోను పేతురుతోను చెప్పుడి.” (ప్రాధాన్యత జోడించబడింది)
అది గొప్ప విషయం కాదా? “పేతురును మర్చిపోవద్దు. నేను అతనితో మళ్ళీ మాట్లాడాలనుకుంటున్నాను అని అనుకునే చివరి వ్యక్తి అతడే. పేతురుతో చెప్పండి! ” ఏమి కృప!
పేతురు పడిపోయిన సమయానికి మరియు ఈ దేవదూతల ప్రకటనకు మధ్య ఎక్కడో ఒక ప్రక్రియ జరిగింది. ఈ సమయంలో పేతురు పశ్చాత్తాపం చెందాడు, వీలైతే తన తప్పును సరిదిద్దుకోవాలని అనుకున్నాడు. . . కానీ అతను చేయలేకపోయాడు. మరియు ఎక్కడో మధ్యలో ప్రభువు అతనితో, “పేతురు, నేను నిన్ను క్షమించాను. నాకు అర్థమైనది. నీ సహోదరులను స్థిరపరచడానికి దీనిని ఉపయోగించు.”
అందుకే పేతురు తరువాత ప్రారంభ క్రైస్తవులకు ఈ క్రింది మాటలను వ్రాయగలిగాడు:
మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక.
మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతోకూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింప జేసెను. (1 పేతురు 1:2-3, ప్రాధాన్యత జోడించబడింది)
పేతురుకు ఇది ఎందుకు అంత ముఖ్యమైనది? పునరుత్థాన సమయంలో పేతురు పేరు పిలువబడింది, మరియు యెంతో కరుణతో ప్రభువు ఇలా అన్నాడు, “నేను తిరిగి వచ్చానని అతనికి చెప్పండి.”
గొప్ప నిరీక్షణ కలిగిన పత్రికయైన మొదటి పేతురును ఆ నిరీక్షణను అనుభవించిన వ్యక్తి వ్రాశాడు! అతను ఈ పత్రిక రాసే సమయానికి, పేతురు తన స్థానానికి తిరిగి రావటమేగాక, అతను ప్రారంభ సంఘ ఏర్పాటులో దృఢనిశ్చయంతో నిమగ్నమయ్యాడు.
ఇది మీకు కూడా జరుగవచ్చు. పడిపోయిన మరియు క్షమించబడిన పేతురు మాదిరిగానే, మీరు వైఫల్యాలు చవిచూసినప్పటికీ మీరు క్రొత్త నిరీక్షణను పొందుకోవచ్చు. నువ్వు విశ్వాసివైతే, మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతోకూడిన నిరీక్షణ కలుగునట్లు నువ్వు తిరిగి జన్మించావు (1 పేతురు 1:3).
ఎంత మహావాత్సల్యము! ఎంత జయకరమైన కృప! వైఫల్యం నిత్యం ఉండేది కాదు. దేవుడు క్షమాపణ మరియు నిరిక్షణలో ప్రత్యేకత కలిగి ఉన్నాడు. ఆయన మీ ఘోరమైన వైఫల్యాలను కూడా శక్తివంతమైన మార్గంలో ఉపయోగించుకోగలడు.
Taken from Charles R. Swindoll, “Hope beyond Failure,” Insights (August 2002): 1-2. Copyright © 2002 by Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.