ప్రశ్న:
నా పాపాల కోసం యేసు చనిపోయాడని నాకు చెప్పబడింది. సరిగ్గా దాని అర్థం ఏమిటి? యేసు మరణం నేను పరలోకానికి చేరుకోవడానికి ఎలా సహాయపడుతుంది? క్రీస్తు మరణం నన్ను దేని నుండి రక్షిస్తుంది?
సమాధానం:
యేసు యొక్క మరణమును అర్థం చేసుకోవడానికి ఒక విధానమేమిటంటే, మన పాపములకు మనం విచారణలో ఉన్న న్యాయస్థాన దృశ్యాన్ని అలాగే న్యాయాధిపతియైన దేవుణ్ణి ఊహించుకోండి. దేవునికి వ్యతిరేకంగా మన పాపాలు మరణకరమైన నేరాలు. దేవుడే మన న్యాయాధిపతి, మరియు ధర్మశాస్త్రం ప్రకారం మన నేరాలు మరణశిక్షకు అర్హమైనవి. ఆత్మీయ కోణంలో మరణమనేది అంతులేని యాతనలో దేవుని నుండి శాశ్వతమైన ఎడబాటు. ఇది చాలా గంభీరమైన తీర్పు.
సిలువపై తన రక్తమును చిందించడం ద్వారా, యేసు మనకు అర్హమైన శిక్షను తనమీద వేసుకొని తన నీతిని మనకు ఇచ్చాడు. మన రక్షణ కొరకు క్రీస్తును విశ్వసించినప్పుడు, ముఖ్యంగా మనం లావాదేవీ చేస్తున్నాం. విశ్వాసం ద్వారా, మన పాపాన్ని మరియు దానితో పాటు మరణశిక్షను ఆయన నీతికి మరియు జీవితానికి లావాదేవీ చేస్తాము.
వేదాంత పరంగా, దీనిని “ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తం” అంటారు. క్రీస్తు మన ప్రత్యామ్నాయంగా సిలువపై మరణించాడు. ఆయన లేకుండా, మన స్వంత పాపాలకు మనం మరణశిక్ష అనుభవిస్తాము. ఈ భావనను వివరించే కొన్ని వాక్యాలు ఇక్కడ ఉన్నాయి:
ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను.
(2 కొరింథీయులకు 5:21)
ఆయన దూషింప బడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసి కొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి.
(1 పేతురు 2:23-24)
నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను
మన వ్యసనములను వహించెను
అయినను మొత్తబడినవానిగాను
దేవునివలన బాధింపబడినవానిగాను
శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితిమి.
మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచబడెను
మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను
మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను
అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది. (యెషయా 53:4-5)
హెబ్రీయులకు వ్రాసిన పత్రిక యొక్క రచయిత ఈ విధంగా పేర్కొన్నాడు: “మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తముచేత శుద్ధిచేయబడుననియు, రక్తము చిందింపకుండ పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును” (హెబ్రీయులకు 9:22). దేవుడు మన పాపాలను క్షమించాలంటే, ఆయన తీర్పు సంతృప్తి చెందాలి మరియు దానికొరకు రక్తం చిందించడం అవసరం.
“రక్తం చిందించడం చాలా అనాగరికంగా అనిపిస్తుంది. ఇది నిజంగా అవసరమా? దేవుడు మనలను ఎందుకు క్షమించడు?” అని కొంతమంది ఆక్షేపిస్తున్నారు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, ఆయన పాపానికి తీర్పు తీర్చాలి. న్యాయమైన, నీతిగల న్యాయాధిపతి చెడును శిక్షించకుండా వదిలేస్తాడా? సిలువ యొద్ద, దేవుడు తన కుమారునిపై తన తీర్పును కుమ్మరించాడు, ఆయన దేవుని కోపాన్ని సంతృప్తిపరిచాడు మరియు మనలను క్షమించటానికి వీలు కల్పించాడు. అందుకే మీ పాపాలు, నా పాపాలు, లోకపాపముల కొరకు యేసు తన రక్తాన్ని చిందించాడు.
సిలువ శిక్ష సమయంలో ఏ క్షణంలో దేవుడు తన ప్రియ కుమారునిమీద తన తీర్పును కుమ్మరించాడు? మూడు గంటల చీకటి సమయం ముగింపులో యేసు: “‘ నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివి?’” (మార్కు 15:34) అని అరచినప్పుడని చాలా మంది వేదాంతవేత్తలు నమ్ముచున్నారు. లోక పాపాలను తనపై వేసుకోవడం ద్వారా, యేసు తనను తాను దేవుని పరిశుద్ధ సన్నిధి నుండి తొలగించుకున్నాడు, అలాగే దేవుడు తన కుమారుని నుండి తనను తాను తొలగించుకున్నాడు. ఇది తాత్కాలికమైనదే కానీ వేదనాత్మకమైన యెడబాటు, ఎందుకంటే ఆ సమయంలో, దేవుని కుమారుడు తండ్రిచేత విడిచిపెట్టబడ్డాడు.
దేవుడు తన కుమారునిపై తన కోపాన్ని విప్పాడు, తద్వారా ఆ భయంకరమైన విధిని మనం తప్పించుకోవచ్చు. సిలువ యొక్క ముఖ్య సందేశం మరియు మన నిరీక్షణకు కారణం యిదే: దేవుడు తన కుమారుని చేయివిడిచాడు, తద్వారా ఆయన మనలను ఎప్పటికీ చేయివిడువడు. “నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను” (హెబ్రీయులకు 13:5) అని దేవుడు మనకు భరోసా ఇచ్చాడు. ఇది అద్భుతమైన వాగ్దానం కాదా?
మీ పాపమునకు బదులుగా మీరు యేసుక్రీస్తుపై నమ్మకం ఉంచారా? మీకు నిత్యజీవము ఇవ్వడానికి యేసు మీకోసం చనిపోయాడని మరియు పాపముపై విజయం సాధించి మృతులలోనుండి లేచాడని మీరు నమ్ముతున్నారా? అలా కాకపోతే, ప్రస్తుతం యేసును మీ రక్షకుడిగా అంగీకరించమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. మీరు మీ కోరికను ఇలాంటి ప్రార్థనలో వ్యక్తపరచవచ్చు:
ప్రభువైన యేసు, నేను పాపిని అని నాకు తెలుసు. నా పాపముల కోసం మీరు చనిపోయి తిరిగి లేచారని నేను నమ్ముచున్నాను. నేను ఇప్పుడు నా రక్షకునిగా నిన్ను నమ్ముచున్నాను. నా పాపములను క్షమించండి, మరియు మీరు నన్ను ఉండాలని కోరుకునే వ్యక్తిగా నన్ను మార్చండి. మీ నిత్యజీవమను బహుమానమునకు ధన్యవాదములు. ఆమేన్.
మీరు ప్రభువైన యేసుక్రీస్తును నిజంగా విశ్వసిస్తే, మీకు నిత్యజీవము కలుగుతుంది. మీరు ఆ సత్యమునందు నిశ్చలముగా ఉండవచ్చు. అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “ఆ సాక్ష్యమేమనగా–దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను; ఈ జీవము ఆయన కుమారునియందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవముగలవాడు; దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవములేని వాడే” (1 యోహాను 5:11-12). మీరు దేవుని కుమారుడైన ప్రభువైన యేసును కలిగి ఉన్నప్పుడు, మీకు నిత్యజీవము ఉన్నది.
మీరు ఈ ప్రార్థనను ప్రార్థించినట్లైతే, అలాగే దేవుని గురించి మరియు మీ కొరకు ఆయన ప్రణాళిక గురించి తెలుసుకోవాలనుకుంటే, మమ్మల్ని జీవాంతర్దృష్టి మినిస్ట్రీస్ ఇండియా వద్ద సంప్రదించండి.
Copyright © 2013 by Insight for Living. All rights reserved worldwide.