“నేను ఎవడనని జనులు చెప్పుచున్నారు?” (మార్కు 8:27)
యేసు ఈ ప్రశ్నను రెండు వేల సంవత్సరాల క్రితం అడిగాడు, ఇంకా సమాధానాలు వస్తూనే ఉన్నాయి: కరుణను బోధించిన రబ్బీ, వేలాది మంది హృదయాలను తాకిన తెలివైన నాయకుడు, అమరవీరుడిగా మరణించి తప్పుగా అర్ధం చేసుకోబడ్డ ఆవిష్కర్త. ఆయన శత్రువులైతే ఆయనను ఒక దెయ్యమని, చనిపోయే అర్హత కలిగిన ఆందోళనకారుడని అన్నారు. ఆయన అనుచరులైతే ఆయనను మెస్సీయ అని, ఆరాధనకు యోగ్యుడైన దేవుని కుమారుడని అన్నారు.
ఏ అభిప్రాయం నిజమైనది? యేసు మానవుడు లేదా దైవము అనే రెండు విభాగాల్లో ఒకదానిలో యేసును గురించిన చాలా అభిప్రాయాలు అమరుతాయి. ఆయన మంచి మానవుడు లేదా దైవ-మానవుడు, గొప్ప చారిత్రక వ్యక్తి లేదా శరీరాకారంలోనున్న దైవత్వమై ఉంటాడు. ఇరువైపులా ఉన్న అభిప్రాయాలను తూచి, ఎటువైపు మొగ్గు చూపాలో నిశ్చయించుకోలేక, మీరు యేసును గురించిన మీ స్వంత నిర్ణయం తీసుకోవటానికి బహు సమీపంగా వచ్చి ఉండవచ్చు. యేసు ఎవరు అనే ప్రశ్నకు మీరు సమాధానం ఎలా కనుగొంటారు?
యేసు వాదనలు
యేసు యొక్క స్వంత వాదనలతో మొదలుపెట్టడం శుభారంభమవుతుంది. యేసు తన గురించి ఏమి చెప్పుకున్నాడు?
యేసు దేవునితో సమానత్వమును పొందాడు
యూదు నాయకుల ఈ క్రింది సూటి ప్రశ్నకు సమాధానంగా యేసు యొక్క స్పష్టమైన స్వీయ-గుర్తింపునిచ్చే ప్రకటన ఒకటి వచ్చింది: “ఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుము” (యోహాను 10:24). తన తరపున సాక్ష్యమివ్వడానికి యేసు తన చరిత్రను గూర్చి చెప్పాడు:
“మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు, నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీరు నా గొఱ్ఱెలలోచేరినవారుకారు గనుక మీరు నమ్మరు. నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలోనుండి యెవడును వాటిని అపహరింపలేడు; నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను.” (యోహాను 10: 25-30)
కొంతమంది వేదాంతవేత్తల ప్రకారం, “నేనును తండ్రియును ఏకమై యున్నాము” అని యేసు చెప్పినప్పుడు తాను దేవుడనని చెప్పుకోలేదు. ఆయన అసాధారణ శక్తితో నిండిన సాధారణ మానవుడని చెబుతున్నాడు. అయినా ఆయన చెప్పదలచుకున్నది అంతే అయితే, యూదు నాయకులు దైవదూషణ నిమిత్తం ఆయనను రాళ్ళతో కొడతామని బెదిరించినప్పుడు ఆయన తన భావాన్ని ఎందుకు స్పష్టం చేయలేదు? వారి చేతిలో ఉన్న రాళ్ళు ఆయన ప్రకటనను ఎంత బాగా అర్థం చేసుకున్నారనటానికి గట్టి రుజువైయున్నది: “నీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదు” (యోహాను 10:33).
వారు తొందరపడి తప్పుడు నిర్ణయానికి చేరుకున్నట్లయితే, వారిని సరిదిద్దడానికి యేసుకు అవకాశం ఉంది, అయినప్పటికీ ఆయన అలా చేయలేదు. ఆయన దేవుడు కాబట్టి ఆయన దేవుడనని చెప్పాడు!
ఆయన తండ్రితో ఏకమైయున్నాడని చెప్పటంలో యేసు యొక్క భావమేమిటి? తమ జీవితాలపై సార్వభౌమ నియంత్రణ కలిగివున్న తమ సృష్టికర్తగా యూదులు “తండ్రిని” అర్థం చేసుకున్నారు (ద్వితీయోపదేశకాండము 32:6; యెషయా 64:8). ఆయన మరియు తండ్రి ఒకే వ్యక్తి అని యేసు సూచించలేదు (త్రిత్వంలో యేసు పాత్రను మనము తరువాత చర్చిస్తాము), కానీ ఆయన మరియు తండ్రి ఒకే స్వభావం గలవారని సూచించాడు. వారు హక్కులు, అధికారం, ఆధిక్యతలు మరియు బలములో సమానంగా ఉన్నారు. గనుక వారి జీవితాలపై సంపూర్ణ సార్వభౌమాధికారం తనకు కలవని యేసు చెబుతున్నాడు. ఇది యూదు నాయకులను ఆగ్రహానికి గురిచేసింది.
యేసు దైవిక అధికారాన్ని పేర్కొన్నాడు
సువార్తలలో, యేసు తన అధికారము యొక్క వాదనల ద్వారా తన దైవత్వమును ప్రకటించాడు. “నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని” (యోహాను 10:11) అని ఆయన ప్రకటించాడు, ఇది దేవునికి పాత నిబంధన ఆపాదించిన శీర్షిక (కీర్తన 23:1). ఆయన ప్రజలందరికీ న్యాయాధిపతియని పేర్కొన్నాడు (యోహాను 5:27), ఇది దేవుడు మాత్రమే చేసే పని (యోవేలు 3:12). ఆయన తనను తాను పెండ్లికుమారుడు అని పిలుచుకున్నాడు (మత్తయి 25:1), ఇది దేవుడు ఇశ్రాయేలుతో పోషించిన పాత్ర (యెషయా 62:5). ఆయన పాపములను క్షమించాడు (మార్కు 2:5); దేవుడు మాత్రమే పాపములను క్షమించగలడు. యేసు దేవుడని చెప్పుకుంటున్నాడని పరిసయ్యులు గ్రహించారు, వారు దేవదూషణ విషయమై ఆయనను చంపడానికి ప్రయత్నించారు (మార్కు 14:64-65).
పాత నిబంధనలోని “నేను ఉన్నవాడను” అని యేసు యెహోవా స్థాయిలో తనను తాను నియమించుకున్నాడు (యోహాను 8:58). ఆయన మెస్సీయ అని చెప్పుకున్నాడు (మార్కు 14:61-64) మరియు మెస్సీయ కేవలం దావీదు వారసుడు కాదని, దావీదు యొక్క ప్రభువని బోధించాడు (లూకా 20:41). ఆయన దేవునితో సమాన అధికారాన్ని పొందాడు (మత్తయి 28:18), అలాగే తన నామమున ప్రార్థనను కూడా ప్రోత్సహించాడు (యోహాను 14:13-14). చివరగా, రక్షణ కొరకు తనను విశ్వసించాలని ఆయన ప్రజలను ఆహ్వానించాడు (యోహాను 3:16; 6:29; 7:38). ఇశ్రాయేలు చరిత్రలో, ఏ ప్రవక్తగాని రాజుగాని యాజకుడుగాని రబ్బీగాని తమ నామమున రక్షణను ఇస్తామని ఎన్నడూ చెప్పలేదు. అలాంటి విజ్ఞప్తి చేయడం వారికి దైవదూషణ అయ్యేది. యేసు మాత్రమే నిర్భయముగా విశ్వాసం యొక్క విజ్ఞప్తి చేశాడు. . . ఎందుకంటే ఆయన దేవుడు.
దేవుడు మాత్రమే చేయగలిగినది యేసు చేశాడు
తాము దేవుడు అని ప్రజలు చెప్పినప్పుడు, మనము వారిని మానసిక వైద్యుడి వద్దకు తీసుకువెళతాము. వారు వంచకులు! ఆయన దైవత్వమునకు రుజువు లేకుండా, యేసు వాదన నిరర్థకముగా ఉంటుంది; మతిస్థిమితం లేనట్లుగా అధ్వాన్నంగా ఉంటుంది. కాబట్టి తాను ఎవరో ప్రపంచానికి చూపించడానికి, దేవుడు మాత్రమే చేయగల పనులను ఆయన చేశాడు.
- ఆయన మృతులైన జనులను లేపాడు. (మార్కు 5:41; యోహాను 11:38-44)
- ఆయన ప్రజలను స్వస్థపరచాడు. (మత్తయి 9:35; 11:4)
- ఆయన తుఫానును నిమ్మళపరచడం మరియు వేలాది మందికి ఆహారమును దయచేయడం వంటి అద్భుతాలను చేశాడు. (మార్కు 4:35-41; 8:1-9)
- ఆయన దయ్యములను పారద్రోలి సాతానును ఓడించాడు. (మార్కు 1:27; లూకా 4:1-13)
- ఆయన ఆరాధనను అంగీకరించాడు. (మత్తయి 14:33)
- అద్భుతాలు చేయటానికి ఆయన తన శిష్యులకు అధికారం ఇచ్చాడు. (మత్తయి 10:1)
యేసు చేసిన ప్రతి స్వస్థత, అద్భుతం లేదా దయ్యములను వదిలించడం అనేవి ఆయనే ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న లోకరక్షకుడైన దేవుని కుమారుడని అదనపు సాక్ష్యాలను అందించాయి (యెషయా 35:5-6).
యేసు దైవత్వం యొక్క వేదాంత శాస్త్రము
యేసు దైవత్వమును గూర్చి మరిన్ని ఆధారాల కోసం, యేసు యొక్క మాటలు, క్రియల నుండి అపొస్తలుల వ్రాతల తట్టు తిరుగుదాం.
క్రొత్త నిబంధనలో యేసు యొక్క దైవత్వం
క్రొత్త నిబంధన యొక్క మిగిలిన భాగాలలో, దేవుని (థెయాస్) బిరుదు యేసుకు స్పష్టంగా ఆపాదించబడిందని మనం చూస్తాము (యోహాను 1:1, 18; 20:28; రోమా 9:5; తీతుకు 2:13; హెబ్రీయులకు 1: 8 ; మరియు 2 పేతురు 1:1). అనేక భాగాలలో, రచయితలు దేవునికి మాత్రమే వర్తించే రీతుల్లో యేసును సూచించారు. ఆయన శాశ్వతమైనవాడు అని వారు వ్రాస్తారు (ప్రకటన 1:17, మీకా 5:2 తో పోల్చండి), అయినను శాశ్వతమైన దేవుడు మాత్రము ఒక్కడే ఉన్నాడు (ద్వితీయోపదేశకాండము 6:4; 33:27). క్రీస్తు అన్నింటినీ సృజించాడు (యోహాను 1:3, కొలొస్సయులకు 1:16), అయినప్పటికీ సృష్టికర్త మాత్రం ఒక్కడే ఉన్నాడు (1 పేతురు 4:19). క్రీస్తు ప్రతిచోటా ఉన్నాడు (మత్తయి 28:20), అయినప్పటికీ మనం ఆరాధించే సర్వాంతర్యామియైన దేవుడు మాత్రం ఒక్కడే ఉన్నాడు (అపొస్తలుల కార్యములు 17:27, 28). క్రీస్తు ప్రజలు మరియు దేవదూతల నుండి ఆరాధన పొందుచున్నాడు (మత్తయి 14:33; ఫిలిప్పీయులకు 2:10; హెబ్రీయులకు 1:6), అయితే పాత నిబంధన మాత్రం దేవుని తప్ప మరెవరినైనా ఆరాధించడాన్ని నిషేధిస్తుంది (నిర్గమకాండము 20:1-5; ద్వితీయోపదేశకాండము 5:6-9). ఈ లక్షణాలలో ప్రతి ఒక్కటి దేవుని గురించి మాత్రమే చెప్పవచ్చు కాబట్టి, యేసు కూడా దేవుడై ఉండాలి.
యేసు యొక్క దైవత్వం మరియు త్రిత్వము
యేసు ఒకే సమయంలో దేవుని కుమారుడు మరియు దేవుడు ఎలా అవుతాడు? యేసు తనకు మరియు తండ్రికి మధ్య వ్యత్యాసం తెలియజేసినందున, కొంతమంది యేసు నిజంగా దేవుడు కాదని, సృష్టించబడిన జీవి అని తేల్చారు. ఈ సమస్యకు సమాధానం ఇవ్వడానికి, త్రిత్వము యొక్క సభ్యులు ఎలా సంబంధం కలిగి ఉన్నారో మనం పరిశీలించాలి.
తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మను ప్రత్యేక వ్యక్తులుగా లేఖనము గుర్తిస్తుంది. త్రిత్వములోని ప్రతి వ్యక్తి పోషిస్తున్న ప్రత్యేక పాత్రలను అనేక వచనాలు వివరిస్తాయి. తండ్రి ఏర్పరచుకుంటాడు (1 పేతురు 1:2), లోకమును ప్రేమిస్తాడు (యోహాను 3:16), శ్రేష్ఠమైన వరములు ఇస్తాడు (యాకోబు 1:17); కుమారుడు హింసలు పొందుతాడు (మార్కు 8:31), విమోచిస్తాడు (1 పేతురు 1:18), మరియు అన్నింటినీ నిర్వహిస్తాడు (హెబ్రీయులు 1:3); ఆత్మ నూతనపరుస్తాడు (తీతుకు 3:5), అధికారం ఇస్తాడు (అపొస్తలుల కార్యములు 1:8), మరియు పరిశుద్ధపరుస్తాడు (గలతీయులకు 5:22-23).
కుమారుడు, తండ్రి మరియు ఆత్మ ఎలా పరస్పరం సంబంధం కలిగి ఉన్నారో వివరించే అనేక వచనాలు కూడా ఉన్నాయి. తండ్రి కుమారుణ్ణి, ఆత్మను పంపుతాడు. కుమారుడు తండ్రి చిత్తానికి తనను తాను లోపరచుకుంటాడు, తండ్రిని బయలుపరుస్తాడు మరియు తండ్రి మాటలు మాట్లాడతాడు (యోహాను 14:7-26). వేదాంత పరంగా, సంబంధాన్ని ఇలా వర్ణించవచ్చు:
- తండ్రి కుమారుని కన్నాడు మరియు ఆయనయొద్దనుండి పరిశుద్ధాత్మ బయలుదేరాడు, అయితే తండ్రి పుట్టలేదు లేక ఎవరియొద్దనుండి బయలుదేరలేదు.
- కుమారుడు పుట్టాడు మరియు ఆయన నుండి పరిశుద్ధాత్మ బయలుదేరాడు, కాని ఆయన కనడు లేక ఎవరియొద్దనుండి బయలుదేరలేదు.
- పరిశుద్ధాత్మ తండ్రి మరియు కుమారుడు యిద్దరి నుండి బయలుదేరాడు, కాని ఆయన కనడు లేక ఆయన నుండి ఎవరూ బయలుదేరరు.1
“కను” అను ఈ పదాన్ని ఎలా నిర్వచించాలనేది కీలకమైన విషయం. మోర్మోన్స్ మరియు యెహోవాసాక్షులు, కనడం అంటే “సృష్టించండి” అని అంటారు. వారి దృష్టిలో, శాశ్వతకాలం యొక్క ఏదో ఒక సమయంలో, తండ్రి అప్పటికే ఉనికిలో లేని ఒక జీవిని సృష్టించాడు మరియు ఆయనను తన సారముతో నింపాడు. “దేవుని కుమారుడు” అయిన ఆ జీవి దేవుడు కాదు, కానీ దేవుడు ఆయనలో నివాసం చేస్తూ భూమిపై ఆయనను సూచిస్తున్నాడు.
ఆ దృక్పథంలో ప్రధాన సమస్య ఏమిటంటే, కుమారుడు సృష్టించబడిన జీవి అయితే, మనం ఆయనను ఆరాధించకూడదు. దేవుణ్ణి మాత్రమే ఆరాధించమని లేఖనం మనకు నిలకడగా ఆజ్ఞాపించుచున్నది మరియు సృష్టించబడిన ఏ జీవిని ఆరాధించకుండా నిషేధిస్తుంది (రోమా 1:24-25). యెహోవా యెషయా ద్వారా, “మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను” (యెషయా 42:8) అని చెప్పారు. “ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను” (ద్వితీయోపదేశకాండము 6:13; మత్తయి 4:10) అనే లేఖనం యొక్క ఉపదేశంతో యేసు సాతాను యొక్క శోధనను తిప్పికొట్టాడు.
అయినప్పటికీ యేసు శిశువుగా పూజింపబడ్డాడు (మత్తయి 2:8). తన శిష్యులు తండ్రిని ఘనపరచునట్లుగా తననూ ఘనపరచాలని ఆయన బోధించాడు (యోహాను 5:23). దేవునికి స్తుతులు ఆపకుండా ఆయన ఆరాధింపబడ్డాడు (మత్తయి 14:33; 28:17; యోహాను 9:38). ఆయన మహిమతో తనను మహిమపరచమని తండ్రిని కోరాడు (యోహాను 17:5).
“సృష్టించడం” అనే అర్ధం రాకపోతే “కనడం” అనే భావనను మనం ఎలా అర్థం చేసుకోగలం? హెబ్రీయులకు 1:3 మనకు అవసరమైన వేదాంత కాంతిని ప్రసారం చేస్తుంది:
ఆయన దేవుని మహిమయొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచున్నాడు. (ఆంగ్లంలో ఇక్కడ NIV తర్జుమ వాడారు)
మహిమనుండి ప్రకాశము బయలుదేరినట్లు తండ్రినుండి కుమారుడు బయలుదేరాడు. ఒకరినుండి మరొకరు భిన్నముగా ఉన్నప్పటికీ, ఒకరు లేకుండా మరొకరు ఉండటం అసాధ్యం. తేజస్సు లేకుండా మహిమ ఉన్న సమయం ఎన్నడూ లేదు. అలాగే, కుమారుడు లేకుండా తండ్రి ఉన్న సమయము ఎప్పుడూ లేదు. వెలుగు మరియు తేజస్సు ఒకటి అయినట్లే ఆ ఇద్దరునూ ఒకటే.
ప్రారంభ సంఘ పితరుడైన అథనాసియస్, ఈ వాక్యమును వివరించడానికి ఒక ఊట మరియు ప్రవాహం యొక్క రూపకాన్ని ఉపయోగించాడు. ఒకదానికంటే మరొకటి వేరుగా ఉంటుంది, అయినప్పటికీ అవి ఒకటిగా ఉంటాయి. ప్రవాహం ఊట నుండి ప్రవహిస్తుంది, అయినప్పటికీ ప్రవాహమే ఊటలోని సారమైయున్నది. అదేవిధంగా, ఆలోచన నుండి ఒక వాక్యం ప్రవహిస్తుంది, అయినప్పటికీ వాక్యము ఆలోచనలోని సారమైయున్నది. “వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను” (యోహాను 1:1) అని వ్రాసినప్పుడు యోహాను ఈ తార్కిక విధానాన్ని అనుసరించాడు. ఒక ఊటకు ప్రవాహమేలాగో, ఆలోచనకు వాక్యమేలాగో, ఆలాగుననే దేవునికి యేసు. ఆయన దేవునియొద్ద నుండి ప్రవహించాడు మరియు ఆయన దేవుడై ఉన్నాడు.
కుమారుడు “ఆయన [దేవుని] తత్వముయొక్క మూర్తి మంతమునైయున్నాడు” (ఆంగ్లంలో ఇక్కడ NIV తర్జుమ వాడారు) అని హెబ్రీయులకు 1:3 కూడా చెబుతోంది. ఈ విషయంలో, కుమారుడు మనకు భిన్నంగా ఉన్నాడు. మనుష్యులు దేవుని స్వరూపంలో సృష్టించబడ్డారు, అయితే యేసు దేవుని స్వరూపము గలవాడై యున్నాడు. చాలా పెద్ద తేడా ఉంది. మన మానవ స్వరూపంలో మనం ఒక మరమనిషిని సృష్టించవచ్చు, కాని ఆ సృష్టము మానవుడి కంటే తక్కువగానే ఉంటుంది మరియు అది ఎప్పటికీ వ్యక్తిగా ఉండలేదు. మనం ఏదైనా “కనినప్పుడు” అది మనవలె ఉంటుంది. మన పిల్లలు మన మానవత్వము యొక్క మూర్తిమంతమునైయుందురు. అదే విధంగా, తండ్రి కుమారుని “కనును.” కుమారుడు తండ్రి యొక్క మూర్తిమంతమునైయున్నాడు- ఆయన దేవుడైయున్నాడు. దేవుడు సృష్టించేది సృష్టి; దేవుడు కనేది దేవుణ్ణే.
యేసు యొక్క దేవత్వము మరియు మన రక్షణ
యుగయుగాలనుండి క్రైస్తవులకు, ఈ వాక్యములు ఒకే ఒక తీర్మానాన్ని జోడించాయి: యేసు దేవుడు. ఈ సత్యం యొక్క స్వభావమును చెప్పడానికి పౌలును ఈ క్రింది విధముగా ప్రేరేపించింది,
క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించు కొనెను. అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. (ఫిలిప్పీయులకు 2:5-11)
యేసు దేవుడు అయినప్పటికీ, ఆయన తన దైవిక లక్షణాలను మానవ రూపాన్ని పొందటానికి పక్కన పెట్టారని, మరియు తన మానవ రూపంలో, ఆయన మన స్థానంలో సిలువపై మరణించాడని ఈ వాక్యాలు చెబుతున్నాయి. ఆ విధంగా, దేవుడు మనకోసం తనను తాను త్యాగం చేసుకున్నాడు. అయినప్పటికీ, దేవుడు ఒక జీవిని సృష్టించి, దానిని తన కుమారుడని పిలిచి, మనకోసం చనిపోవుటకు పంపినట్లయితే, అది ఎలాంటి త్యాగం అవుతుంది? అలా కాకుండా, దేవుడు స్వయంగా మానవుడయ్యాడు, మన బాధను అనుభవించాడు, మన హృదయాలను తాకి, మన స్థానంలో మరణించాడు.
ముగింపు
క్రీస్తు దేవత్వం యొక్క సిద్ధాంతమునకు ముఖ్యమైనదేమంటే, దేవుడు మన కోసం ప్రేమతో స్వీయ త్యాగం చేసుకోవటం. మన రక్షణ మనలాంటి మనిషిలో కాదు, మన పాపముల నుండి విడుదల పొందటానికి మనలాగే మారిన దేవునిలో ఉంది.
“నేను ఎవడనని జనులు చెప్పుచున్నారు?” అని యేసు అడిగిన తరువాత, ఆయన మరింత ముఖ్యమైన ప్రశ్నను అడిగాడు, “మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారు?” (మార్కు 8:29). ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి వ్యక్తి తనను తాను నిర్ణయించుకోవాలి. యేసు ఎవరు అని మీరు అనుకుంటున్నారు? ఆయన మీ ప్రభువా?
మీరు మీ నిర్ణయం గురించి మరింత మాట్లాడాలనుకుంటే, మా ఇన్సైట్ ఫర్ లివింగ్ పాస్టర్లలో ఒకరిని సంప్రదించడానికి సంకోచించకండి. మీ ఆత్మీయ ప్రయాణంలో మిమ్మల్ని ప్రోత్సహించడానికి మేము సంతోషిస్తాము. మీ ప్రశ్నలతో పాస్టరుకు ఎలా రాయాలో దానికి సంబంధించిన సంప్రదింపు సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Charles C. Ryrie, Basic Theology: A Popular Systematic Guide to Understanding Biblical Truth (Wheaton, Ill.: Victor, 1986), 54.