యేసు సిలువ వేయబడిన రోజున, ఒక చెడ్డ అంధకారము సూర్యుడిని మాయంచేసి, చెడు దుప్పటి కింద యెరూషలేమును ఉక్కిరిబిక్కిరి చేసింది. అంధకారము, సాతాను మరియు మరణం దేవుని కుమారుడిని ఒక్కసారిగా ఓడించాయని శారీరక కళ్ళతో చూసేవారికి ఎవరికైనా అనిపిస్తుంది.
నేను బాధపడే ప్రతి ఆందోళనకు దాదాపు మూలంగా ఈ మూడూ ఉన్నాయని నేను మీతో ఏకీభవిస్తాను. నేను మరణం గురించి, ముఖ్యంగా, నేను ప్రేమించే వ్యక్తుల మరణం గురించి ఆందోళన చెందుతున్నాను. నేను యథాతథమైన మరియు ఉపమానవిశిష్టమైన చీకటి గురించి ఆందోళన చెందుతున్నాను. సాతాను ఏమి చేయనైయున్నాడో దాని విషయమై నేను ఆందోళన చెందుతున్నాను.
దయ్యములు, చీకటి, మరణం. . . ఈ మూడు కూడా ఈ సుదీర్ఘమైన మరియు వేదన కలిగించే రోజును తీసుకురావడానికి యేసు పరిచర్యలో శ్రద్ధగా పనిచేశాయి. కానీ ఎవరూ చూడలేనిది ఏమిటంటే, మెస్సీయ మరణం చెడు యొక్క ముఖ్య భాగాన్ని కొట్టింది.
యేసును సమాధిలో ఉంచిన మూడు రోజుల తరువాత, ఆదివారం ఉదయమున, మగ్దలేనే మరియ, యింకా కొంతమంది స్త్రీల గుంపు సమాధి దగ్గరకు వెళ్ళారు. వారు సమీపించినప్పుడు, పెద్ద రాయి ప్రక్కకు దొరలింపబడియుండటం వారు చూశారు. మగ్దలేనే మరియ వెంటనే పేతురు మరియు యోహాను దగ్గరకు పరుగెత్తుకొని వచ్చి ఇలా చెప్పింది: “ప్రభువును సమాధిలోనుండి యెత్తికొనిపోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో యెరుగము” (యోహాను 20:2).
మగ్దలేనే మరియ లేనప్పుడు, యితర స్త్రీలు ఆ సమాధిని నిశితంగా పరిశీలించారు. సమాధి తెరిచి ఉంది. సమాధిలో నారబట్టలు అక్కడే ఉన్నాయి, చెక్కుచెదరకుండా అక్కడే ఉన్నాయి, కానీ ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే శరీరము అక్కడ లేదు. వారి వెనుక ఇద్దరు దేవదూతలు ఉన్నారని వారు గ్రహించే వరకు వారు చాలా క్షణాలు మూగబోయారు. ఒకరు రాతిపై కూర్చున్నారు, మరొకరు సమీపంలో నిలబడ్డారు. “సజీవుడైన వానిని మీ రెందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన ఇక్కడలేడు, ఆయన లేచియున్నాడు!” (లూకా 24:5-6).
ఖాళీ సమాధి నుండి పరుగెత్తుచూ ఉండగా, వారి భయాలను శాంతపరిచే వ్యక్తిని వారు ఎదుర్కొన్నారు. “యేసు వారిని ఎదుర్కొని,‘మీకు శుభము! . . . భయపడకుడి. మీరు వెళ్లి, నా సహోదరులు గలిలయకు వెళ్లవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడి’ అనెను” (మత్తయి 28:9-10).
స్త్రీలు ఏమి జరిగిందో చెప్పినప్పుడు, శిష్యులు వారి కథను పిచ్చిగా, అతిశయోక్తి కబుర్లుగా కొట్టిపారేశారు. ఇంతలో, మగ్దలేనే మరియ పేతురు మరియు యోహానులను కనుగొంది. మొదట, వారు కూడా ఆమె చెప్పినదాన్ని త్రోసిపుచ్చారు, కాని చివరికి వారిలో ఉత్సుకత పెరగటంతో వారు సమాధి యొద్దకు పరుగెత్తారు.
యోహాను అక్కడికి వచ్చినప్పుడు, అతను ప్రవేశద్వారం వద్ద ఆగి లోపలికి చూశాడు. పేతురు నేరుగా సమాధిలోకి పరుగెత్తి తాను చూసినదానికి విస్మయమొందాడు. సమాధి లోపల పేతురుతో కలిసి, “ఆయన సజీవుడై ఉన్నాడు!” అని యోహాను గుసగుసలాడి ఉంటాడని నేను అనుకుంటున్నాను.
మాట వ్యాపించడంతో, యెరూషలేములోని ఒక ఇంటి వద్ద ఒక గుంపు కూడుకున్నారు. తలుపులు గట్టిగా మూసివేసియుండగా, గది మధ్య నుండి సుపరిచితమైన గొంతు వినబడింది. “‘మీకు సమాధానము కలుగునుగాక.’ ఆయన ఆలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపెను” (యోహాను 20:19-20). వారు నమ్మారు.
దురదృష్టవశాత్తు, పన్నెండు మందిలో ఒకరైన తోమా అక్కడ లేడు. అతను వచ్చినప్పుడు, అందరూ అతనికి జరిగినది చెప్పారు. తోమా ఆ సమాచారమును నమ్మలేదు. “నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మను” (20:25). ఎనిమిది రోజుల తరువాత, యింట్లో గది తలుపులు మునుపటి కంటే గట్టిగా మూసివేసియుండగా తోమా అక్కడ ఉన్నాడు. “మీకు సమాధానము కలుగును గాక” (20:26). మరల, యేసు గది మధ్యలో నిలబడ్డాడు. “నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము; నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుము” (20:27). తోమా కదలలేదు. అతను ఒక వేలు కూడా ఎత్తలేదు. యేసు యొక్క నిజమైన శిష్యుడు మాత్రమే స్పందించునట్లుగా అతను స్పందించాడు: “నా ప్రభువా, నా దేవా!” (20:28).
ఆ ఆదివారం ఉదయం యేసును యెరిగిన ప్రజల స్పందనలు సువార్త యొక్క ఆధునిక కాలపు వాహకునిగా నేను ప్రతిరోజూ ఎదుర్కొనే ప్రతిస్పందనలకు సమాంతరంగా ఉంటాయి.
కొందరు వెంటనే నమ్మారు. వారికి సమాచారం ఇవ్వబడింది, యేసు తన పరిచర్యలో ముందుగా చెప్పిన వాటిని జ్ఞాపకం చేసుకున్నారు. అలాగే ఆయన పునరుత్థానాన్ని నిజమైనదిగా అంగీకరించారు.
కొందరు పరోక్ష ఆధారాలనుబట్టి నమ్మారు. వారు మొదట ఈ భావనను అనుమానించారు. కాని వారు ఖాళీ సమాధిని చూసి, దాని గురించి మరింత సమాచారం అందుకున్నప్పుడు, ఆయన లేచాడని వారికి తెలిసింది.
కొందరు ప్రత్యక్ష సాక్ష్యాలనుబట్టి నమ్మారు. తమ కళ్ళతో యేసును చూసిన తరువాతనే యేసు లేచాడని వారు విశ్వసించారు.
దయ్యములు, అంధకారము మరియు మరణం నిర్మూలించబడ్డాయి, అయినప్పటికీ అవి దేవుని సృష్టిలోని ప్రతిదానికీ వ్యతిరేకంగా విరుచుకుపడుతున్నాయి. కానీ చింతించకండి. . . యేసు ఒక కొత్త రకమైన జీవముతో జీవించి ఉన్నాడు, నమ్మిన వారందరికీ ఎవ్వరికైనా సరే ఇవ్వడానికి ఆయన ఎంతో ఆశతో ఉన్నాడు. మీరు ఆ సాహచర్యంలో ఉన్నారా? లేదా, రక్షకుని కోసం మీ అవసరాన్ని మీరు గ్రహించారా? అది మీకు మంచిది! దయ్యము, చీకటి, మరియు మరణం ప్రగల్భాలు పలుకుతాయి, జీవితపు బాధలు కొద్దిసేపు నొప్పిస్తాయి, కాని చెడు శక్తులు నాశనం చెందుతున్నాయి. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. . . ఆయన లేచెను! ఆయన లేచాడు, రూఢిగా!
Taken from Charles R. Swindoll, “Not to Worry . . . He’s Risen!” Insights (March 2008): 1-2. Copyright © Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.