నేను హ్యూస్టన్‌లో పెరుగుతున్నప్పుడు, మా కుటుంబం శ్రీమతి రాబర్ట్స్ అనే విధవరాలి యింటికి ఎదురుగా వీధి ఆవల నివసించాము. ఆమె భర్త ఇటీవల ఆకస్మిక గుండెపోటుతో మరణించారు. ఒంటరితనముతో, భయముతో, భవిష్యత్తు ఏమిటో తెలియని స్థితిలో ఉన్నది. ఆమె దుఃఖానికి హద్దులు లేవు.
అంత్యక్రియలు జరిగిన తరువాతి వారాల్లో, శ్రీమతి రాబర్ట్స్ తన భర్త సమాధిని సందర్శించడానికి ప్రతిరోజూ ఇంటి నుండి బయలుదేరడం మా తల్లి గమనించారు. ప్రతి రోజు ఆమె ఏకాంతమైన ఇంటినుండి స్మశానవాటికకు వెళుతున్నప్పుడు, ఆమె నిరాశ తీవ్రమైంది. చూడండి, మా పొరుగువారైన ఆ స్త్రీ నైతికంగా నిజాయితీగల వ్యక్తి అయినప్పటికీ, ఆమెకు యేసుతో వ్యక్తిగత సంబంధం లేదు. కొన్ని సంవత్సరాలుగా, నా తల్లి సువార్తతో ఆమెను చేరుకోవడానికి ప్రయత్నించింది, కాని శ్రీమతి రాబర్ట్స్ ఎప్పుడూ అంగీకరించలేదు. ఆమెకు క్రీస్తుపై నిరీక్షణ లేనందున, ఆయన పునరుత్థానం మీద ఆమెకు నిరీక్షణ లేదు, జీవితంలో సంతోషం గురించి ఆశ లేదు, అలాగే పరలోకంలో శాశ్వతమైన, సమాధానకరమైన గృహమును గురించి ఖచ్చితంగా ఆశ లేదు.
“చార్లెస్, నేను చెప్పేదానికి శ్రీమతి రాబర్ట్స్ హృదయం తెరువబడులాగున నువ్వు ప్రార్థించాలని నేను కోరుకుంటున్నాను” అని నా తల్లి నాతో చెప్పిన రోజును నేను ఎప్పటికీ మరచిపోలేను. కొద్ది నిమిషాల్లోనే, ఆమె బిస్కెట్లను మరియు నిమ్మకాయ రసాన్ని తీసుకుని వీధి అవతలకు వెళ్లింది. ఆ మధ్యాహ్నం, శ్రీమతి రాబర్ట్స్ క్రీస్తు సువార్తను విన్నది మరియు సత్యాన్ని స్వీకరించింది: యేసు మృతులలోనుండి లేచినందున, తుది విజయం సాధించటానికి మరణానికి ఎటువంటి హక్కు లేదు. అయితే, క్రీస్తు మరియు ఆయనను విశ్వసించేవారు నిత్యము జీవించియుందురు.
ఒక్క క్షణం ఆగి దీని గురించి ఆలోచించండి: యేసు పునరుత్థానం ఒకవేళ మోసం అయితే? అయితే, భూమిపై నిలకడలేని మీ జీవితానికి అర్థం ఏమిటి? శ్రీమతి రాబర్ట్స్ తన భర్తతో గడిపిన సంతోషకరమైన సంవత్సరాలను వెనక్కి తిరిగి చూసుకోగా, అకస్మాత్తుగా, చాలా గందరగోళంగా ముగిసిన సంవత్సరాల విషయమై ఆమె దగ్గర సమాధానం లేదు. మరియు ఆమె నిష్ఫలమైన సమాధి విహారయాత్రలు ఆమె యొక్క నిరీక్షణలేమితనమును మరింత తీవ్రతరం చేశాయి.
మనం ఎదుర్కొందాము. ఒకవేళ యేసు ఆ మొదటి ఈస్టర్ ఉదయాన్నే లేవనట్లైతే, ఆయనను చుట్టిన నారబట్టలు ప్రక్కనే ఉండటం, సమాధిని వదిలి తనను ప్రేమిస్తున్నవారి మధ్య నడవడానికి రావటం, ఏదీ ముఖ్యమైనది కాదు. మరొక విధంగా నన్ను వ్రాయనివ్వండి. యేసు మృతుల్లోనుండి సజీవంగా తిరిగి రాకపోతే, లేదా ఆయన పునరుత్థానం ఒక బూటకమైతే, దేనికీ కూడా ఖచ్చితంగా ఏ అర్థమూ లేనట్లే. అప్పుడు మనం ఆస్వాదించే ఏ ఆశీర్వాదమైనా సరే అకస్మాత్తుగా, హృదయ విదారక ముగింపుకు వచ్చేస్తుంది. అలాగే మనము సాధించే ఏ మంచి పనైనను క్షీణించటమో లేదా త్వరగా వాడుకలో లేకుండా పోవటమో జరుగుతుంది. మనకు ముందు మరియు తరువాతి యుగాలతో పోల్చినప్పుడు క్షణమాత్రముండు మన జీవితం గతించిపోయినప్పుడు మనం వేసే ముద్ర సముద్రపు అలలచేత ఇసుకలోని పాదముద్రలు కొట్టుకొనిపోయినట్లు కొట్టుకుపోతుంది. అంతేగాక, మనము వింతైన, చనిపోయిన రక్షకుడిని విశ్వసించి, ప్రార్థిస్తూ మన సమయాన్ని వృథా చేసుకుంటాము. అపొస్తలుడైన పౌలు దీనిని ఈ విధముగా వ్రాశాడు:
మరియు క్రీస్తు లేపబడియుండనియెడల మేముచేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని, ఆయననుగూర్చి మేము సాక్ష్యము చెప్పియున్నాము గదా? మృతులు లేపబడనియెడల దేవుడాయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము. మృతులు లేపబడని యెడల క్రీస్తు కూడ లేపబడలేదు. క్రీస్తు లేప బడనియెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే యున్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించినవారును నశించిరి. ఈ జీవితకాలముమట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైనయెడల మనుష్యులందరి కంటె దౌర్భాగ్యులమై యుందుము. (1 కొరింథీయులకు 15:14–19)
చనిపోయిన ప్రభువుపై మన నమ్మకం కలిగియుండటం ఎంత అర్ధరహితమవుతుంది! కల్లలాడే దేవుణ్ణి విశ్వసించడం ఎంత వ్యర్థము! ఏ ఆనందమైనా లేదా ఏ అర్ధవంతమైన భవిష్యత్తుయైనా లేదా ఏ నిరీక్షణయైనా మరణంతోనే ముగిసిపోతే అది ఎంత నిరర్ధకమైనది!
మరోవైపు, క్రీస్తు నిజంగా లేచినందున, మనం బాగా జీవించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి మరియు ఈ రోజు మనం అనుభవిస్తున్న ఆశీర్వాదాలను ఆస్వాదించడానికి మనకు ఆధారం ఉంది. ఎందుకు? ఎందుకంటే ఈ భూసంబంధమైన ఆశీర్వాదాలు రాబోయే అనేకమైన ఆశీర్వాదాలకు ఒక నమూనా మాత్రమే.
పునరుత్థానం మనకు ఏమి ఇస్తుంది? ప్రయోజనాలు చాలా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. కానీ ప్రస్తుతానికి, నన్ను రెండింటిని మాత్రం ప్రస్తావించనివ్వండి:
మొదటిది, యేసుక్రీస్తు పునరుత్థానం మనం జీవించే జీవితం నిష్ఫలమైనది కాదని మన వాగ్దానం. మనకు తాత్కాలికంగాను మరియు శాశ్వతంగాను ప్రాముఖ్యత ఉన్నది. మనం భూమిపై గడిపే ఎనభై లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలకు మించి మన జీవితాలకు ప్రయోజనం ఉంది, ఎందుకంటే నిత్యత్వంలో మన పెట్టుబడులు మంచి లాభాన్ని యిస్తాయని సజీవ దేవుడు మనకు వాగ్దానం చేశాడు.
రెండవది, యేసు మరణాన్ని జయించినందున మరియు ఆయనపై మనకున్న విశ్వాసం కారణంగా, మనము ఇప్పుడు సమాధిపై విజయం కొరకు ఎదురుచూస్తున్నాము. మరణంపై యేసు సాధించిన విజయం అన్ని తాత్కాలిక విషాదాలను భరించే ధైర్యాన్ని మరియు ప్రతి భూసంబంధమైన ఆనందాన్ని పొందే జ్ఞానాన్ని ఇస్తుంది. అంతిమ చెడు అయిన మరణంపై ఆయన సాధించిన విజయం, ఆయన పునరుజ్జీవింపజేయలేనంతగా ఏదీ మరణించలేదని మనకు భరోసా ఇస్తుంది. కాబట్టి మన పరిస్థితులు ఏమైనప్పటికీ, మంచి రోజులు ముందు ఉన్నాయని మనం ధైర్యం కలిగియుండవచ్చు. ఇంకా, మన స్వంత మరణంపట్ల మనకు భయం లేదు!
నా తల్లి ఖాళీ మట్టి పాత్రతో మరియు నిండు మనస్సుతో తిరిగి వచ్చిన రోజు శ్రీమతి రాబర్ట్స్ ఈ సత్యాన్ని స్వీకరించారు. కానీ విధవరాలి స్మశానవాటిక పర్యటనలు మాత్రం ఆగలేదు. అయితే, ఆమె వెళ్ళడానికిగల కారణం మారింది. ఆమె చేసిన అనేక సమాధి సందర్శనలలో, ఇతర వ్యక్తులు ఏడుస్తూ, యెటువంటి భావోద్వేగాలులేని రాళ్లతో మాట్లాడటం, వారు ఒకసారి అనుభవించిన సంబంధాలను అంటిపెట్టుకుని ఉండటానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆమె వారి నిరాశను అర్థం చేసుకుంది. . . కానీ ఇప్పుడు వారు ఖచ్చితంగా విని నమ్మవలసిన సత్యం ఆమె దగ్గర ఉన్నది.
తన చిన్న క్రొత్త నిబంధనతో మరియు బాగా ఎన్నుకున్న కొద్ది మాటలతో, ఈ రూపాంతరం చెందిన స్త్రీ ఏడుస్తున్న దుఃఖితులను ఓదార్చింది. తరువాత తన జీవితానికి అర్ధాన్ని మరియు నిరీక్షణను ఇచ్చిన సందేశాన్ని వారికి అందించింది: యేసుక్రీస్తు మృతులలోనుండి లేచాడు! వినటానికి వింతగా ఉండవచ్చు గాని, ఆమె “స్మశానవాటిక సువార్తికురాలు” అయ్యింది! నిరాశ స్థానంలో, ఆమెకు ఇప్పుడు నిరీక్షణ ఉంది. . . తన మిగిలిన జీవితమంతా అనేకమందితో పంచుకోవటానికి తగినంత నిరీక్షణ ఆమె కలిగి ఉన్నది.
అలాగే, మన నిరీక్షణ కూడా అదే, కాదా? మరలా చనిపోకుండా మనం కూడా ఒక రోజు పునరుత్థానులమవుతామని యేసు యొక్క పునరుత్థానం వాగ్దానం చేసింది.