ఈస్టర్ మరియు నిరీక్షణ పర్యాయపదాలు.
ఈ జీవితానికి మించిన జీవితం ఉందని మనకు సేదతీర్చుచూ గుర్తుచేయకుండా ఈ ప్రత్యేకమైన దినము ఎప్పటికీ రాదు. నిజమైన జీవితం. నిత్యజీవం. ఘనమైన జీవితం. “నిరీక్షణకు దూరంగా” నివసించే వారికి మార్పు అవసరం. ఈస్టర్ అది ఇస్తుంది.
కొన్ని అసాధారణ కారణాల వల్ల, నేను నిత్యం సాన్నిహిత్యం కలిగియుండే చాలా మంది వ్యక్తులు ఒకేసారి క్యాన్సర్ అనే భయంకరమైన వ్యాధి బారిన పడి జీవించడం నేను నా జీవితంలో అనుభవించాను. “దూరంగా” నివసించే జనుల గురించి మాట్లాడండి మరి. నా ప్రియమైన స్నేహితులలో ఒకరు, క్యాన్సర్‌తో ఒక సంవత్సరం పాటు వీరోచితంగా పోరాడి, ఉపశమనాన్ని పొంది మరల తిరగబెట్టడం నాకు గుర్తుంది. అదే సమయంలో, నేను శిక్షణ పొందిన సెమినరీ అధ్యక్షుడి భార్యకు మెలనోమా-ఆమె కాలేయంలో కణితి ఉన్నట్లు నిర్ధారణ అయింది. మరొకరు ఇండియానాకు చెందిన 22 ఏళ్ల వ్యక్తి, ఆ సమయంలో కాలేయ క్యాన్సర్ కారణంగా కీమోథెరపీ చేయించారు. దానివల్ల కలిగే భయంకరమైన ప్రతిక్రియలను భరించాడు. వీరందరూ మరియు ఎవరితోనైతే నేను సంబంధం కలిగియున్నానో వారందరూ కూడా మార్పుతెచ్చు నిరీక్షణ అవసరమున్న అనేకమంది పురుషులు, మహిళలు, బాలురు మరియు బాలికల భారీ మంచుకొండ యొక్క కొనను సూచించుచున్నారు. ఇంకా ఎంతోమంది క్యాన్సర్ తో పోరాడుచుండగా-ఈస్టర్ ఈ నిరీక్షణను అందిస్తుందని-నాకు అప్పుడు గుర్తుకు వచ్చింది అలాగే నాకిప్పుడు తెలిసింది.
భాగస్వామిని, పిల్లవాణ్ణి, తల్లిదండ్రులను లేదా స్నేహితుడిని ఇటీవల కోల్పోయినందుకు దుఃఖిస్తున్నవారు ఉన్నారు. మరణం క్రూరమైన దొంగ లాగా వచ్చి, ఒక విలువైన ఉనికిని కొల్లగొట్టి, ఉత్త జ్ఞాపకాలను మాత్రమే మిగిల్చింది. దుఃఖిస్తున్నవారి యొక్క విచారం మాటలు లేదా వ్యర్థమైన పాటలు విరగ్గొట్టలేని బలమైన ఒంటరితనమనే మంత్రాన్ని వేస్తుంది. లేనిది ఏమిటి? ఆస్కార్ వైల్డ్ యొక్క ప్రకటనను భావానువాదం చేస్తే:
వారిలో ప్రతివానిలో ఏదో చనిపోయింది,
మరియు చనిపోయినది ఏమిటంటే నిరీక్షణ.
1
నిరీక్షణను తిరిగి జీవింపచేయుటకు ఈస్టర్ లాంటిది ఏదీ లేదు.
దాని స్వంత గీతాలను ఈస్టర్ కలిగి ఉంది:
యేసు జీవించుచున్నాడు, నేను కూడా అలానే ఉంటాను.
మరణమా, నీ ముల్లు శాశ్వతంగా పోయింది!2
క్రీస్తు లేచేనేఁడ హా, హల్లెలూయా!
మర్త్యదూత సంఘమా, హల్లెలూయా!
భూమి నాకసంబునన్, హల్లెలూయా!
పాడు స్తోత్రగీతమున్, హల్లెలూయా!3
దాని స్వంత లేఖనాలను ఈస్టర్ కలిగి ఉంది:
అయితే నా విమోచకుడు సజీవుడనియు,
తరువాత ఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును.
ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత
శరీరముతో నేను దేవుని చూచెదను. (యోబు 19:25–26)
ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీముల్లెక్కడ? మరణపుముల్లు పాపము; పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి. (1 కొరింథీయులకు 15:55–58)
మరియు దాని స్వంత ప్రకటనను ఈస్టర్ కలిగి ఉంది:
“ఆయన ఇక్కడ లేడు; ఆయన లేచియున్నాడు.” (మత్తయి 28:6)
ఏమి జరుగుతుందో నేను చెప్పలేను, నేను అందుకోసం ప్రయత్నించాల్సిన అవసరమూ లేదు. సాధారణ వాస్తవం ఇది: ఈస్టర్ ఉదయం గురించి అద్భుతమైనది, గుణపరచగలిగేది మరియు భరోసా కలిగించేది ఏదో ఉంది. క్రైస్తవులు ప్రార్థనా మందిరాల్లో కూడుకొని, లేచియున్న విమోచకుడిని స్తుతిస్తూ వారి స్వరాలను ఎత్తినప్పుడు, నరకం యొక్క దెయ్యాల గుంపులు మరియు వాటి యొక్క హేయమైన చీకటిరాజు తాత్కాలికంగా స్తంభించిపోతాయి. పాస్టర్లు నిలబడి, యేసు శారీరక పునరుత్థానం యొక్క కదిలించలేని, తిరస్కరించలేని వాస్తవాలను మరియు మన యొక్క భరోసాను ప్రకటించినప్పుడు, సంశయవాదులు మరియు నిరాశావాదుల వ్యర్థ సందేశం ఆ సమయంలో నిశ్శబ్దమైపోతుంది. “అమూల్యమైన విశ్వాసము” కలిగినవారితో ఐక్యంగా నిలబడటం యొక్క పులకరింత దేవుని ప్రజలలో ప్రవహిస్తున్నప్పుడు, దాదాపు బలమైన అర్థంకాని ప్రవాహం మనపై వెల్లువెత్తుతుంది (2 పేతురు 1:1). ప్రయోజనాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. కొన్నింటిని మాత్రమే జాబితా చేయడమైంది:
- మన అనారోగ్యాలు అంత అంతిమంగా అనిపించవు.
- మన భయాలు మసకబారుతాయి మరియు వాటి పట్టును కోల్పోతాయి.
- దూరమైన వారిపై మన దుఃఖం తగ్గిపోతుంది.
- అడ్డంకులు ఉన్నప్పటికీ ముందుకు వెళ్లాలనే మన కోరిక తిరిగి పుంజుకుంటుంది.
- మన అభిప్రాయ భేదాలు మన సారూప్య విశ్వాసం ద్వారా కప్పబడతాయి.
- శతాబ్దాలుగా సాధువుల యొక్క నీడలలో నిలుచున్నప్పుడు, వారు ఎల్లప్పుడూ యాంటీఫోనల్ స్వరంలో: “నిజంగా, ఆయన లేచాడు!” అని సమాధానం ఇచ్చినప్పుడు, క్రైస్తవులుగా మన గుర్తింపు బలపడుతుంది.
ఈ కాలంలో, ఒక మార్పు తెచ్చు నిరీక్షణ మనకొరకు ఎదురుచూస్తోంది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. హల్లెలూయా!
- Oscar Wilde, The Ballad of Reading Gaol (Boston: John W. Luce and Company, 1906), 23.
- Christian F. Gellert, “Jesus Lives, and So Shall I,” trans. Philip Schaff, in The Hymnal for Worship and Celebration (Waco, Tex.: Word Music, 1986), 224.
- Charles Wesley, “Christ the Lord Is Risen Today,” in The Hymnal for Worship and Celebration (Waco, Tex.: Word Music, 1986), 217.
Copyright © 2010 by Charles R. Swindoll, Inc.