సాధారణ విశ్వాసం యొక్క నేర్పుగల శత్రువు ఏ పాపమో మీకు తెలుసా?
భౌతికవాదం మరియు దురాశా? కోపమా? కామమా? వంచనా? కాదు. ఈ పాపాలన్నీ ఖచ్చితంగా మన శత్రువులే, కాని వీటిలో ఏవీ కూడా నేర్పుగల శత్రువులుగా పరిగణించబడవు.
ఆగి ఆలోచించండి. మీరు సాధారణమైన విశ్వాసంతో దేవుణ్ణి విశ్వసించాలని నిర్ణయించుకున్నాక, ఆయన ప్రణాళికను మరియు ఉద్దేశ్యాన్ని మీలో, అలాగే మీ ద్వారా నిర్వర్తించడానికి ఆయనకు పూర్తి స్వేచ్ఛను అనుమతించాలని నిర్ణయించుకున్న తర్వాత, ఒకప్పుడు మీ అధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నించిన వాటి విషయమై నెమ్మది కలిగియుండి ఆయన మీద ఆధారపడితే చాలు.
ఇప్పటి నుండి మీరు అడుగుపెట్టి బాధ్యత వహించరు. “దేవుడు దీన్ని బాగా నిర్వహించగలడు” అని మీ అంతట మీరే చెబుతారు. అప్పుడు, బలహీనమైన క్షణంలో, మీ ఆత్మ యొక్క విరోధి మీ చెవిలో “ఓయ్, ఒకవేళ-?” అనే చిన్న అనుమానమును గుసగుసలాడతాడు. అది మిమ్మల్ని కలవరపరచకపోతే, వాడు అర్ధరాత్రి తిరిగి వచ్చి, మీ ఊహను అనేక అవకాశాలతో తీవ్రతరం చేసి పోషిస్తాడు, పూర్తిగా భయపడకపోయినా మిమ్మల్ని కొంచెం కలవరపరచి వదులుతాడు. చూడటంతోనే ఎవరూ చెప్పలేరు (మరియు మీరు ఖచ్చితంగా ఎవరికీ చెప్పకూడదని అనుకొని ఉంటారు), కానీ మీ అంతర్గత శాంతి మరియు సాధారణ విశ్వాసం స్థానంలో, మీరు ఇప్పుడు కదలింపబడుచున్నారు . . . దేని చేత?
మీరు సరిగ్గా ఊహించారు, జీవితంలో అత్యంత అపఖ్యాతి పాలైన విశ్వాస హంతకురాలు: చింత.
అందువలన నేను మీతో చెప్పునదేమనగా–ఏమి తిందుమో యేమి త్రాగు దుమో అని మీ ప్రాణమునుగూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమునుగూర్చియైనను చింతింపకుడి; ఆహారముకంటె ప్రాణమును, వస్త్రము కంటె దేహమును గొప్పవి కావా? (మత్తయి 6:25)
మాటలలో నేర్పుగలవాడిని కావడం వల్ల, చింత అనే పదం ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ నిజానికి మన జీవితాల్లో పిచ్చెక్కించగలదు. మొదటిగా, మత్తయి ఉపయోగించిన పదం (ఇక్కడ “చింత” అని అనువదించబడింది) ఏమిటంటే గ్రీకు పదమైన మెరిమ్నావో. ఇది రెండు చిన్న పదాల కలయిక, మెరిజో, అంటే “విభజించడం” మరియు నూస్, అంటే “మనస్సు.” మరో మాటలో చెప్పాలంటే, ఆత్రుతగా ఉన్న వ్యక్తి విభజించబడిన మనస్సుతో బాధపడుతుంటాడు, అతన్ని లేదా ఆమెను అసంతృప్తికి మరియు పరధ్యానానికి గురిచేసి వదిలేస్తుంది.
చింతను వివరించే అన్ని బైబిల్ కథలలో, లూకా 10 యొక్క చివరి ఐదు వచనాలలో నమోదు చేయబడిన కథ కంటే ఏదీ ఆచరణాత్మకంగాను స్పష్టంగాను లేదు. కొంచెముసేపు అందులో జీవించుదాం రండి.
యేసు బేతనియలోని తన స్నేహితుల ఇంటికి వెళ్లాడు. ఆయన నిస్సందేహంగా, రోజంతా పనిచేసి అలసిపోయాడు. కాబట్టి తనను అర్థం చేసుకోగలిగే స్నేహితులతో విశ్రాంతి తీసుకోవడానికి నిశ్శబ్దమైన స్థలాన్ని కలిగి ఉండటం కంటే ఆయనకి మరేమీ అవసరం లేదు. అయితే, ఆ స్నేహితులలో ఒకరైన మార్త ఈ సమయాన్ని కాస్త ఆవేశపూరితంగా మార్చేసింది. విషయాన్ని మరింత దిగజార్చడానికి, మార్త సోదరియైన మరియ, ప్రభువు వారి ఇంటిని సందర్శించినందుకు చాలా సంతోషించి, తన సోదరి యొక్క ఆందోళన విషయమై పెద్దగా ఆందోళన చెందకుండా, ఆమె ఆయనయొద్ద కూర్చున్నది.
లూకా మనకు చెప్పినట్లుగా, “మార్త విస్తారమైన పని పెట్టుకొనుటచేత తొందరపడి” (లూకా 10:40) ఉన్నది. ఆమె వంటగది చుట్టూ తిరగడం, పిండిని పిసికి కలపటం, గొర్రెలను కాల్చడం, కూరగాయలను ఉడకబెట్టడం, ఆమె ఉత్తమమైన వంట సామాగ్రిని గుర్తించి, టేబుల్‌క్లాత్ మరియు న్యాప్‌కిన్‌లతో సరిపోల్చాలనే ఆశతో, చివరికి సరైన సమయంలో ఇవన్నీ సిద్ధపరచడానికి సహాయం కావాలని కోరుకుంది. కానీ మార్తకు సహాయం అందలేదు, యిది ఆమెను కలవరపరచింది. చిరాకు, ఉద్రేకం, కోపంతో ఆమె ఓర్చుకోలేని స్థితికి వచ్చింది. మరియు ఆమె ఓర్చుకోలేని స్థితి మరియ మీద నింద వేయుటకు కారణమైంది. “ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచి పెట్టినందున, నీకు చింతలేదా? నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పుమనెను” (10:40).
కానీ యేసు ఆమె తీరికలేనితనాన్ని చూచి ప్రభావితుడవ్వలేదు లేదా ఆమె గట్టిగా అడగటంతో బెదరిపోలేదు. దయగా, కాని దృఢముగా, ఆయన ఇలా అన్నాడు, “మార్తా, మార్తా, నీవనేకమైన పనులనుగూర్చి విచారముకలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే, మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్దనుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను” (10:41-42).
మన నియంత్రణలో లేని విషయాలకు మనం బాధ్యత వహిస్తున్నప్పుడు చింత కలుగుతుంది. ప్రభువు పరిష్కారాన్ని నేను ప్రేమిస్తున్నాను: “గాని అవసరమైనది ఒక్కటే.” సాధారణ విశ్వాసానికి ఎంత శ్రేష్ఠమైన ఉదాహరణ!
భోజనాన్ని సెలవుదినపు విందుగా మార్చడం ద్వారా మార్త విషయాలను సంక్లిష్టం చేసింది. మరియ కాదు. మరియ కోరుకున్నదల్లా యేసుతో సమయం . . . అందుకాయన ఆమెను ప్రశంసించాడు. మరియ యొక్క సాధారణ విశ్వాసం, ఆమె సోదరి భయాందోళనలకు భిన్నంగా, రక్షకుని యొక్క ప్రామాణ్యమును గెలుచుకుంది.
Adapted from Charles R. Swindoll, “That Subtle Sin,” in The Finishing Touch: Becoming God’s Masterpiece (Dallas: Word, 1994), 632-33. Copyright © 1994 by Charles R. Swindoll, Inc. All rights reserved worldwide. Used by permission.