తొందరపాటుతోకూడిన ప్రతిచర్యలు ఎప్పుడూ ఉత్తమమైనవి కావు.
మనలో భావోద్వేగాలు బాగా ఎక్కువై, కోపము మనలను అధిగమించిన క్షణములో, వెంటనే ప్రకోపాన్ని చూపించడం ఉత్తమంగా అనిపిస్తుంది. కానీ మనం దీని వశమైనప్పుడు, మనం ఎప్పుడూ అనకుండా, చేయకుండా ఉండాల్సినవి అంటాము మరియు చేస్తాము.
నాకు గుర్తుంది, సంవత్సరాల క్రితం, ఒక వ్యక్తి దుర్భాషలాడుతూ నాకు ఉత్తరాలు వ్రాసేవాడు. అతని చేతివ్రాత నాకు తెలుసు కాబట్టి, నేను సాధారణంగానే అతని లేఖను అయిష్టముతో పక్కన పడేసేవాడిని. కానీ ఒక రోజు, బలహీనమైన క్షణంలో, అది నాకు తీవ్రమైన విసుగును తెప్పిచ్చింది. నేను అతని లేఖను లాక్కొని, చాలా తీవ్రంగా స్పందించాను. నేను దానిపై రెండు గంటలు గడిపాను-అందులో అతని పొరబాట్లను సరిదిద్ది, వాస్తవాలను తెలియజేసి, అతను ఉండవలసిన స్థానంలో అతన్ని ఉంచాను.
నేను లేఖను నా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌కి అప్పగించి, “ఇదిగో, దీన్ని టైప్ చేయండి” అని చెప్పాను. ఆమె దాన్ని టైప్ చేసి, తిరిగి వచ్చి, “నేను దీనిపై వ్యాఖ్యానిస్తే మీకు ఏమైనా అభ్యంతరం ఉన్నదా?”
“లేదు,” అని నేను సమాధానం చెప్పాను.
“నేను ఆ లేఖ పంపేముందు బాగా ఆలోచిస్తాను. ఈ రాత్రి దాని గురించి ఆలోచిస్తూ గడిపితే మీరు జ్ఞానముగలవారని నేను భావిస్తాను,” అని ఆమె సూచించినది.
ఇంతకంటే చక్కగా ఆమె చెప్పలేదు. ఆమె ఆలోచన ఏమిటంటే, ఒక రాత్రి నిద్ర తర్వాత, జ్ఞానం యొక్క కళ్ళ ద్వారా నేను పరిస్థితిని మరింత స్పష్టంగా చూడగలను.
నిఘంటువులు బహుళ ఎంపికలను చూపిస్తాయి, కాని నిజంగా, జ్ఞానానికి ఒకటే సాధారణ నిర్వచనం ఉంది: దేవుని దృష్టికోణంలో జీవితాన్ని చూడటం.
దేవుడు చూసే విధంగా మనం జీవితాన్ని చూడగలిగితే, సమస్యలను, వాటి గురించి మనం ఎలా విచారిస్తామో మాత్రమే కాకుండా, సమస్యల యొక్క మూలాన్ని తెలుసుకొని ఏది సరైనదో మరియు ఏది మంచిదో చూడగలుగుతాము.
మీ సమస్యలను దేవుని కోణం నుండి చూడాలనుకుంటున్నారా? మీరు చేయగలరు . . . ఆయన వాక్యమనే అద్దముగుండా! సామెతల గ్రంథము మంచి ప్రారంభాన్ని అందిస్తుంది. కళ్ళు తెరిపించే ఈ పుస్తకం జ్ఞానం అందుబాటులో ఉన్నదని మనకు బోధిస్తుంది.
జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది,
సంతవీధులలో బిగ్గరగా పలుకుచున్నది. (సామెతలు 1: 20)
మీ దృష్టి కొరకు జ్ఞానం అరచుచున్నది: “నేను మీలో భాగం కావాలనుకుంటున్నాను. నన్ను లోపలికి రానివ్వండి!” ఇప్పుడే జ్ఞానం మీ తలుపు తట్టుచున్నది!
అయితే, జ్ఞానం చొచ్చుకొనిపోదు. ఇది అందుబాటులో ఉంటుంది, కానీ మీరు దానిని చేతివేత దూరంలో ఉంచుకోవడానికి ఎంచుకోవచ్చు. జ్ఞానాన్ని నిరాకరించవచ్చు. భగ్న ప్రేమికుడిలాగే, జ్ఞానమను స్త్రీ రోదిస్తున్నది:
“నేను పిలువగా మీరు వినకపోతిరి.
నా చేయిచాపగా ఎవరును లక్ష్యపెట్టకపోయిరి.” (సామెతలు 1: 24)
మన సమస్య జ్ఞానం లభ్యం కాకపోవటం కాదు; దాని పట్ల మక్కువ లేకపోవడం. దేవుడు ఇప్పటికీ దాని పట్ల మక్కువతోనున్న ప్రజలకు ఉదారంగా జ్ఞానం ఇస్తాడు. కానీ మీరు తప్పక దాని కొరకు అడగాలి (యాకోబు 1: 5)! అలాగే మీరు దానిని పొందుకున్న తర్వాత, దానికి అంటుకొని ఉండండి. దానిని వెంబడించండి. జ్ఞానం పట్ల మీ మక్కువను మసకబారనివ్వొద్దు!
నిజమైన జ్ఞానం మన తొందరపాటు స్వభావమునకు దూరముగా పుడుతుంది. జ్ఞానం దేవుని నుండి వస్తుంది-నేరుగా ఆయన హృదయం నుండి . . . ఆయన వాక్యం ద్వారా. . . మనము నివసించే ప్రదేశానికి.
విమర్శకుడితో వ్యవహరించడంలో జ్ఞానం కావాలా? అహేతుక మాజీ జీవిత భాగస్వామితో? ధిక్కరించే పిల్లవానితో? జీవితకాల పోరాటమైన ఆందోళనతో?
- దేవుని వాక్యంతో మీ మనస్సును నింపుకోండి.
- దేవుని స్వరముపట్ల శ్రద్ధగల చెవిని కలిగి ఉండండి.
- దేవుని హృదయం నుండి దైవిక అవగాహన కొరకు అభ్యర్థించండి.
- మక్కువతో జ్ఞానాన్ని వెదకండి, ఆపై దానిని ఆచరణలో పెట్టండి!
మీకు అవసరమైన జ్ఞానం మీకు అవసరమైనప్పుడు ఖచ్చితంగా అందుబాటులో ఉంటుంది.
నేను విమర్శకుడితో కత్తులు దూయటానికి శోధింపబడినప్పుడు ఒక సామెతను కనుగొన్నాను:
కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు,
జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. (సామెతలు 12:18)
ఇది ఎంత సహాయకరముగా ఉంది! ఆ క్షణంలో నేను ఈ దైవిక సలహాను గుర్తుచేసుకొనియుండి ఉంటే, దేవుని జ్ఞానం నా దృష్టిని స్పష్టం చేసుండేది, నా హృదయాన్ని శాంతపరచియుండేది. . . మరియు నేను ఆ లేఖ కోసం నా సమయాన్ని వృథా చేయకుండా ఉండేవాడిని! (ఓ ముఖ్యమైన మాట, నా సహాయకురాలి జ్ఞానయుక్తమైన సలహాకు ధన్యవాదాలు, నేను ఎప్పుడూ నా తొందరపాటు ఉత్తరాన్ని పంపలేదు.)
కాబట్టి, పుస్తకం తెరవండి. . . దేవుని జ్ఞానం యొక్క పుస్తకమును, ఆయన వాక్యమును తెరవండి. అప్పుడు మీ కళ్ళు జ్ఞానమునకు తెరుచుకుంటాయి. మీరు మీ సమయాన్ని ఎప్పటికీ ఆ విధముగా వృథా చేయరు. నేను ప్రమాణం చేస్తున్నాను.