ముంచుకొస్తున్న ముప్పు

పరిచయం

యేసు నిజానికి శాంతముగలవాడు మరియు దయగలవాడు అయినప్పటికీ, ఆయన పాపానికి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడ్డాడు. నిజానికి, మతం యొక్క ముసుగుతోనున్న చెడును ఎదుర్కొన్నప్పుడు, ఆయన భీకర కోపం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇశ్రాయేలు‌లోని మత పెద్దలు తమ ప్రత్యేక స్థానాన్ని ధనము మరియు అధికారాన్ని పొందేందుకు అవకాశంగా మార్చుకున్నందుకు ఆయన తీవ్రంగా మందలించాడు. మరియు సరైనది చేసినందుకు మనం ప్రజాదరణను కోల్పోయి హింసను అనుభవిస్తున్నప్పటికీ, సత్యం కోసం ఎలా నిలబడాలో యేసు యొక్క ఉదాహరణ నుండి నేర్చుకుంటాము.

వివరణ

1. సత్యం కోసం నిలబడటానికి యేసు భయపడలేదు (మత్తయి 10:34; లూకా 12:40-53).
చాలా తరచుగా, ప్రజలు యేసును సాత్వికమైన మరియు శాంతమైన బోధకుడిగా చిత్రీకరిస్తారు, ఆయన తన అనుచరులకు ఇతరులను తమలాగే ప్రేమించాలని, ఇంకొక చెంపను చూపించి ప్రతీకారాన్ని నివారించాలని, శాంతిని అనుసరించాలని మరియు ఇతరులను తీర్పు తీర్చకూడదని నేర్పించాడు. యేసు నిజానికి ఈ లక్షణాలను కలిగియుండి ఈ విలువలను బోధించినప్పటికీ, ఈ వర్ణన అసంపూర్ణంగా ఉంది. కళలో, టెలివిజన్‌లో మరియు సినిమాల్లో తరచుగా చిత్రీకరించబడిన లేత, నీరసమైన వ్యక్తిని మించి యేసు ఉన్నాడని ఈ వాక్యభాగాలు వెల్లడిస్తున్నాయి.

2. యేసు యొక్క శత్రువులు సత్యం ప్రకారం జీవించడం కంటే ఇతరులను సంతోషపెట్టడం గురించి ఎక్కువ శ్రద్ధ వహించారు (మత్తయి 15:1-9, 12; లూకా 19:45-48).
ఈ భూమిమీద యేసు యొక్క పరిచర్యకు అనేక శతాబ్దాల ముందు, యూదు ప్రజలు బబులోనీయులచే జయించబడ్డారు మరియు బానిసలుగా బబులోను‌కు తీసుకెళ్లబడ్డారు. వారి దేవాలయం ధ్వంసమై వారి మాతృదేశం ఇతర సంస్కృతులచే వలసరాజ్యంగా మారడంతో, యూదులు తమ జాతీయ గుర్తింపును నిలబెట్టుకోవడానికి మరియు దేవుడు ఎన్నుకున్న ప్రజలుగా తమ ప్రత్యేకతను కాపాడుకోవడానికి మోషే ధర్మశాస్త్రాన్ని పాటించారు.

వారి క్రొత్త మరియు అపరిచిత నివాస స్థలములో దైనందిన జీవితంలో ధర్మశాస్త్రాన్ని అన్వయించుకోవడంలో వారికి సహాయం చేయడానికి, హీబ్రూ లేఖనాల ఉపాధ్యాయులు ప్రజలు అనుసరించాల్సిన నిర్దిష్ట సూచనలను చాలా జాగ్రత్తగా వ్రాసారు. అయితే, యూదులకు ఆచరణాత్మక సహాయంగా ప్రారంభమైనది నియంత్రించడానికి వీలుకాని పవిత్ర సంప్రదాయంగా మారిపోయింది.

“పెద్దలు” అభివృద్ధి చేసిన పవిత్ర సంప్రదాయాల సమూహం చివరికి అది సమర్థించాలనుకున్న ధర్మశాస్త్రాన్ని భర్తీ చేసింది. మరియు యేసు వచ్చే సమయానికి, సంప్రదాయాన్ని పాటించడంలో వైఫల్యమనేది దేవుని ధర్మశాస్త్రానికి అవిధేయతగా పరిగణించబడింది. ఇంకా, ఈ మానవ నిర్మిత మతతత్వం అనేక మంది పరిసయ్యులు ఇతరులపై నైతికంగా ఉన్నతమైనవారమనే భ్రమను కొనసాగించే సాధనంగా మారింది. హాస్యాస్పదంగా, వారి మతపరమైన ఉత్సాహం వారిని దేవునితో విభేదించింది. వారు అధికారం కోసం తృష్ణతో ప్రేరేపించబడడమే కాకుండా, వారి సంప్రదాయాలు తరచుగా వారు ఆరాధించే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించాయి.

యేసు యొక్క భూసంబంధమైన పరిచర్య కాలంలో, యెరూషలేము ఆలయంలో ఆరాధన అనేది మత పెద్దలకు పెద్ద వ్యాపారంగా మారింది. ప్రధాన యాజకులు ఇశ్రాయేలు‌లో ముద్రించబడిన షెకెల్‌లు తప్ప వేరే కరెన్సీని స్వీకరించడానికి నిరాకరించారు. ఆలయ ప్రాంగణంలో డబ్బు మార్చేవారు సంతోషంగా ఏదైనా కరెన్సీని తీసుకొని యూదుల షెకెల్స్‌ యొక్క మారకపు విలువను తమకిష్టానుసారముగా పెంచేసి, ఆ పై వచ్చిన డబ్బును జేబులో వేసుకున్నారు. ఇంకా, దేవునికి అర్పించే ఏ జంతువు అయినా దోషరహితంగా ఉండాలని మోషే ధర్మశాస్త్రం పేర్కొంది; ఉత్తమమైనది మాత్రమే పనికొస్తుంది. కాబట్టి అర్పణలు విలువైనవని ధృవీకరించడానికి, ఆలయాన్ని నడుపుతున్న పురుషులు బలి ఇవ్వడానికి తీసుకువచ్చిన జంతువులను పరీక్షిస్తారు.

అయితే, ఇది మోసగించటం తప్ప మరొకటి కాదు. వారు డబ్బు తీసుకొని తగిన ప్రత్యామ్నాయాన్ని అందించునట్లుగా, వారు ఏకపక్షంగా జంతువులను తిరస్కరించారు. హాస్యాస్పదంగా, డబ్బు తీసుకుని ఇవ్వబడిన “తగిన” జంతువు, కేవలం క్షణాల ముందు, మరొక ఆరాధకునికి తగని అర్పణగా ఉండినది!

తన పరిచర్య ముగింపులో, యేసు యెరూషలేములోని మత వ్యవస్థను బహిరంగంగా ఖండించాడు మరియు దానిని నడిపిన పురుషుల నైతిక దివాళాకోరుతనాన్ని బహిర్గతం చేశాడు (మత్తయి 23:1-33 చదవండి). యేసు తాను నేరారోపణ చేసిన ప్రతిసారీ “అయ్యో” అని చెప్పాడు, ఆపై ఆయన శాస్త్రులను మరియు పరిసయ్యులను నేరుగా సంబోధించాడు. మూలభాషలో, అయ్యో అనేది మరొకరి బాధను చూసినప్పుడు మాట్లాడే వ్యక్తి యొక్క ఆగ్రహాన్ని లేదా బాధను వ్యక్తపరుస్తుంది.

ప్రపంచ వ్యవస్థచే త్తొక్కబడిన ప్రజల పట్ల యేసు తన హృదయంలో మృదువుగా ఉన్నప్పటికీ, మతపరమైన నాయకత్వంలో ఇతరులను నిర్లక్ష్యం చేసే లేదా దుర్వినియోగం చేసే వారి పట్ల ఆయనకు ఓపిక చాలా తక్కువగా ఉండేది. వారు దేవుని సత్యానికి నేరుగా ప్రవేశం కలిగి ఉన్నారు, అయినప్పటికీ వారు సంపద మరియు అధికారాన్ని కూడబెట్టుకోవడానికి తమ ప్రత్యేక స్థానాన్ని ఉపయోగించారు. మోసపోవద్దు; వారు ఏమి చేస్తున్నారో వారికి తెలుసు. మరియు యేసు వారి తిరుగుబాటును ధైర్యంగా బహిర్గతం చేసినప్పుడు, అది ఆయనను చెడుకు వ్యతిరేకంగా పోరాడేట్లు చేసింది.

స్పష్టముగా, ప్రతి తప్పును ఇదే ఆవేశంతో ఎదుర్కోవటం సరికాదు. యేసు అనేక రూపాల్లో చెడును ఎదుర్కొన్నాడు, అలాగే ఆయన తరచుగా పాపుల పట్ల కరుణతో ప్రతిస్పందించాడు. అయినప్పటికీ, యేసు సున్నితమైన విధానాన్ని ఎక్కువగా అవలంబించినప్పటికీ, ఆయన ఎల్లప్పుడూ నిర్భయంగా మరియు సూటిగా ఉండేవాడు. మతపరమైన ఔత్సుక్యము వల్ల లేదా నియమాలకు అర్థరహితముగా కట్టుబడి ఉండటం వల్ల దేవుడు ఆకర్షితుడవ్వడు. ప్రజలు తన పట్ల ప్రేమతో ప్రేరేపించబడ్డారు కాబట్టి సరైనది చేయాలని ఆయన కోరుకుంటున్నాడు.

అన్వయము

చెడుకు వ్యతిరేకంగా మన స్వంత వైఖరిని తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, యేసు యొక్క ఉదాహరణ నుండి నాలుగు సూత్రాలు ఉద్భవిస్తున్నాయి.

1. ఏ ముప్పు గుండా అయినను సరే వెళ్లడానికి మీ మిషన్‌ను గుర్తుంచుకోవడం మీకు సహాయపడుతుంది. పట్టుదలతో ఉండండి.
ఒక పరిస్థతి విషయంలో తప్పేముందో తెలుసుకుంటే సరిపోదు; ఏది సరైనదో కూడా మనం నిర్వచించాలి. ఒకసారి మనం సరైన చర్యను నిర్ణయించుకున్న తర్వాత, ఇతరులు మనల్ని నిరుత్సాహపరిచినా లేదా హింసించినా, మనం దానిని అనుసరించడంపై దృష్టి కేంద్రీకరించాలి.

2. చెడును ఎదుర్కోవాలంటే కత్తి యుద్ధం అవసరం, అంతేగాని శాంతిని నెలకొల్పే రాజీ కాదు. మెలకువగా ఉండండి..
“హృదయముయొక్క తలం పులను ఆలోచనలను శోధించుచున్నది” (హెబ్రీయులు 4:12), అని ఒక ప్రారంభ క్రైస్తవ రచయిత దేవుని వాక్యాన్ని రెండు అంచుల ఖడ్గంతో పోల్చాడు. మరో మాటలో చెప్పాలంటే, దేవుని సత్యానికి ఒక ముఖ్యమైన విషయమై ఉపయోగకరముగా ఎలా వ్యవహరించాలో తెలుసు. స్పష్టమైన నైతిక సమస్య ప్రమాదంలో ఉన్నప్పుడు, ప్రజలను మెప్పించే రాజీతత్వం సత్యం యొక్క ఖడ్గాన్ని ప్రక్కన పెట్టడానికి మనల్ని ప్రలోభపెడుతుంది. అయితే, సమస్యపై మన కత్తి గురిపెట్టాలని మనం గుర్తుంచుకోవాలి.

3. అది నొప్పించినా మరియు అపార్థానికి దారితీసినా, పోరాడటానికి యోగ్యమైన సిద్ధాంతము ఉన్నప్పుడు ధైర్యంగా ఉండటమనేది అర్హమైన తెగింపే. ధైర్యంగా ఉండండి.
అపార్థం అనేది నాయకత్వం యొక్క వృత్తిపరమైన ఆపద. ఇతరులు ఖచ్చితంగా మీ ఉద్దేశాలను తప్పుగా అపార్థం చేసుకుంటారు లేదా ఉద్దేశపూర్వకంగా తప్పుగా అర్థం చేసుకుంటారు, మీరు (మరియు ప్రతి వ్యక్తి యొక్క) ఇష్టపడాలనే ప్రాథమిక కోరికను లోతుగా గాయపరుస్తారు. అయినప్పటికీ, మీరు తీసుకునే నైతికపరమైన వైఖరి అనేది అంతిమంగా త్యాగానికి యోగ్యమైనదే.

4. సరైన దాని కోసం మాట్లాడటం వలన మీరు గెలుస్తారని లేదా గౌరవం పొందుతారని గ్యారంటీ ఏమీ లేదు. వాస్తవికంగా ఉండండి.
యెరూషలేములోని మతనాయకుల దారుణమైన దుష్టత్వానికి వ్యతిరేకంగా యేసు బలమైన వైఖరిని చూపించాడు మరియు ముప్పు త్వరగా ఆయన చుట్టూ ముంచుకొచ్చింది. ఆయన ప్రమాదాన్ని అర్థం చేసుకున్నాడు. నిజానికి, అది తన మరణానికి దారితీస్తుందని ఆయనకు తెలుసు. ఆయన బంధింపబడక ముందు శిష్యులతో ఇలా అన్నాడు,

నేను వచ్చి వారికి బోధింపకుండినయెడల, వారికి పాపము లేకపోవును; ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడ ద్వేషించుచున్నాడు. ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండినయెడల వారికి పాపము లేకపోవును; ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించియున్నారు. అయితే
–నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యము నెర వేరునట్లు ఈలాగు జరిగెను. (యోహాను 15:22-25)

కొన్నిసార్లు మనం ఎదుర్కొనే చెడు చాలా దృఢంగా పాతుకుపోయి ఉంటుంది, మన జీవితకాలంలో దాని ఓటమిని మనం చూడలేము. వాస్తవానికి, ఈ పోరాటానికి మన ప్రాణములతోపాటు సమస్తమును త్యాగం చేయవలసి ఉంటుంది. అయితే మనం విజయవంతులమవ్వాలని దేవుడు మనలను పిలువలేదు. నమ్మకంగా ఉండాలని ఆయన మనల్ని పిలుచుచున్నాడు. విజయం లేదా వైఫల్యం అనేది అంతిమంగా ఆయన బాధ్యత. మనము సమస్య యొక్క సరైన పక్షమున నిలబడతామని నిర్ధారించుకోవడం మన బాధ్యత.

ముగింపు

ఏది సరైనది అనే దాని కోసం ఒక వైఖరిని తీసుకున్నప్పుడు, జనాదరణ కోసం నైతిక నాయకత్వాన్ని వదులుకోవడం, తటస్థంగా ఉండటమే మన ఎదుర్కొనే భయంకరమైన శోధన. ఖచ్చితంగా, మనం మన పోరాటాలను తెలివిగా ఎంచుకోవాలి మరియు మనం ఒక నిర్ణయం తీసుకునే ముందు మన ఉద్దేశాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. కానీ ఇతరుల ఆమోదమును దేవుని పట్ల మరియు ఆయన ఎంతగానో ప్రేమిస్తున్న సత్యం పట్ల విశ్వసనీయతకంటే ప్రాముఖ్యమైనదిగా మనం అనుమతించలేము. సరైనది చేసినందుకు జనాదరణ కోల్పోయి హింసకు గురైనను సరే, యేసులాగే మనం కూడా సత్యం కోసం నిలబడాలి.

Adapted from Charles R. Swindoll, Jesus: The Greatest Life of All (Nashville: Thomas Nelson, 2008), 157-170. Copyright © 2008 by Charles R. Swindoll, Inc. Used by permission. All rights reserved worldwide. Also adapted from Insight for Living, Jesus: The Greatest Life of All Bible Companion (Nashville: Thomas Nelson, 2007), 101-109. Copyright © 2007 by Charles R. Swindoll, Inc. Used by permission. All rights reserved worldwide.

Posted in Easter-Telugu, Jesus-Telugu, Pastors-Telugu.

Accuracy, clarity, and practicality all describe the Bible-teaching ministry of Charles R. Swindoll. Chuck is the chairman of the board at Insight for Living and the chancellor of Dallas Theological Seminary. Chuck also serves as the senior pastor of Stonebriar Community Church in Frisco, Texas, where he is able to do what he loves most—teach the Bible to willing hearts. His focus on practical Bible application has been heard on the Insight for Living radio broadcast since 1979.

ఖచ్చితత్వం, స్పష్టత మరియు ఆచరణాత్మకత అన్నీ చార్లెస్ ఆర్. స్విన్డాల్ యొక్క బైబిల్-బోధనా పరిచర్యను వివరిస్తాయి. చక్ ఇన్సైట్ ఫర్ లివింగ్ కు బోర్డు ఛైర్మన్ మరియు డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ఛాన్సలర్. చక్ టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చ్ యొక్క సీనియర్ పాస్టర్‌గా కూడా పనిచేస్తున్నారు, అక్కడ ఆయన చాలా ఇష్టపడేదాన్ని చేయగలుగుతున్నాడు-ఇష్టపడే హృదయాలకు బైబిల్ నేర్పిస్తున్నారు. ఆచరణాత్మక బైబిల్ అనువర్తనంపై ఆయన దృష్టి 1979 నుండి ఇన్సైట్ ఫర్ లివింగ్ రేడియో ప్రసారంలో వినబడుచున్నది.