ఒక గొర్రెల కాపరి నుండి తన మందకు ఐదు వాగ్దానాలు

కొన్ని సంవత్సరాల క్రితం, ఒక స్నేహితుడు నేను చదువుకునేటప్పుడు నా దగ్గరకు వచ్చాడు. అతను నిజమైన స్నేహితుడు, నన్ను బాగా ఎరిగినవాడు . . . మరియు నాలో ఉన్న మంచి, చెడులన్నిటినీ ప్రేమించేవాడు. అతను ప్రేమతో సత్యాన్ని మాట్లాడతాడు, ఆ రోజు మేము కలుసుకున్నప్పుడు చివరి ఇరవై నిమిషాలలో అతను అదే చేసాడు.

అతను తన ఫోల్డర్‌ను (కాగితములు పెట్టే సాధనము) మూసివేసినప్పుడు మేము మా సంభాషణను పూర్తి చేయలేదని నేను చెప్పగలను. తల వంచుకుని ఊపిరి గట్టిగా పీల్చుకున్నప్పుడు తన పని అసంపూర్తిగానే ఉండిపోయిందనే భావన అతనిలో కనిపించింది. నేను అతని అయిష్టతను ప్రశంసించాను; అతను కాస్త సున్నితమైన అంశంలోకి ఉద్రేకముతో రావాలనుకోలేదు . . . కానీ అతను నా కళ్లలోకి సూటిగా చూడకుండా మరియు కొన్ని కఠినమైన విషయాలు చెప్పకుండా వెళ్లలేకపోయాడు.

“సరే చెప్పు . . . నిన్ను బాగా చింతకు గురిచేస్తున్నదేమిటో చెప్పు,’’ అని నేను విజ్ఞప్తి చేశాను.

“సరే, నేను ఈ విషయాలు ఎలా చెప్పాలో నాకు తెలియటంలేదు, చక్. అయితే నేను వాటిని అలా వదిలేయలేను. వాస్తవం ఏమిటంటే, నేను ఆందోళన చెందుతున్నాను.”

“దేని గురించి ఆందోళన చెందుతున్నావు?” అని నేను విచారించాను.

“నీ గురించే. నీకున్న బాధ్యతలకు డల్లాస్ సెమినరీ ప్రెసిడెన్సీని కూడా జోడించాలని నువ్వు ఇటీవల తీసుకున్న ఈ నిర్ణయం గురించే. కేవలం నిర్ణయం విషయమై ఆందోళన చెందటంలేదు; నేను దాని విషయమై సంతోషిస్తున్నాను. అది మీకు ఏమి చేయగలదో దాని విషయమై ఆందోళన చెందుతున్నాను. అంటే, ఇప్పటికే మీరు చెయవలసినవి ఎన్నో ఉన్నాయి . . . అయితే ఇప్పుడు మీరు దీన్ని కూడా జోడించారు. మీరు చాలా బిజీగా మారిపోయి బోధకు సిద్ధపడే విషయంలో తేలికైన మార్గాలు వెతుక్కుంటారేమోనని నేను ఆందోళన చెందుతున్నాను. మీరు నైతికంగా పడిపోతారని నేను ఎప్పుడూ చింతించలేదు. అయితే దేవునితో మీ సమయాన్ని తగ్గించుకొనులాగున మీరు శోధించబడతారేమోనని నేను చింతిస్తున్నాను. ఇది మీకు సులభంగా తక్కువ ప్రాధాన్యతగా మారిపోతుంది. నేను మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను: అలా జరగనివ్వవద్దు. మీరు అసలైన పనిని కొనసాగించడం, విస్తృతంగా చదవడం, లోతుగా ఆలోచించడం . . . మరియు మేము ఊహించినంత లోతు మరియు అభిరుచితో మాట్లాడటం మాకు అవసరం.”

నేను మరచిపోలేని, అనేకమైన ఇతర సమాన ప్రాముఖ్యమైన విషయాలను అతను చెప్పాడు. చివరికి అతను బయలుదేరడానికి నిలబడినప్పుడు, నేను అతని దగ్గరకు వెళ్లి అతనిని ఆలింగనం చేసుకున్నాను. అతని మాటలను, అతని హృదయంలో ఉన్న యథార్థతను, హెచ్చరించటంలో అతని ధైర్యాన్ని నేను ఎంతగానో మెచ్చుకున్నాను.

అతను వచ్చినట్లుగానే వెళ్ళిపోయాడు-నిశ్శబ్దంగా, నిస్సంకోచంగా. నేను తిరిగి కూర్చున్నాను, అంగీకరించడానికి కష్టంగా ఉంది, నిట్టూర్పు విడిచాను. అతని సందర్శన సమయానుకూలమైనది మరియు చిరస్మరణీయమైనది. అతను ఆ విషయాలను చెప్పవలసిన అవసరమే కాదు, నేను వాటిని వినవలసిన అవసరం కూడా వచ్చింది. నేను తరచుగా ఉదాహరించే సొలొమోను మాటలు ఆ రోజు ఫలించాయి. “మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును.” (సామెతలు 27:6).

స్థానిక సంఘాన్ని కాయడంలో నేను చాలా నిబద్ధతతో ఉన్నాను అని నా స్నేహితుడు తెలిసికొనినట్లే మీరు కూడా తెలుసుకోవాలి. నేను చేపట్టే అదనపు బాధ్యతలతో సంబంధం లేకుండా ఇది నా ప్రాథమిక అభిరుచి. మీరు ఇన్‌సైట్ ఫర్ లివింగ్ ప్రసారానికి సంబంధించిన ఉపన్యాసాలను విన్నా లేదా స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చ్‌లో కూర్చున్నా, నిబద్ధత యొక్క మార్గాన్ని చెత్తగా మార్చే ఉచ్చులలోబడి పొరపాట్లు చేయకుండా . . . మందకు జాగ్రత్తగా తయారు చేసిన భోజనాన్ని నేను తినిపించాలని ఆశించే హక్కు మీకు ఉంది. మా అమ్మ చెప్పేది, “సమూహములు ఘనమైన మాంసంతో కూడిన మంచి ఆహారంతో పోషించబడాలి, అంతేగాని కొన్ని పిట్ట కథలతో కాదు. వారు ఎన్నడూ ఆకలితో వెళ్లకూడదు. నీ పని సక్రమంగా నిర్వర్తించు, చార్లెస్.”

మనం నివసించే దినాలు బూటకమైనవి. మీరు వేషధారణతో మోసపుచ్చగలిగితే, మీరు తరచుగా తెలివైనవారుగా మెచ్చుకోబడతారు, అంతేగాని మోసపూరితమైనవారని విమర్శించబడరు. పరిచర్య ఇందులో మినహాయింపు కాదు. పరిచారకులు శ్రద్ధగా మరియు ఆధ్యాత్మికంగా సున్నితంగా ఉండాలని, వారి హోంవర్క్ చేయాలని మరియు సృజనాత్మకంగా ఆలోచించాలని, తాజాగా మరియు వినూత్నంగా ఉండాలని, వారి పిలుపు విషయమై ఉత్సాహంగా ఉండాలని, ప్రార్థనలో నమ్మకంగా మరియు వారి ఉద్దేశ్యాలలో స్వచ్ఛంగా ఉండాలని ప్రజలు నమ్ముతారు.

కానీ బాధాకరమైన నిజం ఏమిటంటే, పరిచారకులమైన మనం సోమరితనంతో, ఉదాసీనతతో, పనికిమాలినవారముగా, నియంత్రించేవారముగా మరియు నీచంగా ఉంటాము. మనం మన సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే, ఊహించలేని లేదా అంచనా వేయలేని స్థితిలో ఏమీ మనం ఉండము. అసూయ ప్రాబల్యం చెంది, గర్వము మభ్యపెట్టే విధంగా ఉండే కొన్ని వృత్తుల గురించి నాకు తెలుసు. పవిత్రమైన ముసుగుల వెనుక ఆ వికారమైన ముఖాలను ఎలా దాచాలో నేర్చుకోవడం సులభం.

కాబట్టి . . . నేను ఉన్నదానికంటే బలంగా కనిపించడం లేదా చాలా మతపరమైన స్వరంలో కనిపించడం వల్ల, నేను చాలా సంవత్సరాల క్రితం నా స్నేహితుడికి చేసిన కొన్ని వాగ్దానాలను మీకు కూడా చేసే సాహసం చేస్తున్నాను. అవి అప్పటికి ఎంత ముఖ్యమైనవో ఈ రోజు కూడా అంతే ముఖ్యమైనవి.

మొదటిది, నా అధ్యయనంలో కల్పనాశక్తితో కష్టపడి పని చేస్తూనే ఉంటానని వాగ్దానం చేస్తున్నాను. నా షెడ్యూల్ ఊపిరి సలపనిదైనను, బలమైన పుల్పిట్ లేదా బైబిల్ బోధించే పరిచర్యను మీనుండి దోచుకోదు. నా ఉత్తమ ప్రయత్నాలకు మీరు అర్హులు.

రెండవది, నేను దేవుని కొరకు హృదయాన్ని కలిగియుంటానని వాగ్దానం చేస్తున్నాను. అంటే నేను తరచుగా మరియు తీవ్రంగా ప్రార్థిస్తాను. నేను ఆయనకు మరియు నా పిలుపుకు సంబంధించిన విషయాలకు అంకితమై ఉంటాను. నేను ఆ పనులు చేయడం గురించి మాట్లాడను . . . నేను వాటిని చేస్తాను.

మూడవది, నేను జవాబుదారీగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాను. మతపరమైన ఏకాకి జీవితాన్ని గడపడం బైబిల్ విరుద్ధం మాత్రమే కాదు, అది ప్రమాదకరం. నేను చిత్తశుద్ధి ఉన్న ఇతర వ్యక్తులతో నిష్కపటంగా ఉండటానికి కట్టుబడి ఉన్నాను.

నాల్గవది, నేను నా కుటుంబానికి నమ్మకంగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాను. నా భార్య నా సమయానికి, ఆప్యాయతకు మరియు అవిభక్త శ్రద్ధకు అర్హురాలు. ఇప్పుడు ఎదిగిన మా పిల్లలు, మనవళ్లు మనవరాళ్లు కూడా అంతే. ఏది ఏమైనా నేను ఆ విషయాన్ని మరచిపోను.

ఐదవది, నేను నేనుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాను. నా వరకు. సమాజంలో ఎంత వెలుగులోకి వచ్చినా నా గురి తప్పదు — ఇది నా మాట. నేను సర్వం తెలిసినవానిగా ప్రవర్తించడం ప్రారంభిస్తే, అది ఎంత అసహ్యంగా కనిపిస్తుందో నాకు గుర్తు చేయండి, గొర్రెల కాపరులు పవిత్రమైన పదాలను ఉపయోగించడం ప్రారంభించి, ఇతరులను ఆకట్టుకోవాలనుకున్నప్పుడు ఎంత హాస్యాస్పదంగా కనిపిస్తారో నాకు గుర్తు చేయండి. నేను నవ్వుతూనే ఉండాలనుకుంటాను; కొంచెం అనూహ్యమైన విషయాలు చెబుతాను, ఆకట్టుకోబడని అబ్బాయిలతో గడుపుతాను, మరియు ప్రతి నెలా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాను. అప్పుడు ప్రాచీన మానవత్వానికి మెరుగులు దిద్ది బాగుచేసినట్లు అవుతుంది.

ఈ ఆలోచనలకు నా స్నేహితుడికి ధన్యవాదాలు చెప్పాలి. అతను ఘనతకు అర్హుడే. సంభావ్య ఆపదల గురించి నన్ను హెచ్చరించడానికి, అతను ఒకప్పుడు గౌరవించిన మరో పరిచారకుని ముఖానికి X గుర్తు పెట్టడానికి సిద్ధంగా లేడని నాకు గుర్తు చేయడానికి, “చార్లెస్, నీ పని చేయి” అని నాకు గుర్తుచేసేంత ధైర్యంగలవాడు, అతను నా తల్లి లాంటివాడు.

నాలాంటి పాస్టర్‌లకు ఇలాంటి స్నేహితులే ఎక్కువ కావాలి.

Copyright © 2012 by Charles R. Swindoll, Inc.

Posted in Bible-Telugu, Pastors-Telugu.

Accuracy, clarity, and practicality all describe the Bible-teaching ministry of Charles R. Swindoll. Chuck is the chairman of the board at Insight for Living and the chancellor of Dallas Theological Seminary. Chuck also serves as the senior pastor of Stonebriar Community Church in Frisco, Texas, where he is able to do what he loves most—teach the Bible to willing hearts. His focus on practical Bible application has been heard on the Insight for Living radio broadcast since 1979.

ఖచ్చితత్వం, స్పష్టత మరియు ఆచరణాత్మకత అన్నీ చార్లెస్ ఆర్. స్విన్డాల్ యొక్క బైబిల్-బోధనా పరిచర్యను వివరిస్తాయి. చక్ ఇన్సైట్ ఫర్ లివింగ్ కు బోర్డు ఛైర్మన్ మరియు డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ఛాన్సలర్. చక్ టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చ్ యొక్క సీనియర్ పాస్టర్‌గా కూడా పనిచేస్తున్నారు, అక్కడ ఆయన చాలా ఇష్టపడేదాన్ని చేయగలుగుతున్నాడు-ఇష్టపడే హృదయాలకు బైబిల్ నేర్పిస్తున్నారు. ఆచరణాత్మక బైబిల్ అనువర్తనంపై ఆయన దృష్టి 1979 నుండి ఇన్సైట్ ఫర్ లివింగ్ రేడియో ప్రసారంలో వినబడుచున్నది.