నాయకుడు పడిపోయినప్పుడు ఏమి చేయాలి

దేవుని పని పవిత్రమైనది. కాబట్టి పరిచర్యలో నిమగ్నమైన వ్యక్తి దేవుని ఉన్నతమైన మరియు పవిత్రమైన ప్రమాణాలను పదేపదే ధిక్కరించినప్పుడు, ఆ వ్యక్తి తొలగించబడాలి. అపొస్తలుడైన పౌలు యొక్క తీర్పు మరియు ఆజ్ఞ రాజీలేనివి. దేవుని పని పవిత్రంగా ఉండడానికి కారణం ఆయన పరిశుద్ధుడు కావడమే. పరిచర్య చేసేవారు కొన్ని వైఫల్యాలు లేకుండా ఎప్పటికీ అలా చేయలేరు, ఎందుకంటే వారు ఆయన వలె పవిత్రులు కారు. అయితే, ఆ బలహీనతలను క్షమించడానికి దేవుని దయ సరిపోతుంది. కానీ పవిత్రమైన పరిచర్య యొక్క ముసుగులో పాపపు జీవనశైలిని కప్పిపుచ్చే వారిని ప్రతిఘటించాలి మరియు తొలగించాలి.

దేవుని మహిమ కోసం మరియు సంఘము యొక్క క్షేమాభివృద్ధి కోసం నిర్వహించబడే దేవుని పవిత్రమైన పనిని ఉల్లంఘించడం యొక్క పర్యవసానం తీవ్రమైనది-పరిచర్య నుండి అనర్హత-ఎందుకంటే ఆయన పని ఆయన ముద్రను కలిగి ఉంటుంది మరియు ఆయన కీర్తిని ప్రతిబింబిస్తుంది. ఇది నిజం కాబట్టి, దేవుడు తన పనిని నెరవేర్చడానికి సరిహద్దులను నిర్దేశిస్తాడు. ప్రమాణాలు ఉన్నతమైనవి మరియు పరిశుద్ధమైనవి. అందుకే పౌలు తిమోతి మరియు తీతులను పరిచర్య చేసే వారిపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా జాగ్రత్తగా వ్యవహరించాలని, అయితే ప్రతిఘటించాల్సిన అవసరం వచ్చినప్పుడు సంకోచించవద్దని హెచ్చరించాడు.

గుడారం నుండి దేవాలయం వరకు మరియు దేవాలయం నుండి హృదయాల వరకు

మానవజాతి సృష్టించబడినప్పటి నుండి, దేవుడు తన ప్రజల జీవితాలలో పని చేస్తూనే ఉన్నాడు. ఆయన అనంతమైన సృజనాత్మకతలో, దేవుడు తన పవిత్రమైన పనిని నిర్వహించే పద్ధతిని మార్చాడు, కానీ ఆయన ప్రమాణం ఎప్పుడూ మారలేదు: తనను సేవించే వారి నుండి పవిత్రతను కోరుచున్నాడు.

దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తులోని బానిసత్వం నుండి బయటకు నడిపించిన తరువాత మరియు వారు ఎడారిలో సంచరించిన కాలంలో, గుడారములో సేవ చేయడమే దేవుని పనిచేయడం. ఇది ప్రజలు ఆరాధించడానికి తాత్కాలికంగా ఏర్పాటు చేయబడిన నిర్మాణం. సేవ చేసే యాజకులు పవిత్రమైన వస్త్రాలు ధరించాలి, పవిత్రమైన ఉపకరణములతో తమ పనిని చేయాలి, పరిశుద్ధ లేఖనములను చదవాలి మరియు దేవుని పవిత్ర ఉద్దేశాల కోసం పవిత్ర బలులు అర్పించాలి (నిర్గమకాండము 39-40). దేవుని పని యొక్క పరిశుద్ధతను కాపాడటంలో విఫలమైన యాజకులు తరచుగా తమ జీవితాలను మూల్యంగా చెల్లించవలసి ఉంటుంది, ఎందుకంటే దేవుడు తన పనిని తన మార్గంలో చేయడం పట్ల గంభీరంగా ఉంటాడు (సంఖ్యాకాండము 3:4; 1 సమూయేలు 2:12-17, 22-25, 34).

సొలొమోను పాలనలో, యెరూషలేములో ఆలయ నిర్మాణంతో దేవుడిని ఆరాధించే స్థలం తాత్కాలికం నుండి శాశ్వతంగా మారింది (1 దినవృత్తాంతములు 28-29; 2 దినవృత్తాంతములు 2-3). నిర్మాణం మారి ఉండవచ్చు, కానీ దేవుని ప్రమాణం అలాగే ఉంది. దేవుని పని పరిశుద్ధమైనదిగా కొనసాగింది. కాలక్రమేణా, దేవుని ప్రజలు ఆయన ప్రమాణాలతో రాజీ పడ్డారు గనుక చివరకు దేవాలయం నాశనం చేయబడింది (2 దినవృత్తాంతములు 36:14-19).

కొంతకాలం తర్వాత, మరియు ఆయన దయ మరియు కృపలో, దేవుడు తన కుమారుడిని చనిపోవడానికి లోకానికి పంపాడు, దేవునికి మానవులకు మధ్య అడ్డుగా ఉన్న పాపమును తొలగించాడు. ఆయన పునరుత్థానుడైన తర్వాత మరియు పరలోకానికి ఆరోహణమయ్యే ముందు, ఇకపై “హస్త కృతాలయములలో” నివసించడానికి కాదు (అపొస్తలుల కార్యములు 7:48) గాని దేవుని హస్తములతో చేయబడిన మనలో నివసించడానికి యేసు తన ఆత్మను మన యొద్దకు పంపాడు (యోహాను 14:16-19; ఎఫెసీయులకు 3:16-17). ఇకపై ఒక నిర్మాణంలో నివసించకుండా, దేవుడు తన ప్రజల జీవితాల్లోకి ప్రవేశించాడు (1 కొరింథీయులకు 3:16; 6:19). విశ్వాసులమైన మనము “జీవముగల దేవుని సంఘము” (1 తిమోతికి 3:15). గుడారం నుండి దేవాలయం వరకు మరియు దేవాలయం నుండి హృదయాల వరకు-పరిశుద్ధత విషయమై దేవుని ప్రమాణం ఎన్నటికీ మారలేదు. ఇది ఇప్పుడు మరింత వ్యక్తిగతమైనది.

ఒక నాయకుడు నేరారోపితుడైనప్పుడు

1 కొరింథీయులలోని పౌలు యొక్క ఉపదేశాలు క్రైస్తవులందరికీ వర్తిస్తాయి, అయితే అవి క్రైస్తవ నాయకులకు ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉంటాయి. సాధారణ వ్యక్తి మరియు నాయకుడు ఇద్దరికీ, దేవుడు క్షమాపణను అందజేస్తాడు. కానీ తన శరీరానికి అలాగే సంఘానికి హాని కలిగించే నాయకుడికి, తీర్పు కూడా ఉంది. పౌలు తీతుకు కక్షపూరిత కలహాలు మరియు వివాదాల పాపంలోకి లాగబడిన నాయకులతో వ్యవహరించమని ఆదేశించినట్లు మనం తరువాత చర్చిస్తాము. అయితే ముందుగా పాపాత్ములైన నాయకులపట్ల ఎలా వ్యవహరించాలో పౌలు మరో యువకుడైన తిమోతికి ఎలా ఉపదేశించాడో చదువుదాం.

సంఘ జీవితంలో కొన్ని సమయాల్లో, దాని ఆధ్యాత్మిక నాయకులలో ఒకరిపై ఆరోపణలు వస్తాయి. కాబట్టి వదంతులను వినవద్దని, పుకార్లకు లేదా ఆధారంలేని అనుమానాలకు పెడచెవినిమ్మని, ప్రతి పుకారుపై త్వరగా చర్య తీసుకోవడం మానుకొనుమని పౌలు తిమోతికి ఆదేశించాడు. అంచనాలను పెంచడం ద్వారా, తిమోతి “ఇద్దరు ముగ్గురు సాక్షులు” (1 తిమోతికి 5:19) సమర్పించిన రుజువు చేయగల మరియు ఆచరణీయమైన వాస్తవాలతో కూడిన కఠినమైన సాక్ష్యాలను మాత్రమే స్వీకరించవలసి ఉంటుంది.

ఒకసారి ధృవీకరించబడిన నేరాన్ని ఉపేక్షించకూడదు, రహస్యంగా సంబోధించకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు మరియు దాచిపెట్టకూడదు. బదులుగా, అపరాధి “అందరి యెదుట” గద్దించబడాలి (5:20). కారణం స్పష్టంగా ఉంది- “ఇతరులు భయపడునిమిత్తము.” పౌలు నాయకత్వ సమస్యలను ప్రస్తావిస్తున్నందున, అపరాధి యొక్క నాయకత్వం ద్వారా ప్రభావితమైన వారందరినీ “అందరి” అనే పదం సూచిస్తున్నది: తెలుసుకోవలసిన వారందరికీ మరియు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకుడి ద్వారా ప్రత్యక్షంగా ప్రభావితం చేయబడిన వారందరికీ. సమాచారం బహిరంగంగా పంచుకున్నందున, దేవుని ప్రజలలో తగిన భయం ఉంటుంది. సంఘంలో ఎవరైనా అదే లేదా అలాంటి పాపంలో నిమగ్నమై ఉన్నట్లయితే, వారి హృదయం దోషనిర్ధారణ చేత గుచ్చుకుంటుంది.

పౌలు దేవుని పని యొక్క పవిత్రతను తీవ్రంగా పరిగణించాడు. అందుకే దేవుని పరిశుద్ధత యొక్క ప్రమాణాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఆయన తిమోతికి నొక్కిచెప్పాడు. “నీకు ఆనబెట్టుచున్నాను” అని పౌలు తిమోతికి వ్రాశాడు (5:21). కోర్టులో ప్రమాణం చేస్తున్నయ్లుగా, పౌలు సంఘమనే దేవాలయంలో, దేవుని పరిశుద్ధ పనిని కాపాడాలని “దేవుని యెదుటను, క్రీస్తుయేసు ఎదుటను, ఏర్పరచబడిన దేవదూతలయెదుటను” తిమోతికి ఆదేశించాడు. మరియు పాపం చేస్తున్న నాయకుడిని విచారించడం మరియు మందలించడం అనే సూత్రాలను నిందితుడు ఎవరు అనేదానితో సంబంధం లేకుండా “పక్షపాతం” లేదా “అనుకూలంగా” ఎప్పుడూ అమలు చేయరాదని అతను అన్నాడు. ద్వంద్వ జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్న నాయకుడైనా – వెలుపల పవిత్రంగా కనబడటం లోపల పాపం చేయడం-గద్దించబడాలని ఆయన నొక్కి చెప్పారు.

దేవుని పనిలో నిమగ్నమవడం చాలా గంభీరమైనది ఎందుకంటే అది పవిత్రమైన పని. కాబట్టి, పౌలు తిమోతికి పరిశుద్ధ సేవ కొరకు ఎవరిపైనైనా హస్తనిక్షేపణము చేయడంలో జాగ్రత్తగా ఉండాలని సూచించాడు (1 తిమోతికి 5:22).

ఒక నాయకుడు పడిపోయినప్పుడు

పాపం చేస్తున్న నాయకుడిని మందలించడంపై పౌలు తిమోతికి బోధించాడు. కానీ ఆ నాయకుడు తన పాపంలో కొనసాగితే – పరిమళమైన పరిశుద్ధత ముసుగులో దాని దుర్వాసనను కప్పి ఉంచడం కొనసాగిస్తే ఏమి చేయాలి? అలాగే, క్రేతు‌లో జరిగినట్లుగా, వారి పాపము సంఘములో వర్గాలు ఏర్పడటానికి కారణమైతే ఏమి చేయాలి? తరువాతి సంగతి ఏమిటి?

పౌలు సంక్షేపముగా మరియు చాలా స్పష్టంగా ఉన్నాడు: అటువంటి మతభేదములు కలిగించు వ్యక్తి విసర్జించబడాలి (తీతుకు 3:10)! పౌలు ఉపయోగించిన పదం, paraiteomai, ఇది ఒకరిని “విసర్జించడం” లేదా “తొలగించడం” అనే కఠినమైన చర్యను కలిగి ఉంది. ఇంకా బలంగా చెప్పాలంటే, “[వారిని] తరిమికొట్టడం.”1Walter Bauer and others, eds., A Greek-English Lexicon of the New Testament and Other Early Christian Literature, 2d rev. ed. (Chicago: University of Chicago Press, 1979), 616. ఇంత కఠినమైన చర్య ఎందుకు? సంఘములో విభజన, విభేదాలు మరియు అశాంతికి కారణమయ్యే వ్యక్తిని కొనసాగించడానికి అనుమతించినట్లయితే, అతని లేదా ఆమె యొక్క చర్యలు, దేవుని ఆలయమైన సంఘాన్ని నాశనం చేయగలవు (1 కొరింథీయులకు 3:17). ఈ సలహా ముఖ్యంగా స్థానిక సంఘంలోని నాయకత్వానికి వర్తిస్తుంది, అయితే ఇది ఏ పరిచర్యకైనా సరే వర్తిస్తుంది. దేవుని పని యొక్క పవిత్రత సంఘము యొక్క నాలుగు గోడలకు మాత్రమే పరిమితం కాదు, కానీ పారాచర్చ్ పరిచర్యలు, మిషన్ల సంస్థలు మరియు అనేకమైన ఇతర పరిచర్యలకు విస్తరించింది.

జాగ్రత్తగా విచారణ లేకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకుడిని తీతు తిరస్కరించకూడదని వాక్యభాగము మనకు చెబుతున్నది. తిమోతి మాదిరిగానే, ఇతను సమాచారం సరైనదేనా అని నిర్ధారించడానికి ప్రయాసపడాలని మరియు చర్య తీసుకునే ముందు పాపం చేస్తున్న నాయకుడిని ఒకటి రెండుమారులు బుద్ధిచెప్పాలని (తీతుకు 3:10) హెచ్చరించాడు. పాపంలో చిక్కుకున్న వ్యక్తి హెచ్చరికలను పట్టించుకోకపోతే, అప్పుడు మాత్రమే అతను లేదా ఆమె తిరస్కరించబడాలి.

కృప రెండుసార్లు పొడిగించబడినప్పుడు అలాంటి వ్యక్తి పశ్చాత్తాపపడే అవకాశాన్ని ఎందుకు తిరస్కరించాడు? ఎందుకంటే భేదములు కలిగించు వ్యక్తి “మార్గము తప్పి పాపము చేయుచున్నాడని” (తీతుకు 3:11) పౌలు అంటున్నాడు. Ekstrepho అనే పదానికి “మార్గము తప్పడం,”2Bauer and others, eds., A Greek-English Lexicon of the New Testament and Other Early Christian Literature, 245. వక్రీకృతముగా, నిరాకారముగా ఉండటమని అర్థం. చీకట్లో తొట్రిల్లుతున్న త్రాగుబోతులా వక్రబుద్ధిగల వ్యక్తి తిన్నని మార్గంలో నడవలేడు. అతను లేదా ఆమె పాపం చేసే స్థితిలో ఉన్నారు, ఉద్దేశపూర్వకంగా దేవుని పరిశుద్ధత ప్రమాణాన్ని ఉల్లంఘించడాన్ని ఎంచుకున్నారు. ఆ విధంగా, వారు ఇప్పటికే తమ్మును తాము ఖండించుకున్నారు.

పరిచర్యలో నిమగ్నమై ఉన్నవారు ఉద్దేశపూర్వకంగా, ఆలోచనాపూర్వకంగా మరియు పదేపదే పాపం చేయడం కంటే బహుశా దేవుని పవిత్రమైన పనిని మసకబార్చడానికి మరేదీ ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉండదు. అ౦దుకే పౌలు తన ఉపదేశమును సూటిగా ఉ౦చాడు—మతభేదములు కలిగించు వ్యక్తిని విసర్జించుము . . . [ఎందుకంటే అతను] మార్గము తప్పినవాడు” (3:10-11).

ముగింపు

మీరు ఎప్పుడైనా ఒక అవిధేయుడైన నాయకుడికి క్రమశిక్షణను అన్వయించాల్సిన సంఘంలో ఉన్నట్లయితే, దేవునికి ఇష్టమైన సేవకుని “గద్దించడం” మరియు “తిరస్కరించడం”తో సంబంధం ఉన్న బాధ మరియు నొప్పి మీకు తెలుసు. పాపం చేసే నాయకుడిని క్రమశిక్షణలో ఉంచాల్సిన సంఘంలో మీరు భాగమై ఉండి ఆ నాయకుణ్ణి క్రమశిక్షణలో పెట్టనట్లైతే, దేవుని పవిత్రమైన పనికి కలిగే కళంకమును చూడటం వల్ల కలిగే నిరాశ మరియు కోపం మీకు తెలుసు. మీరు ఎన్నడూ “మార్గము తప్పి పాపముచేయు” నాయకుడిని కలిగి లేని సంఘంలో సభ్యునిగా ఉన్నట్లయితే, మీరు చాలా అదృష్టవంతులు. మీ గత అనుభవంతో సంబంధం లేకుండా, మీరు లేదా మీ సంఘ నాయకులు పాపం చేస్తున్న పరిచారకుని ప్రతిఘటించే కష్టమైన పనిని చివరికి ఎదుర్కోవలసి రావచ్చు. ఒకవేళ ఆ రోజు వస్తే, ఇక్కడ అనుసరించడానికి ఐదు ఆచరణాత్మక మరియు నిరూపితమైన సూత్రాలు ఉన్నాయి.

ముందుగా, వాస్తవాల ఆధారంగా మనకు ఖచ్చితమైన సమాచారం ఉండాలి. దేవుని పరిచర్యలో యథార్థతను కాపాడుకోవడానికి మనం కట్టుబడి ఉంటే, కష్టమైన పని చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. దీనికి వదంతులను, పుకార్లను లేదా అన్యాపదేశములను కాక–కఠినమైన వాస్తవాలను మాత్రమే వివేచించగల మరియు వినగల సామర్థ్యం అవసరం.

రెండవది, పరిచర్య యొక్క మొత్తం మేలు కోసం మరియు వ్యక్తికి ప్రయోజనం చేకూర్చినప్పుడు మాత్రమే మనం క్రమశిక్షణను చేపట్టాలి. పరిచర్య నాయకుడి పాపం నుండి వచ్చే ముల్లు మన హృదయాలకు గుచ్చుకోవచ్చు, కానీ మన క్రమశిక్షణ ఎన్నడూ వ్యక్తిగత దాడి కాకూడదు. సంఘము కొరకు మరియు వ్యక్తి జీవితంలో పాపం యొక్క ప్రక్షాళన కొరకు కొన్నిసార్లు తొలగించబడటం అవసరమని మనం అర్థం చేసుకోవాలి.

మూడవది, వ్యక్తి పట్ల నిజమైన ప్రేమ మరియు శ్రద్ధతో కూడిన స్ఫూర్తితో మనం క్రమశిక్షణలో పెట్టాలి. పడిపోయిన నాయకుడు ప్రభువుచే ప్రేమించబడ్డాడని మరియు క్రీస్తు వలె అతనిని లేదా ఆమెను ప్రేమించడానికే మనం పిలుపబడ్డామని కూడా మనం గుర్తుంచుకోవాలి. మనం దేవుని మార్గంలో–కృపలో క్రమశిక్షణ చేయకపోతే దేవుని పని యొక్క పవిత్రతను మనం సమర్థించలేము.

నాల్గవది, మనం చాలా ప్రార్థన తర్వాత మాత్రమే చర్య తీసుకోవాలి. సత్యం కోసం మనం ఉత్సాహంతో, పాపం చేసే నాయకునితో తెగదెంపులు చేసుకోవడానికి మనం శోధింపబడవచ్చు, కానీ మనం ఆత్మ జ్ఞానానికి లోబడి ఉండాలి. మనం చిత్తశుద్ధి, వివేచన మరియు వినయంతో పరిస్థితిని సమీపించాలి.

చివరగా, వ్యక్తి యొక్క పునరుద్ధరణను మనం లక్ష్యంగా కలిగి ఉండాలి. క్రమశిక్షణ ఎప్పుడూ ఖండించకూడదు కానీ వ్యక్తి యొక్క పూర్తి పశ్చాత్తాపాన్ని మరియు సమాధానమును కోరుకోవాలి.

కష్టమైన పనిని చేయడం నిజానికి ఉత్తమమైన పని అయిన సందర్భాలు ఉన్నాయి. దేవుని పవిత్రమైన పని విషయానికి వస్తే ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది. తన వాక్యాన్ని నిర్వహించే మరియు తన ప్రజలతో కలిసి పనిచేసే వారి కోసం ఆయన ఎల్లప్పుడూ అధిక ప్రమాణాన్ని కలిగి ఉన్నాడు. యేసు యొక్క సహోదరుడైన యాకోబు ఒక పరిచారకుని ఉన్నతమైన మరియు పవిత్రమైన పనిని అర్థం చేసుకున్నాడు. అందుకే అతను ఇలా హెచ్చరించాడు: “నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి” (యాకోబు 3:1). నాయకులు తమ పాపము గురించి పశ్చాత్తాపపడటానికి నిరాకరిస్తే, ఆ “కఠినమైన తీర్పు” లో భాగంగా మందలించడం మరియు తిరస్కరించడం వంటి పరిణామాలు ఉంటాయి.

అటువంటి తీర్పును నిర్వహించడంలో ఎవరూ ఇష్టపడనప్పటికీ, సంఘానికి మరియు పాపం చేస్తున్న నాయకుడికి నిజంగా మంచి విషయం అయినప్పుడు ప్రతిఘటించడం అనే కఠినమైన విషయం నివారించడానికి వీలులేనంత ముఖ్యమైనది దేవుని పని.

  1. Walter Bauer and others, eds., A Greek-English Lexicon of the New Testament and Other Early Christian Literature, 2d rev. ed. (Chicago: University of Chicago Press, 1979), 616.
  2. Bauer and others, eds., A Greek-English Lexicon of the New Testament and Other Early Christian Literature, 245.

Adapted from Insight for Living,When Doing What’s Hard Is Best,” Tough Grace in Difficult Places: A Study of the Book of Titus Bible Companion(Plano, Tex.: Insight for Living), 91-100. Copyright © 2007 by Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.

References
1 Walter Bauer and others, eds., A Greek-English Lexicon of the New Testament and Other Early Christian Literature, 2d rev. ed. (Chicago: University of Chicago Press, 1979), 616.
2 Bauer and others, eds., A Greek-English Lexicon of the New Testament and Other Early Christian Literature, 245.
Posted in Church-Telugu, Leadership-Telugu, Pastors-Telugu.

Insight for Living Ministries is committed to excellence in communicating the truths of Scripture and the person of Jesus Christ in an accurate, clear, and practical manner so that people will come to an understanding of God’s plan for their lives, as well as their significant role as authentic Christians in a needy, hostile, and desperate world.

లేఖనములోని సత్యాలను మరియు యేసుక్రీస్తు అను వ్యక్తిని గూర్చి ఖచ్చితమైన, స్పష్టమైన మరియు ఆచరణాత్మక పద్ధతిలో తెలియపరచడంలోను, తద్వారా ప్రజలు తమ జీవితాల కోసం దేవుని ప్రణాళికను, అలాగే లేమిలోవున్న, ప్రతికూలమైన మరియు నిరాశతో కూడిన ప్రపంచంలో ప్రామాణికమైన క్రైస్తవులుగా తమ ముఖ్యమైన పాత్రను అర్థం చేసుకోవటానికి ఇన్సైట్ ఫర్ లివింగ్ మినిస్ట్రీస్ ఎంతో ఉత్కృష్టతతో రాణించటానికి కట్టుబడి ఉంది.