“ప్రపంచం మొత్తం దేవుని చేతుల్లో ఉంది,” అని ఆంగ్లములోనున్న ఈ పాత సువార్త పాట గుర్తుందా? గాలి, వర్షం, చిన్న శిశువు, అవును, నువ్వు మరియు నేను కూడా ఆయన చేతుల్లో ఉన్నాము. ఈ విషయాన్ని ఎంత సులభంగా మరచిపోతాము! అలాగే ఇది మన భూగోళానికి లేదా మన సంస్కృతికి పరిమితం కాదని మీకు తెలుసా? మధ్య-తూర్పు ఆయన చేతుల్లో ఉన్నది (అది ఎంత ఉపశమనం, కాదా?), ఉత్తర కొరియా మరియు ఇరాన్, క్యూబా మరియు భారతదేశం, ఇండోనేషియా మరియు రష్యా గురించి చెప్పనవసరం లేదు – ఇవన్నీ ఆయన సార్వభౌమాధికారంలోనే ఉన్నాయి. మన పనుల్లో మనం ఉన్నప్పుడు, మన భవిష్యత్తు, మన పిల్లలు, మన పరిస్థితులు, మన స్నేహితులు మరియు మన శత్రువులు ఆయన చేతుల్లో ఉన్నారు. . . ఆయన పట్టులోనే. . . ఆయన నియంత్రణలోనే. మన విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ఊహాత్మక భయాలు ఉదయపు మంచులాగా జారినప్పుడు కూడా. ఆయన అక్కడ ఉన్నాడు- మన బాధ్యత ఆయన తీసుకున్నాడు.
కానీ మన పరిస్థితి నిజంగా ఆయన చేతుల్లో ఉందని నమ్మడానికి చాలా కష్టమనిపించిన సందర్భాలూ ఉన్నాయి. గాలి, వాన మరియు చిన్న బిడ్డ మాత్రమే కాదు, జీవితం యొక్క చిన్న అంతరాయాలు మరియు పెద్ద విపత్తులు కూడా ఆయన చేతుల్లోనే ఉన్నాయి. వాస్తవానికి, అవి ఆయన దృష్టిని ఎప్పటికీ వదలవని మీరు నమ్ముతారా?
యెషయా అనే జ్ఞానము కలిగిన ప్రవక్త యొక్క మాటలను జ్ఞాపకం చేసుకోవటం మనకు కొన్ని సమయాల్లో అవసరమవుతాయి.
“చూడుము నా యరచేతులమీదనే నిన్ను చెక్కి యున్నాను;
నీ ప్రాకారములు నిత్యము నాయెదుట నున్నవి.” (యెషయా 49:16)
మరో మాటలో చెప్పాలంటే, దేవుడు మనమెలాగు ఉన్నామో అలాగే మనల్ని చూస్తాడు. . . మచ్చలు మరియు వాటికి సంబంధించినవన్నిటినీ, అవసరాలు మరియు వాటికి సంబంధించినవన్నిటినీ. ఆయన ప్రతిదీ చూస్తాడు. మరియు ఆయన దానిని ఎంత దగ్గరగా చూస్తాడు? ఇది ఆయన అరచేతుల్లో ఉంది.
మీ మార్గములను దేవుడు యెరుగును. . . మరియు ఆయన వాటిని నిరంతరం యెరుగును. అందులో మీ స్పందనలు, మీ అనుభవాలు, మీ ప్రతిచర్యలు, విపత్తులని మీరు పిలిచేవి, మూసుకుపోయిన మీ దారులు, మీరు అనుకునే అసాధ్యమైన పరిస్థితులు అన్నీ ఉన్నాయి.
మీరు-నేను, గాలి-వాన, మరియు చిన్న బిడ్డ మాత్రమే కాదు, నిన్నటి వైఫల్యాలు కూడా ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆయన వద్ద నేటి సవాళ్లు ఉన్నాయి, రేపటి అద్భుతాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. మరియు వాటిలో ఏ ఒక్కటి కూడా దేవుని ఉక్కిరిబిక్కిరి చేయదు. “ఆహ్! అది నాకు అస్సలు తెలియలేదు,” అని ఆయన ఆశ్చర్యంతో స్పందించడానికి ఏ ఒక్కటీ కారణం కాదు. ఒక్కటి కూడా. ఆయన కదిలింపబడడు, ఆయన మార్పులేనివాడు. ఆయన చేతుల్లో ప్రపంచమంతా ఉన్నది. ఆయన తన యరచేతులమీద నిన్ను నన్ను చెక్కియున్నాడు. ఇంతకంటే ఏమి కావాలి? పరిస్థితులు చేయి దాటిపోలేదు.
Taken from Charles R. Swindoll, Encouragement for Life: Words of Hope and Inspiration (Nashville: J. Countryman, 2006), 73-74. Copyright © 2006 by Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.