చెవులు పగిలిపోయేంత శబ్దమది. ఇది వినడానికి ఎవరూ దగ్గరలో లేనప్పటికీ, చివరికి అది ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించింది. DC-4 లోని ప్రయాణీకులలో ఎవరికీ ఏమి జరిగిందో తెలియదు-వారు వెంటనే చనిపోయారు. అది ఫిబ్రవరి 15, 1947, ఈక్వెడార్‌లోని క్విటోకు బయలుదేరిన ఏవియాంకా ఎయిర్‌లైన్ విమానం బొగోటాకు దూరంగా ఉన్న ఎల్ టాబ్లాజో యొక్క 4,267 మీటర్ల ఎత్తైన శిఖరాన్ని ఢీకొట్టి, ఆపై జ్వలించే ఆ లోహపు ముద్ద చాలా దిగువ లోయలో పడిపోయింది.
బాధితులలో ఒకరు న్యూయార్కుకు చెందిన గ్లెన్ ఛాంబర్స్ అనే యువకుడు. అతను “వాయిస్ ఆఫ్ ది ఆండీస్” తో పరిచర్యను ప్రారంభించాలని అనుకున్నాడు.
ఆ రోజు మయామి విమానాశ్రయం నుండి బయలుదేరే ముందు, ఛాంబర్స్ టెర్మినల్‌లో తీసుకున్న కాగితంపై తన తల్లికి ఒక నోటు రాశాడు. ఆ కాగితం “ఎందుకు?” అనే ఒకే పదంతో ఉన్న ఒక ప్రకటన యొక్క ముక్క మాత్రమే. సరిగ్గా కాగితం మధ్యలో “ఎందుకు?”అనే ప్రశ్న విస్తరించి ఉంది. ఆతురుతలో మరియు ఏదో పనిలో పడిపోయి, అతను ఆ పదం చుట్టూ తన నోటును వ్రాసి, దానిని మడిచి, తన తల్లికి సంబోధించిన కవరులో పెట్టాడు.
అతని మరణవార్త తెలిసిన తరువాత ఆ నోటు ఆమె దగ్గరకు వచ్చింది. అతని తల్లి దానిని అందుకున్నప్పుడు, అక్కడ, ఆమెను తేరిచూస్తూ ఆ ప్రశ్న వెంటాడింది: ఎందుకు?
అన్ని ప్రశ్నలలో, ఇది చాలా శోధించేది, చాలా బాధించేది. ఇది ప్రతి విషాదమును తనతో పాటు తీసికొని వెళుతుంది. చనిపోయిన బిడ్డకు జన్మనిచ్చిన తల్లి పెదవులనుండి… తన భర్త విషాద మరణం గురించి తెలుసుకున్న భార్య పెదవులనుండి… “నాన్న ఇక ఎప్పటికీ ఇంటికి రారు” అని చెప్పబడిన పిల్లవాని పెదవులనుండి… ఉద్యోగం పోగొట్టుకున్న ఐదుగురు బిడ్డల తండ్రి పెదవులనుండి … ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికి సన్నిహిత మిత్రుని పెదవులనుండి ఈ ప్రశ్న వస్తుంది.
ఎందుకు? నాకే ఎందుకు? ఇప్పుడు ఎందుకు? ఇది ఎందుకు? అలాంటి క్షణాలకు మనల్ని ఏదీ కూడా పూర్తిగా సిద్ధం చేయలేదు. కొన్ని ఆలోచనలు తరువాత మనలను స్థిరంగా ఉంచగలవు. . . బహుశా ఒకటి మాత్రమే. యోబును పరిగణలోనికి తీసుకోండి. . . అతని భావాలను ఊహించుకోండి!
“నువ్వు నీ పశువులను కోల్పోయావు, అవి దొంగిలించబడ్డాయి. నీ గొర్రెలు, ఒంటెలు కూడా నాశనమయ్యాయి. యోబు, నీ ఉద్యోగులు హత్య చేయబడ్డారు. ఓహ్, ఇంకొక విషయం-నీ పిల్లలు విచిత్రమైన గాలివానలో నలిగిపోయారు…నా స్నేహితుడా, వారందరూ, ఆ పదిమంది చనిపోయారు.”
వాస్తవానికి అది జరిగింది. భయాందోళన చెందుతున్న తరుణంలో యోబుకు ఈ వార్తలన్నీ వచ్చాయి. కొంతకాలం తర్వాత అతనికి తల నుండి కాలి వరకు బాధగల కురుపులు వచ్చాయి. శోకముతో నిండియున్నాడు. నివ్వెరపోయాడు. చేతులెత్తేశాడు. శరీరంలోను, ఆత్మలోను బాధాకరమైన నొప్పిలో ఉన్నాడు. ఒక విషాదాన్ని కూడా వివరించడానికి మాటలు లేవు. అలాంటిది అయిదింటిని గూర్చి మాట్లాడకపోతే ఎలా! ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది, పచ్చి వేదన, మరియు ఆకాశం మూగబోయింది. ఖగోళ అగాధమునుండి కూడా ఎటువంటి వివరణ లేదు. ఒక్కటంటే ఒక్క కారణం కూడా లేదు. ఆపై అతని భార్య ఇలా సలహా ఇచ్చింది: “దేవుని దూషించి మరణము కమ్ము!”
వెంటనే యోబు ధైర్యంగా, “మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు, ఓ నారీ!” తెలివిగా ఆయన ఇలా అన్నాడు, “మనము దేవునివలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా?”
ఆ రోజు యోబు వాదమును చాలా జాగ్రత్తగా గమనించండి. అతన్ని చివరిదాకా నడిపించినదానిని పోగొట్టుకోవద్దు. “నవ్వి భరించండి… లేదా కనీసం ధైర్యంగా ఉండి సహించండి”-అనే స్టాయిక్ యొక్క వైఖరిలా కాకుండా, యోబు ఒక గొప్ప సూత్రాన్ని స్వాధీనం చేసుకొని దాన్నే అంటిపెట్టుకున్నాడు. ఇది అతనికి కష్ట సమయంలో సహాయంగా ఏర్పడింది. . . అది అతని అడుగును స్థిరంగా ఉంచింది. . . అది అతను శపించకుండా ఆపింది. ఇలాంటిది తప్ప, “ఎందుకు?” అని అడగవలసిన ఆవశ్యకతను వేరే ఏ ఒక్క సత్యం నివారించదు:
దేవుడు ఏదైనా క్రూరమైనది చేయలేనంత బహుదయగలవాడు. . . తప్పు చేయలేనంత జ్ఞానముగలవాడు. . . తనను తాను వర్ణించుకోలేనంత గూఢమైనవాడు.
అంతే! యోబు తన స్థితిని అక్కడ ఉంచాడు.
ఆ ఒక్క లోతైన ప్రకటనను నమ్ముటవలన భూమి యొక్క అసమానతల నుండి వచ్చిన “ఎందుకు?” అనే ప్రశ్నను చెరిపివేస్తుందనడం చాలా గొప్ప విషయం.
1947 శీతాకాలంలో న్యూయార్క్‌లో విరిగిన హృదయంతో ఉన్న తల్లి యిదే సత్యమును పెనవేసుకుంది. తెర వెనుక ఎవరున్నారనేది చూచినప్పుడు మిసెస్ ఛాంబర్స్ ఎందుకు అని అడగడం మానేసింది.
మనము ఆయన సంపూర్ణ సార్వభౌమత్వము నిజమని ఒప్పుకున్నప్పుడు ఇతర శబ్దాలన్నీ మూసివేయబడతాయి. కూలిపోతున్న DC-4 యొక్క అతిపెద్ద శబ్దం కూడా.
Taken from Charles R. Swindoll, The Finishing Touch: Becoming God’s Masterpiece (Dallas: Word, 1994), 170-71.