“దేవుని వశములో నిజంగా పరిస్థితులు ఉన్నాయా, లేదా నా జీవితం అదుపు లేకుండా పోతోందా?” అని మీరెప్పుడైనా ఆశ్చర్యపడ్డారా? నేను పడ్డాను. 18 ఏళ్ళ వయసులో యేసుక్రీస్తుపై నమ్మకంతో, నేను సరైన పనులను తగినంతగా చేస్తే, నా క్రైస్తవ జీవితం పరిపక్వత వైపు స్థిరంగా ఎక్కుతుందని నేను వెంటనే తేల్చేశాను. అనేక ఎదురుదెబ్బలు మరియు వైఫల్యాల తరువాత, దేవుడు నియంత్రణలో ఉన్నాడని మరియు అన్నింటికీ ఒక ఉద్దేశ్యం ఉందని నేను నమ్ముతున్నాను.
కానీ నా జీవిత గమనం, పరిచర్య, సంబంధాలు మరియు ఆత్మీయ జీవితం ప్రతిష్టంభించినప్పుడు, నాకు అంత ఖచ్చితంగా తెలియలేదు. బహుశా నన్ను నేను మోసం చేసుకున్నాను. దేవుడు నియంత్రణలో ఉండటానికి బదులుగా, నా జీవిత గమనానికి అసలు ఉద్దేశ్యం లేకపోవచ్చు. దేవుడు భరించగలిగిన దానికంటే ఎక్కువగా నా తప్పులు ఉండవచ్చు.
మనమందరం కొన్ని సమయాల్లో మన జీవితాలను చూస్తూ, “ఈ గందరగోళంనుండి ఏదైనా ఒక అభిప్రాయానికి రావచ్చా?” అని అనుకునే ఉంటాం. బయటనుండి చూస్తే, కొన్ని సమయాల్లో జీవితం అస్పష్టంగా మరియు అస్తవ్యస్తంగా కనిపిస్తుంది. ఇది తరచుగా బైబిల్లోని ప్రజలకు ఆ విధంగా కనిపించింది. జైలు గదిలో అన్యాయంగా కూర్చొనియున్న యోసేపు, అతిక్రూరుడైన సౌలు నుండి పారిపోతున్న దావీదు లేదా యెరూషలేము ద్వారముల వెలుపల విస్తారమైన అష్షూరు సైన్యాన్ని ఎదుర్కొంటున్న హిజ్కియాను గూర్చి ఆలోచించండి. పరిస్థితులు ఎలా తప్పుదోవ పట్టాయి? దేవుని ప్రణాళిక ఇంకా కొనసాగుతుందా, లేదా ఆయన సెలవు తీసుకున్నాడా?
లేఖనము యొక్క రచయితలలో ఒకరు ఈ సమస్యను చాలా అసాధారణమైన పద్ధతిలో ప్రసంగించారు. దేవుని గురించి ఎస్తేరు పుస్తకం ఎప్పుడూ ప్రస్తావించలేదు. అయినప్పటికీ ఇది యూదు చరిత్రలో ఒక భాగాన్ని కలిగి ఉంది. ఈ పుస్తకంపై దేవుని ప్రభావం స్పష్టంగా మనకు కనిపిస్తుంది. పరిస్థితులు అదుపులో లేనప్పటికీ, దేవుడు తెర వెనుక క్రియాశీలకంగా ఉన్నాడని రచయిత నొక్కిచెప్పాలనుకున్నట్లుగా ఉంది.
పారసీకుల చెరలో నివసిస్తున్న యూదులకు పరిస్థితులు ఖచ్చితంగా అలానే అనిపించాయి. క్రూరమైన అన్యదేశానికి లాక్కోనిపోబడటం చాలా భయంకరమైనది. ఇప్పుడు, రాజు యొక్క కుడి భుజమైనవాడొకడు యూదులను నిర్మూలించాలని రాజుతో మాట్లాడి తాకీదుపై సంతకం చేయించాడు. ఈ ప్రణాళిక వివరాలు రాజధాని నగరంలో నివసిస్తున్న మొర్దెకై అనే యూదునికి తెలిసింది. ఈ వ్యక్తి ఎస్తేరు అనే అందమైన యూదు అనాధ అమ్మాయిని పెంచాడు. లెక్కలేనన్ని అభ్యర్థులలోనుండి, రాజుచేత ఎస్తేరు రాణిగా ఎంపిక చేయబడింది. ఆయన అనుకోకుండా తన మునుపటి రాణిని ఆమె పదవినుండి దించేశాడు.
ఈ యువతి-ఇప్పటికీ ఒక పడుచుపిల్లే, నిజంగా-తన ప్రజల తరపున రాజును సంప్రదించడం ద్వారా తన ప్రాణాలను పణంగా పెట్టే అంతర్గత ధైర్యాన్ని కలిగి ఉంది. రాజు అప్పుడే రాజ్యపు సమాచార గ్రంథమును చదువుతున్నాడు, అక్కడ రాజు జీవితానికి వ్యతిరేకంగా ఒక కుట్రను వెలికితీసినందుకు మొర్దెకైకి ఎప్పుడూ బహుమతి లభించలేదని ఆయన కనుగొన్నాడు. కాబట్టి ఎస్తేరు తన ప్రజల ప్రాణాల కోసం వేడుకున్నప్పుడు, ఆమెను ప్రేమించిన రాజు ఇప్పుడు యూదుల వైపు మొగ్గు చూపాడు. ఆ విధంగా, యూదులు అద్భుతంగా రక్షించబడ్డారు మరియు వారి శత్రువు ఉరి తీయింపబడటానికి శిక్షించబడ్డాడు.
రాజు ఆస్థానంలో ఎంత కుట్రతో కూడిన కథ! తన ప్రజల కోసం దేవుని ప్రణాళిక శాశ్వతంగా పట్టాలు తప్పినట్లుగా కనిపించినప్పుడు కూడా, దేవుని సంరక్షణపై విశ్వాసం కలిగివున్న ఒక యువతిని గూర్చిన ఎంత గొప్ప కథ.
క్రొత్త నిబంధన రచయితలు మన జీవితంలోని ప్రతిదీ మన తండ్రి నియంత్రణలో ఉందని భరోసా ఇస్తున్నారు. క్రీస్తునందు విశ్వాసులు “ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయముచొప్పున సమస్తకార్యములను జరిగించుచున్నాడు” అని పౌలు వ్రాశాడు (ఎఫెసీయులకు 1:11-12). మరో మాటలో చెప్పాలంటే, దేవునికి ఒక ప్రణాళిక ఉంది, మరియు ఆయన ప్రణాళికను మొత్తంగా గాని, మనపట్ల వ్యక్తిగతంగా గాని ఏదీ పట్టాలు తప్పించలేదు.
ఈ నాశనమైపోయిన ప్రపంచంలో జీవితం నిరాశపరిచే గందరగోళమని అపొస్తలుడు ఒప్పుకున్నాడు (రోమా 8:20-23), కాని దేవుడు మన జీవితాలలో తన మంచి ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి అతిచిన్న వివరాలను మరియు అతి ముఖ్యమైన సంఘటనలను కూడా వాడుకుంటున్నాడనే భరోసా మనం కలిగియుండవచ్చని చెబుతున్నాడు. ఆ ఉద్దేశ్యం ఏమిటంటే మనం యేసు యొక్క సారూప్యము గలవారమవ్వాలి (రోమా 8:28-29).
బయటినుండి పరిస్థితులు గందరగోళముగా కనిపిస్తున్నప్పటికీ, దేవుడు తన శాశ్వతమైన ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి మన జీవితంలో తెర వెనుక పని చేస్తున్నాడు. ఆయన తన మహిమకు కీర్తికలుగజేయుటకు దానిని నెరవేరుస్తాడు (ఎఫెసీయులకు 1:12). మన తప్పులు కూడా చాలా ఉన్నప్పటికీ, అవి ఆయన ప్రణాళికను అడ్డుకోవు. “మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక ఆలాగు చేయును” (1 థెస్సలొనీకయులకు 5:24).
యోసేపు మాదిరిగానే, ఈ జీవితంలో సంఘటనలు ఎలా జరుగుతాయో దేవుడు ఎందుకు అనుమతించాడో మనం చివరికి అర్థం చేసుకోవచ్చు (ఆదికాండము 50:20). లేదా చాలా పాత నిబంధన పరిశుద్ధుల మాదిరిగానే, మనం ఎన్నడూ పరలోకం యొక్క ఈ వైపున పజిల్‌ను కలపలేకపోవచ్చు (హెబ్రీయులకు 11:35-40). కానీ ఫర్వాలేదు. జీవిత చిత్రములను తయారుచేసేది మనం కాదు. దేవుడు.
ప్రస్తుతం, మన జీవితపు చిత్రం యొక్క వెనుక వైపు మాత్రమే చూస్తున్నాము-ఇది చిక్కుబడిపోయి అస్తవ్యస్తముగా ఉన్నది. ఒక అందమైన చిత్రం వాస్తవానికి మరొక వైపు సృష్టించబడుతోందా అనే సందేహముతో మనము శోధింపబడుచున్నప్పుడు, ఇక్కడ మనం చేయగలిగే కొన్ని విషయాలు ఉన్నాయి. మొదటిది, దేవుని వాక్యంలో నిలిచియుండండి. పరిస్థితులు చాలా ఘోరముగా ఉన్నప్పుడు, దేవుని వాక్యంతో మిమ్మల్ని మీరు నింపుకోండి. మన భూసంబంధమైన దృక్పథముతోగాక దేవుని దృక్పథముతో స్థిరంగా చూసే ఏకైక మార్గం ఇది.
రెండవది, చిన్న సూచనల ద్వారా భవిష్యత్తును తెలుసుకోవటానికి ప్రయత్నించవద్దు. అవన్నీ గుర్తించడానికి ప్రయత్నించవద్దు. ఏమైనప్పటికీ, ఆ విషయంలో మనం సమర్థులము కాదు. అంతేకాకుండా, అర్థరహితంగా కనబడేదాన్ని మనం అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, మనం కనిపించని దేవుని కంటే మనకు కనిపించేదాన్నే విశ్వసించాలని కోరుకుంటున్నాము. అంత విస్తారమైన విశ్వం యొక్క సంక్లిష్టతలను మనం గ్రహించలేకపోతున్నామని అంగీకరించండి.
మూడవది, మన పరలోకపు తండ్రిని నమ్మండి. ఆయన సార్వభౌమాధికారి అని నమ్మండి, ఆయన తన నియంత్రణలో ప్రతిదీ కలిగి ఉన్నాడు. మరియు ఆయన మంచివాడని, ఆయన హృదయం మన పట్ల ప్రేమగల హృదయం మాత్రమేనని, మరియు ఆయన మనకొరకు “అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును” నేయుచున్నాడని విశ్వసించండి (2 కొరింథీయులకు 4:17).
Taken from Greg Smith, “Is God Really in Control?” Insights (February 2005), 2,5. Copyright © 2005 by Insight for Livng. All rights reserved worldwide.