ఒక చిన్న బహుమతి . . . అద్భుతంగా చుట్టబడి, నిశ్శబ్దంగా అందించబడింది

మొట్టమొదటి క్రిస్మస్ వేడుక నుండి, సంవత్సరంలో ఏ సమయంలోనూ లేనివిధంగా ఈ సమయంలో ఒక పదం అందరి పెదవుల వెంట వస్తుంది. ఇది ఆనందగీతం లేదా చెట్టు లేదా భోజనం అనే పదం కాదు. అదేమిటంటే బహుమతి.

బహుమతులు క్రిస్మస్‌తో విడదీయరాని విధంగా ముడిపడి ఉన్నాయి, మనం ఈ రెండింటిలో ఏది లేకపోయినా ఊహించలేము. మీరు ఈ నెలలో కొట్లలో సంభాషణలను వింటుంటే, బహుమతి గురించి అనేకసార్లు ప్రస్తావించబడుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. మనము కొనాలనుకునే బహుమతుల జాబితాలు మనందరికీ ఉంటాయి–అలాగే మనలో కొంతమందికి మనం స్వీకరించాలనుకునే బహుమతుల జాబితాలూ ఉంటాయి. ప్రతి సంవత్సరం నా పిల్లలలో ఒకరు నాకు జాగ్రత్తగా ముద్రించిన క్రిస్మస్ జాబితాను అందజేయటం నాకు గుర్తుంది. నేను కావాలనుకుంటే నేను ఇష్ట ప్రకారముగా యిచ్చే బహుమతులు ఉంటాయి అలాగే ఐచ్ఛికం కాని అవసరమైన బహుమతులు కూడా ఇందులో ఉంటాయి–తప్పనిసరిగా కావలసిన బహుమతులు!

క్రిస్మస్ సమయంలో ఇచ్చిపుచ్చుకోవడాలు జరుగుచున్నప్పుడు, తన కుమారుడు . . . మనకు దేవుడిచ్చిన బహుమతి గురించి నిదానించి ఆలోచించడం సబబే. యేసు మిగిలిన వారిలాగా కాక, నమ్మదగినవాడు గనుక భూమిమీద ఉన్న ప్రతి వ్యక్తికి తప్పనిసరిగా ఉండవలసిన బహుమానమని దేవుడు ఉద్దేశించాడు.

తన కుమారుని ఇవ్వడంలో దేవుని ఔదార్యాన్ని ప్రతిబింబిస్తూ, అపొస్తలుడైన పౌలు నాకు ఇష్టమైన క్రిస్మస్ వాక్యం వ్రాసాడు. నేను ఎల్లప్పుడూ దీనిని క్రిస్మస్ కార్డులలో చూడటానికి ఇష్టపడతాను:

చెప్ప శక్యము కాని ఆయన వరమునుగూర్చి దేవునికి స్తోత్రము.(2 కొరింథీయులకు 9:15)

మనము సాధారణంగా “క్రిస్మస్ కథనం” అని పిలిచే దానికి ఇది సరిపోదు, కానీ ఇది నాకు ఇష్టమైనది ఎందుకంటే ఇది పశువుల తొట్టిలోని శిశువును చూచినప్పుడు మనలో కనిపించే నిజమైన విస్మయాన్ని తెలియజేస్తుంది.

పౌలు విస్తృత పదజాలం కలిగిన ఒక అద్భుతమైన వ్యక్తి. అతడు గ్రీకు భాషను ఉపయోగించడంలో సమర్థుడు, అతడు ప్రసంగించడంలోను మరియు చర్మపత్రంపై వ్రాయడంలోను అద్భుతమైన బోధకుడు మరియు సంభాషణకర్త. అతడు క్రొత్త నిబంధన యొక్క అత్యంత విస్తారముగా వ్రాసిన రచయిత అలాగే యేసు క్రీస్తు కాకుండా, బహుశా గొప్ప వేదాంత మనస్సు ఉన్నవాడు. అయినను, పౌలు యొక్క కలం ఈ సరళమైన నాలుగు-అక్షరాల పదమైన “బహుమతి” కి వచ్చేసరికి ఆగిపోయింది, మరియు దానిని గూర్చి జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత, అతడు అది “చెప్ప శక్యము కాని” అని రాశాడు.

అతను తన జ్ఞాన నిధిలో మునగగా, తాను ప్రసిద్ధికెక్కినను దేవుని బహుమతిని వర్ణించగలిగే ఏ పదాన్నీ కనుగొనలేకపోయాడు. పొత్తిగుడ్డలతో చుట్టబడి మనకు క్రిస్మస్ సమయంలో ఇవ్వబడిన యేసు అనే వ్యక్తిని ఉద్దేశించిన వివరణాత్మక పర్యాయపదాలు సరిపోవు. పౌలు అకస్మాత్తుగా మరియు పూర్తిగా నివ్వెరపోయాడు. అతను ఏ పదాన్ని ఉపయోగించాలి?

కింగ్ జేమ్స్ బైబిల్ ఇలా చెబుతోంది, “చెప్పనలివి కాని ఆయన వరమునుగూర్చి దేవునికి స్తోత్రము.” కెన్నెత్ వుయెస్ట్, తన విస్తరించిన అనువాదంలో ఇలా వ్రాశాడు: “వర్ణించలేని ఆయన వరమునుగూర్చి దేవునికి స్తోత్రము.” ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్ ఇలా చదువబడుచున్నది, “వివరించలేని ఆయన వరము!” న్యూ లివింగ్ అనువాదంలో ఇలా ఉన్నది, “మాటలకు అందని అద్భుతమైన వరమిది!” యాంప్లిఫైడ్ క్లాసిక్ ఎడిషన్‌లో ఇలా ఉన్నది, “ఆయన వరము, [విలువైనది] మాటలకు మించినది!”

దేవుని వరము ఎందుకని చెప్ప శక్యము కానిది, చెప్పనలివి కానిది, వర్ణించలేనిది, వివరించలేనిది, మాటలకు అందని అద్భుతమైనది, మరియు మాటలకు మించి విలువైనది? ఒక మామూలు కారణం: పశువుల తొట్టిలో పరుండియున్న చిన్న శిశువు కంటే యేసు ఎంతో ఎక్కువ కలిగియున్నాడు! మనము తేరిచూచుచూ మరియు లోతుగా ఆలోచిస్తున్నప్పుడు, ఎంతో ఎక్కువగా . . . యేసు పొత్తిగుడ్డలతో కంటే ఇంకా ఎక్కువైన వాటితో చుట్టబడటం మనం చూస్తాము!

మొదటిది, యేసు ప్రవచనంలో చుట్టబడ్డాడు. యేసు పుట్టడానికి శతాబ్దాల ముందు యేసును శక్తివంతమైన దేవుడు మరియు శాశ్వతమైన రాజుగా యెషయా చెప్పిన ఆశ్చర్యకరమైన ప్రవచనాన్ని చదవండి.

ఏలయనగా మనకు శిశువు పుట్టెను
మనకు కుమారుడు అనుగ్రహింపబడెను
ఆయన భుజముమీద రాజ్యభారముండును.
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు
నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి
అని అతనికి పేరు పెట్టబడును.
ఇది మొదలుకొని మితిలేకుండ దానికి
వృద్ధియు క్షేమమును కలుగునట్లు…నియమించును.
(యెషయా 9:6-7)

రెండవది, యేసు చరిత్రలో చుట్టబడ్డాడు. కాలమునకు సార్వభౌముడైన దేవుడు చరిత్ర సంఘటనలను అల్లాడు, తద్వారా అవి సరైన సమయంలో, ప్రవచనంతో సరిగ్గా ఇమిడాయి.

అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను; ఆయన స్త్రీయందు పుట్టి, మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడియున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను. (గలతీయులకు 4:4-5)

మూడవది, మరియు ఈ సందర్భంలో చాలా ముఖ్యమైనది, యేసు మర్మములో చుట్టబడ్డాడు. నిజమైన “విస్మయం” యేసు స్వభావం యొక్క మర్మంలో నివసించుచున్నది. ఈ చిన్న శిశువులో కూడా, పరిపూర్ణ మానవత్వం ధరించిన అపరిమితమైన దైవత్వమును మనం చూస్తాము. ఒక వ్యక్తిత్వంలో రెండు స్వభావాలు కలిసిన, ఒక ఏకైక శరీరంలో నివాసం చేసిన, దైవ మానవుడైన యేసు జన్మించాడు. ఒక్క వ్యక్తిలో, ఒక్క శరీరంలో, పరిపూర్ణమైన దైవత్వము, పరిపూర్ణమైన మానవత్వము, ఎప్పటికీ.

అది విస్మయం కలిగించే మర్మము! దేవదూతల సమూహము ఏకగ్రీవంగా ఈ క్రింది విధంగా ప్రకటించడంలో ఆశ్చర్యం లేదు, “సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ” (లూకా 2:14)! వివరించడానికి పదాలు విఫలమైనప్పుడు ఆరాధన మాత్రమే వ్యక్తపరచగలదు.

అందుకే క్రిస్మస్ కథను దేవుని మాటల్లో కాలానుగుణంగా, సంవత్సరం తర్వాత సంవత్సరం పునరావృతం చేయాలి! ప్రజలు సత్యాన్ని వినే ఏకైక మార్గం ఇదే . . . దీన్ని నమ్మండి.

కాబట్టి, మీరు ఈ కాలము‌లో క్రిస్మస్‌ని జరుపుకుంటున్నప్పుడు, ఆనందగీతములు పాడండి, భోజనాన్ని ఆస్వాదించండి మరియు బహుమతులను ఇచ్చిపుచ్చుకోండి. కానీ ప్రవచనం, చరిత్ర మరియు అసలైన, తప్పక, చెప్పశక్యముకాని వరము చుట్టూ ఉన్న మర్మాన్ని గుర్తుకుతెచ్చుకోకుండా ఈ కాలమును గడిచిపోనివ్వకండి: ఆ చిన్న శిశువు అద్భుతంగా చుట్టబడి, నిశ్శబ్దంగా ఇవ్వబడ్డాడు . . . నిత్యము ఆరాధింపబడుచున్నాడు.

Copyright © 2018 by Charles R. Swindoll, Inc. All rights are reserved worldwide.
Posted in Christmas-Telugu, Jesus-Telugu.

Pastor Charles R. Swindoll has devoted his life to the accurate, practical teaching and application of God’s Word. He is the founding pastor of Stonebriar Community Church in Frisco, Texas, but Chuck’s listening audience extends far beyond a local church body. As a leading programme in Christian broadcasting since 1979, Insight for Living airs around the world. Chuck’s leadership as president and now chancellor emeritus at Dallas Theological Seminary has helped prepare and equip a new generation of men and women for ministry.

పాస్టర్ చార్లెస్ ఆర్. స్విండాల్ దేవుని వాక్యాన్ని నిర్దిష్టంగా, ఆచరణాత్మకంగా బోధించడానికి మరియు అన్వయించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చి వ్యవస్థాపక కాపరియై ఉన్నారు, అయితే చక్ యొక్క శ్రోతలు స్థానిక సంఘ పరిధి దాటి వ్యాపించి ఉన్నారు. 1979 నుండి క్రైస్తవ ప్రసరణలో ప్రముఖ కార్యక్రమంగా, ఇన్‌సైట్ ఫర్ లివింగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసారమవుతోంది. డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ప్రెసిడెంటుగా, అలాగే ఇప్పుడు ఛాన్సిలర్ ఎమెరిటస్‌గా చక్ యొక్క నాయకత్వం క్రొత్త తరం స్త్రీపురుషులను పరిచర్య కొరకు సిద్ధపరచడంలో సహాయపడింది.