మేరీల్యాండ్‌లోని డార్లింగ్టన్‌లో చాలా సంవత్సరాల క్రితం ఒక తమాషా జరిగింది. ఎనిమిది మందికి తల్లి అయిన ఈడిత్ ఒక శనివారం మధ్యాహ్నం పొరుగువారి ఇంటి నుండి తన ఇంటికి తిరిగి వస్తున్నది. ఆమె తన యింటి ముందు తోటలో నడుస్తున్నప్పుడు ఇంట్లో అంతా నిశ్శబ్దంగా ఉన్నట్లు అనిపించింది. కుతూహలంతో, ఆమె తలుపు గుండా చూసింది మరియు ఆమె ఐదుగురు చిన్న పిల్లలు కలిసి కూర్చొని, ఏదో ఒకదానిపై దృష్టి పెట్టడం చూసింది. ఆమె వారికి దగ్గరగా వెళ్లి, వారు దేనిపై దృష్టి కేంద్రీకరించారో కనుగొనడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఆమె తన కళ్లను నమ్మలేకపోయింది. వారి మధ్యలో ఐదు చిన్ని అడవిపిల్లుల వంటివి ఉన్నాయి.
ఈడిత్ గట్టిగా అరచింది, “త్వరగా పిల్లలు . . . పరిగెత్తండి!” ఆ పిల్లలందరూ ఒక్కొక్క అడవిపిల్లిని ఎత్తికొని పరుగెత్తారు.
కొన్ని రోజులు అలానే ఉంటాయి, కాదా? మీరు వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించే వరకు మీకు సమస్యలు ఉన్నాయని మీరు అనుకుంటారు. మీరు పరిష్కరించాలనుకున్నప్పుడు, అవి పెరుగుచున్నవి.
యేసు మన మధ్య జీవించినప్పుడు అలాంటి ఒత్తిడి నుండి కాపాడబడలేదు. ఒకానొక సందర్భంలో పరిస్థితులు ఎంత వేగంగా జరిగాయంటే, ఆయన ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం లేదు. లూకా 4:31–44లో నమోదు చేయబడిన సంఘటనల గురించి నేను ఆలోచిస్తున్నాను. ఆయన అనుదినము సమాజమందిరంలో బోధించుచున్నాడు. ఆయన ప్రజల ప్రశ్నలకు సమాధానమిస్తూ, వారి విమర్శలను ఎదుర్కొంటూ, పరిసయ్యుల మరియు సద్దూకయ్యుల సూటిపోటి మాటలను యుక్తితో తప్పించుకోవడం, దయ్యములను వెళ్ళగొట్టడం, పెరిగిన ప్రజాదరణతో పాటు వచ్చే అన్ని సమస్యలతో జీవించడం, రోగులను స్వస్థపరచడం, చెడు శక్తులను ఎదుర్కోవడం. . . అంతా అక్కడే ఉంది. మీరే చూసుకోండి.
ఆయన ఏకాంత ప్రదేశానికి వెళ్లాలనుకున్నాడు గాని “జనసమూహము ఆయనను వెదకుచు” ఉన్న వారి కంటపడగా ఆయన “తమ్మును విడిచి పోకుండ ఆపజూచిరి” (లూకా 4:42). తప్పించుకునే అవకాశం లేదు. కనికరంలేని జనులు ఆయన శక్తిని పీల్చేస్తున్నారు.
చివరికి, లూకా సువార్త ఐదవ అధ్యాయం ప్రకారం, ఆయన ఏకాంతంగా ఉండటానికి ఒక స్థలాన్ని కనుగొన్నాడు-పూర్తిగా కాకపోయినా కొంచెం ఏకాంతం దొరికింది. ఆయన పడవలో అడుగుపెట్టి కూర్చున్నాడు. ఆయన కొంచెం ఊపిరి పీల్చుకున్న తర్వాత, ఆయన “దోనెలోనుండి జనసమూహములకు బోధించుచుండెను” (5:3). ఏమిటండీ ఈ మనిషి! ఆయన ఒత్తిడికి లోనైనప్పటికీ మరియు ఆయన శరీరం అలసిపోయినప్పటికీ, ఆయన పని చేస్తూనే ఉన్నాడు. మొత్తానికి, ఆయన పనులను ముగించగలిగాడు, కనీసం జనసమూహము విషయంలో ముగించాడు. కానీ యేసు శ్రద్ధ వహించడానికి అవసరమైన అసంపూర్ణమైన పని ఒకటి ఉంది. లూకా దానిని వివరించనివ్వండి.
ఆయన బోధించుట చాలించిన తరువాత–నీవు దోనెను లోతునకు నడిపించి, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా
సీమోను–ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమియు దొరకలేదు; అయినను నీ మాటచొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. (5:4-5)
పేతురు అయిష్టంగా ఉన్నందుకు ఎవరూ విమర్శించలేరు. అనుభవజ్ఞుడైన సీమోనుకు ఆ నీళ్ల గురించి తెలుసు. అలాగే, అతను రాత్రంతా ప్రయాసపడినను ఏమీ పట్టుకోలేదు. కష్టమైన పని, ఏమీ దొరకలేదు. సహజంగానే, ఆ వ్యక్తి ముఖమును చిట్లించుకొని ప్రతిఘటిస్తాడు. కానీ అతను తెలివిగా లోబడ్డాడు. అక్కడ అద్భుతము జరిగింది.
వారాలాగు చేసి విస్తారమైన చేపలు పెట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోనెలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి; వారు వచ్చి రెండు దోనెలు మునుగునట్లు నింపిరి. (5:6-7)
నాకు చేపలు పట్టడం చాలా ఇష్టం గనుక, ఆ దృశ్యం ఎంతో ఆహ్వానించదగినదిగా అనిపించింది. అంటే, రెండు దోనెలు మునిగిపోయేంత విస్తారమైన చేపలు పట్టారు. నా మొట్టమొదటి ఆలోచన ఏమిటో తెలుసా? “ఎంత గొప్ప పని చేసారు!” మీరు చనిపోబోతున్నట్లయితే, నడుము లోతు ఉన్న చేపల మధ్య చనిపోవడం కంటే మత్స్యకారుడికి ఏదైనా సంతృప్తికరంగా ఉంటుందా? నేను 30 నిమిషాల్లోపు మాతగోర్డా ద్వీపంలో 60, పెద్ద మచ్చల ట్రౌట్‌లను పట్టుకున్నాను. నేను అలాస్కాలో ఒక గంట కంటే కొంచెం ఎక్కువ వ్యవధిలో 30 కంటే ఎక్కువ బహుమతి పొందతగిన సాల్మన్లను పట్టుకున్నాను. సెంట్రల్ కెనడాలో ఉదయాన్నే నా పరిమితినిబట్టి వాలీ మరియు నార్తర్న్ పైక్‌లను నేను పట్టుకున్నాను, మయామి తీరంలో అసహ్యకర భారీ హామర్‌హెడ్ సొరచేపను, కౌవై ఉత్తర తీరంలో ఒక పసుపురంగు ట్యూనాను పట్టుకున్నాను . . . కానీ నేను ఎన్నడూ చేపలతో భారీగా నిండిపోయి మునిగిపోతున్న పడవలో లేను!
ఎందుకంటే నేను యేసుతో కలిసి ఎన్నడూ చేపలు పట్టలేదు. పరలోకం, భూమి, సముద్రం మరియు ఆకాశము యొక్క ప్రభువు ఆధిపత్యం కలిగియున్నప్పుడు, ఇలాంటివే జరుగుతాయి . . . ఇదే పేతురు శక్తివంతమైన ప్రతిస్పందనను వివరిస్తుంది:
సీమోను పేతురు అది చూచి, యేసు మోకాళ్లయెదుట సాగిలపడి ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలయనగా వారు పెట్టిన చేపల రాశికి అతడును అతనితోకూడనున్న వారందరును విస్మయమొందిరి. ఆలాగున సీమోనుతోకూడ పాలివారైన జెబెదయి కుమారులగు యాకోబును యోహానును (విస్మయమొందిరి). అందుకు యేసు–భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పెను. (5:8-10)
అసాధారణమైనది ఏదైనా గమనించారా? అంతకుముందు, పేతురు యేసును “ఏలినవాడా” అని పిలిచాడు. అద్భుతం తరువాత: “ప్రభువు.” తాను సజీవుడైన దేవునితో దోనెలో ఉన్నానని గ్రహించిన పేతురు, ప్రాచీన యెషయా వలె అతని మాటలు ఉన్నాయి, “అయ్యో!” యేసు మాటలు నాకు కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
అందుకు యేసు–భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పెను. (5:10)
అక్కడ వారిద్దరూ నిలబడి, తొడల లోతు చేపల మధ్య ఉన్నారు, అయితే యేసు “చేపలను పట్టుకోవడం” గురించి మాట్లాడుచున్నాడా? లేదు. చేపలు ఆయనకు చాలా చిన్న విషయం, వీటి సాదృశ్యం ద్వారా లోతైన సందేశాన్ని బోధించడానికి ఇవి ఒక దృష్టాంతం మాత్రమే. ఆయన హృదయంలో మనుషులను “పట్టుకోవడం” ఉంది. లోతైన విశ్వాసమే ఆయన అసలైన సందేశం. చేపలు పట్టేవారికి సందేశం అర్థమైందా?
వారు దోనెలను దరికిచేర్చి, సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. (5:11)
అద్భుతం, కదండీ? వారు ఆయన ఆహ్వానాన్ని విన్న తర్వాత, వారు నిజంగా ప్రతిదీ విడిచిపెట్టి పరుగెత్తారు. సమస్తమును గూర్చి ఆలోచించండి. వారి జీవితకాల వృత్తి. వారికి తెలిసిన పరిసరాలు. వారి స్వంత లక్ష్యాలు. వారి వలలు, దోనెలు మరియు వ్యాపారం. సమస్తము. ముక్కుసూటిగా చెప్పాలంటే, వారి ప్రతిస్పందనతో నేను ప్రభావితుడనయ్యాను. ఎందుకు అలా అని నేను ఎంతో ఆలోచించాను.
ప్రజలు సమస్తమును విడిచిపెట్టి యేసుక్రీస్తును వెంబడించడానికి సిద్ధంగా ఉండటానికి గల ఆరు కారణాలను సూచించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రతి కారణాన్ని ఒక సూత్రం లాగా పేర్కొనవచ్చు.
1. యేసు ఒంటరిగా ఇతరులకు సేవ చేయాలని అనుకోలేదు. ఆయన ఒంటరిగా సేవ చేయగలడు, అది మీరు గ్రహించండి. కానీ ఆయన కావాలని అలా చేయలేదు. ఆయన ఆ దోనెను స్వయంగా నడపగలడు. ఆయన అలా చేయలేదు (5:3). ఆయన ఆ వలలను ప్రక్కకు పడవేయగలడు. ఆయన అలా చేయలేదు (5:4). ఆయన ఖచ్చితంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న చేపలతో నిండిన వలలను లాగగలడు. ప్రతిగా, వారు లాగారు (5:6-7). అలాగే మీరు గమనించారా? ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నాడు, “ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువు” (5:10, ప్రాముఖ్యత జోడించబడింది).
2. నమ్మశక్యం కాని పని చేయడానికి యేసు సుపరిచితమైన వాటిని ఉపయోగిస్తాడు. ఆయన వారికి పరిచయమైన ప్రదేశానికి (సరస్సు) వచ్చాడు. ఆయన వారి పని ప్రదేశానికి (దోనెలు) చేరుకున్నాడు మరియు వారి నైపుణ్యాలను వారు ఉపయోగించునట్లు (వలలతో చేపలు పట్టడం) చేసాడు. అటువంటి సుపరిచితమైన నేపథ్యంలో, ఆయన వారికి అద్భుతమైన అవకాశాల గురించి అవగాహన కల్పించాడు.
3. యేసు కనిపించే సురక్షత నుండి కనిపించని ప్రమాదాల వరకు మనల్ని నడిపిస్తాడు. లోతులేని నీటిలో గణనీయంగా ఏమీ జరగలేదు. ఆయన ఎవరూ దిగువను తాకలేని “లోతునకు” (5:4) ప్రత్యేకంగా వారిని నడిపించాడు. వారు అక్కడకు వెళ్లిన తర్వాతగాని ఆయన “మీ వలలు వేయుడని” వారికి ఆజ్ఞాపించాడు (5:4). లోతు ఎల్లప్పుడూ అనిశ్చితులతో నిండి ఉంటుంది.
4. యేసు మన వలలను పిగిలింపజేయుట ద్వారా మరియు మన దోనెలను నింపడం ద్వారా సామర్థ్యాన్ని నిరూపించాడు. ఉప్పగా, అలసిపోయిన మత్స్యకారులలో ఒక్కరు కూడా ఆ సరస్సులో చాలా చేపలు ఉన్నాయని ఒక్క దేనారము కూడా పందెం వేసేవారు కాదు. వారు చేపలు పట్టడానికి ప్రయాసపడిన చోటునైతే ఖచ్చితంగా పందెం వేసేవారు కాదు! దేవుని చేయి ఒక పరిస్థితి మీద ఉన్నప్పుడు, వలలు పిగిలిపోతాయి, కళ్లు ఉబ్బిపోతాయి, ఓడ పైభాగం పలకలు మూలుగుతాయి మరియు పడవలు దాదాపు మునిగిపోతాయి. శక్తిని ప్రదర్శించడానికి ఇది ఆయన విధానం.
5. మనం ఆయన నడిపింపును అనుసరించే వరకు యేసు తన ఆశ్చర్యకార్యములను మరుగుపరచుతాడు. పైకి అంతా వ్యాపారం సాగుతున్నట్లుగా కనిపించుచున్నది. దోనెలకు కాంతి వలయం లేదు, వారి స్పర్శతో వలలు జలదరించలేదు, సరస్సు నీరు మెరవలేదు. ఇవేమీ జరుగలేదు. వారు వలలు పడవేసిన తర్వాతనే దైవికంగా ఏర్పాటు చేయబడిన ఆశ్చర్యం జరిగింది. గుర్తుంచుకోండి, అతను యేసు సూచనలను పాటించిన తర్వాతగాని పేతురు “ఏలినవాడా” నుండి “ప్రభువు” గా మార్చాడు (5:5, 8).
6. వారు ఆశ్రయించిన దానిని వదులుకున్న వారికే యేసు తన లక్ష్యాన్ని వెల్లడిస్తాడు. వారు సుముఖంగా ఉన్నారని ఆయన వారి ముఖాలను చూసి చదువగలిగాడు. అప్పుడు (అప్పుడు మాత్రమే) వారు “మనుషులను పట్టుకోవడంలో” నిమగ్నమై ఉంటారని ఆయన వారికి చెప్పాడు (5:10). అలాగే ఊహించండి-వారు అవకాశాన్ని ఆసక్తితో అందిపుచ్చుకున్నారు!
మీ జీవితం బాధ్యతలు, కార్యకలాపాలు, అవాంతరాలు మరియు తొందరపాటుతో నిండి ఉందా? మీ పనిలో . . . మీ స్వంత విజయాలలో మీ భద్రతను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారా? లోతులోనికి మానసిక పడవ ప్రయాణానికి ఇది సమయం కావచ్చు. మీరు మీ సమస్యను తీవ్రతరం చేయకుండా ఉండటానికి ఇది వినడానికి సమయం కావచ్చు. మరియు “నన్ను వెంబడించుడి” అని యేసు చెప్పినప్పుడు, ఆ పని చేయండి. ఈడిత్ పిల్లలలా కాకుండా, అన్నింటినీ వదిలివేసి, పరుగెత్తండి.
Copyright © 2010 by Insight for Living. All rights reserved worldwide.