అనంతమైన దేవుని చర్మాన్ని తాకడానికి ఆహ్వానం

ప్రసవము అనేది ఏ మనిషీ పూర్తిగా అభినందించలేడు. ఆ విషయంలో నిస్సహాయులము–మనము ఒక పరిశీలకునిగా ఆశ్చర్యపోవచ్చు–కానీ ఒక మహిళ అనుభవించినట్లుగా మనము దానిని అనుభవించలేము. నా భార్య నాతో ఇలా అంటుంది, “డాక్టర్‌గారు కర్ట్‌ను పట్టుకుని, బొడ్డును కత్తిరించి, ఆపై వాణ్ణి నా పొట్టమీద పెట్టినప్పుడు నాలో వచ్చిన అనుభూతిని నేను పూర్తిగా వర్ణించలేను. వాడు పడుకున్నప్పుడు, నేను వాణ్ణి చేరుకొని తాకి చూశాను మరియు ఇలా ఆలోచించాను, ఎంత అద్భుతమైనది! ఈ చిన్ని ప్రాణం మన నుండి వచ్చింది!”

ప్రసవం అనేదే ఒక అద్భుతం, కానీ సంవత్సరంలోని ఈ సమయమనేది పూర్తిగా కొత్త కోణాన్ని జోడిస్తుంది. చాలా కాలం క్రితం జంతువులు నిద్రపోయే నిశ్శబ్దమైన, అనాగరికమైన ప్రదేశంలో, మరియ ఆ శిశువును దగ్గరకు తీసుకొని ఆమె శరీరం నుండి ప్రాణాన్ని అనుభవించింది-ఆమె దగ్గరకు తీసుకొని అనంతమైన దేవుని మృదువైన, మానవ చర్మాన్ని అనుభవించింది.

మానవత్వపు దృశ్యం దగ్గరగా చూడటానికి మనల్ని సముచిత రీతిలో దగ్గరకు తీసుకువస్తుంది. యోసేపు యొక్క గందరగోళం, మరియ యొక్క ఆశ్చర్యం మరియు ఆదరించని ఇటువంటి ప్రపంచంలో దేవుని నిశ్శబ్ద రాక యొక్క విశిష్టతను మనం గుర్తించగలము. . . ఆ ఆలోచనలన్నీ ఆలోచించడానికి అద్భుతమైనవే. కానీ మనము అక్కడితో ఆగిపోలేము. ఇవి చాలా లోతైన, చాలా ముఖ్యమైన అద్భుతాలకు ప్రవేశం మాత్రమే. ఈ అందమైన కథ యొక్క మృదువైన, నవజాత చర్మం క్రింద, సృష్టి కంటే పురాతనమైన వేదాంత సత్యం యొక్క సారం ఉంది, ఎందుకంటే ఈ ప్రణాళిక సమయం ప్రారంభం కావటానికి చాలా కాలం క్రితమే స్థాపించబడింది.

మర్త్యరూపము–దేవుడు శరీరధారియై రావటం–క్రైస్తవులముగా మనం విశ్వసించే ప్రతిదానికీ పునాదియైన సిద్ధాంతమిది. చాలామంది సంప్రదాయవాద పండితులు ఆదికాండము 3:15 లో క్రీస్తు జననం యొక్క సూచనను సుస్పష్టముగా అర్థము చేసుకున్నారు. ఏదెనులో సర్పంతో మాట్లాడుతూ, దేవుడు ఇలా అన్నాడు:

“మరియు నీకును స్త్రీకిని
నీ సంతానమునకును ఆమె సంతానమునకును
వైరము కలుగజేసెదను.
అది నిన్ను తలమీద కొట్టును;
నీవు దానిని మడిమెమీద కొట్టుదువని చెప్పెను.”

చాలా కాలం తరువాత, దేవుడు మానవుడు కావడానికి శతాబ్దాల ముందు ప్రవక్తయైన యెషయా ఈ మాటలు వ్రాశాడు:

కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. (యెషయా 7:14)

దేవుని మానవరూపము యొక్క కథను చెప్పడంలో, శిష్యుడైన మత్తయి మనకు ఇలా చెప్పుచున్నాడు:

ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై –దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చు కొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మవలన కలిగినది; ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను.
ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును
ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు
అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. (మత్తయి 1:20-23)

మొదటి మానవుడు ఏదెను తోట‌లో తన అవిధేయతతో మానవాళి మొత్తాన్ని పాపంలోకి నెట్టినప్పుడు, చెడు మానవత్వం యొక్క రక్తప్రవాహంలోకి ప్రవేశించి, దానిలో నివసించే వారందరినీ కలుషితం చేసింది. మరియు మనలో ప్రతి ఒక్కరమూ మన పాపాన్ని అతనితో జోడించడం ద్వారా ఆదాము యొక్క విషాదకరమైన కోరికను ఆమోదించాము. ఫలితంగా ఊహించదగిన ప్రతి విధమైన వేదనకు ఈ లోకం లోబడిపోయింది: ఆకలి, దాహం, దుఃఖం, అలసట, శోధన, వ్యాధి, పక్షపాతం, వ్యాకులము . . . మరణమనే అంతిమ చెడుతో ముగియకపోతే ఈ జాబితా అంతులేనిది అవుతుంది.

చాలామంది దేవుని గూర్చిన ఆలోచనతో సంఘర్షణ చేస్తున్నారు ఎందుకంటే వారు “వేదన అనే కఠిన విషయము” నకు వ్యతిరేకంగా పోరాడుచున్నారు–మంచి దేవుడు చెడు కొనసాగడానికి ఎలా అనుమతించగలడు? ఆశ్చర్యకరమైన సమాధానం: ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించుచున్నాడు. ఆదాము కడుపులో నిషేధించబడిన చెట్టు ఫలము జీర్ణమవడానికి ముందు ఆయన అన్ని చెడులను అంతం చేసియుండగలడు. ఏ చెడునైతే దేవుడు అంతం చేసియుంటే బాగుండేదని అనుకుంటున్నామో దానిలో నీవు మరియు నేను ఉన్నామని మనం మర్చిపోకూడదు. మనపై అలాగే మన ప్రపంచంపై చెడును తీసుకువచ్చాము మరియు తీసుకురావడం కొనసాగించుచున్నాము, మరియు మనం ఆయన సృష్టిలో చేసిన వక్రీకృత గందరగోళానికి తగిన శాస్తి పొందడానికి ఆయన మనలను దండించడానికి ఆయన సంపూర్ణమైన యోగ్యత గలవాడు. కానీ . . . ఆయన మనల్ని ప్రేమించుచున్నాడు.

ఎంత దారుణమైన దుస్థితి. దేవుడు పాపాన్ని శిక్షించాలి. పాపం యొక్క శిక్ష శాశ్వతమైన మరణం. కానీ విధింపబడిన తీర్పును అమలు చేయడానికి, దేవుడు తాను ప్రేమించే మనుష్యులను కోల్పోతాడు. ఏవిధంగానైతే ఒక్క మానవుడు మానవాళినంతటినీ తిరుగుబాటులోకి నడిపించాడో, అదేవిధంగా మరొకరు మనలను దేవునితో సమాధానపరచాలి. కానీ ఎవరు? మనలో ఎవరు పాపం యొక్క శిక్షకు అర్హులు కాదు? మరియు ఒక పాపము లేని వ్యక్తిని కనుగొని, అతను మనకు ప్రాతినిధ్యం వహించేలా ప్రక్రియను తట్టుకుని ఉండగలిగి, మీరు మరియు నేను అర్హులైన మరణాన్ని మరణించే శక్తి ఏ వ్యక్తికి ఉంటుంది? ఎందుచేతనంటే, దేవునిగా కూడా ఉన్న మానవుడు మాత్రమే అలా చేయగలడు!

రెండువేల సంవత్సరాల క్రితం, “చెడు అనే సమస్య” ను తనదిగా చేసుకొని మానవాళి యొక్క వేదనతో కూడిన ఏడ్పుకు దేవుడు సమాధానమిచ్చాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు ఇమ్మానుయేలు అయ్యాడు, “దేవుడు మనకు తోడు.” ఆయన మనం జీవించినట్లుగా జీవించాడు, మనం బాధపడునట్లుగా బాధపడ్డాడు, మనం చనిపోవునట్లుగా చనిపోయాడు, అయిననూ పాపం లేకుండా ఉన్నాడు. అలాగే ఆయన, దైవ-మానవుడైయుండి, మనకు నిత్యజీవమును దయచేయుటకు మరణము యొక్క బలమును జయించాడు.

ప్రణాళిక పూర్తయింది. సిలువపై యేసు మాటలు గుర్తున్నాయా? “సమాప్తమైనది!” (యోహాను 19:30). లక్ష్యం (mission) నెరవేర్చబడింది. ప్రతిస్పందించడానికి తన సృష్టికి సమయాన్ని అనుమతించడం మినహా చేయడానికి దేవునికి ఏమీ మిగలలేదు. ఆయన ఓపికగా వేచి ఉన్నాడు . . . కానీ సమయం మించిపోతోంది. ఆయన ఎప్పటికీ వేచి ఉండడు. మీ స్వంత భౌతిక మరణం ద్వారా లేదా భూసంబంధమైన చరిత్రను ముగించడం ద్వారా ఆయన ఒకరోజున అవకాశం యొక్క తలుపును మూసివేస్తాడు.

మీరు మొదటి క్రిస్మస్ యొక్క మానవత్వాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు, నెమ్మదించి లోతుగా ఆలోచించడానికి ఇది ఆహ్వానమని గుర్తుంచుకోండి. మీ ఊహతో దైవ-మానవుని యొక్క శిశు చర్మాన్ని తాకమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. గొర్రెల కాపరులు ఆశ్చర్యపోయినట్లుగా ఆశ్చర్యపోవాలని మరియు జ్ఞానులు చేసినట్లుగా పూజించాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దైవ-మానవుడైన యేసు, మీ స్వంత “వేదన యొక్క సమస్య” ను తీసుకొని దానిని తనదిగా చేసుకోవడానికి ఆయనను అనుమతించాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరు నా ఆహ్వానాన్ని ఆమోదించగలిగితే, మీరు భూమిమీద గొప్ప క్రిస్మస్ బహుమానమును పొందుకుంటారు: చెప్పశక్యము కాని దేవుని వరము.

Taken from Charles R. Swindoll, “An Invitation to Touch the Skin of Infinite God,” Insights (December 2005): 1-2. Copyright © 2005, Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.

Posted in Jesus-Telugu, Theology-Telugu.

Pastor Charles R. Swindoll has devoted his life to the accurate, practical teaching and application of God’s Word. He is the founding pastor of Stonebriar Community Church in Frisco, Texas, but Chuck’s listening audience extends far beyond a local church body. As a leading programme in Christian broadcasting since 1979, Insight for Living airs around the world. Chuck’s leadership as president and now chancellor emeritus at Dallas Theological Seminary has helped prepare and equip a new generation of men and women for ministry.

పాస్టర్ చార్లెస్ ఆర్. స్విండాల్ దేవుని వాక్యాన్ని నిర్దిష్టంగా, ఆచరణాత్మకంగా బోధించడానికి మరియు అన్వయించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చి వ్యవస్థాపక కాపరియై ఉన్నారు, అయితే చక్ యొక్క శ్రోతలు స్థానిక సంఘ పరిధి దాటి వ్యాపించి ఉన్నారు. 1979 నుండి క్రైస్తవ ప్రసరణలో ప్రముఖ కార్యక్రమంగా, ఇన్‌సైట్ ఫర్ లివింగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసారమవుతోంది. డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ప్రెసిడెంటుగా, అలాగే ఇప్పుడు ఛాన్సిలర్ ఎమెరిటస్‌గా చక్ యొక్క నాయకత్వం క్రొత్త తరం స్త్రీపురుషులను పరిచర్య కొరకు సిద్ధపరచడంలో సహాయపడింది.