నేను పరిచర్యలో ఉన్నంత కాలం నేను మృదువైన హృదయానికి మరియు బలమైన స్వభావానికి మధ్య సమతుల్యత కోసం ప్రభువును వేడుకున్నాను. ఇది సులభముగా సమానీకరించలేనిది. వాస్తవానికి, రెండోది మొదటిదాని కంటే అలవరచుకోవడం చాలా కష్టం. పరిచర్యలో పూర్తిగా నిమగ్నమవ్వాలంటే, మొట్టమొదటి బాధ్యత ఏమిటంటే మృదువైన హృదయాన్ని కలిగి ఉండాలి. బలమైన స్వభావాన్ని అభివృద్ధి చేసుకోవటమే ఒక సవాలు.
పరిచర్యలో ఉన్నవారు ముఖ్యంగా నిందలు భరించువారిగా ఉంటారు; మనం విమర్శలకు పెద్ద లక్ష్యాలుగా ఉంటాము. నాకు తెలిసిన ప్రతి ఉద్వేగభరితమైన పాస్టరు, ప్రతి క్రైస్తవ నాయకుడు, ప్రతి క్రైస్తవ రచయిత వారికి వ్యతిరేకంగా చెప్పబడిన మరియు చేయబడిన అన్యాయమైన అనేక అపవాదములను విసుగుపుట్టించే పెద్ద జాబితాగా చేయవచ్చు. మీ సంగతి ఏమిటి? తీర్పు తీర్చే వ్యాఖ్యలతో, మిమ్మల్ని నిర్దక్షిణ్యముగా అవమానించినప్పుడు లేదా, ఘోరంగా, మీ వెనుక మీ గురించి క్రూరంగా మాట్లాడినప్పుడు మీరు ఎలా వ్యవహరిస్తారు? ఒక పొరుగువాడు మీ బైబిల్ సంబంధమైన పెంపకాన్ని ఎగతాళి చేసినప్పుడు, మీ చిన్న సమూహంలోని ఆ జంట మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రశ్నించినప్పుడు, మీ స్నేహితుడని భావించిన మీ తోటి క్రైస్తవుడు మీ గురించి పుకార్లు వ్యాప్తి చేస్తున్నాడని మీరు కనుగొన్నప్పుడు, మీరు ఎలా స్పందిస్తారు? మీరు బలముగా మరియు మృదువుగా ఉన్నారా లేదా మీరు పెళుసుగా మరియు కటువుగా ఉన్నారా?
కొంతమంది విమర్శలను చాలా చక్కగా ఎదుర్కొంటారు. కానీ దీనిని దయతో మరియు చిత్తశుద్ధితో ఎదుర్కొన్న ఒక వ్యక్తి ఉన్నాడని మనమందరం అంగీకరించాలి.
అపొస్తలుల కార్యములు 24 లో, పౌలు అధిపతియైన ఫేలిక్సు ముందు సాక్షి బోనులో ఉన్నాడు, అయితే తెర్తుల్లు అనే కపటముతో నిండిన న్యాయవాది కొన్ని కల్పితమైన ఆరోపణల ద్వారా తన అభిప్రాయాన్ని ధృవీకరించాడు. ఈ అధ్యాయాన్ని మీరు చదివినప్పుడు, నిజం నిర్ధారణ అయ్యే వరకు పౌలు వేచి ఉండి, ప్రశాంతంగా వాదించడానికి ముందుకు వచ్చాడు. విమర్శలను భరించేటప్పుడు మృదువైన హృదయాన్ని మరియు బలమైన స్వభావాన్ని ఏడు రకాలుగా కొనసాగించవచ్చని పౌలు మాటలు వివరిస్తున్నాయి.
మొదటిది: ఆరోపణల భావోద్వేగంలో చిక్కుకోవడానికి అతను నిరాకరించాడు. ఇది మనము సాధారణంగా చేసే మొదటి తప్పు. మనలోని ప్రతిదీ కొట్టడానికి, నిరసన తెలపడానికి, కేకలు వేయడానికి లేదా బయటికి వెళ్లిపోవడానికి ఇష్టపడుతుంది. పౌలు అతిగా స్పందించడానికి నిరాకరించాడు. అతని ప్రారంభ వాక్యం నిరాయుధంగా ఆహ్లాదకరంగా ఉంది, “నేను ధైర్యముతో సమాధానము చెప్పుకొనుచున్నాను.”
ధైర్యముతో? ఇప్పటికే ఈ మనిషి కోపంతో మండిపడాలి! “పీడవంటివాడని” మరియు మతవిధానమునకు నాయకుడిగా ముద్రవేయబడినప్పటికీ (అపొస్తలుల కార్యములు 24:5 చూడండి), తన వాదనను చెప్పుకోవటానికి యిచ్చిన అవకాశాన్ని పౌలు దయతో అంగీకరించాడు. తన భావోద్వేగాలు తనను నడిపించడానికి అతను నిరాకరించాడు.
నిందించువారి యొక్క అత్యధిక భావోద్వేగాలకు మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు, మన కోపం బయటపడుతుంది. అది సంభవించినప్పుడు, సూటిగా ఆలోచించడం అనేది అహేతుక ప్రతిస్పందనలకు మరియు దుడుకైన మాటలకు దారితీస్తుంది. పౌలు అంత దూరం వెళ్ళలేదు.
రెండవది: అతను వాస్తవాలకు కట్టుబడి ఉన్నాడు. అతను ఏమన్నాడంటే, “యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్లిననాటనుండి పండ్రెండు దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలిసికొన వచ్చును.” అతను ఇలా నివేదించాడు, “దేవాలయములోనేమి, సమాజమందిరములలోనేమి, పట్టణములోనేమి, నేను ఎవనితోను తర్కించుట యైనను, జనులను గుమికూర్చుటయైనను వారు చూడలేదు. మరియు వారు ఇప్పుడు నామీద మోపు నేరములను తమరికి ఋజువుపరచలేరు” (అపొస్తలుల కార్యములు 24:11-13).
అపొస్తలుడు ఎన్నడూ రెప్ప వేయలేదు. అతను మొండి పట్టుదల కలిగి వాస్తవాలతో తాను గట్టిగా నిలబడ్డాడు. ఆ వ్యూహం అతన్ని లక్ష్యం మీద చూపు నిలపడమే ఉంచడమే కాదు, అధిపతియైన ఫేలిక్సు దృష్టిలో అతని విశ్వసనీయతను పెంచింది.
మూడవది: అతను నిర్మలమైన మనస్సాక్షితో సత్యము చెప్పాడు. పౌలు ఇలా అన్నాడు, “నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరియెదుట ఒప్పుకొనుచున్నాను . . . దేవునియెడలను మనుష్యులయెడలను ఎల్లప్పుడు నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసికొనుచున్నాను” (అపొస్తలుల కార్యములు 24:14-16).
నిర్మలమైన మనస్సాక్షి లాంటిదేమీ లేదు. ఇది మీరు మంచిగా నిద్రపోవడంలో సహాయపడటమేకాక, స్పష్టంగా ఆలోచించేలా చేస్తుంది. దర్యాప్తు ప్రారంభమైనప్పుడు ఏదోయొక పీనుగ కోపము పుట్టిస్తుందనే భయం మీకు ఉండదు. . . ఎందుకంటే పీనుగ లేదు!
నాలుగవది: విమర్శ యొక్క అసలు మూలాన్ని అతను గుర్తించాడు. మీరు విమర్శలతో వ్యవహరించేటప్పుడు ఎవరు విమర్శస్తున్నారో తెలియకపోవటం చాలా భయంకరంగా ఉంటుంది. మీరు చేయగలిగే ఘోరమైన పనులలో ఒకటి ఏమిటంటే-అసలు వివాదానికి మూలమేమిటో దాన్ని పరిష్కరించకుండా-మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, మీ స్నేహితులు లేదా ఇతర క్రైస్తవుల సమూహానికి విషాన్ని వ్యాప్తి చేయడం. దీనిని తట్టుకోవడానికి మీకు బలమైన స్వభావం అవసరం.
ఐదవది: అతను లొంగిపోడు లేదా విడిచిపెట్టడు. పౌలు విషయంలో నాకది చాలా ఇష్టం. అతను మీ చీలమండను కొరికే పిట్ బుల్ లాగా ఉంటాడు; అతను వదలడు! ఒకసారి 2 కొరింథీయులకు 11:23-33 చదవండి. దెబ్బలు తిన్నాడు, రక్తము కారునట్లుగా కొట్టబడ్డాడు, ఓడ పగిలి శ్రమపడ్డాడు, వేధించబడ్డాడు, ఆపదలలో పడ్డాడు, పట్టణంలోనుండి పారిపోయాడు, మరియు తప్పుడు ఆరోపణలు వేయబడ్డాయి, అయినను పౌలు వదల్లేదు, విరమించలేదు లేదా నోరుమూసుకోలేదు.
ఆరవది: అతను అసహనంగాను లేదా కటువుగాను మారలేదు. రెండేళ్లుగా పౌలు ఈ విచారణ కోసం ఎదురు చూస్తున్నాడు. మీకు అది తెలుసా? అయినను మనకు యెటువంటి వైరము యొక్క సంకేతాలు కనిపించవు. అసహనం లేదు. పగ లేదు. రోమా అధికారులపై విరుచుకుపడటం లేదు. ప్రజలు మరియు సంఘటనల మీద దేవుడు గట్టిగా నియంత్రణ కలిగి ఉన్నాడని పౌలు నమ్మాడు.
ఏడవది: అతను దేవుని వాగ్దానం మీద నిలబడ్డాడు. అపొస్తలుల కార్యములు 24 లోని ఈ భాగాన్ని చదివినప్పుడు నా మనసులో ఏమి వెలిగిందో మీకు తెలుసా? నేను సంఘములో చిన్నప్పటినుండి సండే స్కూల్లో పాడిన పాట.
విఫలం కాని వాగ్దానాలపై నిలబడి,
సందేహం మరియు భయం యొక్క తుఫానులు దాడి చేసినప్పుడు,
దేవుని సజీవ వాక్యము ద్వారా నేను విజయం సాధిస్తాను,
దేవుని వాగ్దానాలపై నిలబడతాను. . . .ప్రభువైన క్రీస్తు వాగ్దానాలపై నిలబడి
ప్రేమ యొక్క బలమైన త్రాడు ద్వారా శాశ్వతంగా అతనికి కట్టుబడి ఉండి,
ప్రతిరోజూ ఆత్మ ఖడ్గముతో అధిగమిస్తూ,
దేవుని వాగ్దానాలపై నిలబడతాను.1
పరిశుద్ధ గ్రంథములో 7,000 పైగా వాగ్దానాలు ఉన్నాయని ఎవరో చెప్పారు. గడచిన వారంలో మీరు ఒకదాన్నైనా హక్కుగా పొందుకున్నారా? రెండు? ఐదు పొందుకున్నట్లు నేను వింటానా?
పౌలు విమర్శలను ఎలా ఎదుర్కొన్నాడు? ఆరోపణల భావోద్వేగంలో చిక్కుకోవడానికి అతను నిరాకరించాడు. అతను వాస్తవాలకు కట్టుబడి ఉన్నాడు. అతను నిర్మలమైన మనస్సాక్షితో సత్యము చెప్పాడు. విమర్శ యొక్క అసలు మూలాన్ని అతను గుర్తించాడు. అతను లొంగిపోవడానికి లేదా విడిచిపెట్టడానికి ఒప్పుకోలేదు. అతను అసహనంగాను లేదా కటువుగాను మారలేదు. అతను దేవుని వాగ్దానం మీద నిలబడ్డాడు. అది గొప్ప కాకపోతే మరేమిటి? అంతేకాదు ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నవి. ఆ ఏడింటిలో ప్రతిదాన్ని మీరు ఆచరించవచ్చు. విమర్శలను భరించేటప్పుడు మీరు మృదువైన హృదయం మరియు బలమైన స్వభావం కావాలనుకుంటే, మీరు వాటిని తప్పక ఆచరించాలి. నేను కూడా తప్పక ఆచరించాలి.
- R. Kelso Carter, “Standing on the Promises”, in The Celebration Hymnal (Word Music/Integrity Music, 1997), no. 410.
Taken from Charles R. Swindoll, “Cultivating a Tender Heart and a Tough Hide,” Insights (July 2003): 1-2. Copyright © 2003, Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.