మార్కు సువార్తను చదువుచున్నప్పుడు నేను తరచుగా నవ్వుతాను. వెంటనే అనే పదాన్ని అతడు ఇష్టపడ్డాడు. ఇది మళ్లీ మళ్లీ కనిపిస్తుంది. యేసు యొక్క జీవితం మీరు నేను ఎన్నడూ యెరుగని ఒత్తిడితో మరియు జనులతో నిండిపోయిందని మార్కు మనకు గుర్తు చేస్తున్నాడు. కానీ అతను ఇంకొకటి కూడా పొందుపరచాడు, “ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను” (మార్కు 1:35).
ఆయన ఎందుకు అలా చేశాడు? ఆయన తెల్లవారుజాము ఇష్టపడే వ్యక్తియా? కానవసరం లేదు. ఆయన ఒంటరిగా ఉండగలిగే ఏకైక సమయం ఉదయం మాత్రమే. తరువాతి వచనాల్లో వారు ఆయన కోసం వెతికారని మరియు వారు ఆయనను కనుగొన్నప్పుడు, “అందరు నిన్ను వెదకుచున్నారు” అని చెప్పారు (1:36-37).
ఒక భావానువాదం ఇలా అర్థమిస్తున్నది “యేసూ, నీయంతట నీవు ఇక్కడ ఇలా ఉంటే కుదరదు. అయ్యా, మీ అవసరం అక్కడ ఉంది!” కానీ విషయాలను క్రమముగా యేర్పరచుటకు యేసు తన తండ్రితో ఆ ఉదయాన్నే మాట్లాడే ఏకాంతము కావాలి-మరియు నా స్నేహితులారా, అలాగే మనకు కూడా కావాలి.
ఏకాంతము మనకు మంచిది. మన సహజ ధోరణి ఏమిటంటే మన చుట్టూ ఎల్లప్పుడూ మనుషులను కలిగి ఉండటం, ఎల్లప్పుడూ ఏదోయొకటి జరుగుతూ ఉండటం, కానీ నన్ను నిక్కచ్చిగా చెప్పనివ్వండి: నేను గుంపులో ఎన్నడూ అంత ముఖ్యమైనది ఏమీ నేర్చుకోలేదు. నేను ప్రజలతో ఉండటానికి ఇష్టపడతాను, కానీ ఏకాంతము అవసరమైన వాటిని క్రమముగా యేర్పరచడానికి మరియు అనవసరమైన వాటిని జల్లెడ పట్టడానికి సహాయపడుతుంది. ఏకాంతములోనే జీవితం ఒక నిర్ణయానికి వస్తుంది.
నిజం చెప్పాలంటే, మీలో కొందరు ఓటమి అంచున నివసిస్తున్నారు, ఎందుకంటే మీరు వ్యక్తులు, డిమాండ్లు, అంచనాలు, తమపై దృష్టి పెట్టాలని పిల్లలు మిమ్మల్ని అడగటం, స్నేహితులు, షెడ్యూల్‌లు మరియు ప్రణాళికలతో నిరంతరం వ్యవహరిస్తారు. చివరిసారిగా మీరు ఒంటరిగా గడిపిన సమయం మీకు గుర్తుండకపోవచ్చు. . . . నేనేమి మాట్లాడుచున్నానో నాకు తెలుసు.
కొన్నిసార్లు ఇది నాకు మోటార్‌సైకిల్ ప్రయాణం. కొన్నిసార్లు ఇది సుదీర్ఘ నడక. కానీ నేను మీకు చెబుతున్నాను కదా, ఇది జరిగిన ప్రతిసారీ, అది ఆలోచనాపూర్వకంగానే ఉంటుంది. “మీరు కొంతసమయం ఏకాంతముగా గడపాలి” అని ఎవరూ నాతో ఎప్పుడూ చెప్పలేదు. లేదు, ఇది మనమందరం తీసుకోవాల్సిన నిర్ణయం.
మీలో కొందరు “నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఏమి చేయాలి?” అని ఆశ్చర్యపోతున్నట్లు నేను వినగలను.
ఏకాంతములో నా సమయాన్ని ఉత్తమంగా ఉపయోగించుకోవటమంటే ఒక దినచర్య పుస్తకమును వ్రాసుకోవటమని నేను కనుగొన్నాను. వెబ్‌స్టర్స్ ఈ దినచర్య పుస్తకమును “వ్యక్తిగత ఉపయోగం కోసం క్రమం తప్పకుండా పొందుపరిచే అనుభవాలు, ఆలోచనలు లేదా ప్రతిబింబాల గ్రంథము”1 గా నిర్వచిస్తుంది. మీరు కూడా ఒకదాన్ని ఉంచుకోవడాన్ని పరిగణించాలని నేను కోరుకుంటున్నాను. మీ ఏకాంతములో మీరు పొందే ఉత్తమమైన వాటిని కోల్పోకుండా ఇది మిమ్మల్ని నిలుపుతుందని మీరు కనుగొంటారు మరియు అది మిమ్మల్ని దేవుని హృదయానికి దగ్గర చేస్తుంది.
మీరు నాకు ఈ చివరి ఆలోచనను చెప్పే అనుమతిని ఇస్తే: మీ జీవితంలో ఏకాంత సమయమును గడపాలని ఉద్దేశపూర్వకంగా నిర్ణయం తీసుకోవడం వలన మీరు దేవునికి రుణపడి ఉంటారు, మీకు మీరే రుణపడి ఉంటారు, మరియు మీరు ఎక్కువగా ఇష్టపడే వారికి మీరు రుణపడి ఉంటారు. ఇది మీ షెడ్యూల్‌లో సర్దుబాటు చేసుకుంటే సరిపోతుంది, కానీ ఇది మీ జీవితంలో అర్థవంతమైన మార్పును కలిగిస్తుంది.
- Merriam-Webster’s Collegiate Dictionary, 10th ed. (Springfield, Mass.: Merriam-Webster, 1999), see “Journal.”
Taken from Charles R. Swindoll, “Solitude: A Vital Factor in Growing Closer to God,” Insights (January 2000): 1-2.
Copyright © 2000 by Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.