సంఖ్యాకాండము 27:12-23 వరకు చదవండి.
మోషే ఒక వ్యక్తి కొరకు అడుగుచున్నాడు, “యెహోవా సమాజము కాపరిలేని గొఱ్ఱెలవలె ఉండకుండునట్లు ఈ సమాజముమీద ఒకని నియమించుము. అతడు వారి యెదుట వచ్చుచు, పోవుచునుండి, వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై యుండవలెను” (సంఖ్యాకాండము 27:17). మరో మాటలో చెప్పాలంటే, “ప్రభువా, ప్రజలకు సేవ చేయడానికి ముందు అతను ప్రజలతో సన్నిహితంగా ఉండాలని గ్రహించే వ్యక్తి మాకు కావాలి. అతను ప్రజల మనిషిగా ఉండాలి.”
మోషే ఏమంటున్నాడంటే, “ఈ వ్యక్తులకు గూఢమతవాది అవసరం లేదు. పరిశోధన ఎంత ముఖ్యమైనప్పటికీ, తన పరిశోధన పట్ల ప్రేమతో నిమగ్నమైయున్న వ్యక్తి వారికి అవసరం లేదు. ఈ వ్యక్తులకు నిజంగా ఉత్తమ-సమర్థవంతమైన CEO లేదా అద్భుతమైన సంస్థాగత మేధావి అవసరం లేదు. వారికి ఒక కాపరి కావాలి. ప్రజలను ఎరిగిన, ప్రజలకు సేవ చేసే, ప్రజలను అర్థం చేసుకునే, మరియు ప్రజలను ఎలా నడిపించాలో తెలిసిన వ్యక్తి వారికి కావాలి.”
మీరు ఎంత మోతాదులో పరిచర్య చేసినా-బైబిల్ టీచర్‌గా, పరిచర్యకు సిద్ధమవుతున్న విద్యార్థిగా, మీకివ్వబడిన తలాంతుతో పరిచర్య చేస్తున్న దైవజనురాలిగా–మీరు ప్రధానంగా ప్రజలకు పరిచర్య చేయాలి, కాగితాలను తిరగవేయటం కాదు, సంఖ్యాపరంగా చూడటం కాదు, ఫోన్ కాల్‌లు చేయడం కాదు, లేఖలు రాయడం కాదు, ప్రోగ్రామ్‌లు ప్లాన్ చేయడం లేదా తరువాతి దశాబ్దం కొరకు వ్యూహాలను రచించడం కాదు. వాస్తవానికి, ఆ పనులన్నీ తప్పనిసరిగా చేయాలి. నేను వారానికి సగటున నలభై నుండి యాభై ఉత్తరాల వరకు సంతకం చేయాలి మరియు/లేదా వ్రాయాలి మరియు ప్రణాళికా సెషన్‌లలో కూడా పాల్గొనాలి. పరిపాలనా వివరాలను నిర్వహించడం అవసరం. (ఎంత తక్కువైతే అంత సంతృప్తికరముగా నిర్వహించగలను!)
మా సంఘానికి రావడం ప్రారంభించిన వ్యక్తుల నుండి నేను వినే అత్యంత సాధారణ విషయం మీకు తెలుసా? మాలో కొంతమంది సిబ్బంది గురించి తెలుసుకోవాలని వారు ఎంతో కోరుకుంటారు, అందుకు వారు ఈలాగు అంటారు, “నేను మీకు తెలియదు, కానీ మీరు బోధించడం వినడానికి నేను ఆదివారం వస్తున్నాను.” అలాగే “హే, మీ సమయం తీసుకున్నందుకు నన్ను క్షమించండి, కానీ నేను మీతో కరచాలనం చేయాలనుకుంటున్నాను” అని చెప్పి, అలా చెప్పినందుకు వారు దాదాపు క్షమాపణలు కోరుకుంటారు. నేను ప్రతిఒక్కరికీ ఈ క్రింది విధంగా చెప్పడానికి నా వంతు కృషి నేను చేస్తున్నాను, “అందరిలాగే మీరు కూడా ఈ సంఘమంతటిలో ముఖ్యమైనవారు. దేవుని కుటుంబంలో ప్రాముఖ్యతలేనివారు లేరు.” సమాజముతో మంచి సంబంధం కలిగియున్నానని తెలియజేసే ప్రకటన చేయడానికో లేదా మంచి అభిప్రాయం పొందడానికో నేనిది చెప్పడం లేదు. అది నిజం గనుక-నేను నమ్ముచున్నాను కాబట్టి చెప్పుచున్నాను. మీరు ఎవరైనా, మీరు ఏమి చేసినా, మిమ్మల్ని ఏర్పరచుకున్న దేవుని యెదుట మీరు ప్రత్యేకమైనవారు.