చక్ స్విన్‌డోల్ ఇటీవల అమెరికాలోని టేనస్సీలోని బ్రెంట్‌వుడ్‌లోని ఫెలోషిప్ బైబిల్ చర్చి పాస్టర్ మైఖేల్ ఈస్లీతో కలిసి ప్రభువు పట్ల, దేవుని వాక్యము పట్ల, మరియు దేవుని అద్భుతమైన కృప పట్ల వారికున్న పరస్పర ప్రేమను గురించి చర్చించడానికి కూర్చున్నారు. ఇక్కడ, చక్ తన వ్యక్తిగత “కృప యొక్క మేల్కొలుపు” గురించి, అలాగే దేవుని యొక్క సర్వసమృద్ధిగల కృప అతన్ని ఎలా తనను తానుగా ఉండటానికి అనుమతిస్తుందని పంచుకున్నాడు.
మైఖేల్: కాబట్టి చక్ స్విన్డాల్ యొక్క లోతుల నుండి ఏదైనా బయటకు వస్తే, అది ఈ కృప యొక్క సందేశమై ఉంటుంది. నా ఉద్దేశ్యం, ఇది మీ ప్రతి అణువులోనుండి బయటకు వస్తుంది. మీ నవ్వు, మీ ఆత్మవిశ్వాసం కలిగించే హాస్యం మరియు మీరు బోధించేటప్పుడు మీ తలను వెనక్కి విసిరే విధానం. ఇది మనోహరమైనది. ఇతరులు ఏమీ చేయలేక ఆలోచిస్తూ ఉండిపోతారు . . . నేను కూడా ఈ వ్యక్తిలాగే జీవితాన్ని ప్రేమిస్తే ఎంత బాగుండు అని అనుకుంటారు. నాకు అంతటి ఆనందం ఉంటే బాగుండునని నేను కూడా అనుకుంటున్నాను. మాకు సహయం చేయండి. దాని సంగతి ఏమిటి అసలు?
చక్: నేను మీకు ఒక్క మాటలో చెబుతాను; ఇది స్వాతంత్ర్యము. నేను స్వేచ్ఛగా ఉన్నాను. నేను నిజంగా స్వేచ్ఛగా ఉన్నాను.
మైఖేల్: మీ జీవితంలో ఒక నిర్ణయాత్మక క్షణం ఉందా? మీరు కృప యొక్క స్వాతంత్ర్యమును రుచి చూడటం ప్రారంభించినప్పుడు ఎలా ఉండేది?
చక్: సరే, నేను దాని గురించి సేయింగ్ ఇట్ వెల్ అనే నా పుస్తకంలో వ్రాసాను. నేను ఎవరో తెలుసుకున్నాను. నన్ను నేనుగా అంగీకరించాను. నేను దాని గురించి ప్రతిదీ ఇష్టపడలేదు, కాని ఈ చర్మం లోపల దేవుడు చేసిన వ్యక్తిని నేను అంగీకరించాను. ఆపై నేను ఏమైయున్నానో అలా ఉండటం నేను ప్రారంభించాను.
అయితే, ఇది మొదట ఈ విధంగా లేదు. ప్రారంభ రోజుల్లో, నేను పుల్పిట్లో నిలబడినప్పుడు నేను కఠినముగా ఉండేవాడిని. నేను చాలా మందలించేవాడిని. మనము దీన్ని ఎలాగైనా సరిచేయాలనే భావనతో ఉండేవాడిని. ఇవి బైబిల్ సూత్రాలు, మరియు మీకు తెలుసా, నిత్యత్వం ప్రమాదంలో ఉంది. ఒక రోజు సింథియా ఇలా అన్నది, “మనందరికీ ఆ విషయాలు తెలుసు, కాని మనం నీతికి ఆకర్షించబడాలి”, ఇది రీన్హోల్డ్ నీబుర్ తన రచనలలో ఉపయోగించిన పంక్తి.
మైఖేల్: కాబట్టి “నేను ఎవరో అర్థం చేసుకోవడం” గురించి వినేవారు ఉంటారు, అదేదో మానసిక నిపుణుల గుంపుకు సంబంధించిన మాటల్లాగా అనిపిస్తుంది. కాబట్టి కృప అనేది మనం మానవులం అనే విషయాన్ని కప్పిపుచ్చి చెడు కోరికలు తీర్చుకోవడం కాదని- కాని పడిపోయిన సందర్భంలో కూడా దేవుడు మనలను రూపొందించిన విధానాన్ని అంగీకరించడం అని అర్థం చేసుకోవడానికి ప్రజలకు మనం ఎలా సహాయం చేస్తాము?
చక్: సరే, లోపాలున్ననూ నేను ఉన్నట్లుగా నన్ను అంగికరించడంలో, “ఇదంతా నా గురించే” అనే దృష్టి కలిగియుండటంలో తేడా ఉంది. ఇది స్వానురక్తి. జీవితం దాని గురించే కాదు. నువ్వు ఎలా ఉన్నావో అలా దేవుడు నిన్ను సృష్టించాడని స్వాతంత్ర్యము చెబుతుంది. ఇందులో బలహీనతలు మరియు బలాలు ఉన్నాయనే వాస్తవాన్ని దాచడానికి ప్రయత్నించవద్దు. చూడండి, నాకు బలహీనతలు ఉన్నాయని ఖండించినట్లే . . . నాకు బలాలు ఉన్నాయని తిరస్కరించడం హాస్యాస్పదంగా ఉంటుంది. ఎక్కడో ఒకచోట సమతుల్యత ఉంది. వ్యత్యాసమును తెలుసుకునే స్వాతంత్ర్యమును కృప నాకు అనుమతిస్తుంది.
మైఖేల్: అవును, కృప అంటే మనం చేసే పని గురించి కాదు గాని మనం ఎవరో అంగీకరించడం. ఇది జాబితాలకు అనుగుణంగా ఉండటం లేదా పరిపూర్ణంగా ఉండటం గురించి కాదు. “నువ్వు చేసేదేదైనా సరే,” ప్రొఫెసర్ హోవార్డ్ హెండ్రిక్స్ చెప్పినట్లు, “దేవుడు నిన్ను ఎక్కువగా ప్రేమించునట్లు చేయలేదు. నువ్వు చేసేదేదైనా ఆయన నిన్ను తక్కువగా ప్రేమించునట్లు చేయలేదు.” విఫలమయ్యే స్వాతంత్ర్యమును దేవుడు మనకు ఇచ్చాడు, అయిననూ ఇంకా ప్రేమించబడుచున్నాము. అయితే నీతి కొరకు మనం ఇంకా పాటుపడాలి.
చక్: ఓహ్ ఖచ్చితంగా. వినండి, నేను క్రీస్తులో నా స్వాతంత్ర్యమును ఆనందంగా-అతిశయంతో స్వీకరించాను. నేను వాస్తవ ప్రపంచంతో నిరంతరం వ్యవహరిస్తున్నాను. “తడి పెయింట్‌ను తాకవద్దు” అని చెప్పే సంకేతాన్ని చూసినప్పుడు ఇతరులు ఎదుర్కొనే పోరాటాన్నే నేను కూడా ఎదుర్కొంటున్నాను. నేను కూడా దానిని తాకాలని అనుకుంటున్నాను. నాకు నియమాలు ఇవ్వబడినప్పుడు, నేను వాటిని ఎల్లప్పుడూ పాటించడానికి ఇష్టపడను.
అలాగైతే కృపను పాడుచేసినట్లే. ఆ నియమం నాకు వర్తించదని . . . నేను ఆలోచించడం మొదలుపెడితే. నేను నియమాలు మరియు జాబితాల నుండి విడుదల పొందానని అంటే, అది స్వాతంత్ర్యము కాదు. ఇది మరొక రకమైన బానిసత్వము; ఇది ఒక రకమైన స్వీయ-నిర్మిత బానిసత్వము, ఇక్కడ నేను కృపను వక్రీకరించి దానిని కృప అని పిలుస్తాను, వాస్తవానికి అది అవిధేయత. దేవుడు మనకు ఇచ్చే జాబితా మనుష్యులకు కనబడాలని చేయటానికి కాదు. ఆ జాబితా మనం విధేయత చూపడానికి ఇచ్చాడు. ఇంకా, ఇది మన మంచికి మరియు ఆయన కీర్తి కోసమే ఇవ్వబడింది. మరియు మీరు కృపను స్వీకరించినప్పుడు, మీరు దాని గురించి శ్రద్ధ వహిస్తారని నేను అనుకుంటున్నాను. మీరు పాటించాలనుకుంటున్నారు. మీకు తెలుసా, నేను నమ్మకంగా లేకపోతే ఆమె నన్ను పట్టుకుంటుందేమోనని నేను సింథియాకు నమ్మకంగా ఉండటంలేదు. నేను ఆమెను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ఆమెకు నమ్మకంగా ఉంటున్నాను. నేను ఆమెకు నమ్మకంగా ఉండి తీరాలి.
మైఖేల్: మీకు తెలుసా…”అర్హమైన ఉగ్రతకు బదులు అనర్హమైన కరుణే” కృప యొక్క నిర్వచనంగా నేను స్వీకరించాను. “నేను కృప పొందుతున్నాను,” అని మాత్రమేగాక “నేను నరకానికి అర్హుడిని. నేను దేవుని ఉగ్రతకు అర్హుడిని, కాని ఆయన దయచొప్పున, ఆయన కృపను నా పట్ల విస్తరింపజేసాడు,” అని పరిగణించుట వలన ఇది ప్రజలకు సహాయపడుతుందని నేను భావిస్తున్నాను.
చక్: అద్భుతం. అదే మన రక్షకుణ్ణి మన పూర్ణహృదయములతో అనుసరించాలని, విధేయత చూపాలని కోరుకుంటుంది. నేను కృపను గురించి ఆలోచించకుండా మరియు దాని విషయమై కృతజ్ఞతలు చెప్పకుండా నా జీవితంలో ఒక రోజుగాని, రెండు రోజులుగాని గడుస్తాయని నేను నమ్మను. స్వాతంత్ర్యము-నిజంగా జీవించుటకు ఇదే ఏకైక మార్గము.
Copyright © 2013 by Insight for Living. All rights reserved worldwide.