కృప అంటే చాలామంది చాలా రకాలుగా అర్థం చేసుకుంటారు. బ్యాలే నర్తకికి హొయలున్నట్లు (కృప) మనం పరిగణిస్తాము. భోజనానికి ముందు మనం ప్రార్థన (కృప) చేస్తాము. ఆమె హాజరయ్యే కార్యక్రమాలకు ఇంగ్లాండ్ రాణి అందం (కృప) తీసుకురావటాన్ని గురించి మనం మాట్లాడతాము. కృప అంటే కదలికల యొక్క సమన్వయం కావచ్చు, ఇది ప్రార్థన అని అర్థమిస్తుంది, ఇది గౌరవం మరియు చక్కదనాన్ని సూచిస్తుంది. చాలా ముఖ్యమైనదేమంటే, కృప అంటే అర్హతలేని కరుణను పొందుకోవటం. ఎవరైతే అనర్హులో, ఎవరైతే సంపాదించుకోలేదో, మరియు ఎప్పటికీ తిరిగి చెల్లించలేరో, అటువంటివారి పట్ల విస్తరింపజేసే ప్రత్యేకమైన ఉపకారమునే కృప అంటాము. అప్పుడప్పుడు లేఖనంలో మనకొక సన్నివేశము తారసపడుతుంది. అక్కడ ఆ రకమైన కృప యొక్క అందమైన దృష్టాంతాన్ని మనం చూస్తాము మరియు అలాంటి అద్భుతమైన కృపను చూసి మనము ఆశ్చర్యపోతాము.
దావీదు రాజు జీవితంలో ఆ క్షణాలలో ఒకదాన్ని మనం కనుగొంటాము. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం, పాత నిబంధనంతటిలో కృప యొక్క గొప్ప ఉదాహరణ. ఇది దాదాపుగా పలకడానికి కష్టమైన పేరుతో ఉన్న ఒక అప్రసిద్ధ మనిషిని కలిగి ఉంటుంది. మెఫీబోషెతు. ఇది అందమైన, మరపురాని కథ.
ఇశ్రాయేలుపై రాజుగా తన పాలన ప్రారంభమయ్యే ముందు, దావీదు తన ముందుండిన వానికి వాగ్దానం చేశాడు. అధికారంలోకి వచ్చాక సౌలు వారసులను నాశనం చేయనని దావీదు ప్రమాణం చేశాడు (1 సమూయేలు 24:20–22). దావీదు తన శక్తిని పదిలం చేసుకున్నప్పుడు మరియు దేశములో శాంతి నెలకొన్నప్పుడు, తన మొదటి పనుల్లో ఒకటి ఏమంటే సౌలు వారసుల గురించి ఆరా తీయడం. సాధారణంగా, పురాతన రాజులు మునుపటి పాలన నుండి వారసులను చంపడానికి మరియు ఆ కుటుంబం తిరిగి అధికారంలోకి రాకుండా ఉండటానికి ప్రయత్నించేవారు. అయితే, ఉపకారము చేయడానికి సౌలు వంశస్థుడిని వెదకినట్లు దావీదు స్పష్టం చేశాడు (2 సమూయేలు 9:1).
సౌలు యొక్క మాజీ సేవకులలో ఒకరు ఆ పిలుపుకు సమాధానం ఇచ్చి, “కుంటికాళ్ళు” గల యోనాతాను కుమారుని గురించి దావీదు రాజుకు సమాచారం ఇచ్చాడు. దావీదు ప్రతిస్పందన అద్భుతంగా ఉంది. అతను వెంటనే, “అతడెక్కడ ఉన్నాడు?” అని అడిగాడు. “అతడు ఎంత ఘోరమైన వికలాంగుడు?” అని అడుగలేదు. అతను ఆ స్థితిలోనికి ఎలా వచ్చాడు అని కూడా అడగలేదు. “ఆ మనిషి ఎక్కడ ఉన్నాడు?” అని మాత్రమే దావీదు అడిగాడు.
కృప అంటే అలాగే ఉంటుంది. జాగ్రత్తగా ఎంపిక చేసుకునేది కాదు కృప. ప్రేమకు అర్హమైన పనులను చేసిన విషయముల కొరకు కృప చూడదు. ఒక వ్యక్తి యొక్క ప్రతిస్పందన లేదా సామర్థ్యమునకు వేరుగా పనిచేస్తుంది. కృప ఏకపక్షముగా ఉంటుంది. అర్హతలేని మరియు ఎప్పటికీ సంపాదించలేని మరియు తిరిగి చెల్లించలేని వ్యక్తికి దేవుడు తనను తాను సమర్పించుకొని ఆ వ్యక్తిని పూర్తిగా అంగీకరించటమే కృప. ఇదే దావీదు మరియు మెఫీబోషెతు యొక్క కథను బాగా గుర్తుండిపోయేలా చేస్తుంది. దావీదు ఏమైయున్నాడో అవేమీ లేని వాటిని సూచించే వ్యక్తి కొరకు ఒక బలమైన మరియు ప్రసిద్ధ రాజు దిగివచ్చి అతనికి సహాయం చేశాడు!
మెఫీబోషెతు అజ్ఞాతంలో ఉండటం ఆశ్చర్యపడవలసిన విషయమేమీ కాదు. పూర్వ పాలన యొక్క వారసులను వెతకటం మరియు చంపడం చేసే మిగతా రాజులలాగే దావీదు ఉంటాడని అతడు భయపడ్డాడు. మెఫీబోషెతు చూడాలనుకున్న చివరి విషయం ఏమిటంటే, రాజు దగ్గర నుండి ఒక దూత వచ్చి తన తలుపు మీద తట్టడం. కానీ అదే జరిగింది.
ఆ మనిషి యొక్క విస్మయాన్ని మీరు ఊహించగలరా? తలుపు తట్టినందుకు సమాధానం ఇచ్చిన తరువాత, మెఫీబోషెతు దావీదు సైనికుల ముఖాలను చూశాడు, వారు, “రాజు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు” అని చెప్పారు. బాగుంది, ఇదే యిక ముగింపు అని అతడు అనుకున్నాడు.
కానీ అలా జరుగలేదు; ఇది సరికొత్త ఆరంభం! యెరూషలేములోని రాజు ముందు తీసుకురాబడ్డ ఈ వ్యక్తి, భయపడి తన కుర్చీని ప్రక్కకు విసిరివేసి, తన జీవితంపై సార్వభౌమ హక్కులు కలిగి ఉన్న రాజు ముందు పడిపోయాడు. ఏమి ఆశించాలో మెఫీబోషెతుకు తెలియలేదు. ఖచ్చితంగా, అతడు ఘోరమైనదే ఊహించాడు.
అందుకు దావీదు–నీవు భయపడవద్దు, నీ తండ్రియైన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము [కృప] చూపి, నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును; మరియు నీవు సదాకాలము నా బల్లయొద్దనే భోజనముచేయుదువని సెలవిచ్చెను. (2 సమూయేలు 9:7)
ఆ సమయంలో మెఫీబోషెతు ఏమి అనుకొనియుండి ఉంటాడో మీరు ఊహించగలరా? తన మెడమీద కత్తి పడుతుందేమోనని ఆశించినవాడు, దావీదు రాజు నుండి ఈ నమ్మదగని మాటలు విన్నాడు. కృప కలిగిన మాటలు.
థామస్ జెఫెర్సన్ గుర్రపు స్వారీ చేస్తూ ఉండగా, అతను మరియు అతని బృందం నీళ్ళు యెక్కువగా ప్రవహిస్తున్న నది దగ్గరకు వచ్చినప్పటి కథను గూర్చి డాక్టర్ కార్ల్ మెన్నింగర్ చెప్పారు. గుంపులో చాలా మంది దాటేంత వరకు ఒక బాటసారి వేచి ఉండి, ఆపై అధ్యక్షుడు జెఫెర్సన్‌కు నమస్కరించాడు మరియు తనని ఆయన గుర్రంపై తీసుకువెళతారా అని అడిగాడు. జెఫెర్సన్ అతనిని తన గుర్రం వెనుక వైపు ఎక్కించుకొని ఎదురుగా ఉన్న ఒడ్డునకు తీసుకువెళ్ళాడు. “నాకు ఒక విషయం చెప్పు,” అని ఒకడు అడిగాడు,”ఈ ఉపకారము కొరకు అడగడానికి మీరు అధ్యక్షుడిని ఎందుకు ఎంచుకున్నారు?” “అధ్యక్షుడు?” ఆ వ్యక్తి సమాధానం చెప్పాడు. “అతను అధ్యక్షుడు అని నాకు తెలియదు. నాకు తెలిసినదల్లా ఒక్కటే, కొన్ని ముఖాల్లో ‘లేదు’ అని సమాధానం వ్రాయబడింది, మరి కొన్ని ముఖాల్లో ‘అవును’ అని సమాధానం వ్రాయబడింది. ఆయనది ‘అవును’ ముఖం.”1
కృపను నిజంగా అర్థం చేసుకున్న వ్యక్తులు “అవును” ముఖం కలిగి ఉంటారు. మెఫీబోషెతు పైకి చూసినప్పుడు, అతను రాజైన దావీదు ముఖం మీద “అవును” అని వ్రాసియుండటం చూశాడని సూచించాలనుకుంటున్నాను. (ఆ అద్భుతమైన క్షణంలో మీరు అక్కడ ఉండి ఉంటే బాగుండునని మీరు అనుకోరు?) అప్పటి నుండి, వికలాంగుడైన యువకుడిని రాజు కుమారులలో ఒకరిగా ఆదరించారు. తన తాత సౌలుకు చెందిన భూమినంతటిని, దానితోపాటు సౌలు సేవకుడైన సీబాను మరియు అతని ఇంటివారందరినీ- 15 మంది కుమారులను మరియు 20 మంది దాసులను దావీదు రాజు అతనికి తిరిగి ఇప్పించాడు. అతన్ని అందరూ గౌరవంగా చూశారు, మరియు అతను రాజైన దావీదు యొక్క బల్ల వద్ద కుటుంబంతో క్రమం తప్పకుండా భుజించడాన్ని ఆనందించాడు, అంతా కృప వల్లనే. అతను కుటుంబ సభ్యుడు కాబట్టి వారు కలిసి మాట్లాడుకున్నారు మరియు కలిసి నవ్వుకున్నారు మరియు కలిసి రుచికరమైన భోజనం తిన్నారు . . . మరియు బల్ల మీద పరచబడిన వస్త్రం అతని వికలాంగ పాదాలను కప్పింది.
అలాంటి క్షణాలు మనకు దేవుడు తన పిల్లలను చూసి “అవును” ముఖంతో, “మీరు నా కుటుంబంలో ఉన్నారు. నా ఇతర కుమారులు మరియు కుమార్తెలందరిలాగే మీరు కూడా నాకు చాలా ముఖ్యమైనవారు,” అని అనటాన్ని గుర్తుచేస్తాయి. మన జీవితాల్లో ఈ సత్యం యొక్క అర్థమేమిటో వ్యక్తీకరించడానికి మనకు శాశ్వతకాలం పడుతుంది-ఆయన మన పాపపు మరియు తిరుగుబాటు స్థితిలో మనలను ఎన్నుకున్నాడు మరియు కృపతో మనల్ని ఎండిన నేల నుండి తీసుకొని ఆయన బల్ల వద్ద ఒక స్థలాన్ని ఇచ్చాడు. మరియు, ప్రేమచేత, ఆయన తన కృపగల వస్త్రముతో మన పాపాన్ని కప్పడానికి అనుమతించారు.
కృప. ఇది నిజంగా అద్భుతమైనది!
- Karl Menninger, Martin Mayman, and Paul Pruyser, The Vital Balance (New York: Viking Press, 1963), 22.
Taken from Charles R. Swindoll, “Amazing Grace on Display,” Insights (March 2009): 1–2. Copyright © 2009 by Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.