ప్రార్థనపై పట్టు సాధించుట

ప్రార్థనపై ఇది మీ ప్రాథమిక మతసంబంధమైన ప్రకటన కాబోదని నేను మీకు ముందుగానే చెప్పాలి. క్షమించండి, అది నాలో లేదు.

లేదు, నేను క్షమించమని అడగటంలేదు.

ఎంతో బాధతో మీకు నిజాయితీగా చెప్పాలంటే, ప్రార్థన గురించి నేను ఇప్పటివరకు చదివిన లేదా విన్న చాలా విషయాలు నన్ను చాలా బరువైన అపరాధభావంతో వదిలివేసాయి లేదా దైవభక్తి ఉన్నట్లు అనిపించే సూక్తులు మరియు అర్థరహితమైన దేవుని గూర్చిన సంభాషణలు నన్ను అలసిపోజేశాయి. ఫలానా డాక్టర్ చేసినట్లు నేను రోజుకు రెండు లేదా మూడు గంటలు అలసిపోయేటట్లు నా మోకాళ్లపై గడపలేదు కాబట్టి . . . లేదా నా ప్రార్థన ద్వారా డజన్ల కొద్దీ లేఖన భాగాలను జోడించలేకపోయాను కాబట్టి . . . లేదా పర్వతాలను కదిలించడంలో నేను విజయవంతం కాలేదు కాబట్టి, క్రైస్తవ జీవితంలో ఈ భాగానికి వచ్చినప్పుడు నేను మతి తప్పాననే స్పష్టమైన అభిప్రాయానికి వచ్చేసాను.

మీకు కూడా ఇటువంటి అనుభవం ఎదురై ఉండవచ్చు. మీకు సహాయం చేకూరే విధంగా ప్రార్థనను మంచి స్థితిలో ఉంచేందుకు నేను చెప్పగలిగేది ఏదైనా ఉన్నదేమో చూద్దాం. మీరు యిబ్బందిపడుచున్నది ప్రామాణికమైన ప్రార్థనతో కాదని, నిజమైన విషయం యొక్క వ్యంగ్యమైన, వక్రీకరింపబడిన, దయనీయమైన అనుకరణతోనే అని మీరు త్వరలో చూస్తారు.

యేసు దినాల్లోని మతసంబంధమైన ప్రజలు తమ సూచనలను యూదుల నాయకుల నుండి-అనగా పరిసయ్యులు, సద్దూకయ్యులు మరియు శాస్త్రుల నుండి తీసుకున్నారు. వారు ప్రార్థనయందు నమ్మకముంచలేదా? నమ్మకముంచారు. వారు,”తన ఇంటిలో ప్రార్థన చేసేవాడు ఇనుము కన్నా బలంగా ఉన్న గోడతో దాన్ని చుట్టినట్లే.” తాము రోజంతా ప్రార్థన చేయలేకపోయామేనని వారు చింతించుచున్నారు. ఈ తీవ్రత వల్లనే ప్రవాహముగా దానంతట అదే రావలసిన ప్రార్థన కఠోరమైన, ప్రణాళికబద్ధమైన రీతిలో మత నాయకులచే క్రమబద్ధ చర్యగా నిర్వహించే హీనస్థితికి పడిపోయింది. ప్రార్థన ప్రత్యేక ఆధిక్యత నుండి ఒక నియమంగా మారిపోయింది. దేవుని సన్నిధిలో ఆనందం నుండి మానవ నిర్మిత అవసరాలుగా మారిపోయాయి.

ప్రార్థన దాని విలువను కోల్పోయిందనటంలో ఆశ్చర్యమేమైనా ఉందా? ఇది బహిరంగ కపటత్వం మరియు అర్థరహిత పదాలతో గుర్తించబడిన ఒక చిన్న దినచర్యగా పడిపోయినప్పుడు, తీర్పుతీర్చే ఆత్మ దీనికి జోడైనప్పుడు, ప్రార్థనలో చాలా త్వరగా విఫలమవుతాము. సామాన్య వ్యక్తి సాధించటం అసాధ్యమైన ఇటువంటి ఉన్నతమైన అంచనాలు మతపరమైన ప్రదర్శనకారులు గర్వంగా ప్రదర్శించే శారీరిక ప్రదర్శనగా ఈ చర్య అంతయు మారిపోయింది. తన శాశ్వతమైన కొండమీది ప్రసంగంలో మన ప్రభువు వారిని ఎందుకు తీవ్రంగా విమర్శంచాడో అర్థమవుతుంది.

ఆ ప్రసంగంలో, యేసు మూడు బలమైన ప్రకటనలు చేస్తాడు (అవన్నీ ప్రతికూలంగా ఉన్నాయి). మనకు సంతృప్తికరమైన మరియు దేవుణ్ణి ఘనపరచే ప్రార్థన జీవితాన్ని కావాలనుకుంటే అనుసరించాల్సిన ప్రణాళికను ఆయన సూచిస్తున్నారు.

1.    వేషధారులవలె ఉండవద్దు (మత్తయి 6: 1-2, 5, 16).
యేసు తన బలమైన గద్దింపులను వేషధారణకు కేటాయించాడు. ఆయన దానిని యెంతమాత్రమును ఒప్పుకొనక తృణీకరించాడు. ఆయన పునరావృతం చేసిన వ్యాఖ్య (ఉద్ఘాటన కొరకు) ఏమిటంటే, తాము చేయు పని యితరులకు కనబడాలని చేసేవారు తప్పక తమ ఫలమును యిప్పుడు పొందుకుంటారు. తరువాత వారు ఏమీ పొందుకోలేరని ఆయన స్పష్టం చేశారు. దాని గురించి చౌకగా చూపించే బదులు, యేసు ఇలా అంటున్నాడు: “నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును” (మత్తయి 6: 6).

ప్రార్థన అనేది యితరులు చూడాలని మనం చేసే పని కాదు. ఇతరులను ఆకట్టుకునే వేదికగా ప్రార్థన మారిపోతే, అది దాని మొత్తం ఉద్దేశాన్ని కోల్పోతుంది. ఇది ఆరాధన యొక్క రహస్యమైన క్రియ, ఆరాధన యొక్క బహిరంగ ప్రదర్శన కాదు. యేసు ప్రకారం, ఇది మన జీవితపు నాలుగు గోడలకు సంబంధించినది, రహస్యంగా చేసే క్రియ.

2.    వ్యర్థమైన మాటలు వచింపవద్దు (మత్తయి 6: 7–8).
ప్రార్థనను దేవుని సింహాసనం వద్ద అర్థించడం లేదా యాచించడం లేదా విస్తారముగా మాట్లాడటం వంటివిగా క్రీస్తు ఎప్పుడూ చూడలేదు. లేదు, తండ్రి తన పిల్లలను యెరుగును; మనకు ఏమి అవసరమో ఆయనకు తెలుసు. అందువల్ల, ఆయనతో సంబంధం పెంపొందించుకోవటానికి ప్రత్యేకమైన పదాలు యెక్కువగా పునరావృతం కావాలని అనుకోవటానికి ఏ కారణం లేదు.

ఇప్పుడు, నన్ను మరింత నిర్దిష్టంగా చెప్పనివ్వండి. ఈ రోజు, యేసు దినాల్లో ఉన్నట్లుగా, క్రైస్తవ జీవితంలో ప్రార్థన కంటే నూతనత్వం మరియు సహజత్వం అవసరమైనది మరొకటి లేదు. ఇది ఒక చర్చి వేదికమీద నుండి ప్రార్థన అయినా, సంఘ కూడికలో ప్రార్థన అయినా, భోజనానికి ముందు ప్రార్థన అయినా, సమావేశానికి ముందు ప్రార్థన అయినా, అర్థరహితమైన పునరావృతం పుష్కలంగా ఉంటుంది! అలసిపోజేసే, పెద్దవియు మరియు సంక్లిష్టమైన పదజాలము ప్రార్థనలో వస్తూనే ఉంటుంది. ఆ వ్యర్థమైన చప్పని మాటలను తెంచుకొని బయటపడండి! ప్రార్థనచేయటం యిప్పుడిప్పుడే ఆరంభించినవారికి నేను చెప్పేదేమిటంటే, “ఆశీర్వదించండి” లేదా “నడిపించండి, దారిచూపించండి, మరియు నిర్దేశించండి” లేదా “ఫలానా ఫలానా సహాయం చెయ్యండి” లేదా “నీ చిత్తము” లేదా “ప్రతి ఒక్కరు” లేదా సంస్థాగతీకరించబడిన, ప్రేరేపించు పదాలను ఉపయోగించకుండా ప్రార్థన చెయ్యండి చూద్దాం. ప్రయత్నించండి చూద్దాం!

సరికొత్త క్రైస్తవుల ప్రార్థన వినడానికి ప్రయత్నించండి. అప్పుడే జన్మించినవారి గురించి మాట్లాడుచున్నాను- వారు “దీన్ని ఎలా చేయాలో” ఇంకా నేర్చుకోలేదు, చాలా మంచిది. ఆయన వారి స్నేహితుడైనట్లు వారు దేవునితో మాట్లాడుతారు, వారు ఎవరైనా అర్థం చేసుకోగలిగే సామాన్య పదాలను ఉపయోగిస్తారు మరియు వారు అప్పుడప్పుడు నవ్వుతారు లేదా ఏడుస్తారు. ఇది చాలా అందంగా ఉంటుంది. లేదా మీరు భోజనానికి ముందు ప్రార్థన చేసేటప్పుడు, ప్రతి నిర్దిష్ట ఆహార వంటకం వడ్డించబడుచున్నందుకు భోజనపు బల్ల వద్ద ఉన్న ప్రతి వ్యక్తి ప్రార్థనలో కృతజ్ఞతలు చెప్పండి. విషయం స్పష్టంగా ఉంది: వ్యర్థమైన మాటలకు దూరంగా ఉండండి.

3.    మరొకరికి వ్యతిరేకంగా మనస్సులో దేనినీ రహస్యముగా పెట్టుకోవద్దు (మత్తయి 6:14–15).
దేవుడు మనలను క్షమించే ముందు, మన మనస్సాక్షి నిష్కల్మషంగా ఉందా అని మనం నిశ్చయించుకోవాలి. నేను శుద్ధీకరించబడాలంటే, నాకు మరియు యితరులకు మధ్య విషయాలు సరిగ్గా ఉన్నాయని నేను ఖచ్చితంగా చెప్పాలి (కీర్తన 66:18).

ప్రార్థనలో స్తుతి మరియు కృతజ్ఞత, మధ్యవర్తిత్వం మరియు విజ్ఞాపన, ధ్యానించటం మరియు ఒప్పుకోవటం ఉన్నాయి. ప్రార్థనలో, మనము దేవునిపై పూర్తిగా దృష్టి కేంద్రీకరిస్తాము, కొనసాగించడానికి మనము కొత్త ఉత్సాహాన్ని సంగ్రహిస్తాము, మనము జీవితం గురించి విస్తృత దృక్పథాన్ని పొందుతాము మరియు ఓర్చుకోవడానికి ఎక్కువ పట్టుదల పొందుకుంటాము. ప్రార్థనపై మనం పట్టు సాధిస్తున్నప్పుడు, ఇది మన దృక్పథాన్నంతటిని ఎలా మారుస్తుందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మీరు నేను ప్రార్థన చేసినప్పుడు, మనము మార్పు చెందుతాము, మరియు ప్రార్థన అనేది చింతను నివారించే చికిత్సలాంటిది.

ప్రార్థనకు ఎన్నడూ మనలో అపరాధ భావన కలిగించాలనే ఉద్దేశ్యం లేదు. ఇది ప్రారంభించినవారికి మాత్రమే విస్తారమైన పదజాలముగా ఎన్నడూ ఉద్దేశించబడలేదు. నిజమైన ప్రార్థన-యేసు ప్రస్తావించిన మరియు మాదిరిగా చేసిన ప్రార్థన-వాస్తవికముగా, అప్పటికప్పుడు చేసేదిగా, జీవముగల దేవునితో తగ్గింపు కలిగి సంభాషించేదిగా ఉంటుంది. దీనివల్ల వ్యక్తిగత చింత నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే మన దేవుడు మన పరిస్థితులపై పూర్తి నియంత్రణలో ఉన్నాడని సమాధానపరచు అభయమును ఇస్తుంది.

Copyright © 2014 by Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.

Posted in Prayer-Telugu.

Pastor Charles R. Swindoll has devoted his life to the accurate, practical teaching and application of God’s Word. He is the founding pastor of Stonebriar Community Church in Frisco, Texas, but Chuck’s listening audience extends far beyond a local church body. As a leading programme in Christian broadcasting since 1979, Insight for Living airs around the world. Chuck’s leadership as president and now chancellor emeritus at Dallas Theological Seminary has helped prepare and equip a new generation of men and women for ministry.

పాస్టర్ చార్లెస్ ఆర్. స్విండాల్ దేవుని వాక్యాన్ని నిర్దిష్టంగా, ఆచరణాత్మకంగా బోధించడానికి మరియు అన్వయించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చి వ్యవస్థాపక కాపరియై ఉన్నారు, అయితే చక్ యొక్క శ్రోతలు స్థానిక సంఘ పరిధి దాటి వ్యాపించి ఉన్నారు. 1979 నుండి క్రైస్తవ ప్రసరణలో ప్రముఖ కార్యక్రమంగా, ఇన్‌సైట్ ఫర్ లివింగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసారమవుతోంది. డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ప్రెసిడెంటుగా, అలాగే ఇప్పుడు ఛాన్సిలర్ ఎమెరిటస్‌గా చక్ యొక్క నాయకత్వం క్రొత్త తరం స్త్రీపురుషులను పరిచర్య కొరకు సిద్ధపరచడంలో సహాయపడింది.