దేవునితో సమయం

“ఏకాంత సమయం” యొక్క ప్రాముఖ్యతను నమ్మాలని నేను పెంచబడ్డాను. ఆశ్చర్యం కలిగించే విషయమేమంటే, ఆ భావన యొక్క అసలైన ఆలోచన ది నావిగేటర్స్ వ్యవస్థాపకుడు దివంగత డాసన్ ట్రాట్మన్ నుండి కాదు, దేవుని నుండే స్వయంగా వచ్చింది.

దేవుని కోసం ఎదురుచూడటం మరియు దేవునితో సమయాన్ని గడపడం యొక్క విలువను గూర్చిన వచనలు లేఖనాల్లో నిండి ఉన్నాయి. అలాంటి సందర్భాలలో, గలిబిలిగా తీరికలేని సమయంలో మనము సేకరించిన చెత్తాచెదారమంతా శుద్ధమవుతుంది. ఒక నది వెడల్పు ఉన్న చోట స్థిరపడే బురద మాదిరిగా కాకుండా, మనం విషయాలను మరింత స్పష్టంగా చూడగలుగుతాము . . . అంటే దేవుడు తట్టినప్పుడు మనం స్పందిస్తాము.

ఏకాంతము యొక్క ప్రయోజనాలను దావీదు తరచుగా నొక్కిచెప్పాడు. అతను తన తండ్రి గొర్రెలను కాయుచున్నప్పుడు అతను మొదట ఈ క్రమశిక్షణతో పరిచయం పొంది ఉంటాడని నాకు ఖచ్చితముగా తెలుసు. తరువాత, సౌలు రాజు పిచ్చిపట్టినవానిగా, అసూయతో అతనిని వెంబడించిన ఆ గందరగోళ సంవత్సరాల్లో, దావీదు దేవునితో తన సమయాన్ని అవసరమైన ఆశ్రయముగా మాత్రమే కాదు, అతని మనుగడకు సాధనముగా చేసుకున్నాడు.

“యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము; / ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము; / యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము,” (కీర్తన 27:14) అని ఆయన రాసినప్పుడు, దాని అర్థం ఏమిటో దావీదుకు బాగా తెలుసు. “యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని; / ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను,” (40:1) అని అతను అంగీకరించినప్పుడు, ఇది అవాస్తవ సిద్ధాంతం యొక్క సందర్భం నుండి వచ్చినది కాదు. ఆ మనిషి దెబ్బతిన్నాడు, తీవ్రంగా బాధపడ్డాడు. అతను తన డైరీ నుండి ఒక పేజీని చించి, కీర్తన 26 ను రచించడానికి ఉపయోగించినప్పుడు, “యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, / ఏమియు సందేహపడకుండ యెహోవాయందు నేను నమ్మిక యుంచియున్నాను. / యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము; / నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము” (26:1-2), అతను పాఠకుడిని ఆశ్చర్యపరిచేందుకు కొన్ని భావోద్వేగ ఆలోచనలను విసరలేదు. ఆ మాటలు అతని కృంగిన ఆత్మ యొక్క లోతుల నుండి, రాళ్ళపై అలలు కొట్టుకున్నప్పుడు చిమ్మే ఉప్పు నీరువలె ఉంటాయి.

దేవునితో సమయమా? అతను కలిగి ఉన్న ప్రతిదాన్ని కోల్పోయిన యోబు కంటే ఎక్కువగా దాని విలువను ఎవరు అనుభవించారు? ఆరాధిస్తూ అతను ఇలా వ్రాశాడు: “నేను నా తల్లిగర్భములోనుండి దిగంబరినై వచ్చితిని, / దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదను. / యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను. / యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక” (యోబు 1:21). మరియు యోబు యొక్క నిశ్చల విశ్వాసం సన్నగిల్లలేదు; ఆ మనిషి దేవునితో సహవాసం చేస్తూనే ఉన్నాడు. అతని ఒప్పుకోలు గుర్తుందా? మరింత విశేషమైనది ఏమిటంటే, తనపై ఆరోపణలు చేసిన వారు అతని చుట్టూ ఉన్నప్పుడు అతను ఇలా చెప్పాడు:

“నేను నడచుమార్గము ఆయనకు తెలియును;
ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును.
నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడచినవి;
నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము ననుసరించితిని.
ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరుగలేదు;
ఆయన నోటిమాటలను నా స్వాభిప్రాయముకంటె ఎక్కువగా ఎంచితిని.” (23: 10–12)

అంతే! మనం ఒంటరిగా ఉండి, వేగంగా పరుగెత్తకుండా మనల్ని మనం ఉద్దేశపూర్వకంగా నివారించుకొని, మనలను సృష్టించిన వానితో నిర్ణీతమైన సమయాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఆయన మాటలు మంచి భోజనం కంటే గొప్ప అర్ధాన్ని కలిగివుంటాయి. ఆయన మన కోసం ఎంత గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు . . . ఏ అంతర్దృష్టులు . . . ఏమి ఓదార్పు . . . ఏమి భరోసా! వీటన్నిటికంటే గొప్ప విషయమేమంటే, ఇటువంటి దైవిక పురోగతులు ఊహించని విధంగా వస్తాయి. మీరు మరియు నేను ప్రతి ఒక్కరూ ఉదయాన్నే దేవునితో ఏకాంతంలో కలుసుకున్నప్పటికీ, అకస్మాత్తుగా ఒక రోజు, ఎన్నడూ లేని విధంగా, తన ప్రణాళికను వెల్లడించినప్పుడు . . . మనము ఉద్వేగపడతాము.

ఇది మోషేకు జరిగింది. ఒంటరిగా ఎడారి వెనుక భాగంలో తన మామయైన యిత్రో యొక్క గొర్రెల మందతో, బహుశా అరణ్యం యొక్క రాత్రి గాలులు నెమ్మదించిన తరువాత మరియు సీనాయి సూర్యుని మండే కిరణాలు హోరేబు యొక్క అద్భుతమైన ఏటవాలులను చూడటం ప్రారంభించిన తరువాత, వింతగా మండుచున్న ఒక పొద మధ్యలో నుండి దేవుడు మాట్లాడాడు. దేవుడు ఏమి చెప్పాడు? ఆ 80 ఏళ్ల వయస్సుగలవాడు, కొండపై గొర్రెల కాపరి విన్నది ఏమిటి? ఫలితంగా, “మహానిర్గమనముకు నాయకత్వం వహించు!” సాధారణ తెల్లవారుజాము ఒక వృద్ధుడిని అవిశ్వాసానికి గురిచేస్తుందని ఆ ముందు రోజు రాత్రి ఎవరు ఊహిస్తారు? అత్యల్పుడైన మోషే. ఎఫ్. బి. మేయర్ వాగ్ధాటితో యిలా రాశాడు:

మన జీవితాలన్నిటిలోనూ ముందస్తుగా ప్రకటించని, ముందుగా సూచనలేని రోజులు కొన్ని వస్తాయి. దేవదూతల ముఖాలు పరలోకం నుండి కనిపించవు; దేవదూతల స్వరాలు మనలను జాగ్రత్త చేయలేదు; కానీ తరువాతి సంవత్సరాల్లో మనము ఒక్కసారి వెనక్కి తిరిగి వాటిని చూస్తున్నప్పుడు, అవి మన అస్తిత్వం యొక్క మలుపులు అని మనము గ్రహిస్తాము. బహుశా మలుపులకు అవతల ఉన్న జీవితం యొక్క నిరుత్సాహకరమైన దినచర్యను బలముగా కోరుకొని మనం వెనక్కి తిరిగి చూస్తాము, కాని దేవదూత, ఒరదీసిన కత్తితో, తిరిగి రావడాన్ని నిషేధించి, మనల్ని ముందుకు బలవంతం చేస్తాడు. మోషేతో అదే జరిగింది.1

అర్థం చేసుకోండి, ఆ అసాధారణ క్షణాలు మినహాయింపులేగాని, నియమం కాదు. దేవుడు ప్రతిరోజూ మనతో ఇలానే మాట్లాడితే, మండుచున్న పొదలు ట్రాఫిక్ లైట్లు మరియు మ్రొగుచున్న ఫోన్‌ల మాదిరిగానే సర్వసాధారణమైపోతాయి. వాస్తవం ఏమిటంటే, అగ్నివలన పొద మండుచున్నను పొద కాలిపోలేని విధముగా దేవుని స్వరం వినబడలేదు. చూడండి, దేవుడు అపూర్వమైన క్రియలు చేయటానికి ఆశ కలిగియున్నాడు, అంతేగాని నకిలీ పనులు నమోదు చేయటానికి కాదు. కానీ ఎప్పుడూ సందేహించకండి: ఆయన యెదుట నిశ్చలముగా ఉన్న హృదయాలు . . . ఎదురుచూస్తున్న హృదయాలతో మాట్లాడటానికి ఆయన ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. దావీదు తన “మాస్కిల్” (“బోధనాత్మక,” “దైవధ్యానము”) కీర్తనలలో ఒకదానిలో వ్రాసినట్లుగా:

కావున నీ దర్శనకాలమందు భక్తిగలవారందరు నిన్ను ప్రార్థనచేయుదురు;
విస్తార జలప్రవాహములు పొరలివచ్చినను నిశ్చయముగా అవి వారిమీదికి రావు.
నా దాగు చోటు నీవే, శ్రమలోనుండి నీవు నన్ను రక్షించెదవు;
విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు.
నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను;
నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను. (కీర్తన 32:6–8)

ఇది ఎంత ముఖ్యమో మీకు అర్థమవ్వాలంటే, డల్లాస్ థియోలాజికల్ సెమినరీ అధ్యక్షుడిగా ఆహ్వానాన్ని అంగీకరించడానికి 1993 లో కాలిఫోర్నియాలోని ఫుల్లెర్టన్లోని మా సంఘమును విడిచిపెట్టాలని ఆలోచిస్తున్నప్పుడు, నా స్వంత జీవితం నుండి మీకు ఒక ఉదాహరణ ఇవ్వాలనుకుంటున్నాను. ప్రభువుపై ఎదురుచూసే ప్రక్రియ మధ్యలో, నేను మా సమూహానికి ఈ క్రింది లేఖ రాశాను:

మీలో చాలా మందికి తెలిసినట్లుగా, సింథియా మరియు నేను ప్రస్తుతం ప్రభువు కోసం ఎదురుచూస్తున్నాము మరియు ఆయన ముందు ఎక్కువ సమయం గడుపుతున్నాము. సంఘానికి నా తొలి ప్రకటనలో, మేము ఆయన మనస్సును వెదకుచున్నామని మరియు ఆయన చిత్తాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నాను. అటువంటి ప్రకటన అసాధారణమైనదని నేను గ్రహించాను- అయితే ప్రత్యేకించి నైతిక వైఫల్యం యొక్క లోతైన వ్యక్తిగత సమస్యతో దీనికి ఎటువంటి సంబంధం లేదు. పాస్టర్లు సాధారణంగా వారి అంతర్గత పోరాటాలను లేదా వారి సమూహములకు తమ వ్యక్తిగత “కలతలు” వంటి అంతర్గత విషయాన్ని గూర్చి అప్రమత్తం చేయరు, ఇది నిజంకాని పుకార్ల ద్వారా సంక్లిష్టంగా మారి, సమాజంలో అశాంతి మరియు అపనమ్మకం యొక్క ఆత్మను సృష్టిస్తుందని ప్రకటన చేయరు. ఈ ప్రమాదం కారణంగా, చాలా మంది పాస్టర్లు తమ మథనమును తమకే ఉంచుకుంటారు.

మా పరిస్థితిని ప్రకటించటానికి మా పెద్దల బోర్డు పురికొల్పగా నా నిర్ణయం వాస్తవానికి మా సంఘములోని వారందరినీ అభినందించినట్లు అయ్యింది. ఫుల్లెర్టన్ ఫ్రీ చర్చి మంద అటువంటి అసాధారణమైన ప్రకటనను పర్యవేక్షించగలదని మేము భావించటమేగాక, వారి సీనియర్ పాస్టర్ మరియు భార్య భవిష్యత్తు కోసం దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి నిజాయితీగా ప్రయత్నిస్తున్నారని తెలుసుకోవడం అభినందిస్తున్నాము. ఇంకా, అలా చేయడం ద్వారా, నిరీక్షిస్తున్న ఈ రోజుల్లో మరియు వారాల్లో నేను మాతో మరియు మా కొరకు ప్రార్థన చేయడానికి వందలాది, బహుశా వేలమంది, శ్రద్ధగల, తోటి క్రైస్తవులను జాబితాలో చేర్చుకుంటాను. తత్ఫలితంగా, మనమందరం దేవునితో మన సమయాన్ని తీవ్రతరం చేశామని నాకు నమ్మకం ఉంది.

సింథియా మరియు నేను ఒక విషయం కోరుకుంటున్నాము: దేవుడు మనం ఏమి చేయాలనుకుంటున్నాడో, మనం ఎక్కడ చేయాలనుకుంటున్నాడో, దానిని మా పూర్ణహృదయంతో చేయాలనుకుంటున్నాము. నాకు ఖచ్చితంగా తెలిసిన వెంటనే, నేను చెబుతాను.

దేవునితో మీ సమయం గడుపుచున్నప్పుడు మీ ప్రార్థనలలో గతంలో కంటే ఎక్కువగా మమ్మల్ని చేర్చండి. ఈ రోజులలో సమీప భవిష్యత్తులో, మన కొరకు తండ్రి యొక్క సంపూర్ణ చిత్తము మనకు తెలుస్తుంది, ఇది మేము ప్రేమించే మరియు సేవ చేసే ఈ సంఘానికి కూడా ఆయన పరిపూర్ణ చిత్తం అవుతుంది.

ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో యెదురైనప్పుడు, మనమందరం ప్రభువుతో సమయం గడపడం అలవాటు చేసుకోవాలి. చాలా సంవత్సరాల క్రితం చేసిన ఆ ప్రార్థనలకు సమాధానంగా దేవుడు మమ్మల్ని తీసుకెళ్తాడని నేను ఊహించలేను. ఆయన శోధింప శక్యముకాని వానిగా ఉన్నాడు!
కాబట్టి దేవునితో మీ ఏకాంత సమయాల్లో నమ్మకంగా ఉండాలని నేను మిమ్మల్ని కోరనివ్వండి. మీకు అవి ఎలా అవసరమో . . . ఆ విధంగా మీకు అవసరమైన సమాధానాలను అందించడానికి ఆయన ఖచ్చితంగా నమ్మకంగా ఉంటాడు.

  1. F. B. Meyer, The Life of Moses: The Servant of God (Lynnwood, Wash.: Emerald Books, 1996), 31.

Copyright © 2010 by Charles R. Swindoll, Inc.

Posted in Christian Living-Telugu, Prayer-Telugu.

Pastor Charles R. Swindoll has devoted his life to the accurate, practical teaching and application of God’s Word. He is the founding pastor of Stonebriar Community Church in Frisco, Texas, but Chuck’s listening audience extends far beyond a local church body. As a leading programme in Christian broadcasting since 1979, Insight for Living airs around the world. Chuck’s leadership as president and now chancellor emeritus at Dallas Theological Seminary has helped prepare and equip a new generation of men and women for ministry.

పాస్టర్ చార్లెస్ ఆర్. స్విండాల్ దేవుని వాక్యాన్ని నిర్దిష్టంగా, ఆచరణాత్మకంగా బోధించడానికి మరియు అన్వయించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చి వ్యవస్థాపక కాపరియై ఉన్నారు, అయితే చక్ యొక్క శ్రోతలు స్థానిక సంఘ పరిధి దాటి వ్యాపించి ఉన్నారు. 1979 నుండి క్రైస్తవ ప్రసరణలో ప్రముఖ కార్యక్రమంగా, ఇన్‌సైట్ ఫర్ లివింగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసారమవుతోంది. డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ప్రెసిడెంటుగా, అలాగే ఇప్పుడు ఛాన్సిలర్ ఎమెరిటస్‌గా చక్ యొక్క నాయకత్వం క్రొత్త తరం స్త్రీపురుషులను పరిచర్య కొరకు సిద్ధపరచడంలో సహాయపడింది.