దేవుడు “వద్దు” అని చెప్పినప్పుడు . . . ప్రార్థన చెయ్యండి

ఎవ్వరూ లేనప్పుడు మరియు దేవుని యెదుట మనం పూర్తిగా నిజాయితీగా ఉండగలిగినప్పుడు, మనము కొన్ని కలలు మరియు ఆశలను ఆలోచనకు తెచ్చుకుంటాము. మన రోజులు ముగిసే సమయానికి _________________________ (ఖాళీని పూరించండి) కలిగి ఉండాలని మనము కోరుకుంటున్నాము. అయితే, ఆ కోరిక నెరవేరకుండానే మనం చనిపోవచ్చు. అది గనుక జరిగితే, మనం ఎదుర్కోవటానికి మరియు అంగీకరించడానికి ఇది ప్రపంచంలోని కష్టతరమైన విషయాలలో ఒకటి అవుతుంది. ప్రభువు “వద్దు” అని చెప్పడం దావీదు విన్నాడు, యెటువంటి కోపం లేకుండా నిశ్శబ్దంగా అంగీకరించాడు. ఇది చేయటం చాలా కష్టం. కానీ దావీదు చివరిగా నమోదు చేసిన మాటలలో దేవుని హృదయానుసారుని యొక్క జీవిత-పరిమాణ చిత్రం మనకు కనిపిస్తుంది.

ఇశ్రాయేలుకు నాలుగు దశాబ్దాలు సేవ చేసిన తరువాత, రాజైన దావీదు, వయస్సు మీదపడి, వృద్ధుడై బహుశా వంగిపోయి, చివరిసారిగా తన నమ్మకమైన అనుచరుల ముఖాల్లోకి చూశాడు. వీరిలో చాలామంది ఈ వృద్ధ మనిషి మనస్సులో విభిన్న జ్ఞాపకాలను అగుపరచుచున్నారు. అతని వారసత్వాన్ని కొనసాగించే వారు అతని చుట్టూ ఉన్నారు, జ్ఞానం మరియు ఉపదేశముతోకూడిన అతని చివరి పలుకులను స్వీకరించడానికి ఎదురుచూస్తున్నారు. డెభ్బై ఏళ్ల రాజు ఏమి చెబుతాడు?

అతను తన హృదయ అభిరుచితో ప్రారంభించాడు. ప్రభువుకు ఒక ఆలయాన్ని నిర్మించాలనే కలలు మరియు ప్రణాళికలు (1 దినవృత్తాంతములు 28:2) కలిగియున్న తన లోతైన కోరికను బహిర్గతం చేయడానికి తెరదీసాడు. ఇది అతని జీవితకాలంలో నెరవేరని కల. “అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించినవాడవు గనుక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు” (28:3) అని “దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను” అని దావీదు తన జనులతో చెప్పాడు.

కలలు అంత సులభముగా మృతి చెందవు. కానీ వీడ్కోలు మాటలలో, దేవుడు తనకు అనుమతించిన దానిపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు-ఇశ్రాయేలుపై రాజుగా పరిపాలించడం, తన కుమారుడైన సొలొమోనును రాజ్యం మీద రాజుగా నియమించటం మరియు తన కలను అతనికి అందించడం (28:4–8). అప్పుడు, ఒక అందమైన ప్రార్థనలో, ప్రభువైన దేవునికి ఆరాధనను వ్యక్తపరుస్తూ, దావీదు దేవుని గొప్పతనాన్ని ప్రశంసిస్తూ, ఆయన దయచేసిన అనేక ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఇశ్రాయేలు ప్రజలకు మరియు వారి కొత్త రాజైన సొలొమోను కొరకు విజ్ఞాపన చేశాడు. దావీదు ప్రార్థనను నెమ్మదిగా మరియు ఆలోచనాత్మకంగా చదవడానికి కొంత సమయం కేటాయించండి. ఇది 1 దినవృత్తాంతములు 29:10–19 లో కనబడుతుంది.

తన నెరవేరని కల గురించి స్వార్థముతో కొట్టుమిట్టాడకుండా లేదా కఠినత్వం లేకుండా, దావీదు కృతజ్ఞతా హృదయంతో దేవుణ్ణి స్తుతించాడు. స్తుతి మానవుని మీద దృష్టి పెట్టకుండా జీవముగల దేవుని ఉన్నతమైన స్థితిపైనే పూర్తిగా దృష్టి పెడుతుంది. స్తుతి ఎల్లప్పుడూ పైకే చూస్తుంది.

“మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి; యెహోవా, రాజ్యము నీది, నీవు అందరిమీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని యున్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీవలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించు వాడవును అందరికి బలము ఇచ్చువాడవును నీవే.” (29: 10–12)

ప్రజలకు ఒకదాని తరువాత ఒకటి మంచిగా ఇచ్చిన దేవుని విలాసవంతమైన కృప గురించి దావీదు ఆలోచించినప్పుడు, అతని స్తుతి ఇప్పుడు కృతజ్ఞత వైపు మళ్లాయి. “మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావముగల నీ నామమును కొనియాడుచున్నాము” (29:13). తన ప్రజలు ఏమాత్రపువారని దావీదు అంగీకరించాడు. ఎడారిలో తిరుగులాడి గుడారాలలో నివసించిన చరిత్ర వారిది; వారి జీవితాలు నీడయంత అస్థిరములు. అయినప్పటికీ, దేవుని గొప్ప మంచితనం కారణంగా వారు దేవునికి ఆలయాన్ని నిర్మించటానికి అవసరమైనవన్నీ సమకూర్చగలిగారు (29:14-16).

దావీదు చుట్టూ అపరిమితమైన ధనము ఉన్నది, అయినప్పటికీ ఆ సంపద అంతా అతని హృదయాన్ని వశపరచుకోలేకపోయింది. అతను లోలోపల వేరే యుద్ధాలు చేసాడు కాని దురాశ అనేది అతనిలో ఎప్పుడూ లేదు. భౌతికవాదం చేత దావీదు‌ బందీగా పట్టబడలేదు. అయితే అతను ఇలా చెప్పాడు, “దేవా, మేము కలిగియున్నదంతయు నీదే- నీ ఆలయము కొరకు మేము అర్పించుచున్న ఈ అందమైన వస్తు సముదాయమంతయు, నేను నివసించే ప్రదేశం, సింహాసనమున్న గది- అంతయు మీదే, సమస్తము.” దేవుడే వీటన్నిటికి యజమాని అని దావీదు అనుకున్నాడు. ఈ వైఖరే తన జీవితంలో దేవుని “వద్దు” ను ఎదుర్కోవటానికి చక్రవర్తిని అనుమతించింది. దేవుడు నియంత్రణలో ఉన్నాడని మరియు దేవుని ప్రణాళికలు ఉత్తమమైనవి అని అతను నమ్మకంగా ఉన్నాడు. దావీదు దేనిని బంధించి పట్టుకోలేదు.

తరువాత, దావీదు ఇతరుల కోసం ప్రార్థించాడు. అతను నలభై సంవత్సరాలు పరిపాలించిన ప్రజల కోసం విజ్ఞాపన చేసాడు, ఆలయం కొరకు వారు తెచ్చిన అర్పణలను జ్ఞాపకం చేసుకోవాలని మరియు వారి హృదయాలను తన వైపునకు ఆకర్షించుకొనుమని ప్రభువును కోరాడు (29:17-18). దావీదు సొలొమోను కొరకు కూడా ప్రార్థించాడు: “నా కుమారుడైన సొలొమోను నీ యాజ్ఞలను నీ శాసనములను నీ కట్టడలను గైకొనుచు వాటినన్నిటిని అనుసరించునట్లును, నేను కట్టదలచిన యీ ఆలయమును కట్టించునట్లును అతనికి నిర్దోషమైన హృదయము దయచేయుము” (29:19).

ఈ అద్భుతమైన ప్రార్థనలో దావీదు చివరిగా నమోదు చేసిన మాటలు ఉన్నాయి; తర్వాత కొద్దికాలానికే, అతడు “వృద్ధాప్యము వచ్చినవాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి”(29:28) మరణించాడు. జీవితాన్ని ముగించడానికి ఎంత సరైన మార్గం! దేవుని బిడ్డ చనిపోయినప్పుడు, దేవునికి సంబంధించినది ఏదీ మరణించదని అతని మరణం సరిగ్గా జ్ఞాపకముచేస్తుంది.

కొన్ని కలలు నెరవేరనప్పటికీ, దేవుని బిడ్డలు ఆయన “వద్దు” అనినప్పుడు దానికి స్తుతి, కృతజ్ఞత మరియు విజ్ఞాపనతో స్పందించవచ్చు . . . ఎందుకంటే ఒక కల చనిపోయినప్పుడు, దేవుని ఉద్దేశాలు ఏవీ చనిపోవు.

Article excerpted from Charles R. Swindoll, David: A Man of Passion & Destiny (Dallas: Word, 1997), 285–88, 292–93. Copyright © 1997 Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.

Posted in Bible Characters-Telugu, Christian Living-Telugu, Divorce-Telugu, Encouragement & Healing-Telugu, Failure-Telugu, God's Will-Telugu, Prayer-Telugu.

Pastor Charles R. Swindoll has devoted his life to the accurate, practical teaching and application of God’s Word. He is the founding pastor of Stonebriar Community Church in Frisco, Texas, but Chuck’s listening audience extends far beyond a local church body. As a leading programme in Christian broadcasting since 1979, Insight for Living airs around the world. Chuck’s leadership as president and now chancellor emeritus at Dallas Theological Seminary has helped prepare and equip a new generation of men and women for ministry.

పాస్టర్ చార్లెస్ ఆర్. స్విండాల్ దేవుని వాక్యాన్ని నిర్దిష్టంగా, ఆచరణాత్మకంగా బోధించడానికి మరియు అన్వయించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చి వ్యవస్థాపక కాపరియై ఉన్నారు, అయితే చక్ యొక్క శ్రోతలు స్థానిక సంఘ పరిధి దాటి వ్యాపించి ఉన్నారు. 1979 నుండి క్రైస్తవ ప్రసరణలో ప్రముఖ కార్యక్రమంగా, ఇన్‌సైట్ ఫర్ లివింగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసారమవుతోంది. డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ప్రెసిడెంటుగా, అలాగే ఇప్పుడు ఛాన్సిలర్ ఎమెరిటస్‌గా చక్ యొక్క నాయకత్వం క్రొత్త తరం స్త్రీపురుషులను పరిచర్య కొరకు సిద్ధపరచడంలో సహాయపడింది.