నూతన సంవత్సరంలో అప్పుడే ఒక నెల అయిపోయింది, ఇప్పటికే జీవిత ఒత్తిళ్లు మళ్లీ మొదలైపోయాయి. ప్రతి నెలా చెక్‌బుక్‌లో చాలా తక్కువ ద్రవ్యము ఉండటం. పిల్లలు మరియు/లేదా మనవళ్లు అంతులేని, అపరిమితమైన శక్తిని కోరుకోవటం. ఎక్కడో వినినట్లుగా చూసినట్లుగా అనిపిస్తుందా?
మనము పరిశుద్ధ గ్రంథములో తొంగిచూసినప్పుడు, ఈ రోజుల్లో ఒత్తిడికి ఆచరణాత్మక దిశానిర్దేశం చేసే మూడు లక్షణాలను, పాత నిబంధన చివరలో దాగియుండటం మనం కనుగొంటాము. తన ప్రజలు మూడు పనులు చేయాలని దేవుడు కోరుకుంటున్నట్లు ప్రవక్తయైన మీకా బోధించాడు: ఆయన యెదుట “న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సుకలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు” (మీకా 6:8).
మీరు దీని గురించి ఆలోచించినప్పుడు, లేఖనములోని అనేకమంది చిరస్మరణీయ వ్యక్తులు వారి హడావిడి మరియు కష్టమైన జీవితాల మధ్య ఈ లక్షణాలను శక్తివంతంగా ప్రదర్శించారు. కొంత ప్రోత్సాహం మరియు ప్రేరణ కోసం ముగ్గురు వ్యక్తులను ఒకసారి చూద్దాం.
పౌలు వలె న్యాయముగా నడుచుకొనుట
అపొస్తలుడైన పౌలును తీసుకోండి. ఇద్దరు రోమా అధికారుల ముందు గొలుసులతో నిలబడి, తప్పుడు ఆరోపణలు వేయబడి, తన న్యాయాధిపతుల అనైతిక స్వభావం గురించి బాగా తెలిసి కూడా, పౌలు సరైనది చేయాలని మరియు నిజాన్ని సున్నితంగా, తెలివిగా మాట్లాడాలని నిశ్చయించుకున్నాడు. అతను తన రాజ్యసంబంధమైన ప్రశ్నించేవారి నుండి తన గురించి ఏమీ దాచుకోకుండా, తన రక్తం తడిసిన చరిత్రను వివరించి మరియు తన గతాన్ని ఆకర్షణీయంగా చూపించే శోధనను ప్రతిఘటించడం ద్వారా ఆరంభించాడు. అందరు ఆలోచించునట్లుగా అతను తన జీవిత వస్త్రమును వాస్తవికంగా చిత్రీకరించాడు – ధైర్యం ప్రదర్శించాడు.
కానీ అతను తన గతాన్ని బహిర్గతం చేయటమే కాదు. పౌలు ధైర్యానికి కృపను జోడించి, అతడిని క్రొత్త జీవితానికి పిలిచిన పునరుత్థాన క్రీస్తును గురించి తన దర్శనమును వివరించాడు. ఒకప్పుడు పౌలు హింసలో నిమగ్నమై ఉన్నప్పటికీ, అతని లక్ష్యం ఇప్పుడు ప్రకటించుటలోనే ఉంది (అపొస్తలుల కార్యములు 26:12-16). కాబట్టి ప్రకటించటమే అతను చేసింది! ప్రతికూల జనుల మధ్య కూడా . . . సరైనది చేయాలనే మీకా ఆదేశాన్ని పౌలు శక్తివంతంగా స్వీకరించాడు.
యోసేపు వలె కనికరమును ప్రేమించుట
బైబిల్‌లోని అన్ని కఠినమైన ప్రారంభాలలో, యోసేపుదే అత్యంత కఠినమైనది కావచ్చు. అతని సహోదరులు, అతని గొప్పతనాన్ని చూసి విసిగిపోయి, అతన్ని ఒక గుంటలో పడేశారు, అతన్ని దాసునిగా అమ్మివేశారు మరియు అతని తండ్రియైన యాకోబుకు తాను ఎక్కువగా ప్రేమించు కుమారుడు చంపబడ్డాడని చెప్పారు (ఆదికాండము 37). సరియైన సంబంధాలులేని ఈ కుటుంబానికి ఇది ఎలా ఉంది? తర్వాతి కొన్ని సంవత్సరాలు యోసేపుకు అనేక ఎత్తుపల్లాలు ఎదురైయ్యాయి: ఐగుప్తులోని బానిస ప్రాంతం నుండి ఒక ప్రముఖ గృహంలో ప్రధాన సేవకునిగా . . . ఒక అశుద్ధమైన ఐగుప్తీయుల జైలు నుండి ఐగుప్తునంతటికి ప్రధానమంత్రి అయ్యే వరకు (ఆదికాండము 39-41).
అలాగే కరువు సమయంలో ఆహారం కోసం యోసేపు సహోదరులు ఐగుప్తుకు వెళ్లినప్పుడు, అతని ఉన్నత స్థానం అతని పగ విషయమై ప్రతీకారం తీర్చుకునే అవకాశాన్ని కల్పించింది. కానీ యోసేపు అందుకు భిన్నంగా చేశాడు. అతను వారిని క్షమించడమే కాదు, వారికి ఆహారాన్ని అందించాడు, పైగా అతను వారిని ఐగుప్తులోని అత్యుత్తమ ప్రాంతానికి తరలించాడు. కరువు సమయంలో తన కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి దేవుడు అతన్ని ఐగుప్తుకు పంపినట్లు యోసేపు అర్థం చేసుకున్నాడు, కాబట్టి అతను అత్యధికమైన కృపను చూపించాడు (ఆదికాండము 45:5-8; 50:20). కనికరమును ప్రేమించడం గురించి మాట్లాడదామా!
దావీదు వలె దీనమనస్సుకలిగి ప్రవర్తించుట
గొర్రెల కాపరుల కుటుంబంలో కడసారివారిగా ఉన్న దావీదు తన జీవితపు తొలినాళ్ళ నుండి వినయాన్ని నేర్చుకున్నాడు. లేదా అతనికంటే ఎంతో బలవంతుడైన గొల్యాతు నుండి విడిపించబడటానికి దేవునిపై ఆధారపడవలసి వచ్చినప్పుడు వినయం వచ్చి ఉండవచ్చు. బహుశా అతను సౌలు రాజు నుండి అనేక సంవత్సరాలు తప్పించుకుంటూ తిరిగిన కాలంలో దీనమనస్సుకలిగి ప్రవర్తించటం నేర్చుకొని ఉండవచ్చు. లేదా అతని ఎడతెగని సైనిక విజయాల తర్వాత వినయం వచ్చి ఉండవచ్చు-అతని జీవితంలో దేవుని క్రియ మూలంగా మాత్రమే అది సాధ్యమైంది. కానీ నిజమైన వినయం దావీదు నుండి ఇంకా ఎక్కువ కోరింది.
కీర్తన 51 లో, మనము అతన్ని విరిగిన మరియు నలిగిన వ్యక్తిగా చూస్తాము. విజయానికి దగ్గరగా కాకుండా-భయంకరమైన వైఫల్యం చవిచూసిన వెంటనే-వినయం యొక్క పాఠం నేర్చుకునే ముందు పరిస్థితులు తనకు వ్యతిరేకంగా మారాలని దావీదు తెలుసుకున్నాడు. దేవుడు మరియు ప్రజల ముందు తగ్గించబడినప్పుడు, అతను కృప, శుద్ధి మరియు పునరుద్ధరణ కోసం తన అవసరాన్ని గ్రహించాడు. దావీదు కఠినమైన అనుభవాల ద్వారా దేవుని యెదుట దీనమనస్సుకలిగి ప్రవర్తించటం నేర్చుకున్నాడు.
ఈ గొప్ప జీవితాలు మన హృదయాలను కదిలించి, క్రియలు చేయునట్లు ముందుకు నడిపిస్తాయి. ఇంకా చాలా మంది ఉన్నారు. మోషే తన ప్రజల తరపున దేవుని కృప కొరకు ప్రార్థించాడు. బాధలకు మందు దేవుని సార్వభౌమాధికారంలో ఉండటమేనని నెమ్మది పొందాడు. నిరంతర వ్యతిరేకత నేపథ్యంలో నెహెమ్యా ఏది సరైనదో అదే చేశాడు. మరియు తన జనులను కాపాడుకొనుటకు ఎస్తేరు తన్నుతాను తగ్గించుకుంది.
మీకా మాటల వెనుక ఉన్న సూత్రాలు ఈ ప్రాచీన పరిశుద్ధుల జీవితాల్లోకి చొచ్చుకుపోయాయి. వారు పూర్వకాలపువాండ్లు అయినప్పటికీ, వారి శక్తివంతమైన ఉదాహరణలు నేటికీ ఆచరణాత్మక అంతర్దృష్టిని అందిస్తూనే ఉన్నాయి.
ఈ సంవత్సరం మనలో ప్రతి ఒక్కరినీ బిజీగా ఉంచుతుంది. అయితే, మన జీవితాల్లో అధిక ఒత్తిళ్లు తలెత్తుతున్నప్పుడు, ఈ ఆచరణాత్మక సూత్రాల వైపు తిరుగుదాం-మనం సరైనది చేస్తున్నప్పుడు, కనికరమును ప్రేమిస్తూ, దీనమనస్సుకలిగి దేవుని యెదుట ప్రవర్తిస్తూ-ఈ గొప్ప జీవితాల నుండి నేర్చుకుందాం.