రెండవ రాజులు

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

మునుపటి అధ్యాయంలో మనము చూచినట్లుగా, 1 మరియు 2 రాజులు మొదట ఒకే చరిత్ర పుస్తకముగా కూర్చబడింది. రచయిత ఎవరనేది ఈ పుస్తకంలో సూచించబడలేదు, పండితులకు కూడా తెలియదు. మొత్తానికి రచయిత ఒక ప్రవక్తయై ఉంటాడు. ఎందుకంటే దీనిలోని చాలా చారిత్రక సంఘటనలు దేవునితో వారు చేసిన నిబంధన పట్ల ఇశ్రాయేలు మరియు యూదా ప్రజలు చూపిన విశ్వాసము లేదా అవిశ్వాసమును గూర్చి వ్రాయబడ్డాయి. ఎజ్రా, యెహెజ్కేలు, యిర్మీయా అందరూ ఈ పుస్తకానికి వీలైన రచయితలుగా పేర్కొనబడ్డారు.

మనమెక్కడ ఉన్నాము?

రెండవ రాజులు సుమారు క్రీ.పూ. 853 మొదలుకొని విభజించబడిన రాజ్యం యొక్క చరిత్రను కొనసాగించింది. క్రీస్తుపూర్వం 722 లో, శక్తివంతమైన అష్షూరు దేశం ఉత్తర రాజ్యంపై దాడి చేసి, ఇశ్రాయేలు ప్రజలను చెల్లాచెదురు చేసి, వారిని చెరగొనిపోయింది. ఆ సమయంలో యూదా మాత్రమే చెక్కుచెదరకుండా ఉంది. క్రీస్తుపూర్వం 612 లో అష్షూరీయుల రాజధానియైన నీనెవెను స్వాధీనం చేసుకున్న బబులోనీయుల చేతిలో అష్షూరు గొప్ప పరాభవాన్ని చవిచూసింది. క్రీస్తుపూర్వం 605 నాటికి బబులోను యూదాపై ఆధిపత్యం చెలాయించి, కొంతమంది బందీలను తీసుకెళ్లింది. క్రీ.పూ. 586 లో బబులోను యెరూషలేమును నాశనం చేసి అదనపు ఖైదీలను చెరలోనికి తీసుకువెళ్ళింది. ఆక్రమణదారులకు ఉపయోగపడతారనుకునే చాలా మంది ప్రజలను, అంటే ప్రవక్తయైన దానియేలు మరియు రాజకుటుంబ సభ్యుల వంటి వారిని, ప్రారంభంలోనే బబులోనుకు తీసుకువెళ్లిపోయారు. రాజుల కాలం ముగిసే సమయానికి, దేవుని ప్రజలు తమ వాగ్దాన దేశంలో నివసించలేదు. బబులోనీయుల సైన్యం యొక్క నాశనకరమైన, దహించివేసే, విధ్వంసక వ్యూహాల వల్ల దేశంలోని అనేక ప్రాంతాలు వాస్తవంగా జనావాసాలు లేకుండా తయారయ్యాయి. ప్రజలు బానిసలై, చెల్లాచెదురైపోయి, వారి శత్రువులచే నాశనం చేయబడ్డారు.

ఈ పుస్తకం ఒక రకమైన ఉపన్యాసంతో ముగుస్తుంది. బబులోను చేతిలో తోలుబొమ్మల వంటి రాజులు నెలకొల్పబడటానికి ముందు యెహోయాకీనును, అనగా యూదా యొక్క చివరి నిజమైన పాలకుడిని గూర్చి ఈ పుస్తకం చెప్పి ముగుస్తుంది. చాలా మట్టుకు రాజుల గ్రంథమును యిర్మీయా వ్రాసినట్లయితే, అతను బబులోనులో జరిగిన ఈ భాగాన్ని వ్రాయలేడు. ఎందుకంటే అతన్ని కొన్ని సంవత్సరాల క్రితం ఐగుప్తుకు తీసుకువెళ్లిపోయారు.

రెండవ రాజులు ఎందుకంత ముఖ్యమైనది?

రెండవ రాజులు అనేక ప్రత్యేకమైన సంఘటనలు మరియు వ్యక్తులను కలిగి ఉన్నది. ఇద్దరు వ్యక్తులు మృతులలోనుండి లేపబడ్డారు (2 రాజులు 4:32–37; 13:20–21). ప్రవక్తయైన ఏలీయా చనిపోకుండా భూమి మీదనుండి కొనిపోబడ్డాడు (2:1–18); బైబిల్లో అలా జరిగింది యింక కేవలం ఒకేఒక్క వ్యక్తికి మాత్రమే, అతడే హనోకు (ఆదికాండము 5:21-24). యొర్దాను నది యొక్క నీళ్ళు రెండుసార్లు విడిపోయాయి (2 రాజులు 2:8, 14). ఇవి మరియు ఇతర అద్భుత సంఘటనలు దేవుడు తన ప్రజల మధ్య నిరంతరం జరిగించుచున్న కార్యములకు సాక్ష్యమిస్తున్నాయి.

ఈ పుస్తకం ఆవరించిన కాల వ్యవధి ఇశ్రాయేలు‌లో మొదటి రచనా ప్రవక్తల ఆవిర్భావాన్ని చూసింది. ఆమోసు మరియు హోషేయ ఇశ్రాయేలు ప్రజల వద్దకు వెళ్ళారు. యెషయా, యోవేలు, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, యిర్మీయా యూదాలో ప్రవచించారు. రెండు సమూహాలు ప్రజలను పశ్చాత్తాపం చెందమని పిలిచి, దేవుని రాబోయే తీర్పులను గురించి హెచ్చరించాయి. ఏలీయా పరమునకు తీసుకొనిపోబడిన తరువాత రచయిత ఎలీషా పరిచర్యకు ఎక్కువ చోటును కేటాయించాడు. ఎలీషా చేసిన అనేక అద్భుతాలకు ప్రత్యేక శ్రద్ధ నిచ్చాడు.

ఇశ్రాయేలు రాజులలో ఎవ్వరూ దేవుని దృష్టిలో యథార్థముగా నడిచినట్లు వర్ణించబడలేదు; ప్రతి ఒక్కరూ ప్రజలను తీవ్రమైన విగ్రహారాధనలోనికి నడిపించారు. యూదా రాజులలో చాలామంది నీతిమంతులు ఉన్నారు, వారిలో ముఖ్యంగా యోవాషు, ఉజ్జియా, హిజ్కియా మరియు యోషీయా. విమోచన కోసం ప్రభువుపై నమ్మకం ఉంచడం ద్వారా హిజ్కియా అష్షూరీయులను అడ్డుకున్నాడు. తరువాత యోషీయా మరింత గొప్ప ఆత్మీయ సంస్కరణలను తీసుకువచ్చాడు. ఏదేమైనా, మోషే నిబంధన (ద్వితీయోపదేశకాండము 28) యొక్క శాపాలు అమలుకాకుండా దేశముపై దేవుని అంతిమ తీర్పును నిరోధించడానికి చేసిన ఏ ప్రయత్నమూ సరిపోలేదు.

రెండవ రాజులు యొక్క ఉద్దేశమేమిటి?

ప్రపంచ వ్యవహారాలు ఇశ్రాయేలు మరియు యూదా యొక్క భవితవ్యములో భారీ పాత్ర పోషించాయి. అయినప్పటికీ, 2 రాజుల రచయిత ఇశ్రాయేలు దుష్ట రాజుల నేతృత్వంలో జరిగిన మతభ్రష్టత్వాన్ని వారి దేశ వినాశనానికి కారణముగా చూపించాడు. ఈ దేశ వినాశనం అవిధేయులైన తన పిల్లలపై దేవుని తీర్పుగా ఎత్తి చూపాడు. తమ మార్గములను విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి రావాలని దేవుని ప్రవక్తల చేత పదేపదే హెచ్చరికలు పొందినప్పటికీ, ప్రజలు పాపములోనే జీవించడం కొనసాగించారు. వారు విచారించవలసిన విషయమేమంటే, విదేశీ ఆక్రమణదారులచే తమ దేశాన్ని నాశనం చేయడానికి దేవుడు అనుమతిస్తాడని వారు నమ్మలేదు.

అయినను దేవుడు దావీదుకు ఇచ్చిన వాగ్దానాన్ని మరచిపోలేదు. ఏదోయొక రోజు తన ప్రజలు తమ దేశానికి తిరిగివచ్చి వాగ్దానం చేయబడిన విమోచకుని కొరకు ఎదురుచూడటానికి దేవుడు ప్రజలలో శేషమును కాపాడాడు.

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

రెండవ రాజులు ఒక ముఖ్యమైన జీవిత పాఠాన్ని బోధించుచున్నది: చేసిన పనులకు పరిణామాలు ఉంటాయి. "మారుమనస్సు పొందండి! పాపం తీర్పును పొందుతుంది, ” అని దేవుడు ప్రవక్తల ద్వారా హెచ్చరించాడు. దేవుడు తాను చెప్పింది చేస్తాడనే సత్యాన్ని ఇశ్రాయేలు, యూదా జనులు తమ స్వానుభవముతో తప్పులు చేసి నేర్చుకున్నారు.

మనం ఎలా నేర్చుకుంటాం? మీ హృదయాన్ని పరిశీలించుకోండి. ఇది దేవుని పిలుపును నిరోధిస్తూ కఠినముగా ఉన్నదా? లేదా మీరు మీ పాపాన్ని అంగీకరించి ఆయన వైపు తిరిగి రాగలరా?