విలాపవాక్యములు

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

విలాపవాక్యముల పుస్తకంలో రచయిత పేరు లేకున్నను, ఈ గ్రంథము లోపల మరియు వెలుపల నుండి బలమైన ఆధారాల ప్రకారం రచయిత యిర్మీయా ప్రవక్తయని సూచిస్తున్నాయి. యూదా మరియు క్రైస్తవ సాంప్రదాయం రెండూ యిర్మీయాకు ఈ రచనను ఆపాదించాయి. మరియు పాత నిబంధన యొక్క గ్రీకు అనువాదమైన సెప్టువజింటు కూడా పుస్తక రచయితగా యిర్మీయాను నొక్కి చెప్పే గమనికను జతచేస్తుంది. అదియుగాక, ప్రారంభ క్రైస్తవ సంఘ నాయకుడైన జెరోమ్ పరిశుద్ధ గ్రంథమును లాటిన్ భాషలోకి అనువదించినప్పుడు, అతను యిర్మీయాను విలాపవాక్యముల రచయితగా పేర్కొన్నాడు.

హెబ్రీ భాషలో అసలు పేరు, ఎకా, అనగా “అయ్యో!” లేదా “ఎలా,” అని కొన్ని విచారకరమైన సంఘటనలపై ఏడుపు లేదా విలపించే భావం వచ్చేలా అనువదించవచ్చు.1 తరువాత పాఠకులు మరియు అనువాదకులు “విలాపవాక్యములు” అనే శీర్షిక స్పష్టమైన మరియు ఎంతో ఉద్వేగభరితమైన అర్థం అందిస్తున్న కారణంగా ప్రత్యామ్నాయంగా వాడారు. ఈ విలపించే ఆలోచనే చాలా మందికి యిర్మీయాను ఈ పుస్తకానికి అనుసంధానిస్తుంది. యెరూషలేము యొక్క నాశనము యొక్క పర్యవసానాలకు పుస్తక రచయిత సాక్ష్యమివ్వడమే కాదు, అతను దండయాత్రకు సాక్ష్యమిచ్చినట్లు తెలుస్తోంది (విలాపవాక్యములు 1:13–15). ఈ రెండు సంఘటనలు జరిగినప్పుడు యిర్మీయా ఉన్నాడు.

మనమెక్కడ ఉన్నాము?

"జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకియై దుఃఖా క్రాంతమాయెను?" (విలాపవాక్యములు 1:1), ఈ విధముగా విలాపవాక్యములు ప్రారంభమవుతుంది. ఆ పట్టణము మరేదో కాదు, యెరూషలేము పట్టణమే. క్రీ. పూ. 586 లో బబులోనీయుల దండయాత్ర నేపథ్యంలో యిర్మీయా పరిశుద్ధ పట్టణం యొక్క వీధులు మరియు ప్రాంతాల గుండా నడువగా నొప్పి, బాధ మరియు వినాశనం తప్ప మరేమీ చూడలేదు. యిర్మీయా తన భావోద్వేగమును వ్యక్తపరిచిన కారణంగా, అలాగే ఈ పుస్తకం సాధ్యమైనంతవరకు దండయాత్రకు దగ్గరగా ఉండుట వలన, క్రీ.పూ. 586 చివరిలో లేదా క్రీ.పూ. 585 ప్రారంభంలో వ్రాయబడి ఉంటుంది.

విలాపవాక్యములు ఎందుకంత ముఖ్యమైనది?

యోబు పుస్తకం వలె, విలాపవాక్యములు దైవజనుడు ప్రపంచంలోని చెడు మరియు బాధల ఫలితాల గురించి అబ్బురపడుతున్నట్లు చూపించింది. అయితే, యోబు విశదపరచలేని చెడుతో వ్యవహరించగా, యిర్మీయా పూర్తిగా యెరూషలేము చేతులారా తెచ్చుకున్న విషాదం గురించి విలపించాడు. ఈ గొప్ప నగర ప్రజలు పరిశుద్ధ దేవుని తీర్పును పొందారు, దాని ఫలితాలు వినాశకరమైనవి. ఈ పుస్తకం నడిబొడ్డున, అనగా ఈ లోకంలో పాపం యొక్క ప్రభావాలను గూర్చిన విలాపము మధ్యలో, ప్రభువునందు నిరీక్షణతో సమర్పించబడిన కొన్ని వచనాలు ఉన్నాయి (విలాపవాక్యములు 3:22-25). చుట్టుప్రక్కల చీకటి నడుమ బలంగా నిలబడిన ఈ విశ్వాస ప్రకటన, వారి స్వంత పాపం మరియు అవిధేయత యొక్క పరిణామాలతో బాధపడుతున్న వారందరికీ ఒక దారిచూపేలా ప్రకాశిస్తుంది.

విలాపవాక్యములు యొక్క ఉద్దేశమేమిటి?

విలాపవాక్యములలో ముందుకు వెళుతున్నపుడు, ఒకప్పుడు గర్వించదగిన యెరూషలేము నగరం నిర్జనమైపోవడాన్ని యిర్మీయా ఎన్ని రకాలుగా వివరించగలడో పాఠకులు చూచి విస్తుపోవటం తప్ప ఏమీ చేయలేరు. పిల్లలు తమ తల్లులను ఆహారం కొరకు వేడుకున్నారు (విలాపవాక్యములు 2:12), కన్యకలును యౌవనులును ఖడ్గములతో నరికివేయబడ్డారు (2:21), మరియు వాత్సల్యముగల తల్లులకు తమ పిల్లలు ఆహారమైయ్యారు (4:10). నగరం యొక్క మార్గములు కూడా దాని పరిస్థితిపై సంతాపం వ్యక్తం చేశాయి (1:4)! శిథిలాలతో పోగుపడిన ఈ నగరం యొక్క దుర్భర స్థితిని యిర్మీయా గుర్తించలేకపోయాడు.

ఈ వినాశనానికి యిర్మీయా స్పందనలో స్పష్టంగా కనిపించే బాధ యెరూషలేములోని భయంకరమైన పరిస్థితి యొక్క ప్రాముఖ్యతను స్పష్టంగా తెలియజేస్తుంది. తానే స్వయముగా మాట్లాడుతూ, యిర్మీయా ముట్టడి వేయబడిన నగరంలో బంధింపబడినవానిగాను, తన ప్రార్థనలను వినడానికి ఎవరూ లేనివానిగాను, మరియు శత్రువు బాణాలకు గురిగాను (3:7–8, 12) తనను తాను చిత్రీకరించుకున్నాడు. ఇటువంటి నిస్సహాయస్థితిలో ఉన్నప్పటికీ, యిర్మీయాకు ఏదో విధంగా ప్రభువుపై ఆశ పుట్టింది (3:21-24).

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

విలాపవాక్యములు మన పాపము విషయమై మనం దుఃఖపడటమే కాక, మనం ఆయనను భంగపరచినప్పుడు ప్రభువు దగ్గర క్షమాపణ కోరుకోవడం యొక్క ప్రాముఖ్యతను మనకు గుర్తు చేస్తుంది. యిర్మీయా కవిత్వంలో ఎక్కువ భాగం ఆక్రమిత నగరం యొక్క పడిపోయిన ఇటుకలు, ఈ ఇటుకల మధ్య ఉండే సిమెంటుకు పగుళ్ళు రావటముపైనే సంబంధము కలిగియున్నది. మీ స్వంత జీవితంలో అటువంటి నాశనమైన నగరాన్ని మీరు చూశారా? మిమ్మల్ని ఈ దశకు తీసుకువచ్చిన పాపం గురించి మీరు దుఃఖిస్తున్నారా? మీరు అన్య శక్తిచేత అధిగమించబడుచున్నారా? ప్రభువు యొద్ద నుండి కొంత ఆశ మీకు అవసరమైయున్నదా? విలాపవాక్యములు 3:17–26 వైపు తిరగండి, అక్కడ మీరు పాపం యొక్క పరిణామాల గురించి తెలుసుకొని, ఫలితాలతో బాధపడి, తన ఆశను మరియు నమ్మకాన్ని ప్రభువుపై ఉంచినవానిని కనుగొంటారు.

  1. Charles H. Dyer, "Lamentations," in The Bible Knowledge Commentary: Old Testament, ed. John F. Walvoord and Roy B. Zuck (Wheaton, Ill.: Victor Books, 1985), 1207.