గలతీయులకు

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

పౌలు పత్రికల్లో గ్రంథకర్తృత్వం విషయమై తక్కువగా ఆక్షేపించబడిన వాటిల్లో ఈ గలతీ పత్రిక ఎప్పుడూ ఉంటుంది. పౌలు దక్షిణ గలతీయలోని సంఘాలకు ఈ పత్రిక రాసాడు. ఆసియ మైనర్‌కు తన మొట్టమొదటి మిషనరీ ప్రయాణంలో ఈ ప్రాంతంలోని సంఘాలను ప్రారంభించడంలో పౌలు హస్తం ఉన్నది. ఈ సంఘములతో పౌలుకు ఉన్న సన్నిహిత సంబంధం పత్రిక ప్రారంభం నుంచీ వారితో బలమైన స్వరముతో మాట్లాడిన విధమును వివరించడానికి సహాయపడుతుంది. గలతీ పత్రిక పౌలును అత్యంత కోపిష్టిగా చూపించింది, ఎందుకంటే ఆ సంఘములలోని మారుమనస్సు పొందినవారు సత్య మార్గంలో ఉండాలని మరియు మోసమునకు పడిపోకుండా చూసుకోవాలని వారి అభిమానాన్ని కూడా పణంగా పెట్టాడు. వాస్తవానికి, తన ఉద్దేశ్యం యొక్క తీవ్రతను నొక్కిచెప్పడానికి, అతను తన లేఖకుడి నుండి సిరాను తీసుకొని, ఆ పత్రిక చివరను పెద్ద అక్షరాలతో తానే స్వయంగా వ్రాశాడు (గలతీయులకు 6:11).

మనమెక్కడ ఉన్నాము?

రోడ్డు మార్గములో పద్దెనిమిది నెలల తరువాత తన మొదటి మిషనరీ ప్రయాణం నుండి అంతియొకయకు తిరిగి వచ్చిన తరువాత, పౌలు గలతీయలో ప్రారంభించిన సంఘాలు కష్టకాలంలో పడిపోయాయని ఒక నివేదికను అందుకున్నాడు-ప్రత్యేకంగా, వారు తప్పులో పడిపోయారు. క్రైస్తవ విశ్వాసంలో ఉండాలంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారం జీవించాలని బోధించే ఒక యూదుల సమూహం గలతీ సంఘములలో ప్రభావాన్ని పొందింది. క్రీ.శ. 49 లో యెరూషలేము సభ‌కు హాజరు కావడానికి కొన్ని నెలల ముందు పౌలు ఈ పుస్తకాన్ని వ్రాశాడు, ఈ సమావేశంలో అపొస్తలులు ఈ అంశాన్ని లేవనెత్తారు (అపొస్తలుల కార్యములు 15:1–30).

గలతీయులకు వ్రాసిన పత్రిక ఎందుకంత ముఖ్యమైనది?

యెరూషలేము సభకు ముందే, ప్రారంభ సంవత్సరాల్లో సంఘములో క్రైస్తవ యూదులు మరియు క్రైస్తవ అన్యజనుల మధ్య సంబంధం సంకటములో పడి మొదటి నిజమైన వివాదంలో ఉన్నప్పుడు పౌలు వ్రాసిన ఈ పత్రిక జ్ఞానం మరియు స్పష్టతను తెలియజేస్తుంది. పౌలు యొక్క దూకుడు స్వరం, జాతి భేదాలతో సంబంధం లేకుండా, ప్రజలు క్రీస్తులో ఐక్యతను ఆలింగనము చేసుకోవటం అతనికి ఎంత ముఖ్యమో చూపిస్తుంది. ఇది అతనికి చిన్న సమస్య కాదు, ఎందుకంటే ప్రజలు పౌలు ప్రకటించిన సువార్తగాక భిన్నమైన సువార్త తట్టు తిరిగి సత్యమునుండి తొలగిపోయినందున, క్రీస్తును విడిచిపెట్టినవారిగా గలతీయులను పిలిచేంత దూరం పౌలు వెళ్లాడు (గలతీయులకు 1:6–9).

గలతీయులకు వ్రాసిన పత్రిక యొక్క ఉద్దేశమేమిటి?

పౌలు వారికి బోధించిన కృపాసువార్త నుండి గలతీయులు అంత త్వరగా పడిపోయినప్పుడు, వారు అపొస్తలుడిగా పౌలు అధికారానికి కూడా నమ్మకద్రోహం చేశారు. కాబట్టి పౌలు గలతీయులకు రాసిన పత్రికను ఆరంభించి రెండు అధ్యాయాలను వెచ్చించి కృపాసువార్తను గూర్చిన విషయాన్ని సమర్థించాడు. 3 వ అధ్యాయంలో మాత్రమే అతను వారి ప్రధానమైన లోపం దగ్గరకు వెళ్లడం ప్రారంభించాడు; అంటే, ఈ గలతీయులు మోషే ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులుగా తీర్చచబడాలని కోరుకున్నారు. దీనికి విరుద్ధంగా, ధర్మశాస్త్ర క్రియలవలన గాక, యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా నీతి కలుగునని పౌలు తన వాదనను ప్రజలకు తెలియజేసాడు.

గలతీయులు ఎదుర్కొన్న సమస్యలో కొంత భాగం అబద్ధ బోధకులు (జుడైజర్స్- అనగా ధర్మశాస్త్ర క్రియలు పాటించాలని చెప్పే క్రైస్తవ యూదులు) చేసిన ఒక వాదన వలన వచ్చింది. ఈ తప్పుడు బోధకులు దయతో మరియు స్వేచ్ఛతో జీవించడం అంటే చట్టవిరుద్ధమైన మరియు దిగజారిన జీవితాన్ని గడపటమేనని సూచించారు. అందువల్ల పౌలు పత్రిక యొక్క చివరి అధ్యాయాలలో, నీతి అనగా విశ్వాసం ద్వారా కృపగల చర్య-పాపపు జీవనశైలికి దారితీయవలసిన అవసరం లేదని స్పష్టం చేశాడు. క్రైస్తవులు పాపపు స్వభావం యొక్క బానిసత్వం నుండి విడుదల పొందినందున, ఇప్పుడు మనకొరకు పరిశుద్ధత యొక్క మార్గము తెరిచి ఉంచబడింది.

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

దౌర్భాగ్యముగా, గలతీ సంఘాలకు అబద్ధ బోధకులు (జుడైజర్స్- అనగా ధర్మశాస్త్ర క్రియలు పాటించాలని చెప్పే క్రైస్తవ యూదులు) తీసుకువచ్చిన తప్పుడు బోధ ఈనాటికీ పెరికివేయడం చాలా కష్టం. మనం ఒక సమతుల్యతతో నడవాలి-ఒక వైపు, ధర్మశాస్త్ర క్రియలవలన నీతిమంతులుగా తీర్చబడతారనే అబద్ధ బోధలో గలతీయులు యిబ్బంది పడినట్లు మనము ఆ బోధలో పడకూడదు, కానీ మరొక వైపు, ఏదైనా సరే అంగీకారయోగ్యమైనట్లు మనం జీవించలేము. క్రీస్తు పట్ల క్రైస్తవుని సమర్పణ, విశ్వాసం ద్వారా ఉచితమైన కృపమీద ఆధారపడి ఉంటుంది. కాని పౌలు గలతీయులకు చివరలో చెప్పినట్లుగా, ఇది ఆత్మానుసారముగా నడిచే జీవితానికి పరిణమిస్తుంది.

ఆత్మఫలం మీ జీవితంలో స్పష్టంగా కనబడుతుందా, లేదా మీరు శరీర ప్రకారం జీవిస్తున్నారా లేదా “స్వార్థం యొక్క నిర్బంధం” లో జీవిస్తున్నారా (గలతీయులకు 5:16–26 MESSAGE-ఆంగ్లములో ఒక అనువాదం)? చాలా తరచుగా మనం ఈ రెండు విషయాల్లో పట్టు కోల్పోతాము. మన రక్షణను సంపాదించడానికి ధర్మశాస్త్ర క్రియలతో ప్రయత్నం చేస్తాము లేదా మన పాపం గురించి నిర్లక్ష్య వైఖరితో ఉంటాము.

పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించడానికి ప్రోత్సాహకంగా గలతీయులలోని పౌలు మాటలను మీ స్వంత బలంతో కాకుండా మీ జీవితంలో మిమ్మల్ని బలపరచు దేవుని కృప యొక్క జ్ఞానము ద్వారా తెలుసుకోండి.