ఎస్తేరు

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

రాజసంగల పారసీకదేశపు ఆస్థానానికి బాగా తెలిసిన యూదుడే ఈ ఎస్తేరు పుస్తకానికి అజ్ఞాత రచయితయై ఉంటాడు. న్యాయస్థాన జీవితం మరియు సంప్రదాయాల యొక్క వివరణాత్మక వర్ణనలు, అలాగే పుస్తకంలో జరిగిన సంఘటనలు ప్రత్యక్ష సాక్షినే రచయితగా సూచిస్తున్నాయి. అతని దృక్పథం యూదులకు అనుకూలమైనందున, జెరుబ్బాబెలు ఆధ్వర్యంలో యూదాకు తిరిగి వచ్చిన శేషం కోసం యూదుడే ఈ పుస్తకాన్ని రచించి ఉంటాడని పండితులు నమ్ముచున్నారు. కొంతమంది మొర్దెకై రచయిత అని సూచించారు, అయినప్పటికీ ఈ పుస్తకంలో అతనికి లభించిన ప్రశంసలనుబట్టి చూస్తే, బహుశా అతనికంటే చిన్నవారైన సమకాలీనులలో ఒకరు రచయితయై ఉంటారని సూచిస్తున్నాయి.

కథ యొక్క ముఖ్య "తార" పేరే ఈ పుస్తకానికి పెట్టబడింది. హదస్సా అనే యూదుల యువతి తన సంరక్షకుడైన మొర్దెకై నుండి తీసుకోబడి, రాజు యొక్క అభిమానం, ప్రేమ కొరకు పోటీ పడవలసి వచ్చింది. అందాల పోటీకి ఏ మాత్రం అవకాశం లేని పోటీదారురాలు పారసీకదేశపు రాణిగా పట్టాభిషేకం చేయబడి ఎస్తేరు అని పేరు పెట్టబడింది. ఈ పేరుకు అర్థం “నక్షత్రం.”

మనమెక్కడ ఉన్నాము?

ఎస్తేరు పుస్తకంలోని సంఘటనలు క్రీ.పూ. 483 నుండి క్రీ.పూ. 473 వరకు రాజైన అహష్వేరోషు పాలన యొక్క మొదటి భాగంలో జరిగాయి. ఈ రాజు ఎస్తేరు‌ను తన రాణిగా ఎన్నుకున్నాడు. ఈ కాలంలో, యూదాకు తిరిగి వచ్చిన యూదులలో మొదటి శేషము మోషే ధర్మశాస్త్రము ప్రకారం ఆలయ ఆరాధనను తిరిగి స్థాపించడానికి కష్టపడుతున్నారు. కానీ ఎస్తేరు మరియు మొర్దెకై, అలాగే వీరితోపాటు యింక అనేకమంది యూదులు యూదాకు తిరిగి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. ఈ కథ సంభవించిన పారసీకదశపు రాజధానియైన షూషనులో తృప్తిగా జీవించగలమని అక్కడే ఉండిపోయారు.

ఈ పుస్తకం క్రీ.పూ. 470 తరువాత, బహుశా క్రీ.పూ. 424 లోపు, అనగా అహష్వేరోషు కుమారుడైన అర్తహషస్త పరిపాలనలో వ్రాయబడి ఉంటుంది.

ఎస్తేరు ఎందుకంత ముఖ్యమైనది?

పరిశుద్ధ గ్రంథములో దేవుని పేరును ప్రస్తావించని ఏకైక పుస్తకం ఎస్తేరు. అంతమాత్రమున దేవుడు లేడని చెప్పలేము. ఆయన ఉనికి కథ అంతటిలో వ్యాపించి యున్నది. ఆయన తన చిత్తమును నెరవేర్చుకోవటానికి "యాదృచ్చికమైనవాటిని" మరియు పరిస్థితులను సమన్వయం చేస్తూ తెర వెనుక ఉన్నట్లుగా మనం చూడవచ్చు.

రూతు పుస్తకం మాదిరిగానే, ఈ పుస్తకం చాలా నైపుణ్యంతో వ్రాసిన బైబిల్ పుస్తకాల్లో ఒకటిగా నిలుస్తుంది. ఉత్కంఠను క్రమపద్ధతిలో పెంచి పరిష్కరించడానికి ఎనిమిది విందులను ఉపయోగించి, రచయిత కథను అద్భుతంగా నిర్మించాడు. సంఘటనలు ఒకదానికొకటి విలోమంగా ప్రతిబింబించే ఒక హెబ్రీ సాహిత్య పరికరాన్ని ఉపయోగించాడు. కథను వినినటువంటి ప్రారంభ శ్రోతలు ముఖ్యమైన సంఘటనలను గుర్తించి, పెరుగుతున్న ఉద్రిక్తతను అవగాహనతో అనుసరించి ఉండివుంటారు.

దుష్టుడైన హామాను రాజు తరువాత అంతటి నాయకుడు. ఇతను అమాలేకీయుల రాజైన అగగు యొక్క వారసుడు. వీరు దేవుని ప్రజలకు పురాతన శత్రువులు (సంఖ్యాకాండము 24:7; 1 సమూయేలు 15:8). యూదులను నిర్మూలించే రోజును నిర్ణయించడానికి అతను "పూరు" అనబడే చీటిని వేశాడు (ఎస్తేరు 3:7-9). హామాను యొక్క కుట్ర (9:24-32) నుండి యూదులు విముక్తి పొందారు. అది గుర్తుచేసుకొని నేటికీ యూదులు పూరీము విందును జరుపుకుంటారు.

ఎస్తేరు యొక్క ఉద్దేశమేమిటి?

ఎస్తేరు పుస్తకం యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం పూరీము విందు యొక్క మూలాన్ని వివరించడమైనప్పటికీ, కథ గుండా ఒక గొప్ప విషయం ప్రకాశిస్తుంది. దేవుని సార్వభౌమాధికారం మరియు ఆయన విశ్వాస్యత ప్రతీ సన్నివేశంలో వ్యాపించి ఉన్నాయి. ఏదీ నిజంగా యాదృచ్చికం కాదని ఎస్తేరు పుస్తకం మనకు చెబుతుంది. దేవుని సార్వభౌమాధికారం ఎస్తేరుకు మొర్దెకై చేసిన హెచ్చరికలో ఎంతో అద్భుతంగా చెప్పబడింది: “నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను” (ఎస్తేరు 4:14).

ఎస్తేరుకి, మొర్దెకైకి సంఘటనలు అదుపులో లేనప్పుడు, తమ ప్రజలను నాశనం చేయుమని రాజు ఆదేశించినప్పుడు, చెడు విజయవంతం అయినప్పుడు. . . దేవుడు తన క్రియ జరిగించుచున్నాడు. ఆయన వారి చీకటి రోజులలో (ఎస్తేరు అంతఃపురానికి తీసుకొనిపోబడింది [2:1-16]), వారి నమ్మకమైన విధేయత (ఎస్తేరు రాజు ముందు తన ప్రాణాలను పణంగా పెట్టింది [5:1–3]), మరియు వారి విజయాల (హామాను యొక్క కుట్రని, అలాగే యూదులు తమ శత్రువులను నాశనం చేసిన [7–9] విషయాలను ఎస్తేరు పుస్తకం వెల్లడించింది) ద్వారా తన క్రియ జరిగించాడు. ఈ సందేశం స్పష్టంగా ఉంది: జీవితం అర్థం కానప్పటికీ దేవుడు సార్వభౌముడే.

దేవుడు తన వాగ్దానములను నెరవేర్చేవాడు కూడా. మొర్దెకై ఎస్తేరుతో ఇలా అన్నాడు: “నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనముగానున్న యెడల యూదులకు సహాయమును విడుదలయు మరియొక దిక్కునుండి వచ్చును గాని, నీవును నీ తండ్రి యింటివారును నశించుదురు” (ఎస్తేరు 4:14). దేవుడు అబ్రాహాము, దావీదులతో చేసిన తన నిత్యమైన నిబంధనను ఘనపరుస్తాడనే మొర్దెకై మాటలు అతని విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

జీవితం కష్టముగా ఉండవచ్చు. కష్ట సమయాలు సంభవిస్తాయి, బాధను నివారించలేము. జీవితం అర్ధం కానప్పుడు, మీరు దేవుని వైపు తిరుగుతున్నారా లేదా ఆయనకు దూరంగా ఉంటున్నారా? దేవుడు ఎల్లప్పుడూ ఉండువాడని ఎస్తేరు పుస్తకం మిమ్మల్ని ప్రోత్సాహపరచునుగాక. యేసు మనలను “స్నేహితులు” అని పిలిచాడు (యోహాను 15:15), మరియు పరిశుద్ధాత్మ మన “సహాయకుడు” (14:26). ఎస్తేరు చేసినట్లు విశ్వసించండి మరియు విధేయులై ఉండండి. దేవుడు తన మహిమ కోసం . . . మరియు మన మంచి కోసం అన్ని సంఘటనలను నిశ్శబ్దంగా అల్లటం చూడండి.