స్వీయ నియంత్రణ అని పిలువబడే ఈ క్రమశిక్షణను ఆచరిస్తే నియంత అవ్వాలనే కోరికను నిరోధిస్తుంది. క్రీస్తు లేని వ్యక్తి మీద కోరికలు ఆదేశిస్తాయి మరియు అతను లేదా ఆమె పాటిస్తారు. క్రీస్తులో ఉన్నవారు, ఆయన ఆత్మ యొక్క అధికారం క్రింద నివసిస్తూ, ఆయన చేత పాలించబడుతూ ఉన్నవారు, ఒకప్పటి శక్తివంతమైన ఈ నియంతను ధిక్కరించగలుగుతారు. తత్ఫలితంగా, ఇతరులు గమనించదగ్గ రూపాంతర మొందించు మార్పును మనం అనుభవిస్తాము.
నాలుక విషయానికొస్తే, మనం నోటిమాట విషయమై సంయమనం పాటిస్తాము. మన ఆహారం విషయంలో, మనం భోజనపు బల్ల యొద్ద సంయమనం పాటిస్తాము. (అలాగే నేను ఐస్ క్రీంను ఫ్రీజర్లో వదిలేస్తాను!) నిగ్రహానికి సంబంధించి, మనం భావోద్వేగ సంయమనాన్ని పాటిస్తాము. మన ఆలోచనలకు సంబంధించినదైతే, మనం మానసిక సంయమనం పాటిస్తాము. శరీరాశకు సంబంధించి, మనం నైతిక సంయమనం పాటిస్తాము. మనందరిలో మిగిలినవాటన్నిటికంటే మనల్ని ఎక్కువగా ప్రలోభపెట్టే అంశాలు ఉంటాయి, కాబట్టి మనం ఆత్మ యొక్క అధికారానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. మన ఉత్సాహమును లేదా మన కోరికను తీర్చుకోవడానికి మనం అడుగు వేసేముందు మనల్ని నివారించడానికి ఆయన అడుగుపెట్టి మనకి అధికారమిస్తాడు.
యథార్థముగా మాట్లాడుకుందాం. మూడు సెకన్ల విరామం ఎంతో వ్యత్యాసం కలిగిస్తుందని నేను కనుగొన్నాను. ఒక కోరిక నన్ను తాకిన వెంటనే, ఏదైనా చర్య తీసుకునే ముందు కేవలం మూడు సెకన్ల పాటు వేచి ఉండాలని నేను నిర్ణయించుకుంటాను. ఆ విరామ సమయంలో, పర్యవసానాలు ఏమైయుండవచ్చో నేను త్వరగా అంచనా వేస్తాను. ఈ చర్య నేను తరువాత ఇబ్బంది పడేదిగా ఉంటుందా? అన్ని కోరికలు చెడ్డవి కావు; కొన్ని మంచివి ఉంటాయి. ఆ మూడు సెకన్లు నన్ను ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితుల నుండి దూరంగా ఉంచాయి.*
కొలీన్ నుండి ఒక గమనిక: ప్రతిస్పందించడానికి బదులుగా విరామం తీసుకోవడం ప్రామాణికమైన జీవితాన్ని గడపడానికి తొలి మెట్లు. నేను ఈ ప్రక్రియను నా బ్లాగులో “వాస్తవంగా మారడం” అని పేర్కొన్నాను. క్లిష్ట పరిస్థితులలో, త్వరగా స్పందించే బదులు, భిన్నమైన, మంచి సమాధానాన్ని ఎంచుకోవటానికి కొన్ని క్షణాలు విరామం తీసుకోండి. ఈ విరామ సమయంలో, “వాస్తవంగా మారడం” ఎలా ఉంటుందో గుర్తు చేసుకోండి, అలాగే యథార్థమైన సమాధానం ఇవ్వండి.
*Adapted from Charles R. Swindoll, The Strength of Character: 7 Essential Traits of a Remarkable Life (Nashville: J. Countryman, 2007), 34-35. Copyright © 2007 by Charles R. Swindoll, Inc.