పెదవుల మీదుగా మరియు చేతివేళ్ల ద్వారా . . . ఆలోచనలు వాటంతట అవే చిక్కులలోనుండి తప్పించుకుంటాయి.
ముప్పై సంవత్సరాల క్రితం ఈ సారవంతమైన మాటను నేను నేర్చుకున్నాను, మరియు నేను దీనిని పరీక్షించిన ప్రతిసారీ, యిది పనిచేస్తుంది! సంక్లిష్టతను అర్థం చేసుకోవడంలో లేదా జటిలమైన దాన్ని స్పష్టం చేయడంలో నాకు ఇబ్బంది వచ్చినప్పుడు, నేను దాని గురించి మాట్లాడతాను లేదా వ్రాస్తాను. లేఖనాత్మక సత్యం విషయానికి వస్తే యిది బాగా సహాయపడుతుంది. కొన్ని విచిత్రమైన కారణాల వల్ల మానవ మెదడు వినడం ద్వారా దైవిక సమాచారాన్ని నిలిపి ఉంచుకొనుటకు ఇష్టపడదు.
ఉదాహరణకు, ఆనందం యొక్క ప్రాముఖ్యతను తీసుకోండి-లేదా, ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే, దేవునికి ఆనందంగా ఇవ్వడం. రెండవ కొరింథీయులకు 9:7 ఇలా చెబుతోంది: “సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.”
ఆ చివరి నాలుగు పదాలను మళ్ళీ చూడండి: “దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.” ఇక్కడ “ఉత్సాహము” అని అనువదించబడిన పదం యొక్క అసలు అర్ధం ఉల్లాసం అని ఉంది. అలాగే క్రొత్త నిబంధనలో ఇది ఈ ఒక్కసారే కనుగొనబడింది. ఉల్లాసంగా ఇచ్చువానిని దేవుడు ఎంతో గొప్పగా తలంచును.
క్రొత్త నిబంధనలో ఉల్లాసంగా ఇచ్చేవారిని గూర్చిన ఉదాహరణలు నేను మరికొన్ని ఆలోచించగలను: ఒనేసిఫోరు అనబడే వ్యక్తి పౌలును “అనేక పర్యాయములు ఆదరించెను” (2 తిమోతికి 1:16-18); అలాగే ఒక సంఘము-ఫిలిప్పీయులు-వీరు పౌలు అవసరములలో ఔదార్యము కలిగి పాలుపొందారు (ఫిలిప్పీయులకు 4:14-16).
ఇప్పుడు, ఇదంతా రోజువారీ జీవితంలోకి ఎలా రూపాంతరం చెందుతుంది? ఈ ఆలోచనలు మన జీవితంలో అర్థవంతమైన భాగాలుగా మారడానికి ఎలా వాటంతట అవే చిక్కులలోనుండి తప్పించుకుంటాయి? మనం ఇచ్చే విషయంలో ఆనందాన్ని పొందుకునే మార్గముల కోసం ఈ క్రింది నాలుగు సూచనలు చేయాలనుకుంటున్నాను.
దేవుడు మీకిచ్చిన బహుమానములను గూర్చి విచారించండి.
ఆయన మంచివాడుగా లేడా? ఆయన ఖచ్చితంగా నా విషయంలో ఉన్నాడు. నా అర్హతకు మించి ఆయన మంచిగా ఉన్నాడు. నా జాబితాలో మంచి ఆరోగ్యం, సామరస్యపూర్వకమయిన కుటుంబం, తగినంత ఆహారం, దుస్తులు మరియు ఆశ్రయం ఉన్నాయి. మిత్రులు. మంచి ఉద్యోగం. దేవుని అద్భుతమైన కృపను దృష్టిలో ఉంచుకుంటే, ఉత్సాహభరిత హృదయం మరియు దాతృత్వం కలిగి ఇవ్వడం చాలా సహజమైన ప్రతిస్పందనలుగా కనిపిస్తాయి.
దాతృత్వం గురించి ఆయన ఇచ్చిన వాగ్దానాలను మీరే గుర్తు చేసుకోండి.
విస్తారంగా విత్తేవారికి విస్తారమైన పంటను వాగ్దానం చేసే పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని సూత్రాలను గుర్తుకు తెచ్చుకోండి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ఎంత ధన్యమో యేసు స్వయంగా చెప్పాడు. విస్తారమైన పంటలు ఇవ్వటం దేవుని ప్రత్యేకతలు, కాబట్టి అత్యధికమైన విత్తనాలను చల్లకుండా మనల్ని నిరోధించడానికి మన దగ్గర ఏమీ లేదు. ఆయన అటువంటి విశ్వాసము వలన ఘనపరచబడ్డాడు.
మీ హృదయాన్ని పరీక్షించుకోండి.
మీ కోసం మరెవరూ చేయలేని విషయమిది. మీ వ్యక్తిగత ఖజానాగదికి ఎలా చేరాలో ఎవరికీ తెలియదు. కఠినమైన ప్రశ్నలను అడగడం ద్వారా మీరు మాత్రమే దాని విషయాలను లోతుగా పరిశీలించగలరు: దాతృత్వం కలిగి ఇవ్వడం విషయమై దేవుని వాగ్దానాలను నేను నిజంగా నమ్ముచున్నానా? నేను శ్రద్ధ వహిస్తున్నందువల్లనా లేదా నేను అపరాధ భావనతో ఉన్నందువల్లనా నేను స్పందిస్తున్నానా? నా ఆదాయానికి అనుగుణంగా నేను ఇస్తున్నానా? నేను ప్రార్థించానా, లేదా నేను హఠాత్తుగా ఇస్తున్నానా? నేను స్థిరంగా ఇచ్చేవాడినా లేదా విచారించేవాడినా?
ఔదార్యముగలవారుగా మారి దేవుణ్ణి మహిమపరచండి.
ఆయన దాతృత్వాన్ని, మరి ముఖ్యంగా సంతోషకరమైన దాతృత్వాన్ని ఎంతో విలువైనదిగా చూస్తాడు. బహుశా మనం బాగా సాంప్రదాయికంగా, జాగ్రత్తగా ఉండే అలవాటునుండి వేరుకావాలి. ఒక విధంగా, సాహసమైనా మనం గట్టిగా నమ్మింది చేయటానికి సిద్ధపడటం మరియు ఆర్థిక సంబంధమైన విషయాల్లో మన విశ్వాసం ఘనపరచబడుటకు నిజంగా దేవుణ్ణి విశ్వసించడం ద్వారా . . . బహుశా మన దాతృత్వ క్రియలతో మనం “ఉలికిపడాలేమో.”
అంతేనండి. పెదవులు మరియు చేతివేళ్ల ద్వారా కొద్దిగా స్పష్టీకరణ. దీన్ని సమీక్షించడానికి ఇవి నాకు సహాయపడినవి. ఇవి మీకు కూడా సహాయపడినవని నేను నమ్ముతున్నాను. క్రీస్తు పనికోసం ఆర్థికంగా సహాయం చేయటం విషయమై మనమెందుకు వెనుకాడుచున్నామో ఎవ్వరికీ తెలియదు. అన్నింటినీ మించి, సంతోషకరమైన దాతృత్వమే మన లక్ష్యం, కాదా?
Adapted from Charles R. Swindoll, “Joyful Generosity,” in The Finishing Touch: Becoming God’s Masterpiece (Dallas: Word, 1994), 100-101. Copyright © 1994 by Charles R. Swindoll, Inc. All rights reserved. Used by permission.