అంతయు దేవుని సొంతమై ఉన్నది

ఐరిష్ నాటక రచయిత మరియు పాతకాలవు రచయిత అయిన ఆస్కార్ వైల్డ్, ది పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే లో ఇలా వ్రాశాడు, “డబ్బే సర్వస్వమని ఈ రోజుల్లో యువతీయువకులు ఊహించుకుంటున్నారు . . . అయితే వారు ముసలివారైనప్పుడు వారికి తెలుస్తుంది!”1 డబ్బు గురించి నేను ముఖ్యంగా ఇష్టపడే మరొక ప్రకటన మాజీ హెవీవెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ జో లూయిస్ నుండి వచ్చింది: “వాస్తవానికి, నాకు డబ్బంటే ఇష్టంలేదు, కానీ అది నన్ను శాంతంగా ఉంచుతుంది.”2 ఒక స్త్రీ యొక్క అవసరాల గురించి మాట్లాడినప్పుడు సోఫీ టక్కర్ నుండి వచ్చిన మాటలు నాకెప్పటికీ ఇష్టమైనవి: “పుట్టినప్పటి నుండి పద్దెనిమిదేండ్ల వరకు అమ్మాయికి మంచి తల్లిదండ్రులు అవసరం; పద్దెనిమిది నుండి ముప్పై ఐదేండ్ల వరకు ఆమెకు అందం అవసరం; ముప్పై ఐదు నుండి యాభై-ఐదేండ్ల వరకు ఆమెకు మంచి శరీర రూపం అవసరం, మరియు యాభై-ఐదు నుండి, ఆమెకు డబ్బు అవసరం!”3

డబ్బు ఎంత ముఖ్యమైనప్పటికీ, అది కొనలేనివి కొన్ని ఉన్నాయని మనందరికీ తెలుసు. ఈ ఉదాహరణలను పరిశీలించండి:

డబ్బు మందును కొనగలదు, కానీ ఆరోగ్యాన్ని కాదు.
డబ్బు ఇల్లును కొనగలదు, కానీ ఇల్లును కాదు.
డబ్బు సాంగత్యాన్ని కొనుగోలు చేయగలదు, కానీ స్నేహితులను కాదు.
డబ్బు వినోదాన్ని కొనుగోలు చేయగలదు, కానీ ఆనందాన్ని కాదు.
డబ్బు ఆహారాన్ని కొనగలదు, కానీ ఆకలిని కాదు.
డబ్బు మంచాన్ని కొనగలదు, కానీ నిద్రను కాదు.
డబ్బు సిలువను కొనగలదు, కానీ రక్షకుణ్ణి కాదు.
డబ్బు మంచి జీవితాన్ని కొనుగోలు చేయగలదు, కానీ నిత్యజీవాన్ని కాదు.4

డబ్బు మరియు భౌతిక ఆస్తుల విషయానికి వస్తే, మనలో చాలా మంది, మనం పూర్తిగా నిజాయితీపరులమైతే, మనం ఏవైతే కలిగియున్నామో వాటి సొంతమై ఉన్నాము. అవిశ్రాంతమైన యజమానికి సేవ చేస్తున్న బానిసల మాదిరిగానే, పాతవైపోయేవి లేదా విరిగిపోయేవి మరియు మరమ్మత్తు అవసరమయ్యే వస్తువులను కొనుగోలు చేయగలుగుటకు, మనం మన జీవితకాలాన్ని డబ్బు సంపాదించడానికి ఉపయోగిస్తాము. ఆపై మనం ఆ వస్తువులన్నిటినీ మార్చడానికి లేదా మరమ్మత్తు చేయడానికి ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలి. కానీ మీకు స్వేచ్ఛనిచ్చే నాలుగు సాధారణ పదాలను మీకు ఇస్తాను-నిజమైన ఆర్థిక స్వేచ్ఛ. ఈ పదాలకు మూలం నేను కాదు, ఇంకా చెప్పాలంటే, అవి అంత లోతుగా అనిపించవు. కానీ మనల్ని ఆర్థిక దాస్యం నుండి విముక్తి చేయగల నాలుగు పదాలను నేనెప్పుడూ నా అధ్యయనాలన్నిటిలో చూడలేదు. ఇదిగో యివే అవి: అంతయు దేవుని సొంతమై ఉన్నది.

ఈ వాక్యములను జాగ్రత్తగా చూడండి.

 • నిర్గమకాండము 19:6: “సమస్తభూమియు నాదేగదా.”
 • ద్వితీయోపదేశకాండము 10:14: “చూడుము; ఆకాశము, మహాకాశము, భూమియు, అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే.”
 • యోబు 41:11: “ఆకాశవైశాల్యమంతటి క్రింద నున్నదంతయు నాదే గదా.”
 • కీర్తన 24:1: “భూమియు దాని సంపూర్ణతయు, / లోకమును దాని నివాసులును యెహోవావే.”
 • 1 కొరింథీయులకు 6:19: “మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు.”
 • 1 కొరింథీయులకు 7:23: “మీరు విలువపెట్టి కొనబడినవారు.”
 • 1 తిమోతికి 6:7: “మనమీలోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొని పోలేము.”

మన దేవుడు లేకపోతే మనం దివాలా తీసిన శవాల్లాగా ఉండేవాళ్లం. మన దగ్గర ఉన్నదంతా ఆయనదే. మనం వట్టిచేతులతో ఈ లోకంలో పుట్టాము, మరియు మనం వట్టిచేతులతో మాత్రమే కాకుండా, జేబుల్లేని దుస్తులు ధరించి మరీ ఈ లోకాన్ని విడిచిపెడతాము. మీరొక్కసారి ఆగి దాని గురించి ఆలోచించినప్పుడు, మన ఆత్మలకు కూడా జేబులు లేవు. మనతేపాటు ఏదీ మనం తీసుకుపోము. అంతయు దేవుని సొంతమై ఉన్నది.

జాన్ వెస్లీ ఈ విధంగా చెప్పాడు, “పరలోకం మరియు భూమి యొక్క యజమాని మిమ్మల్ని ఉనికిలోకి తీసుకువచ్చి, ఈ లోకంలో పెట్టినప్పుడు, ఆయన మిమ్మల్ని ఇక్కడ ఒక యజమానిగా కాకుండా, ఒక సేవకుడిగా పెట్టాడు.”5

గృహనిర్వాహకత్వం అనేది దేవుని సంపదను దేవుని మార్గంలో, దేవుని ఉద్దేశాల కోసం మరియు ఎల్లప్పుడూ దేవుని మహిమ కోసం నిర్వహించటమే. మన చేతులను విశాలంగా చాచి, వాటిలో ఏమీ లేకుండానే మన జీవితాన్ని ప్రారంభిస్తాము. మనం పరిపక్వం చెందుతున్నప్పుడు, దేవుని దయ ద్వారా, కొన్ని విషయాలను మనం కలిగి ఉండటానికి ఆయన కొన్నిటిని అనుమతిస్తాడు, వాటిలో ఏవీ మన యాజమాన్యంలో ఉండవు. గుర్తుంచుకోండి, ఆకాశం మరియు భూమిలోని ప్రతిదీ ఆయన సొంతం. ఇదంతా ఆయనదే.

కాబట్టి, మన జీవితాలను తెరచిన చేతులతో జీవిస్తూ, ఆయనను ప్రసన్నం చేసుకకంటున్నాము. ఆయన మనకు అప్పగించిన వాటిని గృహనిర్వాహకులముగా మాత్రమే అంగీకరిస్తాము, ఎన్నడూ యజమానులుగా కాదు. ఆయన మనకు అప్పగించిన వాటిని అదుపులో ఉంచుకోవడం గురించి మనం ఆలోచించే ధైర్యం కూడా చేయము. మనం దేనిని గట్టిగా పట్టుకోము. ఆయన మనకు అప్పగించిన సంపదను మనం నిర్వహిస్తాము, వాటిని తెలివిగా పెట్టుబడి పెడతాము. అయితే ఆయన ఎప్పుడైనా ఆ వస్తువులను మన నుండి తీసివేస్తాడని, అది ఆయన సార్వభౌమ హక్కు అని ఎప్పటికీ మరచిపోకూడదు. ఆ సమయం మన జీవితాల నడుమ మనం అత్యంత సంపన్నమైన స్థితిలో ఉన్నప్పుడైనా కావచ్చు. మనం బాగా కూడబెట్టడానికి మరియు బాగా ఖర్చు చేయడానికి హక్కును సాధించామని అనుకున్నప్పుడు ఇది మన జీవిత ప్రారంభంలోనైనా జరుగవచ్చు. కూడబెట్టుకున్న సొమ్మంతా పోయినప్పుడు, జీవిత చరమాంకంలో పిల్లలు లేని గూడును తప్ప ఆశతో ఎదురుచూడటానికి ఏమీ లేనప్పుడు యిది జరుగవచ్చు.

మనం ప్రారంభించిన చోటుకే తిరిగి వచ్చాము: అంతయు దేవుని సొంతమై ఉన్నది. ఆ నాలుగు పదాలను గుర్తుంచుకుంటే మీరు ఎప్పటికీ ఆర్థిక ఇబ్బందుల్లో పడరు. అవి ఆర్థిక విషయాలపై మీ ఆలోచనలో విప్లవాత్మక మార్పులు తెస్తాయి. ప్రతి చెక్‌బుక్, ప్రతి పాకెట్‌బుక్, ప్రతి ఆదాయపు పన్ను చెల్లింపు, ప్రతి స్టాక్ లావాదేవీ, ప్రతి క్రెడిట్ కార్డ్, ప్రతి ఇంటి తనఖా, ప్రతి కారు టైటిల్, ప్రతి రియల్ ఎస్టేట్ ఒప్పందం మరియు ప్రతి వ్యాపార ఒప్పందం మీద “అంతయు దేవుని సొంతమై ఉన్నది” అని కనబడాలని నేను కోరుకుంటున్నాను. మన గృహముల్లోని అన్ని వస్తువుల మీద-మన ఇళ్ళతో సహా-జ్ఞాపికగా పెద్ద అక్షరాలతో ముద్రించబడాలని నేను కోరుకుంటున్నాను.

క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపడం గురించిన చక్కటి పుస్తకంలో రిచర్డ్ ఫోస్టర్ ఇలా రాశాడు,

సిరిని సూచించడానికి యేసు అరామిక్ పదమైన మామ్మన్ ను ఉపయోగించినప్పుడు, ఆయన దానికి శారీరిక మరియు ఆత్మీయ లక్షణాన్ని ఇస్తున్నాడు. “మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు” (మత్తయి 6:24) అని ప్రకటించినప్పుడు, ఆయన మామ్మన్ ను ప్రత్యర్థి దేవుడిగా వ్యక్తీకరిస్తున్నాడు. . . . మామ్మన్ మనపై ఆధిపత్యం చెలాయించటానికి చూసే శక్తి.6

ఫోస్టర్ వ్యక్తీకరించిన విధానాన్ని నేను ప్రేమిస్తున్నాను – డబ్బు “ప్రత్యర్థి దేవుడు,” అది “మనపై ఆధిపత్యం చెలాయించటానికి ప్రయత్నిస్తుంది.” లైంగిక వాంఛ లేదా కీర్తి వలె. ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. మీరు నిజంగా మీ జీవితాన్ని తెరచిన చేతులతో జీవిస్తున్నారా? లేదా మీరు దురాశతో-వస్తువులను, డబ్బును, పెట్టుబడులను, పలుకుబడిని అదుపులో ఉంచుకోవడానికి పోరాడుచున్నారా?

కవి మార్తా స్నెల్ నికల్సన్ నాకన్నా బాగా చెప్పింది.

ఒక్కొక్కటిగా ఆయన వాటిని నా నుండి తీసుకున్నాడు,
నేను చాలా అమూల్యంగా భవించినవన్నీ,
నేను రిక్త హస్తములతో ఉండువరకు;
మెరిసే ప్రతి బొమ్మ పోయింది.

నేను దుఃఖిస్తూ, దేశము యొక్క రహదారులపై నడిచాను
నా చింపిగుడ్డలు మరియు పేదరికంలో.
నేను ఆయన స్వరం ఆహ్వానించటం నేను వినే వరకు,
“ఆ వట్టిచేతులను నా వైపుకు ఎత్తండి!”

కాబట్టి నేను నా చేతులను స్వర్గం వైపు పట్టుకున్నాను,
మరియు ఆయన వాటిని సమృద్ధితో నింపాడు
తన సొంత ధననిధిలోనుండి
అవి పట్టజాలనంతగా.

చివరికి నేను గ్రహించాను
నా తెలివితక్కువ మనస్సుతో, మందబుద్ధితో,
దేవుడు తన ధనమును పోయలేడు
అప్పటికే నిండియున్న చేతుల్లోకి!7

ఆయనను నమ్మండి. దాని గురించి ఆలోచించవద్దు. మీకు ఒక ప్రధానమైన పని ఇవ్వబడింది: ఆయన మీకు అప్పగించిన దానికి మంచి గృహనిర్వాహకునిగా ఉండటం. ఎక్కువ తక్కువ కాకుండా పని చేయాలి. అంతయు దేవుని సొంతమై ఉన్నది.

 1. Oscar Wilde, The Picture of Dorian Gray (New York: Barnes & Noble Classics, 2003), 35.
 2. Joe Lewis, “Quotes,” in Joe Lewis: The Official Web Site, http://www.cmgww.com/sports/louis/quotes.htm (accessed October 11, 2010).
 3. Sophie Tucker, as quoted in Charles R. Swindoll, The Tale of the Tardy Oxcart and 1,501 Other Stories (Nashville: Word, 1998), 442.
 4. Charles R. Swindoll, Strengthening Your Grip: Essentials in an Aimless World (Dallas: Word, 1982), 84–85.
 5. John Wesley, “The Use of Money,” in Sermons on Several Occasions (New York: G. Lane & C. B. Tippett, 1845), 446.
 6. Richard J. Foster, Money, Sex & Power: The Challenge of the Disciplined Life (San Francisco: Harper & Row, 1985), 25–26.
 7. Martha Snell Nicholson, “Treasures” in Ivory Palaces (Moody Publishers, 1946), 67.

Copyright © 2010 by Charles R. Swindoll, Inc. All rights are reserved worldwide.

Posted in Stewardship-Telugu.

Accuracy, clarity, and practicality all describe the Bible-teaching ministry of Charles R. Swindoll. Chuck is the chairman of the board at Insight for Living and the chancellor of Dallas Theological Seminary. Chuck also serves as the senior pastor of Stonebriar Community Church in Frisco, Texas, where he is able to do what he loves most—teach the Bible to willing hearts. His focus on practical Bible application has been heard on the Insight for Living radio broadcast since 1979.

ఖచ్చితత్వం, స్పష్టత మరియు ఆచరణాత్మకత అన్నీ చార్లెస్ ఆర్. స్విన్డాల్ యొక్క బైబిల్-బోధనా పరిచర్యను వివరిస్తాయి. చక్ ఇన్సైట్ ఫర్ లివింగ్ కు బోర్డు ఛైర్మన్ మరియు డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ఛాన్సలర్. చక్ టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చ్ యొక్క సీనియర్ పాస్టర్‌గా కూడా పనిచేస్తున్నారు, అక్కడ ఆయన చాలా ఇష్టపడేదాన్ని చేయగలుగుతున్నాడు-ఇష్టపడే హృదయాలకు బైబిల్ నేర్పిస్తున్నారు. ఆచరణాత్మక బైబిల్ అనువర్తనంపై ఆయన దృష్టి 1979 నుండి ఇన్సైట్ ఫర్ లివింగ్ రేడియో ప్రసారంలో వినబడుచున్నది.