నేను మీతో ఒప్పుకుంటున్నాను, కొన్ని సందర్భాల్లో నేను దేవుని ఉద్దేశ్యం మరియు వాగ్దానం పట్ల సందేహం కలిగియున్నాను. అది చెప్పడానికి నేనెంతో సిగ్గుపడుచున్నాను. నేను అనుకున్నట్లుగా పనులు జరగనప్పుడు, అనగా నేను జరుగుతాయనుకున్నవి జరగనప్పుడు, జరగనవి జరుగుతున్నప్పుడు, నేను ఒక పరిస్థితి యొక్క చిక్కుముడిని విప్పలేనప్పుడు మరియు దానిని నేను దేవుని స్వభావమునకు యిమడ్చలేనప్పుడు . . . “ఇది సరైనది కాదని నాకు తెలుసు” అని నేను చెప్పిన సందర్భాలు అవి. దీని విషయమై, హెబ్రీయులకు వ్రాసిన పత్రిక యొక్క గ్రంథకర్త మోకరించి, ఇలా అంటున్నాడు, “దయచేసి, తార్కికంగా ఆలోచించడం కంటే, వేదాంతపరంగా ఆలోచించండి!” అది చాలా మంచి సలహా.
మీ జీవితం క్రుంగిపోయినప్పుడు, ఆశ సన్నగిల్లటం మొదలైనప్పుడు, మానవ తర్కం అస్సలేమీ అర్థం కానప్పుడు, వేదాంతపరంగా ఆలోచించండి! హెబ్రీయులకు 6:17-18 చదవండి:
ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైనవారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్దేశించినవాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులనుబట్టి, మనయెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను.
వేదాంత సంబంధమైన వాస్తవాలు ఏమిటంటే: (1) దేవునితో నిశ్చలమైన సంకల్పం ఉంది; మరియు (2) ఆ ఉద్దేశం వాగ్దానముతో ప్రమాణం చేయబడింది.
ఈ సమయంలో నేను జోడించాలి: ఇవన్నీ వేరొకరికి వివరించడానికి ప్రయత్నించవద్దు. మీరు చేయలేరు. మీరు చేయగలిగితే, మీరు దేవుడై ఉంటారు. మీరు వేదాంతపరంగా వివరించగల ఏకైక విషయం ఏమిటంటే, ఇది ఆయన మార్పులేని ఉద్దేశ్యంలో భాగం, వాగ్దానం ద్వారా ప్రమాణం చేయబడింది, రెండింట్లో ఏది అబద్ధం కాదు. అది వేదాంతపరమైన ఆలోచన. సొలొమోను చాలా చక్కగా చెప్పాడు: “దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన [దేవుడు] నియమించియున్నాడు” (ప్రసంగి 3:11).
నన్ను మీకు ఒక సిలోజిజం [త్రిపాద తర్కవాదం] ఇవ్వనివ్వండి-ఒక వేదాంత త్రిపాద తర్కవాదం:
సమయాలు మరియు కాలాలు దేవుని నియంత్రణలో ఉన్నాయి.
కొన్ని సమయాలు కష్టముగా మరియు కొన్ని కాలాలు నిర్జీవంగా ఉంటాయి. కాబట్టి సారాంశమేమంటే:
కష్టసమయాలు మరియు నిర్జీవకాలాలు దేవుని నియంత్రణలో ఉన్నాయి.
ఆశీర్వాదాలు ప్రవహించినప్పుడు-బ్యాంకు ఖాతాలో డబ్బులు నిండుగా పొర్లిపారుచున్నప్పుడు; ఉద్యోగం సురక్షితంగా ఉన్నప్పుడు, మరియు పదోన్నతి దగ్గర్లోనే ఉందనుకున్నప్పుడు; జీతం బాగున్నప్పుడు; మన ఆరోగ్యం బాగున్నప్పుడు మనం దేవుణ్ణి వెంటనే స్తుతిస్తాము. కానీ ఇవన్నీ నిజం కానప్పుడు నమ్మడానికి మాకు చాలా కష్టంగా ఉంది.
వేదాంతపరంగా ఆలోచించడం వల్ల కలిగే మూడు ప్రయోజనాలు
వేదాంతపరంగా ఆలోచించడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి; హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 6 వ అధ్యాయంలోని ఈ రెండు వాక్యాలలో మీరు ఆ మూడింటినీ చూస్తారు. 18 వ వచనాన్ని మళ్లీ చూడండి:
తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులనుబట్టి, మనయెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణా గతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను.
తార్కిక ఆలోచన మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది; వేదాంత ఆలోచన మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. అది మొదటి ప్రయోజనం. . . వ్యక్తిగత ప్రోత్సాహం. దీనిని నమ్మండి. మీకు “బలమైన ప్రోత్సాహం” లభిస్తుంది.
హెబ్రీయులకు వ్రాసిన పత్రిక యొక్క రచయిత పేర్కొన్న రెండవ ప్రయోజనం నిరీక్షణాశ్రయం. ప్రోత్సాహం నిరుత్సాహానికి వ్యతిరేకం. ఆశ నిరాశకు వ్యతిరేకం. కొన్నిసార్లు కాలాలు నిర్జీవమవటం మరియు సమయాలు కష్టంగా ఉండటం మరియు దేవుడు రెండింటినీ నియంత్రించుచున్నాడనే వాస్తవాన్ని మీరు అంగీకరించినప్పుడు, మీరు దైవిక ఆశ్రయ భావనను కనుగొంటారు, ఎందుకంటే ఆ నిరీక్షణ మీ మీద కాక దేవునిపై ఉంటుంది. అబ్రాహాము నిరీక్షించిన కాలంలో దేవునికి ఎందుకు మహిమ ఇచ్చాడో తెలుస్తుంది. “నేను దానిని గుర్తించలేను, నేను దానిని వివరించలేను, కానీ ప్రభువా, మీరు నాకు వాగ్దానం చేసారు. . . మరియు నేను పెరుగుతున్నప్పటికీ, నిరీక్షణ కాలం కోసం నేను మీకు మహిమ చెల్లిస్తాను.”
బలమైన ప్రోత్సాహం, నిరీక్షణాశ్రయం మరియు చివరి ప్రయోజనం కోసం, చదవండి:
ఈ నిరీక్షణ మన ఆత్మకు లంగరువలె ఉన్నది.
అది మూడవ ప్రయోజనం . . . ఆత్మ కోసం ఒక లంగరు. లంగరు అనే పదం ప్రాచీన సాహిత్యంలో-అలాగే అపొస్తలుల కార్యముల గ్రంథములో కూడా తరచుగా ఉపయోగించబడుతుంది-అయితే ఇది కేవలం ఒకసారి మాత్రమే హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో, అది కూడా ఇక్కడే హెబ్రీయులకు 6 వ అధ్యాయంలో ఉపయోగించబడింది. లంగరు రూపకంలో అనేక కీర్తనలు మరియు సువార్త పాటలు ఉన్నాయి. వాటిలో ప్రతి ఒక్కటీ “ఆత్మ యొక్క లంగరు” ను సూచించే ఈ వాక్యము దగ్గరకే వస్తాయి.
జపాన్‌లోని యోకోహామా నౌకాశ్రయ నగరానికి (పదిహేడు రోజుల తర్వాత!) మా ట్రూప్ షిప్ ఎప్పుడు వచ్చిందో నాకు స్పష్టంగా గుర్తుంది. మేము నౌకాశ్రయానికి చేరుకుంటున్నప్పుడు, ఓడ నాయకుడు మా ఓడను ఆపాడు మరియు అది ఒక పెద్ద, ఉబ్బిన తిమింగలం వలె లోతైన సముద్రంలో నిశ్శబ్దంగా ఉంది. నౌకనులాగు ఒక చిన్న పడవ నౌకాశ్రయాన్ని విడిచిపెట్టి, మా భారీ నౌక వైపు వచ్చినప్పుడు మేము మెరైన్స్ మండుటెండలో ఓడపైభాగం మీద వేచి ఉన్నాము. వెంటనే, ఒక చిన్న జపనీయుల పెద్దమనిషి మా ఓడ వైపు వచ్చారు మరియు చివరికి మా ఓడ నియంత్రణలను తీసుకొని మేము నౌకాశ్రయానికి సురక్షితంగా చేరే వరకు ఆయన వ్యక్తిగతంగా మార్గనిర్దేశం చేసారు. తర్వాత ఎవరో నాకు కారణం వివరించారు: జపనీయుల నౌకాశ్రయంలో ఇంకా మందుపాతరలు ఉన్నాయి. సముద్రంలో పదిహేడు రోజుల తర్వాత ఇది ఒక నవ్వించే ఆలోచన: “జపాన్‌కు స్వాగతం; మందుపాతరలు మీ కోసం సిద్ధంగా ఉన్నాయి!” అతను నౌకాశ్రయం యొక్క మోసపూరిత జలాల గుండా మరియు రేవు వరకు మాకు మార్గనిర్దేశం చేశాడు.
దీని ఉద్దేశ్యం, లంగర్లు మరియు ఓడ నాయకులు, ఓడలు మరియు నౌకాశ్రయాలు కాదు. విషయం ఏమిటంటే: జీవితం క్రుంగిపోయినప్పుడు యేసుక్రీస్తు సరిగ్గా ఇదే చేస్తారు.
మీరు చూసినట్లైతే, సందేహం, ఈ విధంగా మిమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది, “మీరు ఒంటరిగా ఉన్నారు. మరెవరికీ తెలియదు. లేదా మరెవరూ పట్టించుకోరు. దీని విషయమై మరెవరూ నిజంగా వచ్చి మీకు సహాయం చేయలేరు.” అయితే హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో, క్రీస్తు మన నిరంతర ప్రధానయాజకుడని రచయిత చెప్పాడు-సంవత్సరానికి ఒకసారి కాదు, ఎప్పటికీ. ఆయన దేవుని సన్నిధిలో నివసించుచున్నాడు. ఆయన అక్కడ ఉన్నాడు, తండ్రి వెంట కూర్చుని, ఆయన ముందు మీ అవసరాల విషయమై విజ్ఞాపన చేస్తున్నాడు. మరియు, దేవుని బిడ్డా, ఆయన బాధపడలేనంతగా మరియు దానిగుండా మీతో ఉండలేనంతగా మీరు భరించగలిగేంత గొప్పది ఏదీ లేదు.
కొంత ఆచరణాత్మక దృష్టికోణం
మీరు సందేహంతో వ్యవహరిస్తున్నప్పుడు, గుర్తుంచుకోవడానికి మూడు విషయాలు మీకు చెబుతాను. మొదటిగా, దేవుడు అబద్ధమాడనేరడు. ఆయన పరీక్షించగలడు, మరియు ఆయన అది చేస్తాడు. ఆయన కాదని చెప్పగలడు, మరియు ఆయన కొన్నిసార్లు అలా చేస్తాడు; ఆయన అవును అని చెప్పగలడు, మరియు ఆయన అది చేస్తాడు; ఆయన “వేచి ఉండండి” అని చెప్పగలడు మరియు అప్పుడప్పుడు ఆయన అది చేస్తాడు-కాని దేవుడు అబద్ధమాడనేరడు. ఆయన తన మాటను నిలబెట్టుకోవాలి. సందేహం ఇలా అంటుంది, “మూర్ఖుడా, నిన్ను దీనిగుండా ఉంచే దేవుని నమ్మడం మూర్ఖత్వం.” విశ్వాసం ద్వారా, దేవుడు అబద్ధమాడనేరడని గుర్తుంచుకోండి.
నాకు సహాయపడే రెండవ సలహా ఇక్కడ ఉంది: మనము ఓడిపోము. సందేహం ఇలా అంటుంది, “దీని విషయమై మీరు దేవుని విశ్వసిస్తే మీరు ఓడిపోతారు. మీరు ఓడిపోతారు.” నేను హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 6 వ అధ్యాయంలోని ఈ మొత్తం భాగం చదివితే, దేవుని స్వంత సమయానికి సంబంధించిన మర్మమైన పద్ధతిలో, కొన్ని వివరించలేని మరియు ఇంకా మార్చలేని ప్రయోజనం కోసం, ఆయనను విశ్వసించే మనం చివరికి గెలుస్తాము-ఎందుకంటే అంతిమంగా దేవుడు గెలుస్తాడు.
దేవుడు అబద్ధమాడనేరడు. మనము ఓడిపోము. నీ జీవిత భాగస్వామి నీ నుండి దూరమయ్యారా, అన్యాయమైన నిష్క్రమణ-నువ్వు ఓడిపోవు, దేవుని బిడ్డ. మీ శిశువు జన్మించి కొన్ని కారణాల వల్ల ఆ బిడ్డ ఈ భూమిపై ఉన్న దివ్యాంగులలో ఒకరిగా ఎంపిక చేయబడింది. మీరు ఓడిపోరు. మీరు ఎదురుచూస్తున్నారు మరియు ఎదురుచూస్తున్నారు, మరియు పరిస్థితులు మెరుగుపడతాయని మీకు నమ్మకం ఉంది, అయితే పరిస్థితులు మరింత దిగజారిపోయాయి-గుర్తుంచుకోండి, మీరు ఓడిపోరు. మార్చలేని వాగ్దానంతో దేవుడు దానిపై ప్రమాణం చేసాడు. మీరు ఓడిపోరు.
మూడవది – మరియు ఇది అన్నింటికన్నా ఉత్తమమైనది అని నేను ఊహిస్తున్నాను-మన ప్రభువైన యేసు విడిచిపెట్టడు. లేఖనం నుండి ఒక వాక్యం ఉదాహరిస్తే, ఆయన “సహోదరునికంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు” (సామెతలు 18:24).
నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధానయాజకుడైన యేసు అందులోనికి మనకంటె ముందుగా మన పక్షమున ప్రవేశించెను. (హెబ్రీయులకు 6:20)
దీని అర్థమేమంటే, ఆయన ఎప్పుడైనా . . . మరియు ఎల్లప్పుడూ అక్కడ ఉన్నాడు. మీపై ఏవైనా బాగా వాడేసినన సామెతలను ఉపయోగించడానికి ప్రయత్నించకుండా, క్రీస్తు తీసుకురాగల ఈ నిరీక్షణ, ఈ “ఆత్మ యొక్క లంగరు,” మాత్రమే మార్గం అని నేను చెబుతాను. యేసు క్రీస్తు తప్ప నా దగ్గర సమాధానం లేదు. నేను మీకు స్వస్థత ఇస్తానని వాగ్దానం చేయలేను, అలాగే మీ ప్రపంచం తిరిగి సర్దుకుంటుందని నేను అంచనా వేయలేను. కానీ మీరు ఆయనయందు విశ్వాసం కలిగియుంటే ఆయన మిమ్మల్ని స్వీకరిస్తారని నేను మీకు హామీ ఇవ్వగలను. మరియు ఆయన మీకు చాలా అవసరమైన నిరీక్షణను తిరిగి తీసుకువస్తాడు. శుభవార్త ఇది: ఆ నిరీక్షణ ఈ ప్రత్యేక శోధన గుండా మిమ్మల్ని దాటించడమే కాదు, మీరు చనిపోయినప్పుడు చివరికి మిమ్మల్ని “తెర లోపల” కు తీసుకువెళుతుంది.