మీ జీవితం అకస్మాత్తుగా కుప్పకూలినప్పుడు ఏమి జరుగుతుంది? అంటే మీరు అగ్నిప్రమాదం లేదా వరద వలన మీ ఇంటిని కోల్పోవడం వంటి పెద్ద విపత్తును ఎదుర్కొన్నప్పుడు? లేదా అనవసరమైన విడాకుల వలన, లేదా ఇంకా ఘోరంగా, మీకు ఎంతో ముఖ్యమైన ప్రియమైన వ్యక్తి మరణించుట వలన బాధపడుతున్నారా? మీరు దీర్ఘకాలంగా, తీవ్రమైన వ్యక్తిగత అనారోగ్యం లేదా బాధ అస్సలు దూరం కానప్పుడు ఏమి జరుగుతుంది? ఇలాంటి సమయాల్లో ఉన్నప్పుడు కొందరు దేవునిపై విశ్వాసం కోల్పోతారు. అయితే, ఇతరులు తమ బలమైన, లోతైన ఆత్మీయ మరియు నైతిక విశ్వాసాల ఫలితంగా తరచుగా జీవితానికి లోతైన అర్థాన్ని తెలుసుకుంటూ, భరించాలనే నిరీక్షణను కనుగొంటారు. ఈ ధైర్యవంతులైన ఆత్మలు దేవుడు జీవించి ఉన్నాడని మరియు ఆ భయంకరమైన సమయాల్లో కరుణ చూపిస్తాడని రుజువును చూస్తారు, అలా ఆయన వారి అవసరముల పట్ల లక్ష్యముంచుతాడు మరియు వారి స్వభావాన్ని శుద్ధి చేస్తాడు.
తన జీవితం కుప్పకూలిపోయినప్పుడు గొప్ప ప్రవక్తమైన యిర్మీయా అగాధంలోకి తేరిచూచాడు. విలాపవాక్యముల గ్రంథములో-తాను చూచినది మరియు భావించినది-మరియు నమ్మినది నమోదు చేశాడు. తన ప్రజలు, అనగా హెబ్రీయులు, తమ దేవుడైన యెహోవాను విడిచిపెట్టి, విగ్రహాలను ఆరాధించుటకు తమ హృదయములను త్రిప్పుకున్నప్పుడు బబులోనులో బంధీలుగా తీసుకువెళ్లబడ్డ భయంకరమైన పరిస్థితుల గురించి యిర్మీయా విచారం వ్యక్తం చేశాడు. యిర్మీయా యొక్క “కన్నులు కన్నీటిచేత క్షీణించినప్పటికీ” . . . మరియు అతని “యంతరంగము క్షోభిల్లినప్పటికీ” . . . మరియు అతని “కాలేజము నేలమీద ఒలుకుచున్నప్పటికీ,” అతడు ఇంకనూ యెహోవాయందే నమ్మిక యుంచుకొన్నాడు (విలాపవాక్యములు 2:11; 3:23-24). అద్భుతంగా లేదూ? యిర్మీయా యొక్క మాటలు ఈ విధంగా ఉన్నాయి:
నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన
మాచిపత్రిని చేదును జ్ఞాపకము చేసికొనుము.
ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసికొని నాలో క్రుంగియున్నది
అది నీకింకను జ్ఞాపకమున్నది గదా.
నేను దీని జ్ఞాపకము చేసికొనగా
నాకు ఆశ పుట్టుచున్నది.యెహోవా కృపగలవాడు
ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక
మనము నిర్మూలము కాకున్నవారము.
అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది
నీవు ఎంతైన నమ్మదగినవాడవు.
యెహోవా నా భాగమని నేననుకొనుచున్నాను
ఆయనయందు నేను నమ్మిక యుంచుకొనుచున్నాను.తన్ను ఆశ్రయించువారియెడల యెహోవా దయాళుడు
తన్ను వెదకువారియెడల ఆయన దయచూపువాడు.
నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ
కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది.
యౌవనకాలమున కాడి మోయుట నరునికి మేలు.
(విలాపవాక్యములు 3:19–27)
కాబట్టి, నన్ను మళ్లీ మిమ్మల్ని అడగనివ్వండి: మీ జీవితం అకస్మాత్తుగా కుప్పకూలినప్పుడు ఏమి జరుగుతుంది? యిర్మీయా ప్రకారం, మీరు బూడిదను తింటున్నట్లుగా మీకు అనిపిస్తుంది! కానీ ఈ రోజు, మీ నాలుకపై విషం యొక్క చేదు రుచి ఉన్నప్పటికీ, మీరు దేవుని ఆశ్రయించవచ్చని మరియు అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నదని గుర్తుచేసుకుంటూ, నూతన బలమును మరియు గొప్ప నిరీక్షణను కనుగొనవచ్చని యిర్మీయా ప్రకటించాడు.