తప్పిపోయిన పరిశుద్ధులను ఎలా దారిలోనికి తీసుకురావాలి

మీరు ఎప్పుడైనా మునిగిపోతున్న వ్యక్తిని రక్షించారా? అలా అయితే, అదుపు తప్పిన ఆ భయానక క్షణంలో బాధితులు తమను రక్షించువారితో తరచుగా ఎలా పోరాడతారో మీకు తెలుసు. తమ విశ్వాసపు నావ బద్దలైపోయి ఆత్మీయంగా తల్లడిల్లుతున్న వారిని రక్షించే ప్రయత్నం చేసినప్పుడు కూడా అదే తరచుగా జరుగుతుంది.

ప్రభువు నుండి దూరమయ్యి, చివరకు తనను నిజంగా ప్రేమించిన స్నేహితుడి సహాయంతో తిరిగి దారిలోకి తీసుకురాబడ్డ ఒక యువకుడి కథను రచయిత మరియు ఉపాధ్యాయుడైన హోవార్డ్ హెండ్రిక్స్ చెప్పారు. పరిపూర్ణమైన పశ్చాత్తాపం మరియు పునరుద్ధరణ జరిగినప్పుడు, అతను కడలిలో, లోతైన నీటిలో, లోతైన ఇబ్బందులలో ఉన్నప్పుడు మరియు అతని అతని స్నేహితులందరూ ఒడ్డున నిలుచుండి, అతనిపై న్యాయం, అపరాధము, మరియు తప్పుడు పనులను గురించి బైబిల్ సంబంధమైన ఆరోపణలు విసురుతున్నప్పుడు ఎలా అనిపించిందని డాక్టర్ హెండ్రిక్స్ ఈ క్రైస్తవుడిని అడిగాడు. అతను ఈ క్రింది విధంగా సమాధానమిచ్చాడు:

“నన్ను ఒడ్డునకు చేర్చడానికి ఒక్క వ్యక్తే ఉన్నాడు మరియు అతను నన్ను మునిగిపోనివ్వలేదు. నేను అతనితో పోరాడాను . . . [కానీ] అతను నా పోరాటాన్ని ప్రక్కకు నెట్టాడు మరియు అతను నన్ను పట్టుకున్నాడు మరియు అతను నా చుట్టూ లైఫ్ జాకెట్ వేసి నన్ను ఒడ్డుకు తీసుకొచ్చాడు. మరియు అతను, దేవుని కృపచేత, నేను పునరుద్ధరించబడటానికి కారణం. అతను నన్ను విడిచిపెట్టనివ్వలేదు.”
1

యాకోబు 4:11-12 లో, తప్పిపోయిన వారిని ప్రతిఘటించవద్దని యాకోబు క్రైస్తవులను నిషేధించలేదు; బదులుగా, దురుద్దేశపూర్వకంగా ఇతరులను దూషించే విశ్వాసులకు వ్యతిరేకంగా అతను హెచ్చరించాడు. మత్తయి 7:1-4 లో యేసు ఇదే విషయాన్ని నొక్కి చెప్పాడు. చాలా మంది క్రైస్తవులు ఈ రెండు వాక్యభాగాల నుండి తీసుకున్న తుది నిర్ణయాన్ని రెండే రెండు ముక్కల్లో చెప్పవచ్చు: తీర్పు తీర్చకుడి!

అయితే ఒక క్రైస్తవ సహోదరుడు లేదా సహోదరి ప్రభువు నుండి దూరమైన ఆ కాలముల సంగతేంటి? విశ్వాసపు ఓడ ధ్వంసమైన వారిని రక్షించడానికి మనం ప్రయత్నించకూడదా? లేదా మనం వారు నశించునట్లు వదిలేయాలా? మన మత్తయి వాక్యభాగంలోని యేసు మాటల పతాకసన్నివేశం ఈ గందరగోళానికి సమాధానం ఇస్తుంది. యేసు చెప్పిన ప్రకారం, ఇతర క్రైస్తవుల కన్నుల నుండి నలుసులు తీయడానికి ఒక సమయం ఉంది (7:5). కానీ గుర్తుంచుకోండి, మన శరీరంలో కంటి కంటే స్పర్శకు ఎక్కువ సున్నితమైన ప్రదేశాలు ఇంకొన్ని ఉన్నాయి. భౌతిక కన్ను నుండి దేన్నైనా తీసివేయడానికి తీవ్రమైన సున్నితత్వం అవసరం అయినట్లే, మన సహోదరుడు లేదా సహోదరి యొక్క కంటి నుండి ఆత్మీయ నలుసును తీసివేయడానికి ప్రయత్నించడం కూడా అంతే. విమర్శలకు “పిలువబడిన” వారిని యేసు వదిలేయడం లేదు. బదులుగా, ఇతరులను రక్షించే ముందు తమ స్వంత ఆత్మీయ నేత్రాలను శుభ్రం చేసుకోవడానికి ఇష్టపడే వారి సహాయాన్ని ఆయన స్వాగతిస్తున్నాడు.

యాకోబు సలహాను అర్థం చేసుకొనుట

ఆత్మీయ కంటి శస్త్రచికిత్సలో ఉన్న సాంకేతికతలను గురించి మరింత తెలుసుకోవడానికి, ఇప్పుడు 5:19-20 లోని యాకోబు మాటల దగ్గరకు వెళ్దాం. అతని కలం నుండి నాలుగు ముఖ్యమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మొదటిది, ఎవరి గురించి ఈ సలహా ప్రస్తావించబడింది? ఈ సలహాను చూచిన వెంటనే, తప్పిపోయిన ఆత్మలను నరకం నుండి రక్షించడం గురించి యాకోబు మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. అయితే, “నా సహోదరులారా” మరియు “మీలో” అనే పదాలు ఆయన విశ్వాసులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడని సూచిస్తున్నాయి.

రెండవది, యాకోబు ఈ మాటలను వ్రాయడానికి కారణం ఏమై ఉంటుంది? ఎవరో ఒకరు సత్యం నుండి తప్పిపోయి ఉండవచ్చు. గ్రీకులో “తొలగడం” అనే పదం ప్లనావో (planao) అని అంటారు, దీని నుండి మనకు గ్రహం (planet) అనే పదం వచ్చింది. ప్రాచీన గ్రీకులకు ఆంతరిక్ష సమూహములు ఆకాశంలో విహరిస్తున్నట్లు అనిపించింది. అలాగే, క్రైస్తవులు సత్యం నుండి తొలగిపోయినప్పుడు, వారు ఒకప్పుడు తమకు తెలిసిన నిర్దేశిత మార్గం నుండి తిరుగులాడతారు.2

మూడవది, వ్యక్తి దేని నుండి తొలగిపోయాడు? సత్యం నుండి. వ్యాఖ్యాత స్పిరో జోదియేట్స్ సత్యం నుండి వైదొలగడం అంటే ఏమిటనే దానిపై విస్తరించి చెప్పారు.

యాకోబు మాట్లాడే సత్యం సహజంగా ఏమిటంటే, యేసుక్రీస్తు అనబడే వ్యక్తి మరియు ఆయన క్రియలు. అతను వియుక్త తాత్విక లేదా వేదాంత వ్యవస్థను సూచించలేదు, కానీ “నేనే మార్గమును, సత్యమును, జీవమును” (యోహాను 14:6) అని చెప్పిన క్రీస్తును స్వయంగా సూచించాడు. వాస్తవానికి, ఇక్కడ “సత్యం” అనే పదానికి క్రీస్తు బోధించిన మరియు స్థాపించినవన్నీ వస్తాయని అర్థం. ఇది ఆయన యొక్క మొత్తం సిద్ధాంతపరమైన మరియు ఆచరణాత్మక బోధ-ఏదైనా ప్రత్యేక సంఘము లేదా తెగల బోధ కాదు, కేవలం క్రీస్తుదే. మరి ఈ బోధ ఎక్కడ దొరుకుతుంది? దేవుని వాక్యంలో, పరిశుద్ధ గ్రంథములో.3

నాల్గవది, ఏమి చేయాలి? ఇప్పుడు మనం చాలా సున్నితమైన భాగానికి వచ్చాము: మన సహోదరుని కంటిలోని నలుసును తొలగించడం. క్రైస్తవులు ఉద్దేశపూర్వకంగా సత్యం నుండి తొలగిపోయినప్పుడు, వారిని వెనక్కి తీసుకురావాలని యాకోబు చెప్పాడు, అంటే స్పష్టమైన కన్ను ఉన్న ఏ క్రైస్తవుడైనా-సంఘ నాయకులు మాత్రమే కాదు- తప్పిపోయిన వారిని దారిలోకి తీసుకురావడానికి సహాయం చేయాలి. డాక్టర్ హెండ్రిక్స్‌ ప్రస్తావించిన ఆ యువ క్రైస్తవునిపట్ల కొందరు చేసినట్లుగా, వారిని అలక్ష్యం చేయవద్దు లేదా దూరం నుండి విమర్శనాస్త్రాలను విసరవద్దు. వారిని చేరుకోండి మరియు వారిని మునిగిపోనివ్వవద్దు!

సరైన వైఖరి

ఇప్పుడు మనం తీసుకోవలసిన చర్య గురించి ఆలోచించాము గనుక, మనకు అవసరమైన సరైన వైఖరిని నిశితంగా పరిశీలించడం కోసం గలతీయులు 6:1 ను చూద్దాం. ఇతరులను సత్యానికి పునరుద్ధరించడంలో సహాయపడటానికి అర్హత పొందాలంటే, మనం మొదట ఆత్మతో నింపబడాలి మరియు శరీరముచేత నియంత్రించబడకూడదు. మనం ఇతరుల కళ్ళనుండి దూలములను తీసివేయడానికి ప్రయత్నించే ముందు మన స్వంత కళ్ళలో ఉన్న దూలములను తొలగించడంలో ఆత్మ సహాయం తీసుకోవాలి. ఆత్మీయంగా ఉన్నవారు మాత్రమే-ఆత్మపై పరిపూర్ణంగా ఆధారపడి అటువంటి ఆపరేషన్‌ను చేయడానికి అందుబాటులో ఉన్నవారు మాత్రమే-ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.

పౌలు పేర్కొన్న రెండవ అర్హత ఏమిటంటే సాత్వికమైన మనస్సు. ఐహిక క్రైస్తవులు సాధారణంగా విమర్శలకు చాలా సున్నితంగా ఉంటారు. కఠినమైన, విమర్శనాత్మక స్ఫూర్తితో వారిని సంప్రదించడం వైఫల్యం మరియు తిరస్కరణను మాత్రమే నిశ్చయపరుస్తుంది. కానీ ఒక సాత్వికమైన మనస్సు విశ్రాంతి తీసుకోవడానికి మరియు దేవునితో సమాధానపడడానికి తల్లడిల్లుతున్న వారిని ప్రోత్సహిస్తుంది.

మూడవది, మనం ఎవరినైనా రక్షించడానికి లోతైన నీటిలోకి దూసుకెళ్లే ముందు, మనం వినయంతో కూడిన దృక్పధాన్ని కలిగి ఉన్నామా అని నిశ్చయించుకోవాలి—“మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు.” సమస్య యొక్క లోతును తప్పుగా అంచనా వేయడం లేదా దానిని నిర్వహించగల మన సామర్థ్యాన్ని అతిగా అంచనా వేయడం వల్ల అది మనల్ని కూడా త్వరగా తల్లడిల్లజేస్తుంది.

నలుసులను తొలగించడం ఆహ్లాదకరమైన పని కాదు. సహాయం చేయడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నానికి వ్యతిరేకంగా కొట్టుచూ తన్నుచున్న వారిని రక్షించడంలో ఆనందం లేదు. వాస్తవానికి, నిజంగా తగ్గింపు స్వభావం గలవారు, అవతలి వ్యక్తిని సురక్షితంగా లాగడానికి తమలో శక్తి లేదని తెలుసుకుని, తరచుగా అడుగు పెట్టడానికి ఇష్టపడరు. అయినప్పటికీ, తండ్రి నుండి నిజమైన ప్రేమ కారణంగా, తగ్గింపు స్వభావముగలవారు మెల్లగా . . . ప్రార్థనాపూర్వకంగా, కష్టమైననూ ముందుకు కదులుతారు.

పునరుద్ధరణ క్రియ

ఇప్పటివరకు మనము తప్పిపోయిన పరిశుద్ధులను దారికి తీసుకురావడంలో ఇమిడియున్న చర్య మరియు వైఖరిని చూసాము. ఇప్పుడు యాకోబు 5:20 కి తిరిగి వెళదాం, వారు పునరుద్ధరించబడినప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం.

మొదటి ఫలితం ఏమిటంటే, తప్పిపోయిన పరిశుద్ధుని యొక్క ఆత్మ “మరణం నుండి” రక్షించబడుతుంది. మరణం అనే పదానికి అర్థం ఏమిటంటే ఈ వ్యక్తి దేవుని వైపు తిరుగకపోతే, అతను లేదా ఆమె దైవిక క్రమశిక్షణలో మరణించి ఉండవచ్చు. అయితే, యాకోబు దృష్టిలో మరణమనేది విశాల దృక్పథంలో, ఉపమాన రూపంలో చెప్పబడినదని అర్థం. తప్పిపోయిన పరిశుద్ధులను మనము ప్రభువు వైపుకు త్రిప్పినప్పుడు, వారి ఆత్మలను ఒంటరితనం, చేదు, వేదన మరియు అపరాధ భావనల యొక్క మరణకరమైన స్థితి నుండి కాపాడినవారమవుతాము.

రెండవ ఫలితం ఏమిటంటే మనం “అనేక పాపములను కప్పివేస్తాము.” ఒప్పుకోలు మరియు పశ్చాత్తాపం ద్వారా ఎవరైనా తిరిగి మందలోకి తీసుకురాబడినప్పుడు, క్రీస్తు యొక్క క్షమాపణ ఈ మునుపు తప్పిపోయిన గొర్రెను పూర్తిగా కప్పివేస్తుంది.

సారాంశం మరియు అన్వయము

యాకోబు తన లేఖ అంతటా, క్రైస్తవులు జారిపోవడం ప్రారంభించిన నిర్దిష్ట ప్రాంతాలను గుర్తించాడు: పరీక్షల సమయంలో అనుమానించడం, శోధించబడినప్పుడు నిందించడం, కోపం మరియు పక్షపాతం, జీవచ్ఛవమైన మేధోవాదం, వాగెడు నాలుక, అసూయ, అహంకారం, తీర్పు తీర్చడం, దేవుడు లేకుండా ప్రణాళిక వేయడం, సంపద మూలంగా ఇతరులను ఉపయోగించుకోవడం, మరియు ప్రార్థన లేకపోవడం-కొన్నిటిని మాత్రమే ఉటంకించాను. ఈ ఐదు అధ్యాయాల కొరకు, యాకోబు మనల్ని రక్షించడానికి వస్తున్నాడు. ఇప్పుడు మనం ఒకరినొకరు రక్షించుకోవడం గురించి అతని సలహాను స్పష్టీకరించడం ద్వారా ముగించుదాం.

ముందుగా, ఇతరుల కళ్ల నుండి నలుసులను తొలగించడంలో మనం పాలుపంచుకోవాల్సిన ఖచ్చితమైన సందర్భాలు ఉన్నాయి. రెండవది, మొత్తం ప్రక్రియ తప్పనిసరిగా పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో ఉండాలి. మూడవది, చర్య ఎంత ముఖ్యమైనదో ఉద్దేశ్యం లేదా వైఖరి కూడా అంతే ముఖ్యం. మరియు నాల్గవది, మనము ప్రభువుచే ప్రేరేపించబడినప్పుడు, ఇతరులను ప్రతిఘటించటానికి మనము అయిష్టంగా లేదా అసందర్భంగా భావించకూడదు. మీరు ఆ వ్యక్తిని మరణం నుండి రక్షిస్తున్నారని మరియు అనేక పాపములను కప్పివేయుచున్నారని గుర్తుంచుకోండి. విడిచిపెట్టవద్దు!

  1. As noted by Charles R. Swindoll, in a sermon titled “Set Me Free,” given at the First Evangelical Free Church of Fullerton, California, January 25, 1981.
  2. The implication here is that James is talking to believers, because only those who have intimately known the truth can stray from it. Unbelievers cannot stray from something they have never known.
  3. Spiros Zodhiates, The Behavior of Belief (Grand Rapids, Mich.: William B. Eerdmans Publishing Co., 1959), 217.

Adapted from Insight for Living, “How to Handle Straying Saints,” James: Hands-on Christianity Study Guide (Plano, Tex.: Insight for Living), 127-131. Copyright © 2003 by Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.

Posted in Church-Telugu, Leadership-Telugu, Sin-Telugu.

Pastor Charles R. Swindoll has devoted his life to the accurate, practical teaching and application of God’s Word. He is the founding pastor of Stonebriar Community Church in Frisco, Texas, but Chuck’s listening audience extends far beyond a local church body. As a leading programme in Christian broadcasting since 1979, Insight for Living airs around the world. Chuck’s leadership as president and now chancellor emeritus at Dallas Theological Seminary has helped prepare and equip a new generation of men and women for ministry.

పాస్టర్ చార్లెస్ ఆర్. స్విండాల్ దేవుని వాక్యాన్ని నిర్దిష్టంగా, ఆచరణాత్మకంగా బోధించడానికి మరియు అన్వయించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చి వ్యవస్థాపక కాపరియై ఉన్నారు, అయితే చక్ యొక్క శ్రోతలు స్థానిక సంఘ పరిధి దాటి వ్యాపించి ఉన్నారు. 1979 నుండి క్రైస్తవ ప్రసరణలో ప్రముఖ కార్యక్రమంగా, ఇన్‌సైట్ ఫర్ లివింగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసారమవుతోంది. డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ప్రెసిడెంటుగా, అలాగే ఇప్పుడు ఛాన్సిలర్ ఎమెరిటస్‌గా చక్ యొక్క నాయకత్వం క్రొత్త తరం స్త్రీపురుషులను పరిచర్య కొరకు సిద్ధపరచడంలో సహాయపడింది.