దివంగత ఫుట్‌బాల్ వ్యూహకర్త విన్స్ లోంబార్డి ప్రాథమిక విషయాల గురించి ఎంతో పట్టుదల కలిగియుంటాడు. ఆయన నాయకత్వంలో ఆడినవారు ఆటలో ధైర్యం కోసం ఆయన ఉద్రేకము, ఆయన ప్రేరణ, ఆయన అంతులేని ఉత్సాహం గురించి తరచుగా మాట్లాడేవారు. ఆయన పదేపదే అడ్డుకోవడం మరియు ఎదిరించి పోరాడటమనే ప్రాథమిక పద్ధతుల దగ్గరకే వచ్చేవాడు. ఒక సందర్భంలో అతని జట్టు, గ్రీన్ బే ప్యాకర్స్, బలహీనమైన జట్టు మీద ఓడిపోయింది. ఓడిపోవడం ఒక పెద్ద తలనొప్పి . . . కానీ ఆ జట్టు చేతిలో ఓడిపోవడం అస్సలు క్షమించరానిది. కోచ్ లోంబార్డి మరుసటి రోజు ఉదయం ప్రాక్టీస్‌కు రమ్మని పిలిచాడు. విజేతల బృందంగా కాక దిగాలుగా చూస్తూ, ఆటగాళ్ళు నిశ్శబ్దంగా కూర్చున్నారు. వారు ఎవరికైతే ఎక్కువ భయపడతారో ఆ వ్యక్తి నుండి ఏమి ఆశించవలసి వస్తుందో వారికి అర్థం కావటంలేదు.
ఒక ఆటగాని తర్వాత యింకొక ఆటగాణ్ణి తదేకదృష్టితో చూచుచూ పళ్ళు కొరుకుతూ, లొంబార్డి ఇలా మొదలుపెట్టాడు:
“సరే, మనము ఈ ఉదయమున మూలపాఠముల వైపు తిరుగుదాం. . . . ”
అందరూ చూడగలిగేంత ఎత్తులో ఫుట్‌బాల్‌ని పట్టుకుని, ఆయన ఈ క్రింది విధంగా అరుస్తూనే ఉన్నాడు:
“పెద్దమనుషులారా, ఇది ఫుట్‌బాల్!”
మీరు యింకెంత మూలానికి వెళ్లగలరు? ఆయన దగ్గర 15 నుండి 20 సంవత్సరాలుగా మైదానంలో ఆడుతున్న కుర్రాళ్లు అక్కడ కూర్చొని ఉన్నారు . . . వారికి తమ పిల్లల పేర్ల కంటే ఆట గురించి బాగా తెలుసు . . . అయితే అటువంటి వారిని ఆయన ఫుట్‌బాల్‌కి పరిచయం చేస్తున్నాడు! ఇది ఎలా ఉందంటే, “మాస్ట్రో, ఇది ఒక దండం” అని చెప్పినట్లు ఉంటుంది. లేదా, “లైబ్రేరియన్ గారు, ఇది ఒక పుస్తకం.” లేదా, “ఓడసిపాయీ, ఇది తుపాకీ.” లేదా, “అమ్మా, ఇది ఒక వంటపాత్ర.” తెలిసినదాని గురించి మాట్లాడితే ఎలా!
ఎందుకని ఒక అనుభవజ్ఞుడైన కోచ్ నైపుణ్యముగల క్రీడాకారులతో ఇలా మాట్లాడతాడు? మొత్తానికి, ఇది పని చేసింది, ఎందుకంటే కోచ్‌లు తమ జట్లను వరుసగా మూడు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల గెలుపు వైపు అన్ని వేళలా నడిపించలేరు. కానీ–ఎలా? లోంబార్డి ఒక సాధారణ సిద్ధాంతముతో నడిపించాడు. క్రీడ యొక్క మూలాలను పరిపూర్ణం చేయడం ద్వారా అత్యుత్తమ స్థాయిని సాధించవచ్చని ఆయన విశ్వసించాడు. అబ్బురపరిచే, ప్రేక్షకులను ఆహ్లాదపరిచే, రిస్క్ తీసుకునే ఆటలు క్రీడాస్థలమును నింపుతాయి (కొంతకాలం పాటు) అలాగే కొన్ని గేములు కూడా (అప్పుడప్పుడు) గెలుస్తాయి, కానీ ముఖ్యమైన విషయమేమిటంటే, తెలివిగా, అప్రమత్తంగా, దృఢ నిశ్చయంతో ఫుట్‌బాల్‌ను ఆడే జట్లే నిలకడగా విజయాన్ని సాధించేవారై ఉంటారు. ఆయన వ్యూహమేమిటి? మీ స్థానమును తెలుసుకోండి. సరిగ్గా ఎలా చేయాలో తెలుసుకోండి. తరువాత మీ పూర్ణశక్తితో చేయండి! ఆ సాధారణ ప్రణాళిక గ్రీన్ బే, విస్కాన్సిన్ జట్టును, ప్రసిద్ధికెక్కించింది. లోంబార్డి రాకకు ముందు, ఇది అడపాదడపా మెరిసే జట్టుగా ఉండేది.
ఫుట్‌బాల్ ఆటలో పనిచేసినదే సంఘములో కూడా పనిచేస్తుంది. కానీ క్రైస్తవమత గుంపులో, కొంచెం గందరగోళం చెందడం సులభం. దీన్ని మార్చి చెప్పాలంటే: చాలా గందరగోళం చెందుతాము. ఈ రోజు మీరు “సంఘము” అని అన్నారంటే, అది ఒక మాల్ట్‌ను ఆర్డర్ చేసినట్లుగా ఉంటుంది . . . రోజుకొకటి చొప్పున మీరు ఎంచుకోవడానికి 31 రకాలు ఉంటాయి. మీరు వ్యాపారము చేసే వారిని, పాములను ఎత్తి పట్టుకునే వారిని, స్వార్థపూరితంగా ఉండేవారిని, పాజిటివ్ థింకర్స్‌ని, లేదా వ్యక్తిత్వాన్ని గ్రహించుకునే వారిని ఎంచుకోవచ్చు. రంగు లైట్లతో రాక్ బ్యాండ్‌లు, క్రూరత్వంతో కప్పబడిన “యాజకులు,” ఆధిపత్యం చెలాయించే అందమైన ప్రదేశాలు, మరియు అద్భుతమైన నటనతో ఆకట్టుకొని స్వస్థపరిచే చేతులు కూడా అందుబాటులో ఉన్నాయి. అది సంతృప్తిపరచకపోతే, మీకు ఇష్టమైన ఇజం కోసం వెతకండి అది ఖచ్చితంగా దొరుకుతుంది: మానవతావాదం, ఉదారవాదం, అపరిమితమైన కాల్వినిజం, రాజకీయ క్రియాశీలత, కమ్యూనిజం వ్యతిరేకత, అతీంద్రియ ఆత్మవాదం లేదా మౌలికవాదంతో పోరాడటం.
కానీ ఆగండి! సంఘము యొక్క సంపూర్ణమైన మూలాలు ఏమిటి? బైబిల్ ఆధారిత స్థానిక సంఘము యొక్క ప్రాథమిక పని ఏమిటి? అవసరం లేని ప్రతిదాన్ని వడబోయడం, మిగిలింది ఏమిటి?
కోచ్ మాట విందాం. మనల్ని మనం సంఘము అని పిలుచుకోవాలంటే మనకు నాలుగు ప్రధాన ప్రాధాన్యతలు ఉంటాయని దేవుడు మనకు చెప్పుచున్నాడు:
బోధ . . . సహవాసము . . . రొట్టె విరుచుట . . . ప్రార్థన. (అపొస్తలుల కార్యములు 2:42)
ఈ నాలుగింటికీ మనల్ని మనం నిరంతరం సమర్పించుకోవాలి. దృఢమైన, సమతుల్యమైన, “జయము” నొందు సంఘాలు ఆ ప్రాథమికాలను పరిపూర్ణం చేసే పనిలో ఉంటాయి. సంఘము యొక్క విధానం ఏమిటో ఇవి రూపొందిస్తాయి.
ఎలా అనేది కూడా అంతే ముఖ్యం. మళ్లీ, కోచ్ జట్టును ఉద్దేశించి ప్రసంగించుచున్నాడు. పనిని పూర్తి చేసే సంఘము దేనిలో నిమగ్నమై ఉంటుందో ఆయన ప్రకటించుచున్నాడు:
పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభి వృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును. (ఎఫెసీయులు 4:12)
“హే, ఇది తేలికే,” అని మీరు అనుకుంటున్నారు. “ఇంతకంటే సులభంగా యింకేమి చేయగలం?” అని మీరు అడుగుచున్నారు. మీరు అదిరిపడటానికి సిద్ధంగా ఉన్నారా? ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఈ ప్రాథమిక అసైన్‌మెంట్‌లను నిర్వహించడమే కష్టతరమైన పని. అనివార్యమైన వాటిని వదిలి ఇతర కార్యకలాపాలలో పాల్గొనడం ఎంత సులభమో చాలామందికి అస్సలు ఆలోచనే లేదు.
నన్ను నమ్మండి; ఆరోగ్యకరమైన, సహాయకరమైన మూలాల నుండి నిరంతరాయంగా విజ్ఞాపనలు వస్తున్నాయి, వాటి కోసం పుల్పిట్‌ను ఒక వేదికగా ఉపయోగించుకోవాలి. నేను మరలా చెబుతున్నాను– మంచి మరియు ఆరోగ్యకరమైన విషయాలే కానీ అనివార్యమైనవి కాదు . . . మన ప్రాథమిక ఉద్దేశ్యంతో నేరుగా సంబంధం లేనివి: వ్యాఖ్యానం, వివరణ, ఔచిత్యంతో పరిశుద్ధ గ్రంథము యొక్క అన్వయం, ఉత్సాహం, స్పష్టత మరియు నిశ్చయత. ప్రప్రథమముగా, పుల్పిట్ పరిచర్య అంటే ఇదే.
కానీ మన దేశమంతటా అటువంటి సంఘములు చాలా అరుదు; ఇది మిమ్మల్ని నిలబెట్టి ఈ విధంగా చెప్పేలా చేస్తుంది:
“ప్రియులారా, ఇది పరిశుద్ధ గ్రంథము!”
Copyright © 2010 by Charles R. Swindoll, Inc.