గత అపరాధములు ప్రభావితం చేయకపోవడం: క్షమించబడిన అనుభూతికి కలిగే అడ్డంకులను అధిగమించడం

ప్యూరిటన్ పరిచారకుడైన రిచర్డ్ బాక్స్టర్ అనవసరమైన అపరాధ భావమును మోయడం వల్ల కలిగే భావోద్వేగాల గురించి హెచ్చరించాడు: “ఆ దుఃఖం, పాపం గురించి అయినా సరే, మరీ ఎక్కువ అవుతుందేమో. ఆ విపరీతమైన దుఃఖం మనిషిని మ్రింగేస్తుంది.”1 రెవరెండ్ బాక్స్టర్ క్షమాపణను అనుభవించని వ్యక్తుల భావాలను తన అద్భుతమైన పాత ఆంగ్లంలో స్వాధీనపరచాడు. గత పాపాలపై దుఖం వారిని తీవ్ర విషాదంలో ముంచేస్తుంది. అపరాధం వారిని మింగేస్తుంది, మరియు తాము మునిగిపోతున్నట్లుగా వారు భావిస్తారు.

విశ్వాసులుగా, క్షమించబడటం అంటే ఏమిటో మేధోపరంగా మనలో చాలామంది అర్థం చేసుకుంటాము. క్రీస్తు మరణం మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తుందని మనకు తెలుసు. ఆయనపై మన విశ్వాసాన్ని ఉంచడం ద్వారా, మన ప్రభువుతో ఎప్పటికీ మారని శాశ్వతమైన సంబంధంలోనికి మనం రక్షింపబడతాము. ఒక క్రైస్తవుడిగా మారిన తర్వాత కూడా మనం పాపం చేసినప్పటికీ, మన పాపాన్ని ఆయనతో ఒప్పుకొని, పశ్చాత్తాపపడే హృదయంతో ప్రభువు వైపు తిరిగినప్పుడు, ఆయన మన పాపాన్ని కడిగివేస్తాడు. మన పాపాన్ని మనం ఒప్పుకున్నప్పుడు, దేవుడు “నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును” (1 యోహాను 1:9).

అయితే కొన్నిసార్లు, ప్రజలు దేవునితో సమాధానకరమైన అనుభూతిని కనుగొనలేకపోతున్నామని తెలుసుకుంటారు. వారు ఎంత తరచుగా ఒప్పుకున్నా మరియు వారి పాపానికి పరిహారం చేయడానికి వారు చేయగలిగినదంతా చేసిన తర్వాత కూడా, వారు తమను తాము క్షమించరానివారుగా భావిస్తారు. విడాకులు, గర్భస్రావం లేదా వ్యభిచారం వంటి వారి పాపములు-దేవుడు క్షమించడానికి సాధ్యముకానివిగా అనిపించవచ్చు. వారు ప్రతిరోజూ తమతోపాటు తమ అపరాధ భారాన్ని మోస్తూనే ఉంటారు, దేవునితో వారి సంబంధం శాశ్వతంగా దూరమైపోయిందనే భావనతో క్రుంగిపోతారు. బహుశా అపరాధం యొక్క నీళ్లు మిమ్మల్ని కొట్టుకొనిపోవచ్చు, అలాగే మీరు దుఃఖం మరియు విచారంలో మునిగిపోతున్నట్లు మీకు అనిపించవచ్చు. మీ గతాన్ని మరచిపోయి ముందుకు కొనసాగకుండా మరియు క్షమించబడే అనుభూతి లేకుండా మిమ్మల్ని నిరోధించేది ఏమైయుండవచ్చు?

గత పాపాలతో పోరాడుతున్న వారిలో సాధారణంగా కనిపించే ఐదు తప్పు ఆలోచనా విధానాలను నేను గమనించాను. ఈ ఆలోచన “అడ్డంకులను” దాటడమే క్షమించబడినట్లు భావించే రహదారిపై మొదటి మెట్టు . . . తద్వారా స్వేచ్ఛ లభిస్తుంది.

అడ్డంకి #1: “నేను చేసింది చాలా ఘోరమైనది. దేవుడు క్షమిస్తాడని నాకు తెలుసు, కానీ దీనికి మాత్రం నేను క్షమించబడలేను.”

ఈ అవరోధం చాలా మంది నిజాయితీగల విశ్వాసులను చిక్కుల్లో పెడుతుంది ఎందుకంటే ఇది పాపం విషయమై ఎంతో ఎక్కువగా దుఃఖించాలని చెబుతుంది. ఇది న్యాయమైన ప్రతిస్పందనగా అనిపిస్తుంది; మన పాపం యొక్క గంభీరతను తక్కువగా అంచనా వేయకూడదు.

అయితే పై ప్రకటనలో నిజాయితీగా చూస్తే అది నిజంగా వినయపూర్వకమైనది కాదని అలాగే అది నిజం కాదని తెలుస్తుంది. నిజానికి, క్రీస్తు మరణం అన్ని పాపాలకు పరిహారం చెల్లించడానికి సరిపోదని ఇది సూచిస్తుంది. “బహుశా ఆయన ప్రాయశ్చిత్తం ప్రపంచంలోని మిగిలిన పాపాలను కప్పివేస్తుంది. కానీ యేసు మరణం దీనిని కప్పలేదు,” అని మనం చెబుతున్నట్లుగా ఉంది. మనం మన ప్రత్యేక పాపాన్ని ప్రత్యేకమైన చెడ్డదిగా మరియు క్రీస్తు యొక్క పరిహారం సరిపోనిదిగా చేశాము.

ఇది సత్యానికి ఎంత దూరంగా ఉంది! మన పాపం దేవుని క్షమాపణకు ఆక్షేపణీయమైతే, “ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వారందరును రక్షణపొందుదురు” (అపొస్తలుల కార్యములు 2:21) అని ప్రకటించినందున లేఖనం అబద్ధమవుతుంది. ఆక్షేపణలు లేవు!

నిజం ఏమిటంటే, మన పాపం మిగిలిన మానవజాతి పాపముల కంటే అధ్వాన్నంగా లేదు (అలాగని మంచిది కూడా కాదు). ప్రభువు దృష్టిలో అన్ని పాపాలు చెడ్డవే. అయితే క్రీస్తు మరణం సరిపోతుంది (కొలొస్సయులకు 1:20-21; హెబ్రీయులకు 7:24-25 చూడండి). మనం యిప్పటివరకు చేసిన మరియు చేయబోయే అన్ని తప్పులను కప్పడానికి-అనేకమారులు కప్పడానికి ఇది చాలా ఎక్కువ. ఏ పాపమూ దేవుని క్షమాపణకు అసాధ్యము కాదు.

అడ్డంకి #2: “క్షమించబడాలంటే నా పాపాలకు నన్ను నేనే శిక్షించుకోవాలి.”

మన పాపాలకు పరిహారం తీర్చుకోవాలనే సహజమైన కోరిక మనకు ఉంటుంది. తప్పు చర్యలు శిక్షకు అర్హమైనవని మనము అర్థం చేసుకుంటాము మరియు మన పాపాలకు శిక్షించబడటంలో (లేదా మనల్ని మనం శిక్షించుకోవడంలో) ఒక రకమైన సంతృప్తిని పొందవచ్చు. మన అపరాధ, తిరస్కరణ భావాలు దేవుని దయను తిరిగి పొందడానికి మన పాపానికి ప్రాయశ్చిత్తం అవుతాయి.

నిజమే, మన పాపాలు భయంకరమైన శిక్షకు అర్హమైనవి – క్రీస్తు ఆ శిక్షను మనకోసం భరించాడు. క్రీస్తు శిక్షకు మనం మన స్వంత శిక్షను జోడించాలనేది నిజం కాదు. వ్యక్తిగత బాధ క్రీస్తు త్యాగానికి ప్రాయశ్చిత్త విలువను జోడించదు. మన క్షమాపణ మన ప్రభువు ఎంతో మూల్యం చెల్లిస్తే వచ్చింది, మరియు మనం చేసిన దానికి చెల్లించడానికి ఈ మూల్యం సరిపోతుంది. మనం మరొక వ్యక్తికి అన్యాయం చేసినప్పుడు మనం నష్టపరిహారం చెల్లించాల్సి ఉండగా, ప్రభువు ఇప్పటికే మనల్ని క్షమించినప్పుడు మనం నిరంతరం మనల్ని మనం హింసించుకోకూడదు. యేసు మనకొరకు ప్రాయశ్చిత్తము చెల్లించాడు. మన పాపాల కొరకు మనం క్రీస్తు అర్పణకు ఏమీ జోడించలేము.

అడ్డంకి #3: “దేవుడు నన్ను క్షమించాడని నాకు తెలుసు, కానీ అది ముఖ్యమైనది కాదు. నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను.”

మళ్ళీ, ఇది చాలా నీతివంతమైన ప్రతిస్పందనగా కనిపిస్తుంది. దేవుని క్షమాపణను అంగీకరించడం మరియు మన పాపాన్ని “కొట్టివేయడం” చాలా తేలికగా అనిపిస్తుంది. బుద్ధిగా ఆలోచిస్తే, మన పాపాలకు ప్రాయశ్చిత్తం చెల్లించడానికి క్రీస్తు మరణం సరిపోతుందని మనకు తెలుసు, కానీ అది ముఖ్యమైనది కాదు. మనము ఎంత తప్పు చేశామో మనకు తెలుసు -అంత సులభంగా వదిలేయడానికి వీల్లేనంత తప్పు చేశాం.

అయితే మనం ఈ ఆలోచనా అవరోధాన్ని నిశితంగా పరిశీలిస్తే, ఈ ప్రతిస్పందన న్యాయమైనది కాదని మనము గ్రహిస్తాము. న్యాయానికి పూర్తి వ్యతిరేకం. మనల్ని మనం క్షమించుకోలేమని చెప్పడం ద్వారా, మన తీర్పును దేవుని తీర్పు కంటే గొప్పదిగా ఎంచుతున్నాము. ఆయన కంటే మనకు బాగా తెలుసు అని మనం భావిస్తున్నాము; ఆయన క్షమించుటకు వేగిరపడువాడు కావచ్చు, కానీ మనం అంత సులభంగా వదిలిపెట్టేవారము కాదు. అయితే దేవుడు విడుదల చేసిన వాటిపై వ్రేలాడటానికి మనకు ఏ హక్కు ఉంది? ప్రతి పాపానికి సంబంధించిన ప్రతి నీఛమైన వివరం ఆయనకు తెలియదని మనం అనుకుంటున్నామా? ఆయనకంటే మనం జ్ఞానముగలవారమా? ఆయన దానిని మరచిపోయినట్లయితే, దానినే పట్టుకొని వ్రేలాడటం మరింత గౌరవప్రదమైనదని మనం ఎందుకు అనుకుంటున్నాము?

ఈ కోణంలో చూస్తే, ఈ అడ్డంకి యొక్క మూర్ఖత్వం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. మనల్ని మనం క్షమించుకోవాలని లేఖనం ఎప్పుడూ చెప్పదు. మనల్ని మనం “క్షమించుకోవడానికి” ప్రయత్నించినప్పుడు, మనం అసాధ్యమైన దానిని ప్రయత్నిస్తున్నాము. ఒక నిరపరాధి పక్షానికి అన్యాయం జరిగిందని, మరియు క్షమించడం అన్యాయానికి గురైన వ్యక్తి యొక్క పని అని భావించటమే క్షమాపణ. అపరాధం చేసిన పక్షము క్షమాపణను పొందుకుంటుంది.

అపరాధి మనమే; మన పాపం ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు గనుక దేవుని విషయంలోనే మనం తప్పుచేశాం. మనల్ని మనం క్షమించుకోవడంపై దృష్టి పెట్టడం ద్వారా, మనం దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యతను యివ్వకుండా, దానిని మన వైపుకు త్రిప్పుకున్నాము-యిప్పుడు మన పాపాన్ని వదిలించుకోవడం రెట్టింపు కష్టతరం! ఆయన మనల్ని క్షమించాడు. మనం ఆ క్షమాపణను స్వీకరించాలి మరియు దానిలో నెమ్మది పొందుకోవాలి. అంటే మనం పట్టుకోవాలనుకునే పాపాలను విడుదల చేయడం, వాటిని మన మనస్సులో పునఃసమీక్షించడాన్ని నిరాకరించడం మరియు మన క్షమాపణ యొక్క సత్యము మనల్ని ఆయన శాంతితో కప్పడానికి అనుమతించడం. దేవుని నుండి విమోచన అనేది ఒక వ్యక్తి తనను తాను విమోచించుకోవడం కంటే చాలా శక్తివంతమైనది.

అడ్డంకి #4: “నేను ఇప్పటికీ నా పాపం యొక్క ప్రభావం వల్ల బాధపడుతున్నాను కాబట్టి, దేవుడు ఇంకా నన్ను క్షమించలేదనుకుంటా.”

దేవుని శిక్షతో సహజ పరిణామాలను ముడిపెట్టి కలవరపడటం సులభం; అయితే, అవి భిన్నంగా ఉంటాయి. మీరు ఎత్తు నుండి దూకితే, మీ చీలమండ బెణకవచ్చు. దేవుడు మిమ్మల్ని శిక్షించడానికి మీ చీలమండను బెణుకునట్లు చేయలేదు. గురుత్వాకర్షణ మిమ్మల్ని భూమి యొక్క ఉపరితలంపైకి ఆకర్షించింది (మరియు వేగంగా!). మీ నొప్పి కేవలం మీ చర్య యొక్క పర్యవసానమే.

అదే విధంగా, చాలాకాలం క్రితం క్షమించబడిన మన పాపాలు ఇప్పటికీ మన జీవితంలో పర్యవసానములను కలిగి ఉండవచ్చు. మాజీ జీవిత భాగస్వామితో కలిసిపోవడం కష్టంగా ఉండవచ్చు. గర్భస్రావం చేయబడిన శిశువు యొక్క గడువు తేదీపై మనం బాధపడవచ్చు. మనము తాగుతున్నప్పుడు జరిగిన ప్రమాదంలో మనము గాయపడి బాధపడవచ్చు. అయితే ఈ ఇబ్బందులు ఏవీ దేవుని శిక్షను సూచించవు. రోమా 5:9-10 ప్రకారం, దేవుడు తన ఉగ్రత నుండి మనలను రక్షిస్తాడు:

కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధానపరచబడినయెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము.

మన శిక్ష క్రీస్తులో చెల్లించబడింది. విశ్వాసులుగా, మన చర్యల విషయమై మనం క్షమించబడ్డాము మరియు ఆ చర్యల వలన వచ్చే పరిణామాలు మన జీవితాల్లో ఉండిపోయినప్పటికీ దేవునికి అమూల్యమైనవారమే.

అడ్డంకి #5: “దేవుడు నా జీవితంలో చాలా బాధలను అనుమతించాడు; దేవుడు చేసిన దానికి నేను ఆయనను క్షమించలేను.”

ఈ చివరి అవరోధంతో పోరాడుతున్న వ్యక్తి సాధారణంగా చాలా బాధలు పడ్డాడు. జీవిత నష్టాల నుండి వచ్చే బాధ చాలా ఎక్కువగా అనిపించవచ్చు, మరియు సార్వభౌమాధికారి వాటిని ఆపకపోవడంపై విరుచుకుపడటం సహజమైన ప్రతిస్పందన కావచ్చు.

అయితే మనం దేవునిపై కోపంగా ఉన్నప్పుడు, మన గాయాలను నిజంగా నయం చేయగల వ్యక్తి నుండి మనల్ని మనం దూరపరచుకుంటాము. కీర్తనాకారుడు ఇలా అన్నాడు, “మా దేవుడు ఆకాశమందున్నాడు; / తన కిచ్ఛవచ్చినట్లుగా సమస్తమును ఆయనచేయుచున్నాడు” (కీర్తన 115:3). కష్టమైన విషయాలను మన జీవితాల్లోకి అనుమతించే హక్కు దేవునికి ఉంది. తన జ్ఞానముచేత ఆయన భూమి నుండి అన్ని బాధలను తొలగించే ముందు వేచి ఉండాలని ఎంచుకున్నాడు. తత్ఫలితంగా, పతనమైన ప్రపంచంలో జీవిస్తూ, ఇతరుల పాపాల నుండి, మరియు మన స్వంత పాపం నుండి మనం పర్యవసానాలను ఎదుర్కొంటూ ఇంకా బాధపడుతున్నాము. అంతిమంగా దేవుని న్యాయం గెలుస్తుందని మనకు తెలుసు. ఈలోగా, మనం బాధను అనుభవించవచ్చు.

మీరు సహించిన విషయాల కోసం మీరు “దేవుణ్ణి క్షమించాలి” అని కొందరు మంచి ఉద్దేశ్యంతో కూడిన సలహాదారులు చెప్పవచ్చు. అయితే లేఖనాలలో ఎక్కడా కూడా మనం దేవుణ్ణి క్షమించాలని చెప్పబడలేదు. దేవుడు మనకు అన్యాయం చేయలేదు. దేవుడే అంతిమంగా అన్యాయానికి గురైన పక్షము గనుక ఆయన ఒక్కడే నిజంగా నిరపరాధి. ఆయనకు వ్యతిరేకంగా మనం పాపం చేసాము. ఆయన దయతో, మన పాపాలకు శిక్షను తానే చెల్లించి, మనల్ని రక్షించడానికి నిశ్చయించుకున్నాడు. మీరు దేవునిపై కోపాన్ని పెట్టుకుని ఉంటే, ఆయన దయ మీ చేదును కరిగించనివ్వండి. ఆయనకు సమర్పించుకుంటేనే మీకు శాంతి లభిస్తుంది.

కాబట్టి అపరాధభావం విషయమై మనం ఏమి చేయాలి?

మనం ఈ ఆలోచన అడ్డంకులను దాటిన తర్వాత, దేవుని కోణం నుండి అపరాధాన్ని అర్థం చేసుకోవడమే తదుపరి దశ. మనం పాపం చేసినప్పుడు ఏమి జరగాలి?

మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, మనలో అసహ్య భావన కలగాలి! దేవుడు మనకు ఇచ్చిన మనస్సాక్షి యొక్క ఉద్దేశ్యం అదే. అయితే, పాపము విషయమై రెండు రకాల అపరాధం లేదా దుఃఖం గురించి లేఖనం మాట్లాడుతుంది, ఒకటి మనం అనుసరించాలి, ఇంకొకటి మనం నివారించాలి.

దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సును కలుగజేయును; ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోకసంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. (2 కొరింథీయులకు 7:10)

దైవిక దుఃఖం మరియు ప్రాపంచిక దుఃఖం. మొదటిది జీవమునకు దారితీస్తుంది, కానీ రెండోది మనల్ని ఆత్మీయ సమాధిలోకి నెడుతుంది. ప్రాపంచిక దుఃఖం మాత్రమే చిక్కుకున్నందుకు లేదా కోల్పోయిన వాటి కోసం ఏడుస్తుంది. చేసిన తప్పుకు అది ఎన్నడూ బాధపడదు. దైవిక దుఃఖం వేరే ఫలితాలను ఇస్తుంది. మనం దైవిక దుఃఖాన్ని అనుభవించినప్పుడు, మనం చేసిన తప్పుకు మనం చాలా బాధపడతాము. మేము క్షమాపణ అడగటానికి, నష్టాన్ని సరిచేయడానికి, చేసిన నష్టానికి పరిహారం చెల్లించడానికి ఆశ కలిగియుంటాము; కేవలం బాధ నుండి మనల్ని మనం రక్షించుకోవడం లేదా మనం వదులుకోవడానికి ఇష్టపడని వాటిని తిరిగి పొందడం కొరకు మాత్రమే కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే, మనము పశ్చాత్తాపపడతాము.

పశ్చాత్తాపం అంటే పాపం నుండి మళ్ళడం మరియు దేవుని వైపు తిరగడం. నిజమైన అపరాధం మనల్ని మన కాళ్ల మీద నిలబెడుతుంది మరియు సరైన పని చేయడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. కానీ పై వాక్యభాగంలోని మధ్య భాగాన్ని గమనించండి, ఎందుకంటే దీనిని తప్పిపోవడం సులభం. దైవిక దుఃఖం . . . విచారించదు. అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా, పదే పదే పాత పాపములోనికి దూకేవారముగా ఉండకూడదు, కానీ మనం దేవునితో ముందుకు సాగాలి. పౌలు తన భయంకరమైన గతాన్ని-అతను క్రైస్తవులను వెంబడించి ఖైదు చేసిన సంగతిని నిరంతరం గుర్తుచేసుకుంటే ఎలా ఉంటుందో ఊహించండి! ఒకవేళ అతను తన పాపాలను అంటిపెట్టుకొని ఉంటే, అతను లేఖనాలలో మనకు కనిపించే శక్తివంతమైన పరిచారకునిగా ఉండేవాడు కాదు (1 తిమోతికి 1:12-16 చూడండి).

నమ్మకం మరియు పశ్చాత్తాపంలో, విశ్రాంతి ఉంది.

జీవితంలోని బాధలు మరియు వేదనల గుండా మన పోరాటంలో, క్షమాపణపై లేఖనములోని బోధనలకు పూర్ణహృదయంతో మనం కట్టుబడి ఉండాలి. లోపల మరియు వెలుపల శుద్ధి చేయబడాలనే మన లోతైన కోరికను తీర్చగల క్షమాపణ-నిజమైన క్షమాపణ ప్రజలందరికీ అందుబాటులో ఉంది. క్రీస్తు ద్వారా, మన పాపాలన్నింటికీ చెల్లించబడ్డాయి. పాపం పట్ల దుఃఖం లేదా అపరాధం అనేది మన హృదయాన్నిఆయనవైపు త్రిప్పుతుందనేది దేవుని ప్రణాళికయై ఉన్నది. మనం ఆ పాపం నుండి బయటపడాలని, ఆయన నుండి మరియు మనం గాయపరచిన వారి నుండి క్షమాపణ అడగాలని ఆయన కోరుకుంటాడు-సాధ్యమైనప్పుడు పరిహారం చెల్లించండి, ఆపై ఆయనతో నడవండి. మనము ఆ పాపమును విడిచిపెట్టాలి, మన దేవునితో కొనసాగుతున్నప్పుడు చింతించకూడదు.

ఆయన క్షమాపణ యొక్క వాస్తవికత మరియు అనుభవం రెండింటి ద్వారా ఈ రోజు ప్రభువు యొక్క శక్తిని మరియు శాంతిని మీరు కనుగొందురుగాక.

  1. Baxter, Richard. “What are the Best Preservatives against Melancholy and Overmuch Sorrow?” In Puritan Sermons 1659-1689, Being the Morning Exercises at Cripplegate. 6 vols. Edited by James Nichols. Wheaton: Richard Owen Roberts, 1981, 3:253.

Copyright © by Charles R. Swindoll, Inc.

Posted in Easter-Telugu, Encouragement & Healing-Telugu, Failure-Telugu, Forgiveness-Telugu.

Accuracy, clarity, and practicality all describe the Bible-teaching ministry of Charles R. Swindoll. Chuck is the chairman of the board at Insight for Living and the chancellor of Dallas Theological Seminary. Chuck also serves as the senior pastor of Stonebriar Community Church in Frisco, Texas, where he is able to do what he loves most—teach the Bible to willing hearts. His focus on practical Bible application has been heard on the Insight for Living radio broadcast since 1979.

ఖచ్చితత్వం, స్పష్టత మరియు ఆచరణాత్మకత అన్నీ చార్లెస్ ఆర్. స్విన్డాల్ యొక్క బైబిల్-బోధనా పరిచర్యను వివరిస్తాయి. చక్ ఇన్సైట్ ఫర్ లివింగ్ కు బోర్డు ఛైర్మన్ మరియు డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ఛాన్సలర్. చక్ టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చ్ యొక్క సీనియర్ పాస్టర్‌గా కూడా పనిచేస్తున్నారు, అక్కడ ఆయన చాలా ఇష్టపడేదాన్ని చేయగలుగుతున్నాడు-ఇష్టపడే హృదయాలకు బైబిల్ నేర్పిస్తున్నారు. ఆచరణాత్మక బైబిల్ అనువర్తనంపై ఆయన దృష్టి 1979 నుండి ఇన్సైట్ ఫర్ లివింగ్ రేడియో ప్రసారంలో వినబడుచున్నది.