జీవితంలోని ముల్లును ఆదరణ తీసివేస్తుంది

మనందరికీ ఆదరణ అవసరం. మనయందు నమ్మకముంచేవారు ఎవరైనా మనకు అవసరం. మనకు భరోసా ఇవ్వడానికి మరియు బలోపేతం చేయడానికి. జీవితాన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చి ముందుకు కొనసాగటానికి మనకు సహాయపడటానికి. మనకు వ్యతిరేకంగా అసమానతలను ఎదుర్కొంటున్నప్పుడు మన సంకల్ప జ్వాలకు ఆజ్యం పోయడానికి.

ఒక వ్యక్తి ఎంత ప్రభావవంతమైన, సురక్షితమైన, లేదా పరిణతి చెందిన వ్యక్తిగా కనిపించినప్పటికీ నాకు అనవసరం, ఆదరణ కలిగించే మాట సహాయం చేయడంలో ఎన్నడూ విఫలం కాదు. మనందరికీ ఇది అవసరం. మనలో నాయకత్వం యొక్క లోతైన లోయలో గెలిచేంతవరకు పోరాడేవారికి ఇది భారీ మోతాదులో అవసరమైయున్నది. విచారించదగ్గ విషయమేమంటే, చాలామంది దీనిని అంగీకరించడానికి వారి గర్వం అడ్డొస్తుంది. ఈ గర్వం లోకవీధుల్లో ఉన్నట్లుగా దేవుని కుటుంబ సభ్యులలో కూడా వ్యాపించియున్నది.

ఆదరణ కలిగించడానికి వెన్ను తట్టడం కంటే చేయవలసినది చాలా ఉంది. ఇది మరొకరి ఆత్మను పైకెత్తడానికి ఉద్దేశపూర్వకమైన, బలమైన నిబద్ధత. క్రొత్త నిబంధన దాని విలువను గుర్తు చేస్తుంది:

కొందరు మానుకొను చున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగుచేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. (హెబ్రీయులకు 10:24-25)

ఈ పదాన్ని నిశితంగా పరిశీలిద్దాం. ఆదరణ అనే పదం, హెబ్రీయులకు 10:25 లో ఉపయోగించినట్లుగా, యోహాను 14:26 మరియు 16:7 లలో పరిశుద్ధాత్మ కోసం ఉపయోగించిన అదే గ్రీకు మూల పదం నుండి వచ్చింది. ఆ రెండు వచనాల్లో ఆయన “ఆదరణకర్త” అని పిలువబడ్డాడు. అసలు పదం, పారాకాలెయో, రెండు చిన్న పదాల కలయిక నుండి వచ్చింది, కాలెయో, “పిలుచుట” మరియు, పారా, “ప్రక్కన.” మనకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ మన ప్రక్కనుండుటకు పిలువబడినట్లే, మీరు మరియు నేను కూడా వేరొకరిని ఆదరించి ప్రక్కనుండుటకు పిలువబడ్డాము. వాస్తవానికి, మనము ఇతరులను ఆదరించినప్పుడు, దేవుని కుటుంబంలో మనం చేయగలిగినంతగా పరిశుద్ధాత్మ యొక్క పనికి చాలా దగ్గరగా వస్తాము.

నన్ను నమ్మండి, క్రైస్తవులు పరస్పర ఆదరణ యొక్క విలువను గ్రహించడం ప్రారంభించినప్పుడు, ఇతరులు సాధించడానికి మనం ఏమి ఉత్తేజపరచగలమో దానికి పరిమితి లేదు. అవసరం ఉన్న ఇతరులకు దేవుడు “సహాయం చేసి ప్రక్కనుండుటకు మనలను పిలిచాడు” అని గ్రహించడం ఝల్లుమనిపిస్తుంది. ఇతరులను కూల్చివేసే చర్యల కంటే ఇతరులను పైకి లేపే చర్యలలో నిమగ్నమవ్వడం ఇంకెంత మంచిగా ఉంటుంది!

ఆదరణ గురించి అందమైన విషయం ఇది: ఎవరైనా దీన్ని చేయగలరు. దీన్ని చేయడానికి మీకు డబ్బు అవసరం లేదు. మీకు నిర్దిష్ట వయస్సు కూడా అవసరం లేదు. నిజం చెప్పాలంటే, నా హృదయం భారంగా ఉన్న సమయంలో నాకు లభించిన అత్యంత ఆదరణకరమైన చర్యలు లేదా మాటలు నా కన్నబిడ్డల నుండి వచ్చాయి. వారు అవసరాన్ని చూసి వెంటనే స్పందించారు . . . వారు “ప్రక్కకు వచ్చి సహాయం చేసారు.”

ఆదరణ లేకపోవడం వల్ల ఫలించలేక ఎండిపోయిన వేలాది మంది ప్రజలు ఉన్నారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఒంటరిగా, మరచిపోబడిన మిషనరీలు, ఇంటి నుండి దూరంగా ఉంటూ సైనిక సేవ చేస్తున్న పురుషులు మరియు మహిళలు, విద్యార్థులు మరియు సెమినారియన్లు, జబ్బుపడినవారు మరియు మరణిస్తున్నవారు, విడాకులు తీసుకున్నవారు మరియు దుఃఖిస్తున్నవారు, తెరవెనుక నమ్మకంగా సేవచేసేవారు అరుదుగా వేరేవారి దృష్టిలో పడటం లేదా అభిప్రాయం తెలియజేయటం.

హెబ్రీయులకు 10:24 లో ఉన్న ప్రకటనకు తిరిగి వెళితే, మనం “ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.” మరో మాటలో చెప్పాలంటే, మనం ఇతరులను ఘనముగా ఎంచి, దృఢపరచి మరియు సహాయపడే నిర్దిష్ట మార్గాల గురించి ఆలోచించాలి. దేవుని ఆజ్ఞలు-ముఖ్యంగా అవసరతల్లో ఉన్న వ్యక్తులతో సంబంధం కలిగి ఉన్నవి పుస్తకజ్ఞానమాత్రమైనవి కావు.

మన ఆదరణను ఆచరణలో పెట్టడానికి ఆసక్తిని కలిగించడానికి కొన్ని ఆలోచనలు సహాయపడవచ్చు:

  • సమయపాలన, శ్రద్ధ, మంచి వైఖరి, పరిపూర్ణత, సామర్థ్యం లేదా మంచి హాస్యానికి స్పందించే గుణం వంటి ఇతరులలో మీరు చూసే ప్రశంసనీయమైన స్వభావ లక్షణాలను గమనించండి మరియు పేర్కొనండి.
  • ఉత్తరప్రత్యుత్తరాలు, ధన్యవాదాలు తెలుపుతూ కార్డులు, చేతితో రాసిన లేఖను జోడిస్తూ చిన్న బహుమతులు.
  • మీరు అభినందిస్తున్న వారి అదనపు ప్రయత్నానికి కృతజ్ఞతలు తెలియజేయండి.
  • బాగా చేసిన పనిని గమనించి అలా చెప్పండి.
  • సానుకూల, భరోసా కలిగించే వైఖరిని పెంపొందించుకోండి. ప్రతికూల వాతావరణంలో ఆదరణ వృద్ధి చెందదు.
  • బయటకు తీసుకువెళ్లండి మరియు రెస్టారెంట్‌లో బిల్లు చెల్లించండి.
  • మీకు తెలిసినవారు నిజంగా బాధపడుచున్నవారికి సహాయకంగా ఉండండి.

జీవితంలోని మల్లును ఆదరణ తీసివేయాలి. కానీ మీరు ఆదరించాలనుకునేవారికి ఇతర భారాలను సృష్టించకుండా జాగ్రత్త వహించండి. మీరు చేసినది గమనించబడాలని లేదా ప్రత్యుపకారము పొందాలని ఆశించకుండా మీరు చేయాలనుకున్నది చెయ్యండి. ఇచ్చి పుచ్చుకొనే అంచనాలు అపరాధ భావాన్ని కలిగిస్తాయి, కాని ఆదరణ కాదు! అలాగే, మీ చర్యలు సమయానుకూలంగా ఉండుటకు జాగ్రత్త పడండి;సమయానుకూలమైన ఆదరణ చాలా అరుదుగా మరచిపోబడుతుంది.

చాలా కాలం పాటు తమ ఉద్యోగంలో నమ్మకంగా పని చేసిన వారి గురించి నేను తరచుగా ఆలోచిస్తూవుంటాను మరియు వారి స్థానంలో మరొకరిని తీసుకుంటారు- నిరాశపరిచే విషయం ఏమిటంటే వారు మరచిపోబడతారు. మాజీ ఉపాధ్యాయులు మరియు శిక్షకులు, సంఘములోని మాజీ అధికారులు, మాజీ బోర్డు సభ్యులు, మాజీ పాస్టర్లు మరియు క్రైస్తవ జీవితాన్ని మాదిరికరంగా జీవించిన మార్గదర్శకులు వంటి వ్యక్తులు సుదూర జ్ఞాపకాల సముద్రంలో మరిచిపోబడతారు.మీ జీవితంలో భాగం పంచుకున్న ముఖ్యమైన వ్యక్తులను గుర్తుచేసుకుంటూ కొంత సమయం గడపండి. . . వారిని ఆదరించే మార్గాల కోసం చూడండి. మీరు వారిని మరచిపోలేదని తెలుసుకోవడం వారికి ఎంత సంతోషాన్ని ఇస్తుందో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు.

ఆదరణ ఎక్కడ ప్రారంభమవుతుందో నన్ను చెప్పి ముగించనివ్వండి.ఆదరణ అనేది మొదట ఒకరి ఇంటిలో నుండే అభివృద్ధి చెందుతుంది.ఇక్కడే ఈ కీలకమైన లక్షణం వృద్ధిచెందుతుంది. పిల్లలు వారి తల్లిదండ్రుల నుండి ఆనందం, దృఢపరచడం మరియు అంగీకరించడం వంటి పదాలను స్వీకరిస్తారు కాబట్టి వారి తల్లిదండ్రుల నుండి పిల్లలు అందిపుచ్చుకుంటారు. అయితే, గృహాలు సానుకూలత కంటే చాలా ప్రతికూలంగాను, దృఢపరచడం కంటే క్లిష్టమైనవిగాను ఉంటాయనే విచారకరమైన వాస్తవాన్ని అనేక సర్వేలు నమోదు చేసాయి.

మీ కుటుంబాన్ని అందుకు భిన్నంగా తయారుచేయాలని నేను మీతో సవాలు చేస్తున్నాను. మీ ఇంటిలో సానుకూల, బలోపేతమైన, స్థిరమైన ఆదరణను పెంపొందించడానికి అవసరమైన యెటువంటి చర్యలనైనా తీసుకోవడం ప్రారంభించండి. మీ కుటుంబం ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుంది, నన్ను నమ్మండి. మరియు మీరు ఈ ప్రక్రియలో చాలా సంతోషకరమైన వ్యక్తిగా తయారవుతారు.

Copyright © 2014, Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.
Posted in Encouragement & Healing-Telugu.

Pastor Charles R. Swindoll has devoted his life to the accurate, practical teaching and application of God’s Word. He is the founding pastor of Stonebriar Community Church in Frisco, Texas, but Chuck’s listening audience extends far beyond a local church body. As a leading programme in Christian broadcasting since 1979, Insight for Living airs around the world. Chuck’s leadership as president and now chancellor emeritus at Dallas Theological Seminary has helped prepare and equip a new generation of men and women for ministry.

పాస్టర్ చార్లెస్ ఆర్. స్విండాల్ దేవుని వాక్యాన్ని నిర్దిష్టంగా, ఆచరణాత్మకంగా బోధించడానికి మరియు అన్వయించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చి వ్యవస్థాపక కాపరియై ఉన్నారు, అయితే చక్ యొక్క శ్రోతలు స్థానిక సంఘ పరిధి దాటి వ్యాపించి ఉన్నారు. 1979 నుండి క్రైస్తవ ప్రసరణలో ప్రముఖ కార్యక్రమంగా, ఇన్‌సైట్ ఫర్ లివింగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసారమవుతోంది. డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ప్రెసిడెంటుగా, అలాగే ఇప్పుడు ఛాన్సిలర్ ఎమెరిటస్‌గా చక్ యొక్క నాయకత్వం క్రొత్త తరం స్త్రీపురుషులను పరిచర్య కొరకు సిద్ధపరచడంలో సహాయపడింది.