నా సంఘములో సంఘర్షణకు కారణమవుతున్న కఠినుడైన నాయకుని గురించి ప్రార్థనలో బాధపడుతున్న నేను, అతనిని తొలగించి, నా కుటుంబాన్ని మరియు నన్ను రక్షించమని దేవుని అడిగాను. ఈ మనిషి రహస్యంగా నాకు విరోధముగా విషప్రచారం చేయుటవలన ఒక సీనియరు పాస్టరుగా నేను కొంతమంది అసంతృప్తిగల మనుష్యులకు లక్ష్యంగా మారాను. చివరికి వారు నా రాజీనామాను డిమాండ్ చేశారు, ఒకవేళ నేను కట్టుబడి ఉండటానికి నిరాకరిస్తే రాబోయే వ్యాపార సమావేశాన్ని నియంత్రించి, అంతరాయం కలిగిస్తామని బెదిరించారు. దేవుడు ఇలా జరగడానికి ఎలా అనుమతించగలడు? సంఘము ఎదుగుతున్నప్పుడు నేను ఈ శోధనను ఎందుకు ఎదుర్కొన్నాను? దేవుడు తన క్రియ జరిగించాలని నేను తీవ్రంగా ప్రార్థించాను, కాని ఆయన యొద్దనుండి యెటువంటి స్పందనా లేదు. ఆయన నా శోధనల్లో నన్ను వదిలిపెట్టి, ఒంటరిగా శ్రమపడటానికి నన్ను విడిచిపెట్టాడని నేను భావించాను.
ప్రతి క్రైస్తవుడు శోధనలు అధికంగా అనిపించిన సందర్భాలను అనుభవించాడు. మనం సహజంగానే ఆశ్చర్యపోతాం: దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు మనలను నిరాశపరుస్తున్నాడా? ఆయన పట్టించుకుంటున్నాడా? దేవుడు మంచివాడైతే, చెడు గెలుచునట్లుగా ఆయన ఎందుకు అనుమతిస్తున్నాడు? ఈ ప్రశ్నలు మనల్ని ఈ క్రింది ప్రశ్నను అడగడానికి దారితీయవచ్చు: దేవుడు నన్ను శిక్షిస్తున్నాడా? దేవుడు లేనప్పుడు, లేదా ఇంకా ఘోరంగా, ఆయన పట్టించుకోనప్పుడు, శ్రమలు సహించడం చాలా కష్టమవుతుంది.
జీవితంలోని కఠినమైన విషయాలను ఎదుర్కొంటున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథము యొక్క దృక్పథం కష్టాలను సులభంగా భరించేందుకు సహాయపడుతుంది.
శ్రమలకు కారణాలు
శ్రమలు అనేక కారణాల వల్ల వస్తాయి. కొన్ని శ్రమలు మన స్వంత పాపం యొక్క సహజ పరిణామాల వలన వస్తాయి. ఉదాహరణకు, నేను నా వివాహ బంధంలో స్వార్థపూరితంగా వ్యవహరిస్తే, నేను తక్కువ సంతృప్తికరమైన అనుబంధాన్ని పొందుతాను. నేను తిండిపోతునైతే, అనారోగ్యకరమైన జీవనశైలి యొక్క శారీరక ప్రభావాలను నేను ఎదుర్కొంటాను. పరిశుద్ధాత్మ మన వ్యక్తిగత పాపాన్ని ఎత్తి చూపినప్పుడు, పాపము తప్పని మనం దేవునితో అంగీకరించి దాని నుండి తప్పుకోవాలి.
కొన్ని శ్రమలు దేవుని క్రమశిక్షణా చర్యలో భాగంగా ఉంటాయి. ఇవి ఎన్నడూ దైవిక శిక్ష కాదు-ఎవ్వరూ భరించవలసిన అవసరం లేకుండా, యేసు మన శిక్షంతటినీ సిలువపై మోసాడు. అయితే, బాధాకరమైన పరిణామాలు దేవుడు తాను ప్రేమిస్తున్న తన పిల్లలకు బోధనా సాధనం కావచ్చు (హెబ్రీయులకు 12:3-11). మంచి మరియు చెడు గూర్చిన విచక్షణ గుర్తించడానికి భూసంబంధమైన తల్లిదండ్రులు తమ పిల్లలకు శిక్షణ ఇచ్చినట్లే, మనం ఆయన పరిశుద్ధతలో పాలుపొందుకోవడానికి మన పరలోకపు తండ్రి కూడా మనకు శిక్షణ ఇస్తాడు (12:10). ఎవరో ఒకసారి చెప్పినట్లుగా, “నొప్పి తిరుగుబాటు హృదయ కోటలో వాస్తవిక జెండాను నాటుతుంది.”
కొన్ని శ్రమలు సాతాను యొక్క ప్రత్యక్ష దాడులుగా ఉంటాయి. యోబు అలాంటి దాడులను అనుభవించాడు (యోబు 12), పౌలు కూడా అలానే అనుభవించాడు (2 కొరింథీయులకు 12:7-10), అలాగే వీరిద్దరూ అసామాన్యమైన నీతిమంతులుగా పరిగణించబడ్డారు. వాస్తవానికి, మనము చెడుతో యుద్ధం చేస్తున్నాము, మరియు మనల్ని నాశనం చేయాలనుకునే శత్రువు మనకు ఒకడున్నాడు (1 పేతురు 5:8), కాబట్టి మనం పరలోకానికి చేరుకున్నప్పుడు కొన్ని యుద్ధ గాయాల గురించి అతిశయపడటానికి ఒక కారణం ఉన్నది. తాను మరియు యేసు ఒకే జట్టులో పోరాడుతున్నామని చెప్పడానికి పౌలు అలాంటి శ్రమను రుజువుగా భావించాడు. (కొలొస్సయులు 1:14).
మనం అనుభవించే ఇతర శ్రమలు-పాపాత్మకమైనవి కానప్పటికీ-మన స్వంత మూర్ఖత్వ క్రియల పర్యవసానంగా సంభవించవచ్చు. ఒకసారి నేను అస్థిర మార్కెట్లో అధిక మొత్తంలో స్టాక్ కొన్నాను. నా నిర్ణయం అవివేకమే, మరియు నేను మంచి సలహా తీసుకోవడంలో విఫలమైనందున నా డబ్బును కోల్పోయాను (సామెతలు 12:15). దేవుడు, తన సార్వభౌమాధికారంలో, మనకు కొంత స్వయంప్రతిపత్తిని, మన స్వంతంగా వ్యవహరించే స్వేచ్ఛను ఇచ్చాడు. ఆ హక్కుతో పాటు, మన నిర్ణయాల యొక్క పరిణామాలను ఒప్పుకునే మనస్సును మరియు ఘనతను ఆయన మనకు ఇచ్చాడు. తత్ఫలితంగా, మన గత మూర్ఖత్వం వల్ల మనం జ్ఞానవంతులం కావచ్చు. అది కూడా మనం కోరుకునే కోరిక కావచ్చు. ఇదే శ్రమలోనున్న వారికి మీరు నూతనంగా కనుగొన్న జ్ఞానమును ఇచ్చి ఉపయోగించాలని నన్ను మిమ్మల్ని ప్రోత్సహించనివ్వండి.
ఈ పరిస్థితులలో ప్రతి ఒక్కటి మన శ్రమలకు నిజమైన కారణాలే. రోమాలోని విశ్వాసులకు పౌలు చెప్పిన మాటలను విస్మరించి, కొన్నిసార్లు మనము ఒక కారణం మీదనే దృష్టి పెడతాము: మనం పాపము నిండిన ప్రపంచంలో నివసించుచున్నందున మనం శ్రమలను అనుభవించుచున్నాము.
ఎప్పుడూ ఏదోయొకటి వస్తూనే ఉంటుంది!
రోమా 8 లో, ప్రపంచం పాపము వలన ఘోరంగా నాశనమైపోయిందని పౌలు వర్ణించాడు. ఈ పాపము నిండిన ప్రపంచంలో, దేవుడు మొదట రూపొందించినట్లుగా ఏమీ లేదు-సృష్టి కూడా లేదు. మనం క్రీస్తువలె సంపూర్ణులముగా చేయబడి, దేవుని కుమారులు మరియు కుమార్తెలుగా పూర్తిగా బయలుపడే ఆ దినము వరకు ఏదీ కూడా అది చేయవలసిన పని చేయదు (రోమా 8:19-21).
మన కోసం మరియు సృష్టి అంతటికొరకు, పౌలు ఈ ప్రస్తుత కాలపు బాధలను, మూలుగులను ప్రసవవేదనపడుచున్న స్త్రీతో పోల్చాడు (8:22-23). జీవితంలో ఎక్కువ భాగం అప్రీతికరముగా ఉందనటంలో ఆశ్చర్యమేమీ లేదు! మన స్వంత పాపం లేదా మూర్ఖత్వం, దేవుని క్రమశిక్షణ లేదా శత్రువు యొక్క ప్రత్యక్ష దాడులతో సంబంధం లేకుండా అది అలానే ఉంటుందని దేవుడు చెప్పాడు. పాపముతో నిండిన ప్రపంచంలో జీవితం అంటే శోధనలు-అనేకమైనవి ఉంటాయి. యేసు కూడా చెడ్డ ప్రపంచం యొక్క క్రూరమైన చపలత్వం నుండి తప్పించుకోలేదు.
శ్రమలో ఉన్నవారికి సువర్తమానము
ఈ అసంపూర్ణ పరిస్థితుల మధ్య, పౌలు ధైర్యాన్ని ఇస్తున్నాడు. మొదటిది, ఈ బాధాకరమైన సమయం తాత్కాలికమే. త్వరలో ఒక రోజున, మనం పొందబోవు మహిమతో పోలిస్తే మన ప్రస్తుతపు శ్రమ నిరర్థకమైనవదిగా కనిపిస్తుంది (రోమా 8:18).
రెండవది, మన బాధలలో దేవుడు మనలను ఒంటరిగా వదిలిపెట్టలేదు. యేసు మనకోసం బాధపడ్డాడు; మనలను సహానుభూతితో ప్రేమించే దేవుడు ఉన్నాడు. ఇప్పుడు కూడా, పరిశుద్ధాత్మ మనతో పాటు బాధపడుతూ, తండ్రితో మన కొరకు విజ్ఞాపనము చేస్తూ మూలుగుచున్నాడు (8:26-27).
మూడవది, దేవుడు మన అసంపూర్ణ పరిస్థితిని చాలా పరిపూర్ణమైన ఫలితాన్ని తీసుకురావడానికి ఉపయోగిస్తున్నాడు: మనల్ని తన కుమారుని పోలికగా రూపాంతరమొందించడం (8:28-30). ఏదో ఒక రోజు యేసు లాగా ఉండటం మీరు ఊహించగలరా? మన ఊహకు మించిన స్థితి. ఒక రోజు ఆయన తిరిగి వస్తాడు! ఒక్క క్షణంలో, మనము మార్చబడతాము. మనం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నది వాస్తవం అవుతుంది. ఈలోపు, దేవుడు మన ప్రస్తుత శోధనలను తనతో శాశ్వతమైన సాన్నిహిత్యం కోసం మనలను సిద్ధపరచడానికి ఉపయోగిస్తున్నాడు.
చివరిగా, పాపముతో నిండిన ప్రపంచంలో దేవుడు శోధనలను అనుమతించినప్పుడు, ఆయన మనపై కోపంగా ఉన్నాడని లేదా మనల్ని ప్రేమించడం మానేశాడని దీని అర్థం కాదు. నిజం దీనికి విరుద్ధంగా ఉన్నది. పౌలు వ్రాసినట్లుగా, “తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?” (8:32). మనం నిజంగా క్రీస్తుతో సహ వారసులము, ఆయన తండ్రి నుండి స్వీకరించే ప్రతిదాన్ని మనం వారసత్వంగా పొందుకుంటాము. మనం దాన్ని ఇప్పుడే చూడలేము అంతే. మనలో ప్రతి ఒక్కరిపట్ల తండ్రి కలిగి ఉన్న అనంతమైన, వ్యక్తిగతమైన ప్రేమ నుండి ఏదీ మనల్ని ఎడబాపనేరదని పౌలు మనకు గుర్తు చేశాడు (8:38-39). మన బాహ్య పరిస్థితుల ద్వారా దేవుని ప్రేమను కొలిచే శోధనను మనం ఎదిరించాలి. బదులుగా, మన విశ్వాసపు నేత్రములు మన పరిస్థితులను మించి వాటి ద్వారా మనలను తీసుకువెళ్ళేవాని హృదయాన్ని చూడాలి.
చాలా సంవత్సరాల క్రితం సంఘములో జరిగిన సంఘటన గురించి ప్రతిబింబిస్తే, శోధనకు దోహదపడిన అనేక కారణాలను నేను చూడగలను:
- నా స్వంత మూర్ఖత్వం; నేను మొదట సమస్యను ఎదుర్కొన్నప్పుడే దాన్ని పరిష్కరించుకోవాల్సింది.
- ఇతరుల యొక్క పాపం; ఈ వ్యక్తి సంఘములో కలహాలను రేకెత్తించాడు.
- సాతాను యొక్క దాడి; సంఘము యొక్క ఎదుగుదల మరియు శక్తిని ఆపడానికి వాడు ఏమి చేయటానికైనా వెనుకాడడు.
దీన్నంతటినీ గుర్తించి, చివరికి నా నిరాశను వీడటానికి మరియు పరిస్థితి నుండి నేర్చుకోవడానికి దయను కనుగొన్నాను.
మనము శోధనలను ఎదుర్కొన్నప్పుడు, మనల్ని మనం నిందించుకుంటూ, ప్రతి నిరాశ వెనుక సాతాను కోసం వెతుకుతూ, దేవుడు ఎక్కడ ఉన్నాడని ఆశ్చర్యపోవచ్చు-లేదా పరిశుద్ధ గ్రంథములోని వాస్తవాలను మనం అంగీకరించవచ్చు. ఇదే మనం నివసిస్తున్నటువంటి ప్రపంచం. మనం కొంతకాలం శ్రమపడతాము, కానీ గొప్ప సమయం సమీపించుచున్నది. ఈలోగా, దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు, మనతో మూలుగుచున్నాడు మరియు ప్రతి శోధనను మన అత్యున్నతమైన, శ్రేష్ఠమైన మంచి కొరకు ఉపయోగిస్తానని వాగ్దానం చేశాడు. నేను నా శోధనను వెనక్కి తిరిగి చూసినప్పుడు, అప్పుడు నేను చూడని వాటిని ఇప్పుడు స్పష్టంగా చూడగలుగుతున్నాను. నా మహాశ్రమ అంతటా దేవుడు నాతో ఉన్నాడు. కష్టాలను భరించడానికి మరియు దాని ఫలితంగా ఎదగడానికి నామీద దయ కురిపించడానికి ఆయన నమ్మకంగా ఉన్నాడు. ఇప్పుడు, నేను బలంగా, తెలివైనవానిగా ఉన్నాను, మరియు నేను ఆయనను గతంలో కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను.