బంపర్-స్టిక్కర్ అంటే పెద్దగా ఇష్టం లేనందున, కారు వెనుక అద్దంపై మరియు వెనుక బంపర్‌లపై ప్రజలు ప్రకటించే చాలా అంశాలు నన్ను నిలిపివేసాయి.
కానీ కొన్ని సంవత్సరాల క్రితం నేను మర్చిపోలేనిదాన్ని గమనించాను. కొన్ని కారణాల వల్ల, ఇది లోహముపై ఉండే రంగు అంత గట్టిగా నా కపాలంలో అతుక్కుంది. మీరు దీనిని కొన్ని డజన్ల సార్లు చూసుంటారు:
క్రైస్తవులు పరిపూర్ణులు కారు, కేవలం క్షమించబడ్డారు.
నేను 70 mph తో వెళుతున్నప్పుడు చివరిసారిగా నేను దీనిని రోడ్డుమీద వేగముగా దూసుకొచ్చిన ఒక కారు వెనుక వైపున చూశాను. దానికంటే ముందు, మీటర్ గడువు ముగిసినందున వైపర్ కింద టికెట్ ఉన్న పార్క్ చేయబడిన VW బగ్ మీద ఈ స్టిక్కర్ చూశాను.
ఇప్పుడు నేను ఈ పేజీ అంతా నా భావోద్వేగాన్ని వెళ్ళగ్రక్కే ముందు, నేను అన్నీ నిజాలే మీ ముందు ఉంచుతాను. ఈ బంపర్ స్టిక్కర్ నిజమని దేవుని కుటుంబానికి వెలుపల ఉన్న వారందరినీ మనము ఎన్నడూ ఒప్పించలేము. కొంతమంది అవిశ్వాసులు అర్థం చేసుకుంటారు, కానీ చాలామంది దానిని సరిగ్గా ఎప్పటికీ తెలుసుకోలేరు. అయితే, చాలా మంది క్రైస్తవేతరులు తాము చనిపోయే రోజు వరకు కూడా ఆశ్చర్యపోతూ, కోపంగా ఉంటూ, ఒక క్రైస్తవుడు తన జీవితంలో ఏ కొంచెం బలహీనత కనబరచినా సరే మనస్తాపం చెందుతూ, నివ్వెరపోతూ కొనసాగుతారు. క్రైస్తవుల గురించి అవిశ్వాసులు అర్థం చేసుకోలేని అన్ని విషయాలలో, దేవుని కృప మరియు మానవ భ్రష్టత్వము వారిని ఎక్కువగా కలవరపెడతాయి.
- పాప క్షమాపణ మరియు నిత్య రక్షణ వంటి అద్భుతమైనవి ఎలా ఉచితంగా ఇవ్వబడుచున్నవి?
- ఆ వ్యక్తి తాను క్రైస్తవుడనని చెప్పుకుంటూ అలా ఎలా ప్రవర్తించగలడు?
మీరు యేసు గురించి నశించిపోయిన వారితో మాట్లాడటానికి ఎక్కువ సమయం గడిపినట్లయితే, ఆ రెండు ప్రశ్నలు ఎంత తరచుగా అడుగబడుచున్నాయో మీకు తెలుసు. దేవుని కృప మరియు క్రైస్తవుల మానవత్వం యొక్క అసమానతకు వారు ఆశ్చర్యపోతారు. ఎందుకు? ఎందుకంటే అవిశ్వాసుల దృక్కోణం మొత్తం లోకపరముగా ఉంటుంది. వారి భూసంబంధమైన మనస్తత్వం ఇలా చెబుతోంది: విలువైన వస్తువులు ఖరీదైనవి. అందువల్ల, పరలోకము వంటి అమూల్యమైనది ఉచిత బహుమతిగా అందించడం వారి ఊహకు అందదు. మరియు ఈ లోకమనే విమానంలో కృప అపరిమితముగా ప్రవహించడం లేదు.
అలాగే, అవిశ్వాసి యొక్క మొత్తం నిర్దేశ చట్రం మానవ-కేంద్రీకృతమై ఉన్నందున, దేవుని కుటుంబంలో ఉన్నానని చెప్పుకునే వ్యక్తి ఇప్పటికీ అసంపూర్ణతతో పోరాడుతున్న వ్యక్తి అని ఊహించడం వాస్తవంగా అసాధ్యం. అంతిమంగా, వారు ఇలా అడుగుతారు, “దేవుడు మీ జీవితంలోకి వచ్చాడని మరియు క్రీస్తు మీ గతం మొత్తాన్ని మరచిపోయాడని మీరు చెబుతుంటే, మీరు ఎలా పరిపూర్ణులుగా లేరు?”
అది క్రైస్తవేతర ఆలోచనా విధానం. వారు రక్షణను పరిపూర్ణతతో సమానంగా చూస్తారు-వారు కలవరపడటంలో ఆశ్చర్యం లేదు! కానీ క్రైస్తవులు? హే, మనకు బాగా తెలుసు. . . మరియు మనకు ఖచ్చితంగా తెలిసుండాలి.
ఒకరికొకరు తోటి సభ్యులుగా ఉండి, క్రైస్తవుడిగా మారడం అనేది మనల్ని ఏ విధంగానూ పరిపూర్ణమైన జీవితంలోకి నడిపించదని మనము అర్థం చేసుకున్నాము-అలా అయితే అది మన మానవత్వాన్ని చెరిపేస్తుంది మరియు మన భ్రష్టత్వాన్ని నిర్మూలిస్తుంది. మనం క్రీస్తుని మన రక్షకుడిగా విశ్వసించే తరుణంలో పరిపూర్ణత నిజంగా సాధ్యమైతే, రక్షణ తర్వాత దేవునికి విధేయులమై ఉండాలనే ప్రాముఖ్యమైన అంశముతో క్రొత్త నిబంధన అంతా ఎందుకు నిండి ఉంది? ఒకరినొకరు క్షమించుకోవడం, ప్రతిఒక్కరి వైఫల్యాలను అర్థం చేసుకోవడం, వారి బలహీనతలను అంగీకరించడం మరియు వారి బలాలపై దృష్టి పెట్టడం (ఇటువంటివారు కొంతమందే అయినప్పటికీ) గురించి ఇది ఎందుకు బోధిస్తుంది? అవిశ్వాసులు పరిపూర్ణతను ఆశించడం ఒక విషయం-నేను వారి అంచనాతో జీవించగలను మరియు దానిని చక్కగా సహించగలను-కాని తోటి క్రైస్తవ సహోదరులు మరియు సహోదరీలు పరిపూర్ణత రూపములోకి నెట్టబడటం చాలా విసుగు తెప్పిస్తుంది!
ఓహ్, మన ఉదాహరణ క్రీస్తు అని . . . మరియు ప్రమాణం ఉన్నతముగా ఉంటుందని . . . మరియు మన ఉద్దేశాలు స్వచ్ఛంగా ఉండాలని నేను అర్థం చేసుకున్నాను. కానీ మళ్లీ మళ్లీ ఇది పునరావృతం చేయవలసి వస్తుంది:
క్రైస్తవులు పరిపూర్ణులు కారు, కేవలం క్షమించబడ్డారు.
మన క్రైస్తవ సహోదర సహోదరీలను మోసపుచ్చడం మరియు బలిజేయడం ఎంత సులభం! పరిపూర్ణత అంచనాల భారమైన బరువులు మనపై వేయబడగా సున్నితమైన స్వాతంత్ర్యము ఎంత త్వరగా తెగిపోతుందో! క్రీస్తుయేసు తన చుట్టూ ఉన్నవారితో ఎన్నడూ అలా చేయలేదు. ప్రజలు ఆయన దగ్గర ఉన్నప్పుడు, అవాస్తవ అంచనాలు, సూక్ష్మమైన డిమాండ్లు మరియు మోసపుచ్చే మార్గములు లేకపోవడం వల్ల అద్భుతమైన ఆకర్షణీయ శక్తి ఆయనలో ఉంది. ఒత్తిడి వ్యూహాలను ఉపయోగించే బదులు, వారు ఎలా ఉన్నారో అలా ప్రజలను ఆయన అంగీకరించాడు.
పరిపూర్ణత-అంచనా సిండ్రోమ్ వలన ఉక్కిరిబిక్కిరి అయిన సందర్భంలో మనం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నప్పుడు పక్షవాతం ఏర్పడుతుంది. భయం మరియు అపరాధ భావనతో విసిగిపోయిన క్రైస్తవుడు క్రీస్తులో విజేతగా కాకుండా తోటి క్రైస్తవులకు బాధితుడు అవుతాడు.
మనం వెనక్కి వెళ్దాం! ఒకరిపై ఒకరు గొంతు నొక్కుకోవడం సడలిద్దాం. దిద్దుబాటు మరియు వేలు చూపించడం మరియు డిమాండ్ చేయడం మరియు తీర్పు తీర్చడం దేవుడు చేయడానికి మనం అనుమతించుదాం. మనం ఎదుగుదాం మరియు చిన్నచిన్న అనవసర విషయాలపై కేంద్రీకరించడం మరియు నిందించడం మానేద్దాం. దివంగత రూత్ గ్రాహం తెలివిగా చెప్పినది నాకు చాలా ఇష్టం: “బిల్లీని ప్రేమించడం నా పని. అతడిని బాగు చేయడం దేవుడి పని.”
బిల్లీ పేరును మీ జీవిత భాగస్వామి, మీ పేరెంట్, మీ స్నేహితుడు, మీ బాస్, మీ మిషనరీ-మరియు ప్రత్యేకించి మీ పాస్టర్ పేరుతో భర్తీ చేయండి మరియు మీరు బంపర్ స్టిక్కర్ సందేశాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. ఇంకా ఏమిటంటే, మీతో జీవించడం చాలా సులభం అవుతుంది.
నేను కూడా అలాగే ఉంటాను.
Copyright © 2013 by Charles R. Swindoll. All rights reserved worldwide.