అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని నేను దేనిచేతను లోపరచు కొనబడనొల్లను. (1 కొరింథీయులకు 6:12)
కృప ప్రమాదకరమైనదా? ముమ్మాటికి ఇది మీ జీవితమండీ. కృపను గూర్చిన ఈ అంశం నిజంగా వివాదాస్పదమైనదని నాకు బాగా తెలుసు; ప్రత్యేకించి క్రీస్తులో క్రైస్తవులకు ఉన్న స్వాతంత్ర్యానికి నేను క్రొత్త మేల్కొలుపు కోసం పిలుపునిచ్చినప్పుడు. కొందరు నేను కృప గురించి వ్రాసినదాన్ని తీసుకొని దానితో పిచ్చివారుగా ప్రవర్తిస్తారు. ఇతరులు నేను వ్రాసిన వాటిని తప్పుగా చదువుతారు మరియు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు, నన్ను అపార్థం చేసుకుంటారు మరియు దేవుని పరిశుద్ధత గురించి అస్సలు పట్టించుకోనని (వారు అంటారు) నేను ప్రజలకు పాపం చేసే స్వేచ్ఛను ఇస్తానని నామీద నేరారోపణ చేస్తారు. మరొక వైపు, ఇంద్రియసుఖాసక్తి గలవారిలో కొందరు తమ అపరాధం నుండి ఉపశమనం పొందినందుకు నాకు కృతజ్ఞతలు తెలుపుతారు, ఎందుకంటే వారు కృపను గూర్చి నేను చెప్పిన మాటలను అపార్థం చేసుకొని ఇప్పుడు వారు తమ నీతినియమములు మీఱిన నిర్లక్ష్య జీవనశైలిలో కొనసాగడం సరైందేనని భావిస్తున్నారు. ఈ విషయాలు జరగకూడదని నేను కోరుకుంటున్నాను, కానీ కృప యొక్క పూర్తి సందేశాన్ని అందించడానికి నేను ఏమీ దాచిపెట్టకుండా ఉండటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అవును, ఆకర్షణ మరియు అందంతో చూపించబడిన కృప ప్రమాదకరమైనది. ఇది కృప యొక్క దుర్వినియోగదారులను అలాగే కృప యొక్క హంతకులను బయటకు తీసుకువస్తుంది!
మనం లేఖనములోని కీలక వచనాన్ని మరలా చూద్దాం, రోమా 5:1 : “కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము.”
పరిశుద్ధమైన మరియు న్యాయమైన దేవుని ముందు ఎవరైనా నిర్భయముగా నిలబడి సమాధానముగా ఉండాలంటే, ఆ వ్యక్తి నీతిమంతుడిగా ఉండాలి. అందువల్ల, మనకు విమోచనము అవసరం. విమోచనము యొక్క నిర్వచనం గుర్తుందా? ఇది దేవుని సార్వభౌమ క్రియ, అందువల్ల యింకను తన పాపపు స్థితిలోనే ఉన్నటువంటి విశ్వసించు పాపిని ఆయన నీతిమంతునిగా ప్రకటించాడు. విశ్వసించు పాపి పాపం చేయడం ఆపేస్తాడని దీని అర్థం కాదు. విశ్వసించు పాపి అకస్మాత్తుగా శాశ్వతంగా పరిపూర్ణుడు అవుతాడనే అర్థమొచ్చే విధంగా నీతిమంతుడయ్యాడని కూడా దీని అర్థం కాదు. పాపి నీతిమంతుడని ప్రకటించబడ్డాడు. విశ్వసించిన క్షణంలో దేవుడు పాపికి నిత్యజీవమను బహుమానమును అనుగ్రహిస్తాడు, తద్వారా అతడిని నీతిమంతుడిగా ప్రకటిస్తాడు, అయితే పాపి తన జీవితంలో ఇప్పటికీ అప్పుడప్పుడు పాపము చేస్తూ ఉంటాడు. అతను సంఘములో చేరలేదు. అతను దశమభాగాలు చెల్లించడం ప్రారంభించలేదు. క్రీస్తును అనుసరించడానికి అతను అన్నింటినీ వదులుకోలేదు. అతను బాప్తిస్మము తీసుకోలేదు. అతను త్యాగం, మచ్చలేని స్వచ్ఛమైన జీవితాన్ని గడపడానికి వాగ్దానం చేయలేదు. అతను కేవలం నిత్యజీవ బహుమతిని పొందుకున్నాడు. అతను క్రీస్తు వైపు తిరిగి మారుమనస్సు పొందాడు (పశ్చాత్తాపం)మరియు క్రియల మూలముగా కాక దేవుని ఉచిత కృపను స్వీకరించాడు. అంతే. కార్యము ముగిసింది. విశ్వాసము ద్వారా, కృప చేతనే, దేవుడు పాపిని నీతిమంతుడు (విమోచనము) అని ప్రకటిస్తాడు, మరియు ఆ క్షణం నుండి నీతిమంతుడైన పాపి పరిపక్వత (ఎదుగుదల) వైపు వృద్ధి ప్రక్రియను ప్రారంభిస్తాడు. క్రీస్తును ఘనపరచే జీవితాన్ని గడపడం అంటే ఏమిటో అతను రోజురోజుకీ, కొంచెం కొంచెంగా తెలుసుకుంటాడు. అయితే వెంటనే జరుగుతుందా? అవకాశమే లేదు.
దయచేసి అర్థం చేసుకోండి, నీతిమంతుడవటం అంటే “నేను ఎన్నడూ పాపం చేయనట్లుగా” అని కాదు. ఇది నేను తరచుగా వింటున్నాను మరియు ఇది ఎప్పుడూ నన్ను ఇబ్బంది పెడుతుంది. వాస్తవానికి, ఇది విమోచనము యొక్క పూర్తి ప్రభావాన్ని బలహీనపరుస్తుంది. విమోచనము అంటే నిజంగా అర్థమిది: నేను ఇప్పటికీ అప్పుడప్పుడు పాపం చేస్తూ, శాశ్వత ప్రాతిపదికన పాపం చేయడాన్ని నేను ఆపలేకపోతున్నప్పటికీ-నేను విశ్వసించినప్పుడు దేవుడు నన్ను నీతిమంతుడిగా ప్రకటించాడు. మరియు నేను ఎప్పటికప్పుడు పాపం చేస్తూనే ఉంటాను కాబట్టి, కృప విషయమై కృతజ్ఞతతో ఉండటానికి నాకు గట్టి కారణమే దొరికింది. ఒక పాపిగా నేను శిక్షకు పాత్రుడను. ఒక పాపిగా నేను న్యాయమునకు భయపడుచున్నాను. కాబట్టి, ఒక పాపిగా, మనుగడ కోసం నా ఏకైక ఆశ కృపయే. దాని స్వచ్ఛమైన రూపంలో, ఇది లోకానికి అర్థం కాదు!
Reprinted by permission. The Grace Awakening Devotional, Charles R. Swindoll, © 2003, Thomas Nelson, Inc., Nashville, Tennessee. All rights reserved. Copying or using this material without written permission from the publisher is strictly prohibited and in direct violation of copyright law.