నేను పిల్లవాడనైయున్నప్పుడు, నాకు ఆగకుండా కడుపునొప్పి వచ్చింది. ఇది ఎంత ఘోరంగా బాధించిందంటే, నేను నొప్పి పెరగకుండా ఉండేందుకు నేరుగా నిలబడటంగాని లేదా కూర్చోవడంగాని చేయలేకపోయాను. చివరగా, టెక్సాస్లోని హ్యూస్టన్లోని ఒక పెద్ద ఇంటికి నావాళ్ళు నన్ను తీసుకువెళ్లారు, అక్కడ ఒక సర్జన్ నివసిస్తున్నాడు. అతను తన ఇంటి వెనుక భాగాన్ని తన కార్యాలయం మరియు క్లినిక్‌గా మార్చాడు. అది వేడిగా, మగ్గిపోతున్న మధ్యాహ్నం. నేను భయపడ్డాను.
నేను అపెండిసైటిస్ తో బాధపడుతున్నానని అతను ఖచ్చితంగా చెప్పినప్పటికీ, నాకు త్వరగా పరీక్ష అవసరమని డాక్టర్ నిర్ణయించుకున్నాడు. అతను చాలా మెల్లగా నా తల్లికి ఈ విషయమై గుసగుసలాడాడు. నేను మెమోరియల్ హాస్పిటల్‌కు వెళ్లడం, అనస్థీషియా కింద ఉంచబడటం, కోయబడటం, ఆపై ఆ కుట్లు పడటం వంటివి భరించడం ఊహించినప్పుడు నన్ను పట్టుకున్న భయం నాకు గుర్తుంది.
అయితే, వెనక్కి తిరిగి చూస్తే, మరుసటి రోజు శస్త్రచికిత్స కంటే “శీఘ్ర పరీక్షే” ఘోరంగా బాధించిందని నేను నిజంగా నమ్ముతున్నాను. వైద్యుడు కఠినంగా ఉన్నాడు; నిజంగా చాలా కఠినముగా ఉన్నాడు. నన్ను పాత చిరిగిపోయిన బొమ్మలాగ అతను గుచ్చి, మొత్తి, లాగి, నన్ను త్రోశాడు. నేను అప్పటికే నొప్పితో ఉన్నాను, కానీ డాక్టర్ వైజ్-గ్రిప్ తన పరీక్షను ముగించే సమయానికి, నేను అతని వ్యక్తిగత గుద్దుకునే బ్యాగ్ లాగా ఉన్నానేమోనని అనుకున్నాను. అతనికి, నేను మానవజాతి యొక్క 10 సంవత్సరాల నమూనా కంటే ఎక్కువ కానేకాదు. 38°C ఉష్ణోగ్రతతో, వికారం, మరియు కుడి దిగువ భాగంలో అనిర్ధారిత కడుపు నొప్పితో మగ, రాగి జుట్టుగల, సన్నని వ్యక్తిని. అతను నన్ను చూడటం, నా మాట వినడం, నాతో మాట్లాడటం లేదా నా గురించి పట్టించుకోవడం వంటివి చేసినట్లు ఒక్కసారి కూడా నాకు గుర్తులేదు. చిన్నవాడనైనప్పటికీ, నేను ఆ మనిషిని విసిగించినట్లు నాకు స్పష్టంగా గుర్తుంది-ఆ రోజు నేను కేస్ నంబర్ 13, అతని ప్రాక్టీసులో అపెండెక్టమీ నంబర్ 796. నిజం చెప్పాలంటే, ఆ మధ్యాహ్నం పద్దెనిమిది రంధ్రాల గోల్ఫ్ ఆట కోసమైన అతని ప్రణాళికల్లో నేను చిరాకు తెప్పించానేమోనని అనిపించింది.
కడుపునొప్పితో పదేళ్ల వయస్సు ఉన్నవాడు, అనుభవజ్ఞుడైన వైద్యుడికి పెద్ద సవాలు కాదు. . . కానీ అతనిలో దయ లేకపోవటం మరచిపోలేని ముద్రను వేసింది. దయతో శ్రద్ధగా చూడటం అతనిలో లేకపోవడం వలన అతని డెస్క్ వెనుక గోడకు అంటుకొనియున్న చక్కగా రూపొందించిన డిప్లొమాలు, విజయాలు మరియు అవార్డుల యొక్క ప్రాముఖ్యత కొట్టివేయబడినవి. నా యవ్వన జీవితంలో ఆ బాధాకరమైన, భయానక క్షణంలో, సాధించిన పట్టాల కంటే నాకు అవసరమైనది చాలా ఉంది. చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటికీ, నాకు దయ అవసరం. దయ యొక్క స్పర్శ. సున్నితమైన, సానుభూతితో ఆలోచించి, ధైర్యాన్నిచ్చే మృదువైన మాట; అలాగే ఒక చిరునవ్వు సహాయం చేసి ఉండేది. “ఈ అబ్బాయికి శస్త్రచికిత్స అవసరం. ఈ రోజు ఐదు గంటలకు మెమోరియల్ వద్ద నన్ను కలవండి,” అని ఆ మనిషి విసిరిన చప్పటి నిర్ణయం యొక్క గంభీరతను తగ్గించేది ఏదైనాసరే బాగుండేది.
అరవై ఏళ్ళు వెనక్కి తిరిగి చూస్తే, నేను ఒక విలువైన పాఠం నేర్చుకున్నాను: ప్రజలు బాధపడుతున్నప్పుడు, వారికి ఖచ్చితమైన విశ్లేషణ మరియు శీఘ్ర నిర్ధారణ కంటే అవసరమైనది ఇంకా ఉన్నది. వృత్తిపరమైన సలహా కంటే ఎక్కువ చేయాలి. అన్నిటిని సులభంగా సరిచేసి బిగించే దృఢమైన, నిశ్చయమైన యంత్రములాంటి మాటలను మించినది కావాలి.
న్యాయవాదులు, వైద్యులు, సలహాదారులు, ఫిజియోథెరపిస్టులు, దంతవైద్యులు, తోటి పరిచారకులు, నర్సులు, ఉపాధ్యాయులు, శిష్యులను తయారుచేసేవారు, తల్లిదండ్రులు . . . మీరంతా వినండి, మీరంతా వినండి! మన సహాయం కోరే చాలా మంది భావాలు బలహీనమైనవిగాను మరియు భయమును పుట్టించేవిగాను ఉన్నవి. వీరు అమూల్యమైనవారు, త్వరితంగా సులభంగా కృంగిపోతారు గనుక, మనము వారి గురించి శ్రద్ధ వహిస్తూ సహాయం చేయడానికి మనము అక్కడ ఉన్నామని వారు గ్రహించాలి. . . ఇది మన ఉద్యోగం కాబట్టి చేయటం కాదు. నిజం మరియు నేర్పు గొప్ప మంచి స్నేహితులను తయారుచేస్తాయి.
మరీ ఔదార్యముగా అనిపిస్తుందా? బలహీనమైనదా? అపొస్తలుడైన పౌలు లాంటి వారు దయను కౌగలింకున్నారని మీరు చూడగలిగితే అది సహాయపడుతుందా? తెలివైన మరియు క్రమశిక్షణ గల వ్యక్తి అయినప్పటికీ, పౌలు దయ మరియు కరుణగల వ్యక్తి.
మీరెరిగియున్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను, ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడును వినియోగింపలేదు; ఇందుకు దేవుడే సాక్షి. మరియు మేము క్రీస్తుయొక్క అపొస్తలులమై యున్నందున అధికారముచేయుటకు సమర్థులమై యున్నను, మీవలననే గాని యితరుల వలననే గాని, మనుష్యుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లుగా, మేము మీమధ్యను సాధువులమై యుంటిమి. మీరు మాకు బహు ప్రియులైయుంటిరి గనుక మీయందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడ మీకిచ్చుటకు సిద్ధపడియుంటిమి. (1 థెస్సలొనీకయులకు 2:5–8)
ఏదోయొక రోజు మనమందరం దయను పొందుకునే స్థితిలో ఉంటాము. మనము నిశ్చయత, ప్రోత్సాహం, దయ యొక్క సున్నితమైన స్పర్శ కావలసినవారమై ఉంటాము. ఇది “ఇంగ్లీష్ హిప్పోక్రేట్స్” (1624-1689) అనబడే థామస్ సిడెన్హామ్ యొక్క పాతకాలపు సలహా లాంటిది, దానిని అతను ఆనాటి నిపుణులకు అందించాడు:
ఇతరుల సంరక్షణకు తనను తాను అప్పగించుకోవడానికి ఉద్దేశించిన ప్రతి వ్యక్తి, ఈ క్రింది నాలుగు విషయాలను తీవ్రంగా పరిగణించాలి: మొదటిగా, అతను తన సంరక్షణకు అప్పగించబడిన అన్ని జీవితాల యొక్క సర్వోన్నత న్యాయాధిపతికి ఒకానొక రోజు తప్పక లెక్క చెప్పాలి. రెండవదిగా, అతని నైపుణ్యం మరియు జ్ఞానం మరియు శక్తి, దేవునిచేత అతనికి ఇవ్వబడినవి గనుక, ఆయన మహిమ కొరకు మరియు మానవజాతి యొక్క మంచి కొరకు వారు అభ్యాసం చేయాలి, కేవలం లాభం లేదా అత్యాశ కొరకు కాదు. మూడవదిగా, అతను నీచమైన జీవి యొక్క సంరక్షణను చేపట్టలేదని తలపోయనివ్వండి, మరియు యిది నిజం కంటే అందంగా ఉండదు; ఎందుకంటే, అతను మానవ జాతి యొక్క విలువను, గొప్పతనాన్ని అంచనా వేయడానికి దేవుని అద్వితీయకుమారుడు ఒక మానవుడు అయ్యాడు, అందుచేత దానిని తన దైవిక గౌరవంతో ఘనత కలుగజేసాడు మరియు ఇంతకన్నా ఎక్కువ ఏమి చేశాడంటే, దానిని విమోచించడానికి మరణించాడు. మరియు నాల్గవదిగా, వైద్యుడు తాను ప్రాణాంతకమైన మానవుడైయున్నాడు, బాధపడే తన రోగులకు ఉపశమనం కలిగించడంలో శ్రద్ధగా మరియు దయగా ఉండాలి, దాదాపుగా అతను కూడా ఒకానొక రోజున ఇలాంటి బాధితుడివలె ఉంటాడు.
ఇవన్నీ కడుపు నొప్పి ఉన్న 10 సంవత్సరాల పిల్లలకు, వెన్నునొప్పి ఉన్న 80 ఏళ్ల వాళ్ళకు, తలనొప్పి ఉన్న ఎవరికైనా . . . మరియు గుండె నొప్పి ఉన్న ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయి.
Copyright © 2012 by Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.