సొలొమోను చెప్పిన మాటలను పరిశీలించండి: “యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును, / కుటిలవర్తనుడు బయలుపడును” (సామెతలు 10:9). చదవడం కొనసాగించుటకు ముందు, ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ దీనిని చదవండి.
యోబు తన కుటుంబాన్ని పెంచుకొని, వ్యాపార ప్రపంచంలో తనను తాను స్థాపించుకొని, వయస్సు మీదపడే సమయానికి, అతను “తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను” (యోబు 1:3).
యోసేపు పోతీఫరు యొద్ద పరిచర్య చేయువాడాయెను, తరువాత పోతీఫరు కలిగినదంతటిమీదను విచారణకర్తగా నియమించబడెను (ఆదికాండము 39:5). పనివారి ముందు లేదా భారీ మొత్తంలో డబ్బును నిర్వహించడం లేదా పెద్ద సంఖ్యలో అతిథులకు పరిచర్య చేయడం లేదా పోతీఫరు భార్యతో కలిసి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడైనా సరే, యోసేపు నమ్మదగినవాడు.
దానియేలు కూడా గుర్తుకు వస్తాడు. అతను ప్రధానమంత్రి పదోన్నతి కోసం ముందుకు వచ్చాడు, మరియు అతని మీద అసూయపడేవారు “దానియేలు మీద ఏదైన ఒక నింద మోపవలెనని యుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి” (దానియేలు 6:4). వారు విఫలమయ్యారు. ఒక్క మరక లేదు . . . కప్పిపుచ్చడం లేదు. ప్రశ్నార్థకమైన కొన్ని సమస్యలను లేవనెత్తడానికి చేసిన ప్రతి ప్రయత్నం తరువాత, ఎక్కడనూ “తప్పయి నను లోపమైనను కనుగొనలేకపోయిరి” (6:4). యోబు మరియు యోసేపు మాదిరిగా, దానియేలు తన చిత్తశుద్ధితో సురక్షితంగా నడచుకున్నాడు. తాను “కనుగొనబడతాను” అని ఎప్పుడూ భయపడలేదు.
ఈ పురుషులు పరస్పరం ఏమి కలిగి ఉన్నారు? పరిపూర్ణత? లేదు, నేను పేరు పెట్టి పిలిచిన ప్రతి వ్యక్తి పరిపూర్ణతకు చాలా దూరంలో ఉన్నారు. సుఖమైన కాలములు? అరుదుగా. నిశితంగా పరిశీలిస్తే మిమ్మల్ని కలవరపరచు వేదనలు మరియు శ్రమలు బయలుపడతాయి. సరే, పబ్లిక్-ఇమేజ్ విభాగం జాగ్రత్తగా రూపొందించిన ఆకర్షణీయమైన వైఖరి ఎలా ఉంటుంది? నన్ను నవ్వించవద్దు. పోనీ, వివేక వాక్చాతుర్యం ఎలా ఉంటుంది? మళ్ళీ తప్పు. కొంతమంది నిరాశావాదులు సూచించే అరడజను ఇతర సంభావ్యతలను మన మనస్సులో సృష్టించుకోవచ్చు, కానీ నేను పేర్కొన్న నాలుగింటిలాగే అవి కూడా లక్ష్యాలకు దూరంగా ఉంటాయి.
వీరు పరస్పరము కలిగియున్నది సత్ప్రవర్తనయే. నేను లేఖనాల నుండి ఎన్నుకున్న ప్రతి మనిషికి ఉన్నతైన నైతిక సత్ప్రవర్తన ఉన్నది. ముఖ్యంగా ఎన్నికల సంవత్సరంలో . . . మన కాలంలో నాయకులలో ఆ ముఖ్యమైన అంశాన్ని విస్మరించడం తేలిక.
దౌర్భాగ్యముగా, మనము రహస్య మరియు మోసపూరిత జీవనశైలిని పట్టించుకొనకుండ ఉండటానికి అలవాటు పడ్డాము. నిజాయితీకి విలువిచ్చేవారిని, బాధ్యతకు ప్రతిరూపాలుగా ఉండేవారిని, న్యాయమును, జవాబుదారీతనమును, విధేయతను మరియు ఇతరులపై గౌరవాన్ని ప్రోత్సహించేవారిని, మరియు బలమైన, నిజాయితీగల నమ్మకాలను కలిగి ఉన్న వ్యక్తులను కనుగొనడం అసాధ్యమే కాదు, వాస్తవికంగా కూడా జరుగదు. “మేము అధ్యక్షుడి కొరకు ఓటు వేస్తున్నాము, పోప్ కొరకు కాదు,” అని మూర్ఖ ఆత్మ ఇటీవల చెప్పినట్లుగా ఉన్నది. అటువంటి సారూప్యతకు నేను “మాలిన్యము” అని సమాధానం ఇస్తున్నాను.
మీకిష్టమైతే నన్ను పాత-కాలపువాడు లేదా ఆదర్శవాది అని పిలవండి, కాని నా ఉద్వేగభరితమైన విజ్ఞప్తి ఏమిటంటే, మనము సత్ప్రవర్తన యొక్క ప్రాముఖ్యతను వెలికితీసి పునరుద్ధరించాలి. ఇది ఎప్పుడో భూస్థాపితమైపోయింది. కార్యాలయంలో ఉద్యోగుల కోసం శోధిస్తున్నప్పుడు ఇది మన జాబితాలో మొదటిదిగా ఉంటుంది. ఇది మన పాఠశాలలు, మన కౌన్సిల్స్, మన కౌంటీలలో నాయకత్వ స్థానాల్లో ఉండేవారిలో . . . మరియు, ఖచ్చితంగా, మన సంఘాలలో మరియు మన ప్రభుత్వ గదులలో సంప్రతించలేనిదిగా ఉండాలి. ఆరోగ్యకరమైన తల్లిదండ్రులు తమ పిల్లలలో సత్ప్రవర్తనను వృద్ధిచేయటానికి ప్రయత్నిస్తారు. తమ యౌవన బిడ్డలు ఎవరినైతే ప్రేమిస్తారో వారిలో ఇది ఉండాలని గొప్ప తల్లులు మరియు నాన్నలు చూస్తారు మరియు నిరీక్షిస్తారు. మనకు సేవ చేసే నిపుణులు మరియు కార్మికుల వర్గము నుండి మనమందరం ఆశించే ముఖ్యమైన గుణం ఇది. మనము ప్రతిసారీ చెప్పకపోవచ్చు, కానీ మన ఆత్మల లోలోపల, మనము సత్ప్రవర్తన కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తాము. అది లేనప్పుడు, మనకు తెలుస్తుంది; ఆగ్రహిస్తాము. గొప్పతనంలో సత్ప్రవర్తన “నిశ్చయమై” ఉన్నది.
అలాంటప్పుడు ఎందుకు ఇది చాలా అరుదుగా ప్రస్తావించబడిందని నేను అడగవచ్చా? దీనిని ఆశించే హక్కు మనకు లేదని చాలామంది నమ్ముచున్నందువల్లనా? ఏదేమైనా, “ఎవ్వరూ పరిపూర్ణులు కాదు.”
మనకు అవసరమైనది సత్ప్రవర్తన, నేను పునరావృతం చేస్తున్నాను, పరిపూర్ణత కాదు. మన దేశం యొక్క ప్రారంభ కాలం నుండి, గొప్ప పురుషులు మరియు మహిళలు, అసంపూర్ణులైనప్పటికీ, ప్రభుత్వ అధికారులు నిజమైన ధర్మాన్ని . . . గౌరవం, స్వీయ నైపుణ్యం, దృఢ నిశ్చయం, పట్టుదల, సంకల్ప బలం, నైతిక స్వచ్ఛత, వ్యక్తిగత సమగ్రత మరియు త్యాగపూరిత దేశభక్తిని ప్రదర్శించినప్పుడు నాయకత్వ స్థానములను ఆక్రమించుకొన్నారు. వారు ప్రజా నాయకత్వంలో మరియు వ్యక్తిగత జీవితంలో ఉదాహరణలుగా ఉన్నందున వారు ఏర్పరచబడ్డారు మరియు ఎన్నుకోబడ్డారు. కనీస ప్రమాణాలకు అనుగుణంగా జీవించడంలో కొందరు విఫలమయ్యారు గనుక ఆదర్శవంతమైనది మార్పుచెందదు.
సొలొమోను సరిగ్గా చెప్పాడు. యథార్థముగా ప్రవర్తించువారు నిర్భయముగా ప్రవర్తిస్తారు . . . “బయలుపడతామనే” భయం లేకుండా ఉంటారు. యోబు, యోసేపు మరియు దానియేలు వంటి పురుషులు భయంకరమైన సమయాల్లో సత్ప్రవర్తనను ప్రదర్శించగలిగినప్పుడు, మీరు మరియు నేను కూడా చేయవచ్చు-ఈ రోజు.
మనం చేయగలము గనుక, మనం తప్పక చేయాలి.