శక్తిగల నాయకుల కొరకు దేవుడు లోకాన్ని పరిశోధించినప్పుడు, శరీర రూపంలోని దేవదూతల కోసం ఆయన అన్వేషణలో లేడు. ఆయన ఖచ్చితంగా పరిపూర్ణమైన వ్యక్తుల కోసం వెతకడం లేదు, ఎందుకంటే ఎవరూ లేరు. ఆయన మీలాంటి మరియు నాలాంటి స్త్రీపురుషుల కోసం, కేవలం మాంసముతో తయారైన మనుష్యుల కోసం వెదకుచున్నాడు. అయితే ఆయన దావీదులో ఏ లక్షణాలనైతే కనుగొన్నాడో అవే లక్షణాలను పాలుపంచుకునే మనుష్యుల కోసం కూడా ఆయన చూస్తున్నాడు. దేవుడు “తన చిత్తానుసారమైన మనస్సుగల” (1 సమూయేలు 13:14) స్త్రీపురుషుల కోసం చూస్తున్నాడు.
దేవుని చిత్తానుసారమైన మనస్సుగల వ్యక్తిగా ఉండడం అంటే ఏమిటి? మీ జీవితం ప్రభువుతో అన్యోన్యముగా ఉందని దీని అర్థం. ఆయనకేది ముఖ్యమైనదో అదే మీకు ముఖ్యం. ఆయనకు భారముగా ఉన్నది మీకు భారముగా ఉంటుంది. “కుడి వైపుకు వెళ్ళండి” అని ఆయన చెప్పినప్పుడు, మీరు కుడి వైపుకే వెళతారు. “మీ జీవితంలో దానిని ఆపండి” అని ఆయన చెప్పినప్పుడు, మీరు దానిని ఆపేస్తారు. “ఇది తప్పు మరియు మీరు మారాలని నేను కోరుకుంటున్నాను” అని ఆయన చెప్పినప్పుడు, మీరు దేవుని అర్థం చేసుకున్నందున మీరు ఆ కష్టమైన పరిస్థితిని అంగీకరిస్తారు. ఇదే ముఖ్యమైన, బైబిలు సంబంధమైన క్రైస్తవ్యం.
మీరు దేవుని హృదయానుసారులైన స్త్రీపురుషులైనప్పుడు, మీరు ఆత్మీయ విషయాల పట్ల చాలా సున్నితంగా ఉంటారు. రెండవ దినవృత్తాంతములు 16:9 దానిని ఈ విధంగా వివరిస్తుంది: “తనయెడల యథార్థ హృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది” (ఉద్ఘాటన జోడించబడింది)..
దేవుడు దేని కోసం చూస్తున్నాడు? ఎవరి హృదయాలైతే ఆయనవై ఉంటాయో–యథార్థముగా, అటువంటి స్త్రీపురుషుల కోసం చూస్తున్నాడు. అంటే హృదయపు తలుపులు మూసివేయబడలేదు. దాగియున్నది ఏదియు లేదు. అంటే మీరు తప్పు చేసినప్పుడు, మీరు దానిని అంగీకరించి సమాధానపడతారు. మీ క్రియలతో ఆయనను సంతోషపరచాలని మీరు కోరుకుంటారు. మీ క్రియల వెనుక ఉన్న ప్రేరేపణలను గురించి మీరు చాలా శ్రద్ధ వహిస్తారు. దేవుడు మానవత్వం యొక్క అద్భుతమైన నమూనాల కోసం వెతకడం లేదు. ఆయన లోతైన ఆత్మీయ, నిజమైన వినయము, సంపూర్ణ చిత్తశుద్ధి ఉన్న నిజాయితీగల సేవకుల కోసం చూస్తున్నాడు.
“యథార్థత” అని అనువదించబడిన ఈ హీబ్రూ పదమైన థామమ్‌కు (thamam) కొన్ని పర్యాయపదాలు వినండి: “పరిపూర్ణత, అభిన్నత, నిష్కాపట్యం, నిరాడంబర జీవితం కలిగియుండటం, పూర్ణత్వము, బుద్ధిగలిగి ఉండటం, దృఢమైనది.” ఎవరూ చూడనప్పుడు మీరు ఏమిటో అదే యథార్థత. “మీరు ఒక మంచి ముద్ర వేస్తే చాలు, అదే ముఖ్యం,” అని అనేక విధాలుగా చెప్పే ప్రపంచంలో మనం జీవించుచున్నాము. కానీ అది మీ తత్వశాస్త్రమైతే మీరు ఎప్పటికీ దేవుని బిడ్డలుగా ఉండలేరు. ఎన్నటికీ. మీరు సర్వశక్తిమంతుని మోసం చేయలేరు. బాహ్యమైనవాటితో ఆయన సంతృప్తి చెందడు. ఆయన ఎల్లప్పుడూ అంతరంగ లక్షణాలపై దృష్టి పెడతాడు, అంటే హృదయము యొక్క స్వభావము . . . ఇటువంటివి అలవరచుకోవడానికి సమయం మరియు క్రమశిక్షణ పట్టే విషయాలు.
Taken from Charles R. Swindoll, “Becoming a Man or a Woman after God’s Own Heart,” Insights (April 1997): 2. Copyright © 1997 by Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.