పౌలు యొక్క పరిచర్య దేవుని వాక్యంతో నిండిపోయింది. అపొస్తలుల కార్యముల గ్రంథములోని పదమూడు మరియు పద్నాలుగు అధ్యాయాలలో పదిహేను సార్లు “దేవుని వాక్యము,” “సత్య వాక్యం,” “ప్రభువు బోధ,” “ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములు,” మరియు “సువార్త” అనే పదాలు వ్రాయబడ్డాయి (13:5, 7, 12, 15, 32, 44, 46, 48, 49; 14:3, 7, 15, 21, 25).
ఆ మొదటి ప్రయాణంలో పౌలు జీవించడానికి అవసరమైనవి, అతని శరీరాన్ని కప్పుకునేందుకు తగినన్ని దుస్తులు, దేవుని సత్యంలో నిండు హృదయంతో నిండిన నిరీక్షణ మరియు అతనిని నమ్మకంగా ఉంచే దేవునిపై విశ్వాసమును తీసుకువెళ్లాడు. అదే అతడిని సురక్షితమైన స్థానంలో నిలబెట్టింది. అదే అతడిని పరిచర్యలో ఆదరణ లోపించి చేదు అనుభవాలు ఎదురైనప్పుడు ధైర్యంతో వాటిని ఎదుర్కొనే విధంగా సిద్ధపరచింది.
లేఖనాల్లో గడిపే సమయం పట్ల మీ నిబద్ధతలో గత కొన్ని నెలలుగా మీరు కొంచెం మెత్తబడి ఉండవచ్చా? అప్పుడప్పుడు నాకు జరిగినట్లే మీకూ అది జరుగుతూ ఉండవచ్చు. దయచేసి ఈ సున్నితమైన హెచ్చరికను లక్ష్యపెట్టండి: మీరు పాఠశాలకు వెళ్లడానికి లేదా క్రొత్త పరిచర్య బాధ్యతలను స్వీకరించడానికి లేదా మీ కెరీర్‌లో క్రొత్త దశను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నట్లయితే, ముందుగా దేవునితో క్రమం తప్పకుండా ఏకాంత సమయం ఏర్పాటు చేసుకోకుండా, ఆయన వాక్యంలో సమయం గడపడం ద్వారా క్రొత్త సవాలు కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోకుండా చేయకండి. మీ ఆత్మీయ భవిష్యత్తు దానిపై ఆధారపడి ఉంటుంది. దేవుని వాక్యంతో మీ జీవితాన్ని నింపుకోవడానికి ఆ సమర్పణ లేకుండా, మీరు మీ స్వంత పూచీతో తెలియని భవిష్యత్తులోకి అడుగుపెడతారు. మీరు లోలోపల బలపడునట్లుగా దేవునితో తగినంత సమయం గడపాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఇది ప్రతిరోజూ కేవలం పదిహేను నిమిషాలు కేటాయించటంతో ప్రారంభం కావచ్చు.
మీలో కొందరు ఆలోచిస్తున్నారు, నాకు రోజుకు పదిహేను నిమిషాలు కేటాయించే సమయం లేదు! మీ మధ్యాహ్న భోజన విరామాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి, తద్వారా మీకు ఒక కీర్తన లేదా రెండు చదవడానికి లేదా క్రొత్త నిబంధన పత్రికలలో ఒకదాన్ని సంగ్రహించుకోవడానికి సమయం లభిస్తుంది.
దేవుని వాక్యంలో పౌలు తన జీవితాన్ని నింపుకోగలిగినప్పుడు, మీరు మరియు నేను కూడా చేయవచ్చు. మరెవరూ తాకలేని విధంగా మీ ప్రభావ పరిధిలోని కొంతమంది జనులను మీరు తాకుతున్నారు. బైబిల్ పట్ల మీ నిబద్ధతకు, మీ బైబిల్ కౌన్సిలింగ్‌కు ప్రసిద్ధి చెందండి. బైబిల్ సంబంధమైన మీ సలహాలకు ప్రసిద్ధి చెందండి. నైతిక విలువలపై బైబిలుసంబంధమైన మీ వైఖరి విషయమై ప్రశంసించబడండి. ఇదంతా పరిశుద్ధ గ్రంథములో మీ సమయం పెట్టుబడి పెట్టడంతో మొదలవుతుంది. అక్కడకు వెళ్ళండి. దేవుని వాక్యంతో నింపబడండి. అదే మిమ్మల్ని ప్రామాణికమైన పరిచర్యను స్థాపించే దిశగా మైళ్ల దూరం మోసుకొని వెళుతుంది.
Adapted from Charles R. Swindoll, “Authentic Ministry,” in Great Days with the Great Lives (Nashville: W Publishing Group, 2005), 327. Copyright © 2005 by Charles R. Swindoll, Inc. All rights reserved. Used by permission.