మన కొత్త కరోనావైరస్ ప్రపంచంలో, కలిసి ఉండటం చాలా అరుదైన మరియు విలువైన అనుభవంగా మారింది. COVID-19 అనే “అదృశ్య శత్రువు” మన ప్రపంచవ్యాప్తంగా కదంతొక్కుతున్నందున, దాని వ్యాప్తిని అరికట్టడానికి మనం వేరుగా ఉంటున్నాము. “సామాజిక దూరం” ఒక వింతైన, క్రొత్త ప్రమాణంగా మారింది. ఒకరికొకరు దూరం కావడం మరియు అనుపస్థితి ఈ రెండింటి మధ్య పెద్ద వ్యత్యాసం ఉందని నేను ఇటీవల గ్రహించాను. దూరం మనల్ని ఒకరినొకరు తాకకుండా, కలవకుండా ఉంచుతుంది. కానీ దూరం కావడం అంటే మనం ఒకరితో ఒకరు మాట్లాడలేము లేదా ఒకరినొకరు చూసుకోలేమని కాదు. టెక్నాలజీకి ధన్యవాదాలు, మనం రెండింటినీ చేయవచ్చు. మనం దూరంగా ఉండవచ్చు, కానీ మనం కనెక్ట్ అయి ఉంటాము. అది అనుపస్థితి అంత తీవ్రమైనది కాదు. ఒంటరిగా ఉండడం, ఏకాకిలా ఉండటం, స్థానభ్రంశం చెందడం, ఏకాంతంగా ఉండటం . . . పోగొట్టుకోవడాన్ని కూడా సూచిస్తుంది.
సంధ్యా సమయంలో ఒక పెద్ద సరస్సులో ఈత కొడుతున్న ఒక వ్యక్తిని గురించి నేను చదివిన విషయాన్ని ఈ అనుపస్థితి గుర్తుచేస్తుంది. నీటిలో ఆడుకుంటూ ఒడ్డునుండి 100 గజాల దూరం వెళ్లినప్పుడు, ఒక అసహజమైన పొగమంచు చుట్టుముట్టింది. అకస్మాత్తుగా, అతను ఏమీ చూడలేకపోయాడు. కన్నుపారేంత దూరంలో ఏమీ కనబడుటలేదు, తెలిసిన గుర్తులు గాని, తీరం వెంబడి లైట్లుగాని జనాలు గాని ఏమీ కనబడుటలేదు. పొగమంచు వెలుగును కమ్మివేసినందున, అతను సూర్యుడు అస్తమించే దిశ ఏదో కూడా నిర్ధారించుకోలేకపోయాడు. సుమారు 30 నిముషాల పాటు, భయాందోళనలకు గురికావడంతో అతను నీళ్లల్లో కొట్టుకుంటూ ఉన్నాడు.
అతను ఒక దిశలో ప్రారంభించి, ధైర్యాన్ని కోల్పోయి, ఆపై తన కుడి లేదా ఎడమ వైపుకు 90 డిగ్రీలు లటుక్కున తిరిగాడు. అతను మళ్ళీ గుడ్డిగా యింకొక కొణంలో ఈతకొట్టే ముందు, అతను తన గుండె వేగం పుంజుకుంటున్నట్లు, తన గొంతు వేగంగా కొట్టుకుంటున్నట్లు భావించాడు. ఇతరులు అతని నుండి దూరంగా ఉండటం కాదు-వారు గైరుహాజరైనారు. అతను పూర్తిగా తప్పిపోయాడు. చివరికి, అతను ఒడ్డు నుండి ఒక మెల్లని స్వరాన్ని విన్నాడు. అతను తన శరీరాన్ని శబ్దం వైపు త్రిప్పి భద్రంగా ఈదుకుంటూ వెళ్లాడు.
బలవంతపు ఒంటరితనాన్ని గడుపుచున్న ఈ వారాల్లో మీరు పూర్తిగా తప్పిపోయిన అనుభూతిని, ఒంటరితనం మరియు స్థానభ్రంశం యొక్క భావనను అనుభవించడం ప్రారంభించారు. భవిష్యత్ యొక్క అనిశ్చిత పొగమంచు మీపైకి రావడంతో మీరు ఎప్పటికన్నా భయాందోళనలకు చాలా దగ్గరగా ఉండవచ్చు. రక్షణ లేని క్షణాల్లో, మీరు ఇంతకు ముందెన్నడూ ఆలోచించని అన్య ఆలోచనను మీరు అలరించి ఉండవచ్చు:
దేవుడు ఎక్కడ ఉన్నాడు?
సిలువ వేయబడటానికి ముందు రాత్రి కలిసినప్పుడు, భయం, విచారం మరియు భయాందోళనల యొక్క ఇదే విధమైన ఆత్మ యేసు శిష్యులను పట్టుకొని ఉంటుంది. ఆయన త్వరలో శ్రమపడి చనిపోతానని బోధకుడు చెప్పడంతో వారికి విపరీతమైన భయం వచ్చేసింది. ఆయన వారిని విడువనున్నాడు.
భ్రమపడినవారి గురించి మాట్లాడండి! యేసు రాజుగా పరిపాలించడాన్ని అలాగే వారు ఆయనతో పాటు ఆయన ప్రక్కనే కూర్చోవడాన్ని ఊహించుకున్నారు. కానీ జరుగవలసినది అది కాదు! బదులుగా, ఆయన బలి కొరకైన గొర్రెపిల్లగా సిలువ వేయబడతాడు. తరువాత, ఆయన మరలా వచ్చి రాజుగా పరిపాలన చేస్తానని ఆయన చెప్పాడు, కాని అది ఎప్పుడు జరుగుతుందో వారికి ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదు. వారు వినగలిగేది ఈ భయంకరమైన వార్త: ఆయన శ్రమపడతాడు, చనిపోతాడు మరియు వెళ్ళిపోతాడు.
ఈ రోజు మనలో చాలా మంది పొందే అనుభూతినే శిష్యులు పొందారు: కంగారుపడుచూ భయపడుచూ ఉన్నారు. యేసు భయావహమైన వారి కళ్ళలోకి చూస్తూ నిశ్శబ్దంగా వారికి భరోసా ఇచ్చాడు: “‘మీ హృదయమును కలవరపడనియ్యకుడి; దేవునియందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి’” (యోహాను 14:1).
అంతా దేవుని అధీనములోనే ఉన్నదని యేసు వాగ్దానం చేశాడు. ఆయన ప్రణాళిక కదిలింపబడదు లేదా మార్చబడదు. ఆయన వారికి అతిముఖ్యముగా చెప్పినదేమంటే, “నన్ను నమ్మండి, భయపడవద్దు. నేను వెళ్లుచున్నాను – కాని నేను తిరిగి వస్తాను! ఈ మధ్యకాలంలో, మనం సంబంధం కలిగియుందాం. మీరు ప్రార్థిస్తారు. . . నేను సమాధానం ఇస్తాను. విషయాలు ఎంత కష్టతరమైనా, నేను పూర్తి అధీనములో ఉంటాను. నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలుసు, అక్కడికి ఎలా రావాలో మీకు తెలుసు.”
తోమాకు అంత నమ్మకం లేదు: “‘ప్రభువా, యెక్కడికి వెళ్లుచున్నావో మాకు తెలియదే; ఆ మార్గమేలాగు తెలియును?’” (14:5).
యేసు ఇచ్చిన సమాధానం బహుశా మీకు కంఠత వచ్చి ఉండవచ్చు: “‘నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు'” (14:6).
ఇది ఒక అద్భుతమైన క్షణం! శిష్యులు రూపాంతరం చెందారు, కొద్ది క్షణాలు ముందు, వారు నెమ్మదిలేక, కష్టపడుతూ, ప్రశ్నలతో నిండిపోయి ఉన్నారు. ప్రస్తుతం మీరు అలా బాధపడుచున్నారా? మీరు ప్రశ్నలతో నిండి ఉన్నారా: ఈ వైరస్ యింకెంత ఘోరంగా తయారవుతుంది? నేను వ్యాధి బారిన పడకుండా ఉండగలనా . . . నా కుటుంబం ఉండగలదా? మాకు తగినంత డబ్బు మరియు ఆహారం మరియు ఇతర నిత్యావసరాలు ఉంటాయా? ఇదంతా ఎప్పుడు ముగుస్తుంది?
యేసు మాటలను వ్యక్తిగతంగా తీసుకోండి: “నీ హృదయమును కలవరపడనియ్యవద్దు.” ఆయన మీతో ఇలా అనడం ఊహించుకోండి: “నా దగ్గరకు రావడానికి మార్గం నీకు తెలుసా? నా దగ్గరకు రా! నన్ను గూర్చిన సత్యాన్ని వెదకుచున్నావా? నన్ను వెతుకు! నీ జీవితానికి భద్రత లేకుండాపోయిందా-నువ్వు తప్పిపోయినట్లు మరియు వదలివేయబడినట్లు భావించుచున్నావా? నన్ను నమ్ము!”
మనం ఈ చీకటి కరోనావైరస్ లోయ గుండా ప్రయాణిస్తున్నప్పుడు ప్రభువు మీకు మరియు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన దూరంగా లేడు . . . మరియు ఆయన ఎన్నడూ అనుపస్థితిలో లేడు.
Copyright © 2020 by Charles R. Swindoll, Inc. All rights are reserved worldwide.