ప్రేతం కాని ఆత్మ

నేను గత వారం “మానవాతీతమైన” పని చేసాను. నిజానికి, నేను రెండుసార్లు చేసాను.

నా జీవితకాలం గురించి వెనక్కి తిరిగి ఆలోచిస్తే, నేను చాలా సాహసోపేతమైన పనులు చేశాను. నేను కొన్ని వెర్రి పనులు కూడా చేసాను; కొన్ని తుంటరియైనవి, అపాయకరమైనవి మరియు కొన్ని సందర్భాల్లో ప్రమాదకరమైనవిగా సంభవిస్తాయని నేను భావిస్తున్నాను. కొన్నేళ్లుగా నా పాఠకులతో నేను పెంచుకున్న కొద్దిపాటి గౌరవాన్ని నిలుపుకోవటానికి, నేను చేసిన ఆ పనులన్నిటిని గురించి నేను వెల్లడించను. కాని నేను గత వారం రెండుసార్లు చేసిన ఈ మానవాతీత పని గురించి నేను మీకు చెప్పాలి.

నేను గురుత్వాకర్షణను ధిక్కరించాను.

నేను దీన్ని నా స్వంతంగా చేయలేదని ఇప్పుడు నేను ఒప్పుకోవలసి ఉంది-చూడండి, మర్త్యులు అలా చేయలేరు. నాకు వెలుపల ఉన్న శక్తి నుండి నాకు సహాయం కావాలి, మరియు అది కొంచెం సమస్యగా ఉంది, ఎందుకంటే ఆ శక్తి అదృశ్యంగా ఉంటుంది. అక్కడే విషయాలు కొద్దిగా “భయం పుట్టించేవిగా” తయారయ్యాయి. ఇది అదృశ్యమని నాకు ఎలా తెలుసు? నేను చూశాను. వాస్తవానికి, నేను తదేకంగా చూశాను. నేను కిటికీ పక్కన కూర్చొని ఉన్న సహచరునిపై వాలిపోయాను, మరియు మేము అత్యధిక వేగముతో రన్వేపైనుండి శరవేగంతో గర్జిస్తూ వెళుతుండగా రెక్కలను నేను చూశాను. నా మానవాతీత అనుభవాన్ని సాధ్యం చేసిన శక్తిని నేను చూడగలనా అని నేను చూస్తూనే ఉన్నాను.

చివరగా, కిటికీ పక్కన కూర్చున్న వ్యక్తి నన్ను అడిగాడు, “మీరు బాగానే ఉన్నారా?”

నేను రెక్క వైపు చూస్తూనే “అవును,” అని సమాధానమిచ్చాను. “అంతా బాగుందా లేదా అని నేను చూస్తున్నాను” (మీరు విమానాలలో బయలుదేరినప్పుడు అలాంటి విషయాలు చెప్పడం నాకు ఇష్టం.) మరియు కొద్దిసేపటికే అతను వెనక్కి తిరిగి చూస్తూ నాతో సంప్రదించుచున్నాడు!

“మనము దేని కోసం వెదకుచున్నాము?” అతను తన మెడను సాగదీస్తూ అడిగాడు.

“ఏముంది,” నేను బదులిచ్చాను, “మనల్ని పట్టుకున్న వస్తువు కోసం మనం చూస్తున్నాము.” ఇది చాలా ఆసక్తికరమైన సంభాషణకు దారితీసిందని నేను జోడించవచ్చు.

“అయ్యో, చక్, నాకు కొంచెం విరామం ఇవ్వండి. ఇక్కడ మీరు నిజంగా విచిత్రమైన భయానకమైనది ఏదో చేశారని నేను అనుకుంటున్నాను, కానీ మీరు ఎగిరారు,” అని మీరు అంటారు. మీరు చెప్పింది నిజమే, నేను చేసినది అదే. ఇది ఇప్పుడు సాధారణ విషయం అయినప్పటికీ, ఇది ఇప్పటికీ అద్భుతమైనదని మీరు అంగీకరించాలి. ఆ అదృశ్య శక్తి మా విమానం సముద్ర మట్టానికి 30,000 అడుగుల ఎత్తులో రెండు గంటలకు పైగా రాకపోకలను మోసింది. మరియు విమానం లోపల మనలో ఒక్కరు కూడా అది ఏమి చేసిందో చూడలేదు.

గాలి నమ్మశక్యం కాని శక్తి. మీరు దీన్ని చూడలేరు లేదా వాసన చూడలేరు (మీరు లాస్ ఏంజిల్స్ దగ్గర నివసిస్తే తప్ప!). మీరు సాంకేతిక మార్గాల్లో తప్ప, దాన్ని కొలవలేరు లేదా బరువు చూడలేరు. కానీ ఇది ప్రతి నిమిషం మిమ్మల్ని సజీవంగా ఉంచుతుంది. అది లేకుండా మనం జీవించలేము. అయినను మనం ఎగురుతున్నప్పుడు దాని గురించి ఏమీ ఆలోచించము. అద్భుతమైన పదార్థం, గాలి.

ఏదోయొకటి అదృశ్యంగా ఉన్నందున అది ముఖ్యం కాదు లేదా బలహీనంగా ఉందని ఎప్పుడూ అనుకోకండి. పరిశుద్ధ గ్రంథము గాలి గురించి చాలా మాట్లాడుతుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు. పాత నిబంధన దీనిని రువాఖ్ అని పిలుస్తుంది. క్రొత్త నిబంధన దీనిని ప్నెన్యూమా అని పిలుస్తుంది. అయితే, ఇంగ్లీష్ బైబిల్ ఈ రెండింటిలో దేనిని కూడా గాలిగా అనువదించదు. సాధారణంగా, ఇది ఊపిరి. “దేవుడైన యెహోవా నరునిలో జీవవాయువును ఊదెను.” లేదా దీనిని గాలి అంటారు. “శక్తివంతమైన గాలిలా.” లేదా అది “మనిషి యొక్క ఆత్మ” లేదా “పరిశుద్ధాత్మ” లో ఉన్నట్లుగా-ఆత్మ అని అనువదించబడినది.

ఆత్మ కోసం అనేక పర్యాయపదాలు-సహాయకుడు, ఉత్తరవాది, ఆదరణకర్త, ఒప్పించువాడు, నిరోధించువాడు, హెచ్చరించువాడు మరియు ఖండించువాడు వంటి పదాలు ఉపయోగించబడ్డాయి. ఆయన పావురం, అగ్ని, గాలి, నీరు వంటి చిహ్నాల ద్వారా చిత్రీకరించబడ్డాడు.

దేవుని ఆత్మ ఏమి కాడో అనేవి కొన్ని విషయాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ గురించి చాలా మందికి ఉన్న మూడు లేదా నాలుగు తప్పుడు ఉద్దేశాలను నన్ను ఎత్తి చెప్పనివ్వండి. వాస్తవానికి, ప్రజలు తమ మూలాలకు తిరిగి వచ్చి వారి నమ్మకాలను వివరించడానికి ప్రయత్నించినప్పుడు, వారు తరచుగా పరిశుద్ధాత్మ సిద్ధాంతం గురించి చాలా గందరగోళానికి గురవుతారు. నేను ఆయనను “అది” అని తరచు పిలువబడటం విన్నాను . . . కాబట్టి అక్కడ ప్రారంభిద్దాం.

ఆత్మ ఒక “ఇది” కాదు, కానీ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం

పరిశుద్ధాత్మ ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన “ఆయనను”, “ఆయన” అయి ఉన్నాడు. యేసు ఒకసారి ఇలా అన్నాడు:

నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొంద నేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతోకూడ నివసించును, మీలో ఉండును. (యోహాను 14:16-17, నొక్కి వక్కాణించబడింది)

ఎంత ఉపయోగకరమైన ప్రకటన! యేసు భూమిని విడిచిపెట్టి, తనలాగే మరొక ఆదరణకర్తను (“ఆయనవంటి మరొకరు,” ఆసక్తికరంగా) పంపినప్పుడు, ఆదరణకర్త వచ్చి వారి జీవితాల్లో ఒక భాగమయ్యాడు. ఇకపై వారి దగ్గర లేడు, కానీ వారిలో ఉన్నాడు. ఇది మనసును కదిలించే నిజం.

ఆత్మ నిష్క్రియాత్మకం కాదు, కానీ చురుకైనవాడు మరియు పాల్గొంటాడు

యేసు ఏమి బోధించాడో చాలా జాగ్రత్తగా చదవండి:

ఆయన వచ్చి, పాపమునుగూర్చియు నీతిని గూర్చియు తీర్పునుగూర్చియు లోకమును ఒప్పుకొనజేయును . . . అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. (యోహాను 16:8, 13-14)

దేవుని ఆత్మ నిరంతరం కదలికలో ఉన్నాడని సందేహించవద్దు. గాలి మాదిరిగా, మనం ఆయనను చూడలేము; ఏదేమైనా, ఆయన ఒప్పుకొనజేస్తూ, మార్గనిర్దేశం చేస్తూ, బోధిస్తూ, బహిర్గతం చేస్తూ మరియు మహిమపరుస్తూ కార్యనిమగ్నమై ఉన్నాడు. ఇవి ఆయన కార్యకలాపాలలో కొన్ని!

పరిశుద్ధాత్మ ఊహాత్మకమైనవాడు కాడు, నిజమైన మరియు ప్రస్తుతముతో సంబంధముగలవాడు

యేసు పరలోకమునకు ఆరోహణమవ్వటానికి ముందు, ఆయన తన అనుచరుల బృందంతో కలిశాడు. వారికి ప్రశ్నలు ఉన్నాయి. ఆయన వద్ద సమాధానాలు ఉన్నాయి. త్వరలో ఆయన స్థానంలోనికి రాబోవుచున్న ఆత్మ గురించి కొంత కీలక సమాచారం ఆయన దగ్గర ఉన్నది.

కాబట్టి వారు కూడివచ్చినప్పుడు–ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా? అని ఆయనను అడుగగా ఆయన–కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని యున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను. (అపొస్తలుల కార్యములు 1:6-8)

ఆత్మ ఊహాత్మక, అస్పష్టమైన నిరీక్షణ కాదు; ఆయనను గురించి మన రక్షకుడిచ్చిన వాగ్దానం ఇది.

పరిశుద్ధాత్మ దేవునికి ప్రత్యామ్నాయం కాదు, కానీ ఆయన దేవుడు

ఇది వేరే ఏమీ చేయకపోతే పరిశుద్ధాత్మ పని పట్ల మీ గౌరవాన్ని పెంచుతుంది. అపొస్తలుల కార్యములలో పొందుపరచబడి, వారి కపటత్వానికి అంతిమ ధర చెల్లించిన జంట గురించి చాలా అరుదుగా ప్రస్తావించబడిన కథ ఉన్నది. వారి సంక్షిప్త జీవిత చరిత్రలో ఆత్మ యొక్క దైవత్వమును గూర్చిన ప్రకటన ఉన్నది.

అననీయ అను ఒక మనుష్యుడు తన భార్యయైన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్యయెరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టెను. అప్పుడు పేతురు –అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీయొద్ద నున్నపుడు నీదే గదా? అమ్మిన పిమ్మట అది నీ వశమై యుండలేదా? యెందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించు కొన్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. (అపొస్తలుల కార్యములు 5:1-4, నొక్కివక్కాణించబడింది)

వారు “పరిశుద్ధాత్మను” మోసపుచ్చినప్పుడు (5:3), వారు “దేవునితోనే . . . అబద్ధమాడారు” (5:4).

మీలో సజీవమైన దేవుని సన్నిధిని కలిగి ఉండటం యొక్క అర్థమేమిటో ఊహించుకోండి. నా క్రైస్తవ మిత్రుడా, ఒక్కసారి ఆగి, దీనిని గురించి ఆలోచించండి: దేవుని యొక్క మూడవ సభ్యుడు, అదృశ్యమైన, ఇంకా దైవత్వము యొక్క సర్వశక్తివంతమైన ప్రాతినిధ్యం వహిస్తున్నవాడు, వాస్తవానికి మీలోనే జీవిస్తున్నాడు. ఆయన మీలో నివసించుచున్నాడు గనుక, ఆయన యొక్క అపరిమితమైన సామర్థ్యాలు మీలో నివసిస్తాయి.

జీవితం మీపై విసిరిన వాటిని మీరు నిర్వహించలేరని మీరు అనుకుంటున్నారా? మీరు దృఢంగా నిలబడలేరని లేదా అవసరమైనప్పుడు మీ జీవితంలో ఒంటరిగా నిలబడలేరని మీరు అనుకుంటున్నారా?

జీవిత శోధనల ఎరను మీరు నిర్వహించలేరని మీరు అనుకుంటున్నారా? మీరు ఒంటరిగా ఉంటే మీరు ఖచ్చితంగా చేసి ఉండలేరు. ఎలాగైతే నేను ఒంటరిగా ఎగరలేనో, మీరు-ఒంటరిగా-దీనిని చేయలేరు. కానీ సరైన శక్తిని క్రియల్లో పెట్టడంతో, దేవుని శక్తి మరియు సన్నిధితో, మీరు దానిని నిర్వహించగలరు. మీరు చేయగలరు. వాస్తవానికి, ఒత్తిడి మరియు బరువు అంతయు మీ నుండి ఆయనకు బదిలీ అవుతుంది. ఇది జీవించడానికి పూర్తిగా భిన్నమైన మార్గం. మరియు ఆయన దేవుడు కాబట్టి ఆయన దానిని నిర్వహించగలడు.

Adapted from Growing Deep in the Christian Life: Returning to Our Roots (Portland, Ore.: Multnomah, 1986), 175-80. Copyright © 1986 by Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.

Posted in Holy Spirit-Telugu, Theology-Telugu.

Pastor Charles R. Swindoll has devoted his life to the accurate, practical teaching and application of God’s Word. He is the founding pastor of Stonebriar Community Church in Frisco, Texas, but Chuck’s listening audience extends far beyond a local church body. As a leading programme in Christian broadcasting since 1979, Insight for Living airs around the world. Chuck’s leadership as president and now chancellor emeritus at Dallas Theological Seminary has helped prepare and equip a new generation of men and women for ministry.

పాస్టర్ చార్లెస్ ఆర్. స్విండాల్ దేవుని వాక్యాన్ని నిర్దిష్టంగా, ఆచరణాత్మకంగా బోధించడానికి మరియు అన్వయించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చి వ్యవస్థాపక కాపరియై ఉన్నారు, అయితే చక్ యొక్క శ్రోతలు స్థానిక సంఘ పరిధి దాటి వ్యాపించి ఉన్నారు. 1979 నుండి క్రైస్తవ ప్రసరణలో ప్రముఖ కార్యక్రమంగా, ఇన్‌సైట్ ఫర్ లివింగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసారమవుతోంది. డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ప్రెసిడెంటుగా, అలాగే ఇప్పుడు ఛాన్సిలర్ ఎమెరిటస్‌గా చక్ యొక్క నాయకత్వం క్రొత్త తరం స్త్రీపురుషులను పరిచర్య కొరకు సిద్ధపరచడంలో సహాయపడింది.